బొగ్గు, భీమా ప్రైవేటీకరణ: ఆర్డినెన్స్ ఆలోచనలో కేంద్రం?


Agra conversion

వచ్చే మంగళవారంతో శీతాకాలం పార్లమెంటు సమావేశాలు ముగింపుకు రానున్నాయి. మళ్ళీ పార్లమెంటు సమావేశం అయ్యేది బడ్జెట్ కే. భీమా ప్రయివేటీకరణ, బొగ్గు గనుల ప్రయివేటీకరణ బిల్లులను శీతాకాలం సమావేశాల్లోనే మోడి ఆమోదింపజేస్తారని స్వదేశీ, విదేశీ కంపెనీలు, బహుళజాతి కంపెనీలు గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. కానీ సమావేశాలు ముగింపుకు వస్తున్నా బిల్లుల అతీగతీ లేదని కంపెనీలు బెంగ పెట్టుకున్నాయి.

ఈ నేపధ్యంలో మోడి ప్రభుత్వం నుండి కంపెనీల ఆశలను ఈడేర్చే శుభవార్త అందింది. పార్లమెంటు ఆమోదంతో సంబంధం లేకుండా ఏకంగా ఆర్డినెన్స్ జారీ చేసి కంపెనీలను సంతృప్తిపరిచేందుకు మోడి ఆలోచిస్తోందట. ఈ మేరకు ప్రభుత్వ అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ సంస్ధ సమాచారం ఇచ్చింది. పార్లమెంటు నానాటికీ ఫ్రాక్షన్ తగాదాల మాదిరిగా తయారవుతుండడంతో బిల్లుల ఆమోదానికి ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోందని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పినట్లు తెలుస్తోంది.

సంపూర్ణ మెజారిటీతో అధికారం చేపట్టిన నరేంద్ర మోడి సంస్కరణల అమలును వేగవంతం చేస్తారని, ప్రయివేటీకరణ కోసం తలపెట్టిన అనేక కంపెనీల వాటాల అమ్మకం చేపట్టడంతో పాటు ముఖ్యమైన భీమారంగంలో ఎఫ్.డి.ఐ ల పరిమితిని 26 నుండి 49 శాతానికి పెంచుతారని కంపెనీలు ఆశించాయి. కానీ హిందూత్వ ప్రకటనల పర్యవసానంగా ప్రతిపక్షాలు సభలను స్తంభింప జేయడంతో బిల్లుల ఆమోదం కష్టం అయిందని కంపెనీలు నిరసిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో భీమా బిల్లును, బొగ్గు తవ్వకాలకు ప్రైవేటు కంపెనీలను అనుమతించే బిల్లును ఆర్డినెన్స్ ద్వారా చట్టం చేసే అవకాశం ఉందని రాయిటర్స్ తెలిపింది. “(ఆర్డినెన్స్ రూటు అన్నివేళలా అందుబాటులో ఉంటుంది. నిర్ణయం తీసుకోవడమే తరువాయి. ఈ సెషన్ లో శేష భాగంలో ఏం జరుగుతుందో చూసి అనంతరం తగిన నిర్ణయం తీసుకుంటాము” అని కేంద్ర ప్రభుత్వ అధికారి చెప్పారని రాయిటర్స్ తెలిపింది.

ఒకవేళ ఆర్డినెన్స్ జారీ చేసినట్లయితే దానిని తదుపరి పార్లమెంటు సమావేశాలలోనైనా ఆమోదించవలసిందే. ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత జరిగే సమావేశాలు ప్రారంభం అయిన 6 వారాల లోపు సంబంధిత చట్టాన్ని పార్లమెంటు ఆమోదించవలసి ఉంటుంది. పార్లమెంటు ఆమోదం అనంతరం రాష్ట్రపతి ఎలాగూ ఆమోదిస్తారు. పార్లమెంటు ఆమోదం సాధించడంలో విఫలం అయితే ఆర్డినెన్స్ లు ఉనికిలో ఉండబోవు. ప్రతిపక్షాలు పరోక్షంగా సహకరిస్తే గనుక ఫిబ్రవరిలో ప్రారంభం అయ్యే సమావేశాలలో ఆర్డినెన్స్ లను చట్టాలుగా మలిచే అవకాశం లేకపోలేదు.

