హిమాలయ రాజ్యమైన నేపాల్ సహజంగానే ప్రకృతి సౌందర్యాలకు నిలయం. ఇటీవలి వరకు ఫ్యూడల్ రాచరికంలో మగ్గిన ఫలితంగా అక్కడ దరిద్రానికి కొదవ లేదు. ఒక పక్క రాచరికం మిగిల్చిన సంపన్న భవనాలు, మరో పక్క ఆ మూడు రోజుల కోసం స్త్రీలను బందిఖానా చేసే చౌపడి గుడిసెలు! ప్రకృతి ఒడిలో నిండా మునిగినట్లుండే నేపాల్ జనజీవనానికి ప్రతిబింబాలు ఈ కింది ఫోటోలు.
నేపాల్ ని ‘ప్రపంచపు పైకప్పు’ (roof of the world) అని కూడా పిలుస్తారట! 2.7 కోట్లమంది ప్రజలు నివసించే నేపాల్ ప్రపంచంలోని అతి ఎత్తైన 10 కొండల్లో 8 కొండలను తన నేలపైనే నిలబెట్టుకుంది. నేపాల్ ఎంత చిన్న దేశమో అన్ని ఎక్కువ సంస్కృతులకు నిలయం. వైవిధ్య భరితమైన జాతులను సంస్కృతులను పుణికి పుచ్చుకున్న ఈ హిమాలయ రాజ్యం సంస్కృతుల పరంగా అత్యంత సంపన్న దేశంగా గుర్తింపు పొందింది.
అత్యంత ఎత్తైన కొండ ఎవరెస్టు ఎవరిది? మనదే అని ఇండియాలో ప్రాధమిక పాఠ్య గ్రంధాల్లో చెబుతారు. నేపాల్ భూభాగంలో ఉన్న ఎవరెస్టు కొండ ఇండియాది ఎలా అవుతుందో అర్ధం కాని సంగతి. ఎవరెస్ట్ అన్నది బ్రిటిష్ వాడు పెట్టిన పేరు. నేపాలీయులు 8,848 మీటర్ల ఎత్తుగల ఈ కొండను సాగర మాత అని పిలుస్తారు. చైనా-నేపాల్ సరిహద్దు సరిగ్గా సాగరమాత శిఖరాగ్రం గుండా పోతుంది. టిబెట్ లో ఈ కొండను చొమొలుంగ్మా అని పిలుస్తారట.
నేపాల్ లో షెర్పా జాతి ప్రజలు ప్రత్యేక తరగతికి చెందినవారు. తూర్పు నేపాల్ లో ఎత్తయిన కొండలలో నివసించే షెర్పా జాతి ప్రజలు పర్వతారోహకులకు గైడ్ లు గా సుప్రసిద్ధులు. ప్రపంచం నలుమూలల నుండి ఎవరెస్టు ను అధిరోహించడానికి వచ్చేవారికి షెర్పాలే మార్గ దర్శనం చేస్తారు. పర్వతారోహకులకు అవసరమైన తాళ్ళు అమర్చి పెట్టడం, వారికి ఆహారం, నీరు సరఫరా చేయడం, ఆక్సిజన్ అయిపోతే అందించడం… ఇవన్నీ షెర్పాలు చేస్తారు. పర్వతారోహకులకు ఎవరెస్ట్ ఆరోహణ జీవితంలో ఒకసారి చేసే సాహసం అయితే, ఆ పనిని షెర్పాలు రోజూ చేస్తారన్నమాట. షెర్పాల జీవితమే సాహసం అన్నట్లు!
ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో షెర్పాలకు మహా కష్టం వచ్చింది. పర్వతారోహకుల కోసం శిఖరాగ్ర అధిరోహణ దారిలో వారు విడిది చేసి ఉండగా మంచు ప్రళయం (avalanche) సంభవించి వారిపై భారీ మంచు శిలలు జారీ పడ్డాయి. ఫలితంగా 16 మంది షెర్పాలు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనతో ఎవరెస్టు అధిరోహణను ఇక కట్టిపెట్టాలని, పర్వతారోహకులను రాకుండా అడ్డుకోవాలని షెర్పాలు డిమాండ్ చేశారు. వారి డిమాండ్ ను ప్రభుత్వం ఒప్పుకోలేదు. దానితో వారు సమ్మె చేశారు. పర్యవసానంగా కొన్ని వందల మంది విదేశీ పర్వతారోహకులు సహాయకులు, గైడ్ లు లేక వెనుదిరిగి వెళ్ళిపోయారు.
నేపాల్ కూడా హిందూ దేశమే అయినందున అక్కడ దేవతలందరూ మన దేవతలే. పండగలు, సంప్రదాయాల్లో చిన్న చిన్న తేడాలు తప్ప దాదాపు భారత హిందూ పేర్లు, పండగలు, ఉత్సవాలే అక్కడ కనిపిస్తాయి. అయితే భారత దేశంలో అనేక స్ధానిక దేవతలు, సంప్రదాయాలు, జాతరలు ఉన్నట్లే నేపాల్ లో కూడా ప్రధాన హిందూ స్రవంతికి భిన్నమైన స్ధానిక దేవతలు, అలవాట్లు ఆచరణలో ఉన్నాయి. జంతు బలి సైతం అక్కడ కొనసాగుతోంది.
నేపాల్ జీవన విధానాన్ని, సంస్కృతులను, కష్టాలను, పండగలను పట్టి ఇచ్చే ఫొటోలివి. వీటిని ది అట్లాంటిక్ పత్రిక అందజేసింది.
నేపాల్ నిజంగా చాలా అందమైన దేశం. చరిత్రలో ఎన్నడూ బానిసత్వంలో లేని దేశం నేపాల్, కాబట్టే అక్కడ సంస్కృతీ సంప్రదాయాలు చాలా తరతరాలుగా కొనసాగుతున్నాయనుకుంటా…!
శేఖర్ గారు. ప్రపంచ పైకప్పు అని పామీర్ పీఠభూమిని అంటారనుకుంటా. పామీర్ పీఠభూమిలో ఆఫ్ఘన్, చైనా పాకిస్తాన్ ఉన్నాయి కానీ నేపాల్ లేదండీ…
https://en.wikipedia.org/wiki/Pamir_Mountains