మత మార్పిడులు ఎప్పటి నుండో బి.జె.పి రాజకీయ అస్త్రాల్లో ఒకటిగా కొనసాగుతోంది. మత మార్పిడులను భావోద్వేగాలను రెచ్చగొట్టగల ఆయుధంగా తయారు చేసుకున్న బి.జె.పి అనేకమార్లు దాన్ని ప్రయోగించి ఓట్లు నొల్లుకుంది. అయితే అది అధికారంలో లేనంతవరకు మాత్రమే ఆయుధం కాగలదని, అధికారంలోకి వచ్చాక ఎదురు తిరగుతుందని ఈ కార్టూన్ సూచిస్తోంది.
కార్టూన్ లో ఉన్న మరో అంశం పిల్లిలా ఉన్న ప్రతిపక్షం మత మార్పిడుల వల్ల పులిగా మారిపోయిందని. బలం లేక, ఐక్యత కొరవడి, అధికార పక్షం ముందు పిల్లి స్ధాయికి ప్రతిపక్షం కుదించుకుపోయింది. ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న రివర్స్ మత మార్పిడులు ప్రతిపక్షం పులిగా గర్జించే అవకాశం కల్పించాయని కార్టూన్ సూచిస్తోంది.
కార్టూనిస్టు దృష్టిలో ఈ రెండు అర్ధాలు ఉన్నాయో లేదో గానీ మనకు మాత్రం ఇవి రెండూ గోచరిస్తున్నాయి.
ఆగ్రాలో 350 మంది ముస్లింలను హిందు మతంలోకి పరివర్తన చెందించామని భజరంగ్ దళ్, ధర్మ జాగరణ్ మంచ్ లు కొద్ది రోజుల క్రితం ప్రకటించాయి. ఆ తర్వాత ఈ సంఖ్య 250కి దిగజారింది. మళ్ళీ చూస్తే 50 కి పడిపోయింది. తీరా పరిశీలిస్తే మతం మారారని ప్రకటించినవారు బంగ్లాదేశ్ నుండి వలస వచ్చినవారని, వారికి ఆధార్, రేషన్ తదితర కార్డులు ఇప్పిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని ఊరించి మంటల పండగ (యజ్ఞం) కు తరలించారని ఆ ముస్లింలే చెప్పగా తెలిసింది. తాము ‘ఏ మతమూ మారలేదని, ఇప్పటికీ అల్లాయే మా దేవుడ’ని వారు చెప్పారు.
ఇది కాస్తా ప్రతిపక్షానికి ఆయుధం అయింది. పిల్లిలా ఉన్న ప్రతిపక్షం కాస్తా పులిలా చెలరేగిపోయింది. పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళనతో పని లేదన్నట్లుగా హిందూ సంస్ధలు మరిన్ని చోట్ల మత మార్పిడులకు సిద్ధపడుతున్నట్లు ప్రకటించడం విశేషం.
మత మార్పిడులు, ఇంటికి తిరిగి రాక… అంటూ వివిధ నినాదాల మాటున జరుగుతున్న తతంగం అంతా ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఉద్దేశించినది. హిందూత్వ ఎజెండాలో భాగంగా బి.జె.పి, సోదర సంస్ధలు వీటిని రంగం మీదికి ఎక్కిస్తున్నాయి.
సందర్భాన్ని బట్టి ఈ ఎజెండాకు రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి: తాము దూకుడుగా అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక నూతన ఆర్ధిక విధానాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడం. రెండు: భారత సమాజంలో హిందూత్వ భావజాలం నింపి తద్వారా తమ ఆర్ధిక విధానాలకు సామాజిక మద్దతు సాధించడం. ఈ వలలో పడి నూతన ఆర్ధిక విధానాలకు ఆమోదం ఇచ్చి తమ గొయ్యి తామే తవ్వుకుంటారా లేక ప్రతిఘటనకు పూనుకుంటారా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలి.