పాక్ ప్రధాని: “నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను- మరణ దండనపై నిషేధాన్ని ఎత్తివేశామని…”
*********
పెషావర్ ఉగ్ర దాడిలో 130 మందికి పైగా స్కూల్ పిల్లలు మరణించిన దరిమిలా ఉగ్రవాదంపై కత్తి కడుతున్నట్లు చూపడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు ప్రకటిస్తోంది. అందులో మొదటిది మరణ శిక్షలు!
ఉగ్రవాదులకు మరణ దండన విధిస్తామనడం ఒక విధంగా హాస్యాస్పదం. ఉగ్రవాదులే చావడానికి నిర్ణయించుకుని వచ్చి దాడులు చేస్తుంటే వారికి మరణ దండన వేస్తామంటే జడిసిపోతారా? ఉదాహరణకి పెషావర్ దాడినే తీసుకుంటే దాడి చేసిన 6 గురిలో ముగ్గురు ఆత్మాహుతి బాంబులని తాలిబాన్ స్వయంగా చెప్పింది. మిగిలినవారిని సైన్యమే చంపేసింది. ఇక మరణ శిక్ష ఎవరిని ఆపగలవు?
నిజానికి గతంలో పట్టుబడిన ఉగ్రవాదులకు పాక్ కోర్టులు కొన్ని మరణ దండన విధించగా మధ్యలో వచ్చిన నిషేధం వల్ల వారు జైళ్ళలో కాలం వెళ్లదీస్తున్నారు. వారికి ఇంతకాలం శిక్ష అమలు చేయలేదు. పెషావర్ దాడి జరిగిన వెంటనే హడావుడిగా వారందరిని ఉరి తీసేశారు. ఉరి తీయబడ్డ వారి సంఖ్య 40 నుండి 60 వరకు ఉన్నదని వివిధ పత్రికలు తెలిపాయి. అప్పటికే అనేకమందికి ఉరి శిక్ష విధించినా పెషావర్ దాడి జరిగింది. ఉరి శిక్షలు ఉగ్రవాదాన్ని ఆపలేవని తెలియడానికి ఇది చాలదా?
ఉగ్రవాదాన్ని తానే తన ఇంటిలోనే పెంచి పోషిస్తూ వారికి ఉరి శిక్షలు ప్రకటించడం వల్ల లాభం ఏమిటని ఈ కార్టూన్ ప్రశ్నిస్తోంది. ఈ అవగాహనలో పాక్షిక వాస్తవమే ఉంది. ఉగ్రవాద పోషకులలో పాకిస్తాన్ రాజ్యానిది ఒక పాత్ర మాత్రమే. ప్రధాన పాత్ర సి.ఐ.ఏ ది. ముంబై పేలుళ్లకు రెక్కీ జరిపిన జేమ్స్ హెడ్లీ సి.ఐ.ఏ చెరలో ఇప్పటికీ భద్రంగా ఉన్న సంగతి మరువరాదు.
తాలిబాన్ ఒకే ఒక్క సంస్ధ కాదు. అది అనేకానేక గ్రూపుల సంగమం. అన్ని గ్రూపులూ ఒకే కమాండ్ లో ఉండవు. పాక్ పాలకవర్గాల లోని వివిధ గ్రూపులు, సి.ఐ.ఏ గూఢచార సంస్ధకు చెందిన వివిధ కాంట్రాక్టర్లు తమ తమ గ్రూపులను పోషిస్తుంటాయి. ఏ ఒక్క సమయంలో తీసుకున్నా, ఈ గ్రూపులు వివిధ లక్ష్యాల కోసం పని చేస్తూ ఉంటాయి.
ఉదాహరణకి పాక్ పాలకవర్గాలలో సైన్యం, పౌర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉగ్రవాద గ్రూపులు పని చేస్తున్నాయి. ఇవి అవసరం అయితే ఒక సమయంలో ఒకరినొకరు సహకరించుకోవచ్చు. మరో సమయంలో, అధికార ఆధిపత్యాల కోసం సైనిక గ్రూపు – పౌర ప్రభుత్వ గ్రూపు పరస్పరం ఘర్షణ పడుతున్నప్పుడు వారి కింద ఉన్న ఉగ్ర గ్రూపులు కూడా ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటాయి. సి.ఐ.ఏ కాంట్రాక్టర్ల మధ్య పోటీ కూడా ఉగ్రవాదు గ్రూపుల మధ్య ఘర్షణలకు కారణం అవుతుంది.
ఇంత గందరగోళం మధ్య పాకిస్తాన్ ఒక అరాచక, రాజ్య రహిత దేశంగా కొనసాగుతోంది. ఎవరి ప్రభావాన్ని వారు కాపాడుకుంటూ అమెరికా ప్రాబల్యం కోసం పోటీలు పడుతూ, వల్ల కాకపోతే రష్యా, చైనాలను దేబిరిస్తూ కాలం వెళ్లదీస్తున్నాయి. అందరూ కలిసి ప్రజల జీవితాన్ని ఛిద్రం చేస్తున్నారు.
దేశాలు ఇలా రాజ్య రహితంగా, గ్రూపుల నిలయంగా ఉండడమే సామ్రాజ్యవాద దేశాలకు కావాలి. ఎక్కడికక్కడ అంతః కలహాలతో స్వతంత్ర దేశాలన్నీ శాంతి లేకుండా బతుకుతూ సామ్రాజ్యవాదులపై ఆధారపడాలి. సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం అని లెనిన్ ఊరకనే అన్నారా?
ఇంత గందరగోళం మధ్య పాకిస్తాన్ ఒక అరాచక, రాజ్య రహిత దేశంగా కొనసాగుతోంది.
సర్,ఇలానే భారతదేశం గూర్చి ఒక వాక్యంలో చెప్పండి.(తెలుసుకోవాలనే ఆత్రుతలో ఉన్నాను!)
అంగట్లో విషం సీసాలూ, తుపాకులూ సులభంగా దొరికినా హత్యలు ఎక్కువగా జరుగుతాయి. అవి దొరక్కుండా చేసినా హత్యలు తగ్గుతాయి. కేవలం మరణ శిక్షల వల్ల హత్యలు తగ్గవు.