విదేశాల్లో నల్లడబ్బు: మూడో స్ధానంలో ఇండియా


blackmoney

భారతీయుల నల్ల డబ్బు తమ వద్ద లేదని స్విట్జర్లాండ్, తదితర నల్ల డబ్బు స్వర్గాలు నమ్మబలుకుతుండగా అందులో నిజం లేదని వాస్తవాలు తెలియజేస్తున్నాయి. రష్యా, చైనాల తర్వాత దేశీయ డబ్బును విదేశాలకు తరలిపోతున్న దేశాలలో ఇండియాయేదే తదుపరి స్ధానం అని ఒక అంతర్జాతీయ సర్వే సంస్ధ నిర్ధారించింది. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ (జి.ఎఫ్.ఐ) అనే సంస్ధ నల్ల డబ్బు వివరాలను వెల్లడి చేసింది.

జి.ఎఫ్.ఐ నివేదిక ప్రకారం ఒక్క 2012 లోనే 94.76 బిలియన్ డాలర్ల డబ్బు ఇండియా నుండి విదేశీ బ్యాంకులకు తరలిపోయింది. ఇది దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలకు సమానం. కాగా ఏ ఫిస్కల్ డెఫిసిట్ పూడ్చడానికని చెప్పి ప్రభుత్వ రంగ కంపెనీలను మోడి ప్రభుత్వం అమ్మకానికి పెడుతోందో ఆ ఫిస్కల్ డెఫిసిట్ 4 లక్షల కోట్ల రూపాయలు. ఒక్క సంవత్సరం నల్ల డబ్బు విదేశాలకు తరలిపోకుండా ఆపగలిగితే ఫిస్కల్ డెఫిసిట్ మటుమాయం అవుతుందన్నమాట! మన దేశ ఆర్ధిక వ్యవస్ధకు సాయం చేస్తున్న ప్రభుత్వ కంపెనీలను అమ్ముకోవలసిన అవసరం కూడా ఉండదు.

2003 నుండి 2012 వరకు జరిగిన పది సంవత్సరాలలో ఇండియా నుండి విదేశాలకు 440 బిలియన్ల నల్ల ధనం తరలిపోయిందని జి.ఎఫ్.ఐ నివేదిక తెలిపింది. ఇది దాదాపు 28 లక్షల కోట్లకు సమానం. గత పదేళ్ళలో తరలిపోయిన నల్ల డబ్బును వెనక్కి తెచ్చుకుంటే రైతుల అప్పులన్నీ మాఫీ చేయవచ్చు. ఏ ఒక్కరైతూ ఆత్మహత్య చేసుకోవలసిన అగత్యం ఉండదు. రోడ్లు, వంతెనలు, రైలు మార్గాల నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు ముందు దేహి అనవలసిన అవసరం ఉండదు. ‘మేక్-ఇన్-ఇండియా’ అంటూ దేశాలు పట్టుకుని తిరగక్కర్లేకుండా, పరిశోధన అభివృద్ధి రంగాలకు డబ్బు కేటాయించి, మనమే మన సరుకులను మేలైనవిగా తయారు చేసుకుని ఎగుమతి సామర్ధ్యం కూడా సంపాదించుకోవచ్చు.

నల్ల డబ్బు ఎగుమతిలో 2012లో 322.86 బిలియన్ డాలర్లతో రష్యా ప్రధమ స్ధానంలో ఉండగా 249.57 బిలియన్ డాలర్లతో చైనా రెండో స్ధానంలో ఉందని జి.ఎఫ్.ఐ తెలిపింది. ఈ సంస్ధ పరిశీలన జరిపిన తాజా సంవత్సరం 2012. ఆ తర్వాత వివరాలను సంస్ధ ఇంకా సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

అభివృద్ధి చెందుతున్న దేశాలు, వర్ధమాన దేశాల నుండి 2012 సంవత్సరంలో మొత్తం 991.2 బిలియన్ డాలర్ల నల్ల డబ్బు విదేశాలకు తరలిపోగా అందులో పదో వంతు ఇండియా నుండే వెళ్ళడం గమనార్హం. ఈ డబ్బంతా నేరాలు, అవినీతి ద్వారా సంపాదించడంతో పాటు పన్నులు ఎగవేయడంలో భాగంగా తరలిపోయిందేనని వాషింగ్టన్ నుండి పని చేసే జి.ఎఫ్.ఐ స్పష్టం చేసింది.

