ప్రపంచ అసమానతల్లో పెరుగుదల -ది హిందు ఎడిట్


Decent-work

నిజ వేతనాలపై అంతర్జాతీయ కార్మిక సంస్ధ (ఐ.ఎల్.ఓ) తాజాగా వెలువరించిన నివేదిక కనుగొన్న అంశాలు వివిధ సందర్భాలలోని క్రియాశీల చొరవలను, విధానపరమైన పక్షవాతాన్ని సూచిస్తున్నాయి. ప్రపంచ నిజ వేతనాలు పడిపోతుండడం కొనసాగుతుండడం వల్లా, జాతి మరియు లింగ ఆధారిత వివక్షాపూరిత వేతన తేడాల వల్లా కుటుంబాల ఆదాయాలలో అసమానతలు తీవ్రం అవుతున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. అధ్యయనంలో కొట్టొచ్చినట్టు కనపడుతున్న అంశం, అభివృద్ధి చెందిన దేశాలలో 1999-2013 సంవత్సరాల మధ్య కాలంలో కార్మిక ఉత్పాదకత పెరుగుదల వారి నిజ వేతనాలలోని పెరుగుదలను మించిపోయిందని చెప్పడం. ఫలితంగా గత రెండు సంవత్సరాలలో ఈ దేశాలలో వేతనాల వృద్ధి నేలబారుగా ఉండిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం ఏమీ కాదు.

ప్రపంచవ్యాపితంగా 2013 సంవత్సరంలో సగటున నెలకు అంతకు ముందరి సంవత్సరం కంటే 0.2 నుండి 2 శాతం వరకు తక్కువ పెరుగుదలకు వేతనాలు నోచుకున్నాయి. (దీనర్ధం వేతనాల ‘పెరుగుదల రేటు’ 2012 కంటే 2013లో తగ్గిపోయిందని. ఆ తగ్గుదల నెలకు సగటున 0.2 నుండి 2 శాతం వరకు ఉన్నదని. -అనువాదకుడు) వేతనాల పెరుగుదలలో ప్రాంతాలవారీగా తీవ్ర తేడాలు ఉండడం వల్ల సంక్షోభం ముందరి కాలం (2007) నాటి 3 శాతం పెరుగుదల స్ధాయికి తిరిగి చేరుకుంటామన్న ఆశలు అడుగంటుతున్నాయి. చైనా సాధించిన ప్రగతిని మినహాయిస్తే, ముందరి రెండు సంవత్సరాలలో ప్రపంచ వేతన సగటు 0.5 శాతం మేర పడిపోయింది. ఆసియా, తూర్పు యూరప్ లలో నిజవేతనాలలో పెరుగుదల 6 శాతం వరకు ఉండగా లాటిన్ అమెరికా, కరీబియన్ లలో 1 శాతం కంటే తక్కువ పెరుగుదల నమోదవడం బట్టి ప్రాంతాలవారి తేడాలు తీవ్రంగా ఉన్నాయని స్పష్టం అవుతోంది.

వేతనాల పంపిణీ కూడా అసమానతలలోని తేడాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. వేతనాల అంతరాలు మరియు ఉద్యోగాల నష్టం వల్ల సంభవించిన అసమానతల వృద్ధి స్పెయిన్ లో 90 శాతం ఉండగా అమెరికాలో 140 శాతం వరకూ ఉన్నది. అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినంతవరకు ఎగువన ఉన్న 10 శాతం మందికీ, దిగువన ఉన్న 10 శాతం మందికి మధ్య అసమానతలు గరిష్టంగా పెరిగిన రెండు దేశాలివి. దీనికి విరుద్ధంగా మరింత సామానత్వ ప్రాతిపదికన వేతనాలు చెల్లించడం వలన ఎగువన ఉన్న వారికీ దిగువన ఉన్నవారికీ మధ్య అంతరాలు అర్జెంటీనాలో 87 శాతం తగ్గిపోగా, బ్రెజిల్ లో 72 శాతం తగ్గిపోయాయి. (వక్కాణింపు అనువాదకుడిది) వేతనాలలో పెరుగుదల ఉత్పత్తి ఖర్చును, లాభదాయకతను, సంస్ధల పోటీ సామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తాయన్నది అంగీకరించినదే. కానీ స్ధూల దృష్టి స్ధాయిలో వేతనాల స్తంభన దేశీయ వినియోగాన్ని, పెట్టుబడులను, ఎగుమతులను కిందికి దిగదోస్తాయన్నది కూడా వాస్తవమే.

