“SMALLEST COFFINS ARE THE HEAVIEST”
పెషావర్ పాఠశాలపై తాలిబాన్ జరిపిన పైశాచిక మృత్యు క్రీడకు నిరసనగా జరుగుతున్న ప్రదర్శనలో ఒక యువతి పట్టుకున్న ప్లకార్డ్ పై రాసి ఉన్న ప్రకటన ఇది.
“అతి చిన్న శవపేటికలు, అత్యంత బరువైనవి”
ఈ ఐదు పదాల ప్రకటనకు ఎంత లోతైన అర్ధం! మానవ మాత్రుల సామాన్య దృష్టికి అందని లోతు అది. బహుశా మానవుడి సాధారణ భావోద్వేగానికి కూడా అందని లోతు కావచ్చు.
ప్లకార్డు పట్టుకున్న ఆ యువతికి తెలుసో లేదో గానీ ఈ అక్షర తూణీరం, మృత్యు క్రీడను రచించిన సామ్రాజ్యాధీశులకు హృదయం అన్నది ఉంటే, ఆ హృదయాన్నే నేరుగా లక్ష్యంగా చేసుకుంది.
ఒక సోషలిస్టు శిబిరాన్ని హెచ్చరించడం కోసం, తద్వారా భౌగోళిక రాజకీయ వేటలో ప్రత్యర్ధులు లేకుండా చేసుకుని తమ అనుంగు కంపెనీలకు లాభాల పంటలు దక్కించడం కోసం పచ్చని నగరాన్ని ఒకే రోజులో ఒక్క అణు బాంబుతో నేల మట్టం చేయగల యుద్ధ పిపాసికి హృదయం ఎలా ఉండగలదు? అన్న ప్రశ్న సహజమే.
ఎంత కాదన్నా నోరు లేని మొక్కలకూ భావాలు ఉంటాయని కనుగొన్నాక, ఎంత లేదన్నా నోరుండీ భాష లేని పశు పక్ష్యాదులకూ హృదయ స్పందనలు ఉంటాయని తెలుసుకున్నాక సాటి మనిషిని హృదయ విహీనుడని ఎలా నిర్ధారించగలం, కాకుంటే ఆ హృదయంలో రక్త కణాలకు బదులు డబ్బు కణాలు ప్రవహిస్తాయని చీత్కరించవచ్చు గాని?!
కానిబాలిజం! పాములకూ, పులులకూ మాత్రమే మనిషి ఈ లక్షణాన్ని అంటగడతాడు! వినోద కాసులు రాల్చి పెట్టే హాలీవుడ్ తెరపై పరాయి తెగల జనానికీ ఆ పశు లక్షణాన్ని అంటగట్టడానికీ ‘వాడే’ ముచ్చటపడతాడు.
వాడే అప్పుడు హీరోషిమా, నాగసాకిలలో, మొన్న వియత్నాంలో, నిన్న ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియాలలో, నేడు యెమెన్, సోమాలియా, సిరియా, తూర్పు ఉక్రెయిన్… ఇలా కన్ను పడిన చోటల్లా కానిబాలిజం అమలు చేస్తూనే ఉన్న సంగతి దృగ్గోచరం కాని బహిరంగ రహస్యం!
వాడు నేరుగా చేస్తే…..?
అది ప్రజాస్వామ్య సంస్ధాపన! అది నియంతృత్వ పీచమణచడం! అది కమ్యూనిస్టు భూతాన్ని మట్టుబెట్టడం! అది అసలే లేని సామూహిక విధ్వంసక మారణాయుధాలను కని పెట్టి ధ్వంసించడమూ కావచ్చు! అది ఎన్నడూ జరగని మహా పౌర హత్యాకాండను నిరోధించడమూ కావచ్చు! అది తానే రేపిన ప్రజాస్వామిక తిరుగుబాటుకు చేయూత ఇవ్వడమే కావచ్చు!
ప్రపంచమే సాగిలపడి నమ్మవచ్చు గాక!
వాడు వెనక ఉండి చేయిస్తే…..?
అది ప్రపంచ ఉగ్రవాదం! అది ఆల్-ఖైదా జాబితా ప్రపంచంపై ప్రకటించే తీవ్రవాద యుద్ధం! అది నాగరికతల మహా సంగ్రామం! అది ఆల్-నూస్రా భాస్వర క్షిపణులతో చేసే రసాయన యుద్ధం! అది ఇస్లామిక్ కాలిఫేట్ సామ్రాజ్యవాద విస్తరణ! ఇసిస్ యొక్క స్వతంత్ర జాతి రాజ్యాల భక్షణ.
రహస్యమెరిగిన నలుగురు నవ్విపోదురు గాక!
యుద్ధం జరగాలి. ఇరు పక్షాలూ తన చెప్పు చేతల్లోనే ఉండాలి.
యుద్ధం సాగాలి. తెగబలిసిన మిలటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అవిరామంగా రణగొణ… కరకర… ఫెటేల్ ఫెటేల్… పని చేస్తూనే ఉండాలి. విధ్వంసక కర్కశత్వం అంతా పోగుబడిన లోహ దేహాలు అవిరామంగా ఉత్పత్తి కావాలి. సామ్రాజ్యాధీశుల లాభ దాహం నిరంతరాయంగా తీరుతూనే ఉండాలి.