గుండెలు బాదుకోవలసిన మరో వాస్తవం ఏమిటంటే 2003 నుండి 2012 వరకు గడిచిన 10 సంవత్సరాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి తరలిపోయిన మొత్తం నల్ల డబ్బు 6.6 ట్రిలియన్ డాలర్లు. ఇది 396 లక్షల కోట్ల రూపాయలకు సమానం. అభివృద్ధి చెందిన దేశాల బహుళజాతి కంపెనీలు అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి దోచుకుపోతున్న డబ్బే పెద్ద మొత్తంలో ఉండగా, ఆయా దేశాలలోని వ్యాపారులు, పెట్టుబడిదారులు తదితర ధనిక వర్గాలు కూడా పూనుకుని విదేశాల్లో దాచి పెడుతున్న మొత్తం 396 లక్షల కోట్ల రూపాయలు. ఇంత డబ్బు పెట్టుకుని డబ్బు లేదని చెబుతూ ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏటికేడూ పన్ను బాదుడు పెంచుకుంటూ పోవడం నయ వంచన తప్ప మరొకటి కాదు.

ఈ 396 లక్షల కోట్ల రూపాయల్లో ఇండియా నుండి తరలి వెళ్ళిన 28 లక్షల కోట్లు కూడా కలిసి ఉంది. పదేళ్ళలో నల్ల డబ్బు ఉత్పత్తి చేసిన దేశాలలో ఇండియా నాలుగో స్ధానంలో ఉండగా 1.25 ట్రిలియన్ డాలర్లతో చైనా మొదటి స్ధానాన్ని ఆక్రమించింది. 973.86 బిలియన్ డాలర్లతో రష్యా రెండో స్ధానాన్ని, 514.26 బిలియన్ల తో మెక్సికో మూడో స్ధానాన్ని ఆక్రమించింది. ఈ పదేళ్ళ లోనూ సగటున సంవత్సరానికి 43.96 బిలియన్ డాలర్ల (2.64 లక్షల కోట్ల రూపాయలు) డబ్బు ఇండియా సరిహద్దులను దాటి వెళ్లిపోతోంది.

సుప్రీం కోర్టు ఆదేశంతో నల్ల డబ్బు వెనక్కి తేవడం కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. హెచ్.ఎస్.బి.సి బ్యాంకు నుండి అందిన జాబితాలోని ఖాతాల్లో రు. 4,479 కోట్ల డబ్బు మాత్రమే ఉన్నదని సిట్ తేల్చింది. ఈ డబ్బు కేవలం జెనీవా బ్రాంచి లోని ఖాతాలో ఉన్నది మాత్రమే. దేశంలోనే లెక్కకు రాని డబ్బు రు. 14,958 కోట్ల వరకు ఉన్నట్లు కనుగొన్నామని సిట్ ఇటీవల తెలిపింది. ఈ డబ్బు పై విచారణ చేస్తున్నామని ఎన్-ఫోర్స్-మెంట్ డైరెక్టరేట్, ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్ వాళ్ళు చెబుతున్నారు.

విదేశాల్లో దాచిన నల్ల డబ్బు వెనక్కి తెస్తామని, దేశంలో నల్ల డబ్బు వెలికి తీస్తామని కాంగ్రెస్, బి.జె.పి, ఇంకా అనేకానేక జాతీయ, ప్రాంతీయ పార్టీలు అనేక మార్లు ప్రజలకు హామీ ఇచ్చాయి. ఈ పార్టీలన్నీ ఏదో ఒక సారి అధికారం వెలగబెట్టినవే. అయినా అధికారికంగా నల్ల డబ్బు ఇంత అని లెక్క తీసినవారు గానీ, కనీసం లెక్కించే ప్రయత్నం చేసినవారు గానీ లేరు.

