పెట్టుబడుల క్లియరెన్స్ ప్రధాని మోడి చేతుల్లోకి


Make in India

‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం ద్వారా భారత దేశంలోకి విరివిగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని కలలు గంటున్న ప్రధాన మంత్రి మోడి ఆ వైపుగా అడుగులు వేగంగా వేస్తున్నారు. మన్మోహన్ హయాంలో యు.పి.ఏ 2 పాలన చివరి రోజుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, విదేశీ-స్వదేశీ ప్రైవేటు పెట్టుబడుల క్లియరెన్స్ కు ఏర్పాటు చేసిన ‘ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్’ (పి.ఎం.జి) ను ప్రధాని మోడి తన చేతుల్లోకి తీసుకున్నారని పేరు చెప్పని అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది.

తమ పేరు చెప్పకుండానే ప్రధాన మంత్రి కార్యాలయంలోని తతంగాన్ని పత్రికలకు, అది కూడా విదేశీ పత్రికలకు లీక్ చేశారంటే అర్ధం ఆ సంగతి బైటికి తెలియాలని ప్రభుత్వ నేతలు కాంక్షించారని భావించవచ్చు. అధికారికంగా చెప్పడం ద్వారా విమర్శలు ఎదురు కావచ్చు. అనధికారికంగా చెప్పడం ద్వారా లక్ష్యిత సెక్షన్లకు పరోక్ష హామీలు ఇవ్వవచ్చు.

ఏది నిజమో తేల్చగల సమాచారం మనకు ఎప్పటికీ దొరకదు. ఈ లోపు ఈ వార్త ద్వారా జరిగే చర్చల సరళిని గమనించి తదనుగుణంగా అధికారిక అడుగు వేసే అవకాశం ప్రభుత్వ పెద్దలకు లభిస్తుంది. అనధికారికంగా, పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేయడం వెనుక తరచుగా ఈ తతంగం దాగి ఉంటుంది.

300 బిలియన్ల డాలర్ల (దాదాపు 18 లక్షల కోట్ల రూపాయలకు సమానం) విలువ గలిగిన పెట్టుబడులు అనుమతుల కోసం ఎదురు చూస్తూ ఎక్కడివక్కడే నిలబడిపోయాయట! పి.ఎం.జి పగ్గాలు ప్రధాని మోడి చేతికి వెళ్ళడం వల్ల వీటికి త్వరలోనే విముక్తి లభిస్తుందని రాయిటర్స్ వార్తా సంస్ధ గంపెడు ఆశల్ని వార్తలో ఒలకబోసింది. ఈ ఆశల్ని నెరవేర్చే ఉద్దేశ్యం మన ఏలికలకు ఉన్నదా అన్నది ఎలా తెలియాలి?

అసలు నిజంగానే 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అనుమతుల ఫైళ్లలో ఇరుక్కుని ఉన్నాయా అన్నది బ్రహ్మ రహస్యం. ఎందుకంటే ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్న అతి పెద్ద ఎఫ్.డి.ఐ పోస్కో కంపెనీది. దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ ఒరిస్సాలో గిరిజనులు, దళితుల భూముల్ని కాజేసి, వారి తమలపాకు తోటల్ని ధ్వంసం చేసి, వారి జీవనాధారాన్ని గంగలో కలిపేసి తమకు అప్పగించాలని కోరుతోంది. దానికి తగిన అటవీ, పర్యావరణ అనుమతులని యు.పి.ఏ ప్రభుత్వం సగం ఇచ్చి ప్రజల వ్యతిరేకత వల్ల ముందుకు వెళ్లలేకపోయింది.

ఈ అతి పెద్ద ఎఫ్.డి.ఐ విలువ 12 బిలియన్ డాలర్లు. అతి పెద్ద ఎఫ్.డి.ఐ విలువే ఇంత తక్కువ ఉంటే మిగిలిన 288 బిలియన్ల పెట్టుబడులు ఎన్ని వందల/వేల కంపెనీలవో ప్రభుత్వమే చెప్పాలి. ఇన్నేసి కంపెనీలు గోతి కాడ గుంట నక్కల్లా భారత ప్రజల వనరులను కాజేయడానికి కాచుకుని కూర్చున్నాయని రాయిటర్స్ కధనం బట్టి అర్ధం అవుతోంది.