స్ధిరమైన ఆర్ధిక వృద్ధి సాధించాలంటే విధాన నిర్ణయాలలో ప్రస్తుతం అనుసరిస్తున్న “పరులపై కోపం తీర్చుకోవడానికి తనకు తాను గాయం చేసుకునే” (Cut off your nose to spite your face) వైఖరిని మార్చుకుని అసమానతలను తగ్గించే మరింత నిర్మాణాత్మక మార్గాలను ఎంచుకోవాల్సి ఉందని స్పష్టం అవుతోంది. అభివృద్ధి చెందుతున్న మరియు అభివృద్ధి చెందిన దేశాలలో దాని ప్రభావశీలత ఆధారంగా ఐ.ఎల్.ఓ ఒక పద్ధతిని సిఫారసు చేస్తోంది. విశాల ఆర్ధిక అంశాల ఆధారంగా కార్మికులు మరియు వారి కుటుంబాల అవసరాలను సమతూకం కావించే విధంగా కనీస వేతనాన్ని నిర్ణయించడమే ఆ పద్ధతి. వేతన అసమానతలను తగ్గించడంలో ఉమ్మడి బేరసారాల హక్కు కీలక పాత్ర పోషించిందన్నది రుజువైన వాస్తవం. ఉద్యోగులు అటువంటి నిర్మాణాలలో (కార్మిక సంఘాలు) సమీకరించబడినంత మేరకే అది రుజువైందన్నది వేరే చెప్పనవసరం లేదు. పైగా (ఆర్ధిక) వృద్ధిపై అసమానతలు పడవేసే ప్రభావం ఏ విధంగా చూసినా తక్కువ కాదు. ఆర్ధికంగా అవకాశాలు లేని సెక్షన్లలో విద్యార్హతల సాధనలో భాగంగా జరిపిన అధ్యయనాల నుండి జనించిన వాస్తవమే ఇది.

(పైన వక్కాణించబడిన అంశం కీలకమైనది. స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక విధానం యొక్క డొల్లతనాన్ని ఐ.ఎల్.ఓ జరిపిన అధ్యయనాలే తేల్చివేయడం మామూలు విషయం కాదు. స్వేచ్ఛా మార్కెట్ పేరుతో ధనిక వర్గాలకు చెందిన కంపెనీలకు సర్వ స్వేచ్ఛలను కట్టబెట్టి శ్రామికులను సకల బంధనాలలోనూ కట్టిపడవేసే పెట్టుబడిదారీ విధానం డొల్లతనాన్ని కూడా ఇది పట్టిస్తోంది. పశ్చిమ బహుళజాతి కంపెనీల ప్రయోజనాల కోసం అర్జెంటీనాపై ఐ.ఎం.ఎఫ్-ప్రపంచ బ్యాంకు-అమెరికాలు రుద్దిన ఆర్ధిక సంస్కరణలు, వ్యవస్ధాగత సర్దుబాటు కార్యక్రమం ఫలితంగా ఆ దేశంలో 1990ల చివరి వరకూ తీవ్ర ఆర్ధిక, ఋణ సంక్షోభం నెలకొనడంతో 2001 డిసెంబర్ లో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించి అమెరికా, యూరప్ అనుకూల ప్రభుత్వాన్ని కూలదోశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వాలు పశ్చిమ దేశాలు, ఐ.ఎం.ఎఫ్ పెత్తనాన్ని నిరాకరించాయి. తమపై రుద్దిన అప్పులను ఎగవేశాయి. స్వతంత్ర ప్రణాళికాబద్ధ ఆర్ధిక విధానాలను అనుసరిస్తూ వచ్చాయి. ఫలితంగా కొన్ని నెలల వ్యవధిలోనే అర్జెంటీనా వృద్ధి 9 శాతం చేరుకుని స్వేచ్ఛా మార్కెట్ విధానాలను వెక్కిరించింది. అర్జెంటీనా ప్రభుత్వ విధానాల కారణంగా ఆర్ధిక అంతరాలు 87 శాతం తగ్గిపోయాయని ఐ.ఎల్.ఓ అంచనా వేయడం అంటే ఐ.ఎం.ఎఫ్ ప్రతిపాదిత వినాశకర విధానాల దగాకోరుతనాన్ని పచ్చిగా వెల్లడి చేయడమే. -విశేఖర్)