యుద్ధం పూయాలి. మధ్య ప్రాచ్యంలో రెండు హెవీ వెయిట్ లు ఒక నది నీటి కోసం యుద్ధంలో మునిగిపోవాలి. ఒకవైపు ప్రత్యక్షంగా, మరోవైపు రహస్యంగా ఆయుధాలు సరఫరా కావాలి. ఆ ఆయుధాలు తన మిలట్రీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నుండే వెళ్ళాలి. లాభాలు కరెన్సీ పువ్వులై పూయాలి.
యుద్ధం వర్ధిల్లాలి. నిన్నటిదాకా కలిసి మెలిసిన హుటు, టుట్సిలు పరస్పరం తెగనరుక్కుని నెత్తురుటేరులు పారించాలి. ఎవరూ తాకని సహజ వనరులు సురక్షితం కావాలి. తాను తాకే వరకూ ఆ గడ్డపై నడిచే వాడు కూడా తాకేందుకు వణికిపోవాలి. సామ్రాజ్యాధీసుడి హేగ్ మానవ హక్కుల కొలువుకి నిందితులు కావాలి. విచారణ తంతులు నడవాలి. ప్రపంచ న్యాయం పచ్చగా వర్ధిల్లాలి.
యుద్ధం అణచివేయాలి. సోవియట్ సేనలు ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధ ఆర్ధిక వ్యవస్ధ అనే దుస్సాహాసంలో కూరుకుపోవాలి. వారిపై తిరగబడ్డ ముజాహిదీన్లు సి.ఐ.ఏ తుపాకులై మొలవాలి. ఎన్.ఎస్.ఏ బాంబులై పేలాలి. డి.ఐ.ఏ మర ఫిరంగులై సొంత జాతినే విధ్వంసం కావించుకోవాలి. ప్రత్యర్ధి అనేవాడు తనలో తాను కుచించుకుపోవాలి. స్వయంగా ఓటమి ప్రకటించి వెనక్కి తిరగాలి.
యుద్ధం విప్లవించాలి. రంగు రంగుల విప్లవాలు హరివిల్లై మెరవాలి. సామ్రాజ్య పోషణలోని ఎన్.జి.ఓ సైనికులే విప్లవ నేతలు కావాలి. ఎక్కడెక్కడి దశాబ్దాల అసంతృప్తినంతా వెంటకొనిపోవాలి. వీధులు రక్తసిక్తం కావాలి. జార్జియా, ఉక్రెయిన్, ఈజిప్టు, ట్యునీషియా… ఏ నేల అయితేనేం? కనుచూపు మేర పాత మాట, కనుగానని రోదసీ నిశీధులు సైతం… నేటి మాట! జనాగ్రహం ఎన్.జి.ఓ పూజారులు పట్టిన హారతిలో కర్పూరమై కరిగిపోవాలి.
యుద్ధం రేగాలి. మాసిపోయిన పాత గాయాలను పొడిచి పొడిచి రేపాలి. నాజీ ముష్కరుల వారసులు ప్రజాస్వామ్య ఉద్యమకారులుగా విచిత్రావతారం ఎత్తాలి. పశ్చిమ ఉక్రెయినియన్లూ, తూర్పు ఉక్రేనియన్లూ ఒకరినొకరు ద్వేషించుకుని కుత్తుకలు ఉత్తరించుకోవాలి. రక్తస్రావంతో ప్రజా చేతన నీరసించాలి. సొంత దళారీల అవినీతే సామ్రాజ్య విస్తరణకు పోషణ కావాలి.
యుద్ధం విస్తరించాలి. యుద్ధ విస్తరణకు కారణాలు కావాలి. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? సామ్రాజ్యాధీశుడు తలచుకుంటే కారణాలు మొలవవా? ఉగ్రవాదం విత్తిన చేనుకు ప్రాణాలు ఎరువుగా కావాలి. ప్రాణాలు మూకుమ్మడిగా ఆవిరైనపుడు విచక్షణారహిత ప్రతీకార భావజాలం గాలిలో నిండిపోతుంది. భయాందోళనలు రక్షకుడి కోసం ఎదురు చూస్తాయి.
రెండో రాకడకు ఏర్పాట్లు జరిగిపోతాయి. పెరట్లో ఇష్టంగా పెంచుకున్న ఉగ్రమూకలు ఏపుగా పెరిగి చేతికొచ్చిన సమయాన పసిప్రాణాలు పిట్టల్లా రాలిపోవడం ఒక లెక్కా? రాలిపడే ప్రాణం ఎంత పసిదైతే అంత ప్రభావం. అంత ద్వేషం. అంత భయం. అంత ప్రతీకారం. ఆ ప్రతీకారాన్ని సామ్రాజ్య ప్రభువులే తీర్చి పెట్టాలి. డ్రోన్ దాడులకు ప్రజామోదం ఇక చిటికెలో పని.