జి.ఎఫ్.ఐ ప్రకారం 2003లో విదేశాలకు తరలి వెళ్ళిన అక్రమ డబ్బు 297.4 బిలియన్ డాలర్లు ఉంటే 2012లో అది 991.2 బిలియన్ డాలర్లకు చేరింది. ద్రవ్యోల్బణం కూడా లెక్కలోకి తీసుకుంటే ఈ అక్రమ డబ్బు ప్రవాహం యేటా 9.4 శాతం చొప్పున పెరుగుతూ వచ్చిందని జి.ఎఫ్.ఐ చీఫ్ ఎకనమిస్టు దేవ్ కర్ చెప్పారు. మధ్య ప్రాచ్యం మరియు ఉత్తర ఆఫ్రికా, ఉప-సహారా ఆఫ్రికా ప్రాంతాల నుండి తరలి వెళ్తున్న అక్రమ డబ్బు యేటా వరుసగా 24.2 శాతం మరియు 13.2 శాతం చొప్పున పెరుగుతోందని ఆయన తెలిపారు. అనగా ఈ ప్రాంతాలు ఇండియా కంటే ఘొరం అన్నమాట.

“ఈ నల్ల డబ్బు ప్రవాహం ఇప్పటికే ఈ దేశాల్లోకి వచ్చే ఎఫ్.డి.ఐ, ఓ.డి.ఏ (అఫిషియల్ డవలప్ మెంట్ అసిస్టెన్స్) నిధుల కంటే చాలా ఎక్కువగా ఉంటోంది. పైగా ప్రపంచంలోని పేద, మధ్య ఆదాయ ఆర్ధిక వ్యవస్ధల నుండి సంవత్సరానికి 1 ట్రిలియన్ డాలర్ల సొమ్మును నల్ల డబ్బు పిండుకుంటోంది” అని దేవ్ కర్ వివరించాడని పి.టి.ఐ తెలిపింది.

నల్ల డబ్బు పెరుగుదల రేటు ఆయా దేశాల జి.డి.పి వృద్ధి రేటు కంటే రెండు రెట్లు, మూడు రెట్లు, నాలుగు రెట్లు కూడా ఉండడం గమనార్హం. దేశ ఆర్ధిక వ్యవస్ధలోని ఉత్పత్తి విలువ డబ్బు రూపంలో విదేశాలకు తరలిపోతున్నప్పుడు ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి నానాటికీ పడిపోతుండడంలో ఆశ్చర్యం ఏముంది?

5 thoughts on “విదేశాల్లో నల్లడబ్బు: మూడో స్ధానంలో ఇండియా

 1. సర్, నాకు కొన్నిసందేహాలు వస్తున్నాయి! ఆ సంస్థ ప్రకటించిన వివరాలను మనం ఎంత వరకు పరిగణలోకి తీసుకోవచ్చు?
  ఉ.అమెరిక,ఐరోపా దేశాల వివరాలను అవి ఎందుకు ప్రకటించలేదు? దీనర్ధం అక్కడ నల్లధనం చలామనిలేదనుకోవాలా?
  ఒకప్పటి కమ్యునిస్ట్ దేశాలు,వర్ధమాన దేశాల వివరాలను మాత్రమే అది ఎందుకు విడుదల చేసింది?
  పెట్టుబడీదేశాలు అంత నీతివంతమైనవా?
  ఇంతేసిధనం ఆయాదేశాలనుండి తరలి వెలిపోతుందని ఆ వివరాలు దానికి ఎలా తెలుసు?అందుకు ఏమైనా శాస్త్రీయ ప్రమాణాలు ఉన్నాయా?
  మనదేశమ్నుండి నల్లధనం తరలివెల్లిపోతుంది అనుమానం లేదు?కానీ,ఆ మొత్తమెంత? దీనికి ఏమైనా శాస్త్రీయ కొలమానాలు ఉన్నాయా? కేవలం ఊహాగానాలేనా?

 2. ఏ అంశాల ఆధారంగా తాము తమ నిర్ధారణలకు వచ్చారో నివేదికలో ఉంటుంది. నివేదికతో విభేదించేవారు తగిన కారణాలు, ఆధారాలు చూపుతూ నివేదిక తప్పు అని చెప్పవచ్చు. కానీ, నల్ల డబ్బు వాస్తవం కనుక నివేదికను తప్పు పట్టే ధైర్యం ఎవరూ చేయరు. శాస్త్రీయ ప్రమాణాలు ఏమిటో తెలుసుకోవడానికి నివేదిక చదవడమే మార్గం. మరో దారి లేదు.