4 thoughts on “ప్రపంచ అసమానతల్లో పెరుగుదల -ది హిందు ఎడిట్

 1. సర్,మీరు ఇక్కడ అర్జెంటీనాను ప్రస్తావించారుగనుక ఒక విషయం అడుగుతాను-ఆ దేశం పెట్టుబదీదారి వ్యవస్థకు చెందినది కదా!కానీ,అక్కడ ప్రజాప్రభుత్వాలు ఉండడం వలన ప్రజలలో అంతరాలు(ఆర్ధికపరమైనవి) తక్కువగా ఉన్నాయని నివేదిక తెలుపుతుంది!
  కనుక పెట్టుబడీదారి వ్యవస్థ ఇక్కడ ప్రజలకు మేలునే చేసిందనవచ్చునా?(ఇక్కడ పెట్టుబడీదారి వ్యవస్థను ప్రజా ప్రభుత్వాలు నియంత్రించడం వలన?) కనుక పెట్టుబడీదారివ్యవస్థను ప్రజప్రభుత్వాలు కట్టడి చేయగలిగినంత వరకు అనుమతించవచ్చునా?

 2. ‘ప్రజా ప్రభుత్వాలు’ అన్న పదాన్ని బ్రాడ్ మీనింగ్ లో రాశాను. దాని అర్ధం శ్రామికులకు అనుకూలంగా పని చేసే సోషలిస్టు ప్రభుత్వం అని కాదు.

  వెనిజులా, అర్జెంటీనా, బ్రెజిల్, ఇరాన్, ఈక్వడార్…. ఇత్యాది దేశాల ప్రభుత్వాలు దళారీ స్వభావం కలిగినవి కావు. అనగా సామ్రాజ్యవాద పెత్తనాన్ని అక్కడి పాలకవర్గాలు తిరస్కరించి స్వతంత్ర విధానాలను అమలు చేసుకుంటారు. ఆ విధంగా అవి జాతీయ స్వభావం కలిగి ఉంటాయి. వారికి దేశభక్తి ఉంటుంది. మా వనరులు మావే అన్న నిబద్ధత ఉంటుంది. సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో నడిచే పాలకులకు జాతీయ స్వభావం ఉండదు. సామ్రాజ్యవాదుల పెత్తనాన్ని అంగీకరిస్తూ వారు పంచి ఇచ్చే వాటాతో సంతృప్తి పడడం వారి నైజం.

  జాతీయ-దళారీ ప్రభుత్వాలలో మొదటిది మేలైనది. కనీసం దేశ సంపద దేశంలో ఉంటుంది. ఆ మేరకు ప్రజలకు మెరుగైన జీవితం ఉంటుంది. అంత మాత్రాన జాతీయ పెట్టుబడిదారుల ప్రభుత్వాల పాలనలో శ్రామికులకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉంటాయని అర్ధం చేసుకోకూడదు. జాతీయ పాలకవర్గాలు కూడా దోపిడిని అమలు చేస్తాయి. అవి కూడా ధనిక వర్గ ప్రభుత్వాలే. కానీ సామ్రాజ్యవాద పెత్తనాన్ని తిరస్కరించడంలో వారు ప్రగతిశీల పాత్ర పోషిస్తారు. నూతన ప్రజాస్వామిక విప్లవంలో కమ్యూనిస్టులు జాతీయ పెట్టుబడిదారుల మద్దతు తీసుకుంటారు కూడా. చైనాలో నూతన ప్రజాస్వామిక విప్లవంలో జాతీయ పెట్టుబడిదారులు కూడా కమ్యూనిస్టు పార్టీతో కలిసి పని చేసి విప్లవం విజయవంతం కావడానికి దోహదం చేశారు.