సంకేత తరంగాలే క్షిపణి బాణాల్ని సంధించే మానవ రహిత గాండీవమవుతున్న కాలంలో ఇళ్ళు, భవనాలు, కుటుంబాలు, జాతులు నేలమట్టం కావడం ఎంతసేపని? మానవతా వ్యతిరేక నేరాలు! Crimes against humanity!! ఇది ఇప్పడు సామ్రాజ్యాధీశుడి ఊతపదం. నేరం ఇప్పుడిక వైయక్తికం కాదు. అది సమూహాల్ని నాశనం చేసే సామూహిక ప్రయోగం.
ప్లేగు, కలరా, మశూచి… అంతరించాయా? పిచ్చివాడా, లేదు లేదు. అవి పేరు మార్చుకున్నాయంతే! పెట్టుబడి, లాభం, మార్కెట్, డబ్బు….
ఆధునిక ప్లేగు, కలరా, మశూచిలను శాశ్వతంగా అంతం చేసే సామాజిక-రాజకీయార్ధిక వ్యాక్సిన్ ఎప్పుడో తయారై ఉంది. వ్యాధి నయమైపోతే వైద్యుడి బ్రతుకు తెరువు ఎలా? తగాదాలు నశించి లోకం ప్రశాంతమైతే న్యాయ దేవత బంటులకు పని ఎలా? రోగం కొనసాగాలి, వైద్యం బతకాలి. జనం తన్నుకు చావాలి. న్యాయవాది పచ్చగా ఉండాలి. కుల, మత, లింగ, జాతి, ప్రాంత వివక్షలన్నీ కొనసాగాలి. లా అండ్ ఆర్డర్ కాపాడే పాలకులు స్వారీ చేయాలి. సామాజికార్ధిక వైరుధ్యాలు కొనసాగాలంటే సామాజిక-రాజకీయార్ధిక వ్యాక్సిన్ నే వైరస్ గా జనం నమ్మాలి.
వైద్యమే రోగమై రోగమే వైద్యమైన పాడుకాలమే ధర్మకాలపై పచ్చగా వర్ధిల్లాలి.
యుద్ధం జరగాలి. యుద్ధం కొనసాగాలి. కొనసాగుతూనే ఉండాలి.
సర్,మీరు వెల్లడించిన ఈ పదాలు వాటి అర్ధాలు మీ లక్ష్యాలను తెలుపుతున్నయనుకోవాలా? లేదా అది కేవలం రచనల వరకే పరిమితమనుకోవాలా? మీరు తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే అంతకుమించి నేనేమీ ఆలోచించలేకపోతున్నాను!
కానీ, ఈ టపా పెట్టుబడీదారి వర్గాల దుర్నీతిని,వికటహాసాని సూటిగా ప్రశ్నిస్తున్నాయి!మీ బ్లాగ్ ను అనుసరిస్తున్న కొద్దిమందికి పెట్టుబడీదారుల అసలు స్వరూపాన్ని తెలియజేస్తున్నారుగానీ,అంతకంటే మెరుగైన(కార్యాచరణ) మార్గాన్ని సూచించవచ్చునుగదా!
ఎందుకంటే మాటలు రాతలు కన్నా చేతలే ప్రభావవంతమైనవి కదా!
//ప్లేగు, కలరా, మశూచి… అంతరించాయా? పిచ్చివాడా, లేదు లేదు. అవి పేరు మార్చుకున్నాయంతే! పెట్టుబడి, లాభం, మార్కెట్, డబ్బు….//
శేఖర్ గారు, చాలా అద్బుతమ్గా చెప్పారు. ఈ పోష్టు చాలా లోతుగా ఉంది. మాములు మాటలకు అందని భావాలని ఆల వోకగా అద్బుతగా చెప్పారు.
హిమగిరి గారు మీరన్నది నిజం. కార్యాచరణే కావాలి. మీరు గమనిస్తే ఆర్టికల్ లో అదే చెప్పాను.
కార్యాచరణ ఏమిటన్నదీ బ్లాగ్ లో అనేకసార్లు చెప్పాను. ఈ రైటప్ లోనూ అది ఉంది. కాకుంటే పరోక్షంగా ఉంది.
బ్లాగు కూడా ఒక కార్యాచరణ. మీరు చెప్పే కార్యాచరణ బ్లాగులో కనపడకపోవచ్చు. మాంసం తింటామని చెప్పేందుకు ఎముకలు మెడలో వేసుకుంటామా?
వీశేకర్ గారు ఈ అర్టీకల్ చాలా బాగుంది నిజంగా హౄదయాన్ని తాకింది . సామ్రజ్యావాదులు చేస్తున్న దారుణాలు , సామ్రజ్యావాదుల చేతుల్లొ ఈ ప్రపంచం ఏలా నలిగిపొతొందొ కళ్ళకు కట్టారు. ఈ ప్రపంచం ఎదురుకొంటూన్న అతి పెద్ద ప్రమాదం ఉగ్రవాదం కాదు ,సామ్రజ్యవాదం .