రోదసీ ప్రపంచంలోకి భారతీయుడు ప్రవేశించే దూరం దగ్గరలోనే ఉన్నదని నేడు ప్రయోగించిన జి.ఎస్.ఎల్.వి – మార్క్ III ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం ద్వారా రుజువయింది. రాకెట్ ద్వారా మనుషులు కూర్చుని ఉండే మాడ్యూల్ ను రోదసీలోకి ప్రయోగించిన అనంతరం సదరు మాడ్యూల్ భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే ప్రయోగాన్ని LVM3/CARE ప్రయోగం ద్వారా భారతీయ శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించి చూశారు. మాడ్యూల్ సురక్షితంగా భూవాతావరణంలోకి ప్రవేశించడమే కాకుండా అనుకున్న చోటనే బంగాళాఖాతంలో దిగడంతో శాస్త్రవేత్తలు ఆనందోత్సాహాలు ప్రకటించారు.
“అంతా అనుకున్న విధంగానే, సవ్యంగానే పూర్తయింది. ఈ కొత్త లాంచింగ్ వాహనం చాలా చక్కగా పనితనం ప్రదర్శించింది. ప్రయోగం గొప్పగా విజయవంతం అయింది. భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించేటప్పుడు ఎదురయ్యే పరిస్ధితుల లక్షణాలను పరిశీలించడానికి మానవ రహిత మాడ్యూల్ ను (రోదసీ) లోకి పంపాము. అది కూడా విజయవంతంగా పూర్తయి మాడ్యూల్ బంగాళా ఖాతంలో సురక్షితంగా దిగింది” అని ఐఎస్‌ఆర్‌ఓ అధినేత కె.రాధా కృష్ణన్ ప్రకటించారు.
మొత్తం ప్రయోగం పూర్తి కావడానికి 20 నిమిషాల సమయం పట్టిందని పత్రికల వార్తల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రయోగం ద్వారా భవిష్యత్తులో భారత అంతరిక్ష శాస్త్రవేత్తలను లేదా రోదసీ సైనికులను (అమెరికా పరిభాషలో ఆస్ట్రోనాట్, రష్యా పరిభాషలో కాస్మోనాట్) ఉపగ్రహంలో ఉంచి రోదసీ లోకి లేదా చంద్రుడి మీదికి, ఇంకా అభివృద్ధి అయితే అంగారకుడి మీదికి పంపేందుకు తగిన పరిజ్ఞానం ఇండియా శాస్త్రవేత్తలకు లభించింది. ఇప్పటికింకా పూర్తి పరిజ్ఞానం అనలేము గానీ అందులో ఒక అంశాన్ని విజయవంతంగా పరీక్షించి చూశారని చెప్పుకోవాలి.
భూమి నుండి ప్రయోగించబడిన ఐదున్నర నిమిషాల తర్వాత జి.ఎస్.ఎల్.వి వాహకం 3775 కిలోల బరువు గల CARE (Crew module Atmospheric Re-entry Experiment) అనుకున్న ఎత్తుకు (126 కి.మీ) తీసుకెళ్లింది. రెండు భారీ S-200 బూస్టర్లు (ఇందులో 207 టన్నుల ఘన ఇంధనం ఉంటుంది), అనుకున్నట్లుగానే 153.5 సెకన్ల తర్వాత వాహకం నుండి విడిపోయాయీ. కీలకమైన క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ ఇంజన్ కూడా తాజా ప్రయోగంలో ఉండడం విశేషం. అయితే క్రయో ఇంజన్ ను ఈ ప్రయోగంలో పని చేయనివ్వకుండా ఉంచారు.
C25 క్రయోజనిక్ నుండి CARE మాడ్యూల్ 330.8 సెకన్ల అనంతరం జి.ఎస్.ఎల్.వి మార్క్ III నుండి విడివడి రోదసీ నుండి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించడానికి దిగడం ప్రారంభించిందని ఇస్రో తెలిపింది. కేర్ మాడ్యూల్ అండమాన్ సముద్రంలో శ్రీహరి కోటకు 1600 కి.మీ దూరంలో దిగిందని తెలిపింది. 20 నిమిషాల 43 సెకన్లకు పారాచ్యూట్ ల సహాయంతో భద్రంగా సముద్రంలోకి దిగిందని, మాడ్యూల్ ను సేకరించడానికి బృందాలు వెళ్ళాయని ఐఎస్‌ఆర్‌ఓ తెలిపింది.
“వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తున్న క్రమంలో పారాచ్యూట్ లు చాలా బాగా పని చేశాయి. పారాచ్యూట్ ప్రదర్శన మమ్మల్ని ఆకట్టుకుంది. ఆస్ట్రోనాట్ లను రోదసీలోకి తీసుకెళ్ళేందుకు ఉద్దేశించిన మాడ్యూల్ క్షేమంగా దిగడం వల్ల భవిష్యత్తులో మానవుల్ని రోదసిలోకి పంపే ప్రయోగం వైపుగా ముందడుగు పడింది. మాడ్యూల్ దిగిన చోటుకు 100 కి.మీ దూరంలో ఉన్న గస్తీ నౌకలకు సంకేతాలు మధ్య మధ్యలో అందలేదు గానీ మాకు మాత్రం అది ఎక్కడ ఉన్నదీ నిరంతరాయంగా సమాచారం ఇస్తూనే ఉంది” అని మానవ రోదసీ ప్రయోగ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్న ఉన్నికృష్ణన్ నాయర్ చెప్పారని ది హిందు తెలిపింది.
తాజా ప్రయోగం ద్వారా మరింత బరువు గల ఉపగ్రహాలను రోదసీ కక్ష్యలోకి ప్రవేశించగల సామర్ధ్యాన్ని ఇండియా సంతరించుకుంది. క్రయోజనిక్ ఇంజన్ యొక్క కీలకమైన పని అదే. ఎంత ఎక్కువ బరువు గల ఉపగ్రహాలను రోదసీలోకి పంపగలరన్న సామర్ధ్యాన్ని బట్టి ఒక దేశం యొక్క రోదసీ పరిజ్ఞానం అంచనా వేయబడుతుంది. ఆ వైపుగా ఇండియా శాస్త్రవేత్తలు మరో ముందడుగు సాధించారని భావించవచ్చు.
ఈ ప్రయోగ ఫలితానికి సంభంధించిన ముఖ్యమైన అంశం ఏమిటంటే-“ఇప్పటికింకా పూర్తి పరిజ్ఞానం అనలేము గానీ అందులో ఒక అంశాన్ని విజయవంతంగా పరీక్షించి చూశారు”
ఎందుకంటే ఈ ప్రయోగ పరీక్ష సమయం 20 నిమిషాలు మాత్రమే! ఇంత తక్కువ సమయం,స్వల్ప పరిభ్రమణ లక్ష్యంతో రోదసీలోకి మనిషిని పంపే ఒక పరీక్షను విజయవంతంగా ప్రయోగించామంటే నమ్మడం కష్టంగా ఉంది!