  పెట్టుబడిదారీ వ్యవస్ధను జాతీయ ప్రభుత్వాలు నియంత్రించవు. దేశీయ పెట్టుబడిని అవి ప్రోత్సహించి అండదండలు అందిస్తాయి. ఆ కారణం వల్ల శ్రామికులకు వచ్చే వేతన వాటా పెరుగుతుంది. దళారీ పాలకులు పాలకులుగా ఉండే దేశాలతో పోలిస్తే జాతీయ పాలకులు ఉన్న దేశాల్లో అసమానతలు కాస్త తగ్గుతాయి గానీ అదృశ్యం కావు. అసమానతలు తగ్గడం అంటే జాతీయ ఉత్పత్తిలో శ్రామిక వర్గానికి కాస్త ఎక్కువ వాటా దక్కడం. సామ్రాజ్యవాదులకు సేవ చేసే దేశీయ పెట్టుబడుదారులను దళారీ పెట్టుబడిదారులు అంటారు. సామ్రాజ్యవాదుల డిమాండ్ మేరకు వాళ్ళు శ్రామిక ప్రజల వాటాను ఇంకా ఇంకా తగ్గిస్తూ పోతారు. ఆ విధంగా అసమానతలు తీవ్రం అవుతాయి.

 3. దళారీ పాలకులు పాలకులుగా ఉండే దేశాలతో పోలిస్తే జాతీయ పాలకులు ఉన్న దేశాల్లో అసమానతలు కాస్త తగ్గుతాయి గానీ అదృశ్యం కావు-అసమానతలు కనిష్ట స్థాయిలో ఉండే వ్యవస్థలు అవసరమే!
  పై విషయాలలో కి వెళ్ళే లోపు కొన్ని విషయాలు చూద్దాం!
  పెట్టుబడీదారి వ్యవస్థ యురప్ లో విజృంభించడానికి ప్రధానకారణం సాంస్కృతిక పునరుజ్జీవనమే ననవచ్చునా? దానికి పెట్టుబడీదారి వ్యవస్థ తోడవడంతో మానవభివృద్ధి(సాంకేతిక పరమైన అంశాలలో చూద్దం!) తారాస్థాయికి తీసుకువెళ్ళిందనవచ్చునా? పెట్టుబడీదారి వ్యవస్థలో ఉన్న పోటీతత్వం ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఈ సుఖజీవనానికి కారణముకదా! ఈ పోటీతత్వం ఇలా నిరంతరం కొనసాగడం మానవాభివృద్ధికి ఇంకా దోహదపడుతుందికదా!
  విషయంలోకి వద్దాం-అసమానతలు కొనసాగుతున్నంతకాలం సమానత్వంకోసం ఆరాటపడుతుండడం కొనసాగుతుంది.లేకపోతే స్తబ్తత ఏర్పడదా?పెట్టుబడీదారి తదుపరి దశలలో ఈ పోటీతత్వం తారా స్థాయికి చేరుకోగలుగుతుందనుకోవచ్చునా? లేక ఆధర్శవంతమైన సమాజంలో ఉన్నాముకనుక ఇక పోటీ అవసరం లేదుకనుక మనమానాన మనం బ్రతికేద్దాం అనే నిర్లప్తత మనిషిలోన ఏర్పడిపోతే మానవ మనుగడకే ప్రశ్నార్ధకంకాదా?

 4. //పెట్టుబడీదారి వ్యవస్థ యురప్ లో విజృంభించడానికి ప్రధానకారణం సాంస్కృతిక పునరుజ్జీవనమే ననవచ్చునా?//
  కాదు పారిశ్రామిక విప్లవం.దీనివలననే సాంస్కృతిక పునరుజ్జీవ నం జరిగింది.సాంస్కృతిక పునరుజ్జీవ నం పెట్టుబడి దారి విధాననానికి దారి తీసింది.

  //పెట్టుబడీదారి వ్యవస్థలో ఉన్న పోటీతత్వం ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఈ సుఖజీవనానికి కారణముకదా! ఈ పోటీతత్వం ఇలా నిరంతరం కొనసాగడం మానవాభివృద్ధికి ఇంకా దోహదపడుతుందికదా!//
  పెట్టుబడి దారి దృష్టితో చూస్తే అలానే కనబడుతుంద్‌. ఎందుకంటే అదే అలవాటైంది కనుక. పెట్టుబడి దారి సమాజానికి ఉన్నట్టే ఆమాటకొస్తే అన్నీ సమాజాలకు ఉన్నట్టే సామ్యవాద సమాజానికి కూడా ఒక భావజాలం ఉంటుంది. దానితో చూస్తే తప్ప భవిష్యుతు సమంగా కనపడదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s