  నల్ల డబ్బు ఎంత అన్నది ఎవరు చెప్పినా ఊహలే. ఎంత ఖచ్చితం అన్న దానిపై ఆధారపడి అంకెలు మారుతాయి. సాధ్యమైనంత ఖచ్చితమైన ఆధారాలతో రుజువు చేయాలనుకుంటే అంకెలు చిన్నవి అవుతాయి. ఆధారాలను బట్టి కొన్ని ఊహలు చేయవచ్చు. అనగా శాస్త్రీయ ఊహలు అనవచ్చేమో. అలాంటప్పుడు అంకెలు పెద్దవి అవుతాయి. ఆధారాల జోలికి పెద్దగా పోకుండా విశాల ప్రాతిపదికన చేసే ఊహల వల్ల అంకెలు ఇంకా పెద్దవి అవుతాయి. ఏ అంకెలు నిజమో నమ్మడం అన్నది వారి వారి జ్ఞాన పరిమితికి, ఛాయిస్ పరిమితికి సంబంధించినది.

  పెట్టుబడిదారీ వ్యవస్ధ అంటేనే ఒక అవినీతి పుట్ట. అవినీతి లేకుండా నిజాయితీగా వ్యాపారం చేయడం ద్వారా మిలియన్లు బిలియన్లు మూట గట్టడం కుదరదు. మూడో ప్రపంచ దేశాలు అవినీతిమయం అని ప్రచారం చేయడం అభివృద్ధి చెందిన దేశాల ప్రయోజనాలను ఒక కోణంలో నెరవేరుస్తుంది. (ఆ కోణం ఏమిటన్నది కొన్ని మాటల్లో చెప్పలేను.) నిజానికి ఆ దేశాల్లో అవినీతి లేకపోతే ధనిక దేశాల బహుళజాతి కంపెనీలు ఒక్క రోజు కూడా అక్కడ నిలబడలేవు. అవినీతిని ప్రోత్సహించేదే పెట్టుబడిదారీ కంపెనీలు. అదే సమయంలో ‘ఛీ, యాక్, అవినీతి’ అని ప్రచారం చేయడంలో కూడా వాటికి అవసరాలు ఉంటాయి. ఒకటి ఆర్ధిక దోపిడీ అవసరం అయితే రెండోది ఆ అవసరాన్ని తీర్చే రాజకీయ అవసరం. అందువల్ల మన అవినీతి లెక్కలు కూడా వాళ్ళు చెబితేనే మనకు తెలియాలి. మన పరిస్ధితి అదే మరి!

 3. ఇందియాలో ఇప్పటికీ 60% పైగా జనం వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు, అది కూడా ఆధునిక యంత్రాలు లేకుండా ఎద్దులూ, నాగళ్ళూ, కూలీలని నమ్ముకుని. ఈ దేశంలో ఎంత మంది కోట్లు సంపాదిస్తారు? స్విస్ బ్యాంక్‌లలో అమెరికన్‌ల డబ్బు లేకపోతే అది వాళ్ళు తమ సొంత దేశంలోనే దాచుకున్నారనుకోవాలి.

 4. // ఛీ, యాక్, అవినీతి’ అని ప్రచారం చేయడంలో కూడా వాటికి అవసరాలు ఉంటాయి//
  ఒకపక్క దోచుకొనేది వారే, ఇంకో పక్క అవినీతి, అవినీతి అనేది వారే, దొంగే పట్టుకోండి, దొంగ, దొంగ అన్నట్లు.
  సంపన్నవర్గాల స్వర్గ సీమ అయిన స్విస్సును ప్రపం చ ప్రజలు ఎప్పటి కైనా ముట్ట డిం చ లేవా? హిట్లరుకు పట్టిన గతి పట్ట వచ్చు.

 5. బ్లాక్ మనీ అంటే పన్నులు ఎగ్గొట్టి సంపాదించిన డబ్బు. శ్రమ దోపిడీ చేసి సంపాదించిన డబ్బు బ్లాక్ మనీ కిందకి రాదు. ఆ డబ్బుని ప్రజలకి ఎవరు పంచుతారు?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s