క్రిస్టమస్ రోజు నాడు ఉత్తర ప్రదేశ్ లోని ఆలీఘర్ పట్టణంలో క్రైస్తవులను పెద్ద సంఖ్యలో హిందూ మతంలోకి మార్చనున్నామని హిందూ సంస్ధలు ప్రకటించాయి. మత మార్పిడి పేరుతో ఆర్.ఎస్.ఎస్ అనుబంధ సంస్ధలు ఆలీ ఘర్ చందాలు కోరుతూ కరపత్రాలు పంచాయి. ఒక ముస్లింను హిందువుగా మార్చడానికి రు. 2 లక్షలు, ఒక క్రైస్తవుడిని హిందువుగా మార్చడానికి రు. 5 లక్షలు ఖర్చవుతాయని కనుక పౌరులు విరివిగా విరాళాలు ఇవ్వాలని కరపత్రాల ద్వారా కోరారు.

ఈ వ్యవహారంపై పార్లమెంటులో వారం రోజులుగా ఆందోళనలు, అరుపులు, కేకలు కొనసాగుతున్నాయి. సభ సజావుగా సాగకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. ఈ గందరగోళం కొనసాగుతుండగానే డిసెంబర్ 25 తేదీన జరగబోయే మత మార్పిడి కార్యక్రమాన్ని జరగనివ్వబోమని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ధర్మ జాగరణ్ సమితి తలపెట్టిన ఘర్ వాపసి కార్యక్రమం వల్ల శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని కనుక కార్యక్రమాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ జరగనివ్వబోమని పోలీసు అధికారులు ప్రకటించారు.

ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలని ప్రధాని మోడి హితవు పలికారని పత్రికలు చెబుతున్నాయి. కానీ బి.జె.పి ఎం.పి యోగి ఆదిత్యనాధ్ (ఉత్తర ప్రదేశ్ ఉప ఎన్నికల ప్రచార సారధిగా మోడి స్వయంగా నియమించిన వ్యక్తి) ఆలిఘర్ లో జరిగే ఘర్ వాపసి కార్యక్రమానికి తాను హాజరు అవుతానని ప్రకటించాడు. వివాదాస్పద చర్యలు, ప్రకటనలు వద్దని ఒక వంక సుద్దులు చెబుతూ మరో వంక అవే చర్యలకు ఎం.పిలను ప్రోత్సహించడం బట్టి ఒక పధకం ప్రకారమే ఇవన్నీ జరుగుతున్నాయని భావించవలసి వస్తోంది.

మోడి తలపెట్టిన ప్రయివేటీకరణ, సరళీకరణ విధానాల అమలు నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బి.జె.పి-ఆర్.ఎస్.ఎస్ శక్తులు మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నాయని కాంగ్రెస్ నేతలతో సహా అనేకమంది విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చిన మోడి ప్రభుత్వం పచ్చి ప్రజావ్యతిరేక నిర్ణయాలతో ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే విధానాలను అమలు చేస్తున్నందున ప్రజల నుండి, ఉద్యోగ, కార్మిక సంఘాల నుండి ప్రతిఘటన అనివార్యం. ఇలాంటి ప్రతిఘటన విస్తరించకుండా చేయడానికి, ప్రతిఘటనపై ప్రజల దృష్టి మళ్ళకుండా చేయడానికే బి.జె.పి ఎం.పిలు, హిందూత్వ సంస్ధల నేతలు రోజుకో వివాదాన్ని రగుల్చుతున్నారని విశ్లేషకులు ఏకీభావం వ్యక్తం చేస్తున్నారు.

One thought on “బొగ్గు, భీమా ప్రైవేటీకరణ: ఆర్డినెన్స్ ఆలోచనలో కేంద్రం?

  1. ఒక ముస్లింను హిందువుగా మార్చడానికి రు. 2 లక్షలు, ఒక క్రైస్తవుడిని హిందువుగా మార్చడానికి రు. 5 లక్షలు ఖర్చవుతాయని కనుక పౌరులు విరివిగా విరాళాలు ఇవ్వాలని కరపత్రాల ద్వారా కోరారు.
    సర్, ఏమిటీ ఈ ఖర్చులెక్కలు దీనిగూర్చి వివరాలుంటే తెలియజేయగలరు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s