“అతి చిన్న శవపేటికలు అత్యంత బరువైనవి” అంటూ తాలిబాన్ పైశాచిక హత్యాకాండను పాక్ ప్రజలు నిరసించారు.
“చిన్న శవ పేటికలను పూడ్చడం చాలా కష్టమయింది” అని సమాధుల తవ్వకం దారు తాజ్ ముహమ్మద్ గాద్కదిక స్వరంతో, దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పాడు.
పెషావర్ లోని అతి పెద్ద శ్మశాన వాటికలో సమాధులను తవ్వేవారిలో తాజ్ ముహమ్మద్ ఒకరు. ముస్లిం సంప్రదాయాల ప్రకారం శవాలను సాధ్యమైనంత త్వరగా పూడ్చిపెట్టాలి. దానితో డిసెంబర్ 16 తేదీన అమానుష రీతిలో దాడి జరగగా మెజారిటీ మృతుల శవాలను డిసెంబర్ 16, 17 తేదీల్లోనే పూడ్చి పెట్టారు.
సమాధులను తవ్వి మృతులను పూడ్చిపెట్టేవారు మృతుల కోసం ఏడవ కూడదట. మృతులను పూడ్చిపెట్టే వృత్తిగత ఉద్యోగులుగా వారు ఏడవకూడదని, తమ భావోద్వేగాలను అణచి ఉంచుకుని సంయమనం పాటించాలని అలిఖిత నిబంధన ఉన్నదట. కానీ తాలిబాన్ దాడి వల్ల ఒకేసారి పెద్ద సంఖ్యలో శ్మశానానికి తరలి వచ్చిన పిల్లలను పూడ్చిపెట్టవలసిన సమయాన తమ నిబంధనను ఉల్లంఘించకుండా ఉండడం తాజ్ ముహమ్మద్ కు సాధ్యం కాలేదు.
నేరస్ధులను ఉరి తీసే తలారికి భావోద్వేగాలు ఉండకూడదు. రోగుల దేహాలను కత్తితో కోసి ఆపరేషన్లు చేసే డాక్టర్లకు కూడా భావోద్వేగాలు ఉండరాదని, తన-మన తేడాలుండరాదని నీతి. ఇదే తరహాలో శ్మశానంలో సమాధులు తవ్వి మృతులను పూడ్చిపెట్టే వృత్తిలో ఉన్నవారు కూడా భావోద్వేగాలకు అతీతంగా ఉండాలన్నది నియమం!
“వివిధ వయసుల వారినీ, అనేక సైజుల వారినీ, అనేక బరువులు కలవారినీ నేను పూడ్చిపెట్టాను. కానీ నిన్నటి నుండి నేను పూడ్చుతున్న ఆ చిన్న చిన్న శరీరాలు గతంలో పూడ్చిన అనేక పెద్ద శరీరాల కంటే అత్యంత బరువైనవిగా నాకు అనుభవం లోకి వచ్చింది” అని తాజ్ ముహమ్మద్ చెప్పారని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్ధ తెలిపింది.
తాజ్ ముహమ్మద్ చెబుతున్నది భౌతిక బరువు కాదన్నది స్పష్టమే. మానవుని భావోద్వేగాలకు ఒక పరిమితి అనేది ఉంటుంది. తాలిబాన్, దాని వెనుక ఉన్న అదృశ్య సామ్రాజ్యాధీశులు బాలలపై జరిపిన మూకుమ్మడి హత్యాకాండ ద్వారా కనీ వినీ ఎరుగని పైశాచికత్వాన్ని లోకానికి చవి చూపారు. ఆ పైశాచికం ఎంతటి అలవిమాలినదిగా ఉన్నదంటే మానవుడి అత్యంత కఠినమైన భావోద్వేగాల పరిమితిని పరీక్షించేంతగా!
రెండు రోజుల వ్యవధిలో 132 మంది బాలలను పూడ్చవలసి రావడం హృదయం ఉన్నవారికి ఎవరికైనా కష్టమే. బంధు మిత్రుల రోదనల మధ్య కాటికి పయనమై వచ్చే మానవ దేహాలు కాటి కాపరులకు కొత్త కాకపోవచ్చు. కానీ చక్కగా ఆడి పాడే వయసులో, లోకం పోకడ ఎరుగని లేలేత ప్రాయంలో మూకుమ్మడి మారణకాండకు బలైన దేహాలు వరుస కట్టి స్మశానానికి వచ్చే క్షణాలు ఎంత బరువైనవి!