వ్యాపారాలకు (అనగా స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీలకు) అనుకూలంగా ఉంటానని హామీ ఇచ్చిన మోడి ఆరు నెలలు దాటినా ఇచ్చిన హామీని ఆచరణలోకి తేలేదని రాయిటర్స్ బాధపడుతోంది. పెట్టుబడులను బాగా ఆకర్షించి ఆర్ధిక వృద్ధిని పైపైకి ఎగదోయగల చర్యలు ఆయన ఇంకా బాకీ పడ్డారని ఆక్షేపించింది. ఈ నేపధ్యంలోనే పారిశ్రామిక వృద్ధి అక్టోబర్ లో మూడు సంవత్సరాల్లోనే అత్యల్ప స్ధాయికి పడిపోయిందని, కుదించుకుపోయిందని విమర్శించింది. మోడి తలపెట్టిన ‘మేక్-ఇన్-ఇండియా’ కార్యక్రమం అందుకే మూలనపడిందని వెక్కిరించింది.

అంతా అయ్యాక పి.ఎం.జి ని కేబినెట్ సెక్రటేరియట్ ఆధీనంలో నుండి ఇక తన చేతుల్లోకి తీసుకోబోతున్నందున ప్రధాన మంత్రి కార్యాలయం నేరుగా ప్రాజెక్టులను క్లియర్ చేస్తుందని, ఇక అనుమతుల అడ్డంకులన్నీ ఏరిపారేస్తారని రాయిటర్స్ తెలిపింది. ఈ అనుమతుల అడ్డంకులు ఏమిటయ్యా అంటే మేళ తాళాల మధ్య కాంగ్రెస్, బి.జె.పి లు కలిసి ఆమోదించిన పర్యావరణ, అటవీ, గ్రామాధికార, భూసేకరణ చట్టాలే. ఈ చట్టాల ద్వారా భారత ప్రజలకు గొప్ప మేలు చేశామని కాంగ్రెస్ చెప్పుకుంది. చట్టాల ఆమోదంలో బి.జె.పి పాత్ర కూడా ఉంది కనుక తమకూ క్రెడిట్ దక్కుతుందని బి.జె.పి కూడా చెప్పుకుంది. తీరా ఆ చట్టాలే వ్యాపారాలకు, తద్వారా ఆర్ధిక వృద్ధికి అడ్డం అయ్యాయని మోడి ప్రభుత్వమే చెబుతోంది. పాలకులు చెప్పే ఆర్ధిక వృద్ధికీ, ప్రజల అభివృద్ధికీ అసలు పొంతనే లేదని చెప్పడానికి ఇది చాలదా?

“సమస్త ప్రాజెక్టు క్లియరెన్స్ లను ప్రధాన మంత్రి కార్యాలయమే నేరుగా పర్యవేక్షిస్తుందన్న వాస్తవమే మెరుగైన సామర్ధ్యాన్ని (ప్రభుత్వంలో) చొప్పిస్తుంది. ప్రతి స్ధాయిలోనూ అనుమతులన్నీ ఇక వేగంగా వచ్చేస్తాయి. పి.ఎం.ఓ ముద్రే భారీ తేడా తీసుకొస్తుంది” అని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి చెప్పారని రాయిటర్స్ తెలిపింది.

గతంలో ఖైతాన్ అనే ఒక ఫ్యాన్ల (పంకాలు) కంపెనీ ఉండేది. ఇప్పుడూ ఉందేమో తెలియదు. ఆ కంపెనీ నినాదం “ఖైతాన్! ఆ పేరే చాలు” అని ఉండేది. ఖైతాన్ అని పేరు ఉంటే చాలు. ఇక ఏమీ చూడక్కర్లేదు. గుడ్డిగా కొనెయ్యొచ్చు అని కంపెనీ నినాదం అర్ధం. అదే కోవలో మన కేంద్ర ప్రభుత్వ అధికారి ‘పి.ఎం.ఓ ముద్ర ఒక్కటి చాలు. ఇక పెట్టుబడులే, పెట్టుబడులు!’ అని నినాదం ఇస్తున్నట్లున్నారు. ఇంతకీ క్రియావిహీనుడు అని విదేశీ పత్రికలు తిట్టిపోసిన మన్మోహన్ నియమిత పి.ఎం.జి యే మోడీకి ఆయుధం కావడం, దాన్ని అవే పత్రికలు నిస్సిగ్గుగా కీర్తించడం ఏమిటి?

గుజరాత్ లో మోడి ప్రధానిగా ఉండగా ఆయనతో సన్నిహితంగా పని చేసిన అధికారే ఇప్పుడు పి.ఎం.ఓ లో ఉన్నారుట. పి.ఎం.ఓ లోని కీలక నిర్ణయాలన్నీ ఆయనా, మరి కొద్ది మంది అధికారులూ తీసుకుంటారట. వారి పుణ్యాన భారత ప్రభుత్వానికి పట్టిన ‘పాలసీ పెరాలసిస్’ వదిలిపోతుందని రాయిటర్స్ ఆశిస్తోంది.

ఈ విదేశీ కంపెనీల ఆశలు నెరవేర్చే ప్రభుత్వాన్నా భారత ప్రజలు ఎన్నుకున్నది?! హతవిధీ!

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s