‘నవమాసాలు మోసి, కనీ, ముద్దూ ముచ్చటంబెంచిన ఈ తల్లియా నీకు తలకొరివి బెట్టుట” అంటూ సత్యహరిశ్చంద్రుడి భార్య చంద్రమతి పాము కాటుకు గురై చనిపోయిన తనయుడిని చూసి బాధపడుతూ తలపోస్తుంది. తాలిబాన్ దాడిలో చనిపోయిన బాలలను సమాధి చేసేప్పుడు ముహమ్మద్ కు కూడా దాదాపు ఇవే భావనలు కలిగాయి. 8 మంది పిల్లలకు తండ్రి అయిన ముహమ్మద్ కు తన సొంత పిల్లలను పూడ్చిపెడుతున్నట్లుగానే తోచిందని ఎ.పి వార్తా సంస్ధతో మాట్లాడుతూ చెప్పారు. దానితో పిల్లల దేహాలు ఉంచిన శవ పేటికలు మరింత భారంగా ఆయనకు తోచాయి.
“మొదటిసారిగా నేను నా దుఃఖాన్ని, కన్నీటిని నియంత్రించుకోలేకపోయాను. ఎందుకో నేను చెప్పలేను గాని నేను తీవ్రంగా ఏడ్చాను. నా వృత్తి నిబంధనలకు అది వ్యతిరేకమే కావచ్చు. కానీ బహుశా నిబంధనలను అతిక్రమించే క్షణాలు ఇవేనేమో” అని తాజ్ ముహమ్మద్ తన హృదయభారాన్ని లోకానికి వెల్లడించాడు.
ప్రతి సమాధికీ వారి వారి ఆర్ధిక పరిస్ధితిని బట్టి 2,000 నుండి 5,000 పాకిస్తానీ రూపాయల వరకూ తాజ్ ముహమ్మద్ వసూలు చేస్తాడు. ఆ వసూళ్లే ఆయనకు జీవనోపాధి. కానీ ఈ రెండు రోజుల్లో తమ వద్దకు వచ్చిన బాలల మృత దేహాలకు మాత్రం ముహమ్మద్ ఒక్క పైసా కూడా తీసుకోలేదు.
“నా సొంత పిల్లలకు సమాధి తవ్వుతున్నప్పుడు డబ్బులు ఇవ్వమని నేను ఎలా అడుగుతాను?” అని ముహమ్మద్ ప్రశ్నిస్తున్నాడు. పాకిస్తాన్ లో పుట్టినవారంతా ఉగ్రవాదులే అని నమ్మే మతోన్మత్త హృదయులకు ముహమ్మద్ ప్రశ్న కనువిప్పు అవుతుందా?
పాకిస్తాన్ లో పుట్టినవారంతా ఉగ్రవాదులే అని నమ్మే మతోన్మత్త హృదయులకు ముహమ్మద్ ప్రశ్న కనువిప్పు అవుతుందా?
ప్రత్యేకించి ఈ ప్రశ్నవలనే కనువిప్పు కలుగుతుందంటారా?అదైతే అసాద్యం అని నా నమ్మకం?ఒకదేశప్రజలు(సామాన్యులు) మరోదేశప్రజలకు ఎన్నడూ శత్రువులుకాదు.అతికొద్దిమంది చేత ప్రభావితమైన వారుచేసే చేష్టలచేత అందరినీ ఒకేగాటాన కట్టడం ఎలాసాధ్యం?
చచ్చిపోయినవాళ్ళందరూ కొంపెళ్ళ జనార్ధనరావులు సార్! (శ్రీశ్రీ, శ్రీశ్రీగాడి{‘డి’కి గానూ శ్రీశ్రీకి క్షమార్పణలతో} మహాప్రస్థానం గుర్తుందిగా).
I am happy for those little kids! -though I am the one who had felt the pain on that day and have cried.