పాక్ పాఠశాలపై ఉగ్ర దాడి, 84 మంది పిల్లలు బలి -ఫోటోలు


పాకిస్ధాన్ కు చెందిన తాలిబాన్ శాఖ తెహ్రీక్-ఏ-తాలిబాన్ పెషావర్ పట్టణంలో పరమ హీనమైన దాడికి పాల్పడింది. అమెరికాలో మాత్రమే కనిపించే ఉగ్రవాద తరహా దాడికి పాక్ తాలిబాన్ తెగబడింది. పాఠశాలపై తుపాకులతో దాడి చేసి అభం శుభం ఎరుగని పసి పిల్లలను కాల్చి చంపే ఉన్మత్త ఘటనలు ఇప్పటిదాకా అమెరికాకు మాత్రమే పరిమితం. అలాంటి దాడి పాకిస్ధాన్ లో చోటు చేసుకుంది. 6గురు తాలిబాన్ ఆత్మాహుతి కార్యకర్తలు జరిపిన దాడిలో 126 మంది చనిపోగా వారిలో 84 మంది పాఠశాల పిల్లలే కావడంతో పెషావర్ లో పెను విషాధం తిష్ట వేసింది.

ఉగ్రదాడి ఇప్పటికీ కొనసాగుతోందని పత్రికలు, ఛానెళ్లు తెలిపాయి. ఒక ఉగ్రవాది 60 మంది విద్యార్ధులు ఉన్న తరగతి గదిలోకి చొరబడి తనను తాను పేల్చివేసుకోవడంతో అనేకమంది చనిపోయారని తెలుస్తోంది. తనను తాను పేల్చుకోవడానికి ముందు పిల్లల ముందే వారి ఉపాధ్యాయుడిని సజీవ దహనం చేశాడని బ్రిటిష్ పత్రిక డెయిలీ మెయిల్ తెలిపింది. మిలట్రీ దుస్తులు ధరించిన మిలిటెంట్లు ఉదయం పాఠశాలలోకి జొరబడ్డారని, వచ్చీ రావడంతోనే చిత్తానుసారం తోచిన వైపుకి కాల్పులు జరపడం మొదలు పెట్టారని తెలుస్తోంది.

ఇప్పటికీ 160 మంది వరకు విద్యార్ధులు పాఠశాలలో మిలిటెంట్ల దిగ్బంధనంలో ఉన్నారు. పాఠశాలను మిలట్రీ బలగాలు చుట్టుముట్టాయి. మిలిటెంట్లను చంపి విద్యార్ధులను విడిపించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు తామే బాధ్యులమని పాకిస్తాన్ తాలిబాన్ (తెహ్రీక్-ఏ-తాలిబాన్) ప్రకటించింది. 6గురు మిలిటెంట్లలో ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లని సంస్ధ ప్రకటించింది. దానితో సైనిక బలగాలు ఆచితూచి అడుగు వేస్తున్నాయి. అవడానికి సైనిక పాఠశాలే అయినప్పటికీ అందులో అనేకమంది బైటి విద్యార్ధులు కూడా విద్య అభ్యశిస్తున్నారని పాక్ పత్రికలు తెలిపాయి.

500 మంది విద్యార్ధులు చదువుకుంటున్న పాఠశాలలో విద్యార్ధులు అందరూ 10 నుండి 18 లోపు వయసు ఉన్నవారు. మిలిటెంట్లు ప్రతి తరగతి గదికి, ఒక దాని తరువాత మరొక గదికి వెళ్ళి ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపారని బైటపడ్డవారు చెప్పారు. మిలిటెంట్లు కాల్పులు ప్రారంభించిన వెంటనే సైనిక బలగాలు వచ్చి పాఠశాలను చుట్టుముట్టాయి. మిలిటెంట్లతో ప్రతి కాల్పులకు దిగాయి. వారి కాల్పుల వల్ల మిలిటెంట్ల సాయుధ చర్యపై ఏ విధమైన ప్రభావం ఉన్నది తెలియరాలేదు. 13, 14 యేళ్ళ వయసు గల 160 మంది విద్యార్ధులు మిలిటెంట్లకు బందీలుగా ఉన్నారని మాత్రం తెలుస్తోంది.

మిలిటెంట్లను తాము ప్రిన్సిపాల్ కార్యాలయంలో ట్రాప్ చేశామని ఒక పోలీసు ఇనస్పెక్టర్ చెప్పారని కొన్ని పత్రికలు తెలిపాయి. పాఠశాలను చుట్టుముట్టి లోపలికి ప్రవేశించిన సైనికుల్లో అనేకమంది తమ సొంత పిల్లలను కాపాడుకునే ప్రయత్నంలో పడిపోయారని తెలుస్తోంది. పాఠశాలలో అనేకమార్లు ఆత్మాహుతి పేలుళ్లు, గ్రేనేడ్ పేలుళ్లు జరిగాయని పోలీసుల ద్వారా తెలుస్తోంది.

“మేము సైనిక పాఠశాలనే లక్ష్యంగా చేసుకున్నాము. ఎందుకంటే ప్రభుత్వం మా కుటుంబాలను, ఆడ పిల్లలను లక్ష్యంగా చేసుకుంది. మేము అనుభవిస్తున్న బాధ ఏమిటో వారికి తెలియాలి” అని తాలిబాన్ ప్రతినిధి ముహమ్మద్ ఉమర్ ఖోరాసాని చెప్పారని పత్రికలు తెలిపాయి.

ఆరుగురు వ్యక్తులు పాఠశాల గోడలపైకి ఎగబాకడం తాము చూశామని కానీ పిల్లలు ఏవో ఆటలు ఆడుకుంటున్నారని భావించి పట్టించుకోలేదని మిలిటెంట్ల దాడి నుండి తప్పించుకున్న పాఠశాల సిబ్బంది కొందరు పత్రికలకు తెలిపారు. దాడి జరిగే సమయానికి కొందరు విద్యార్ధులు పార్టీ జరుపుకుంటుండగా మరికొందరు సైనిక వైద్యుల వద్ద ఫస్ట్ ఎయిడ్ చేయడం ఎలాగో నేర్చుకుంటున్నారని ఒక గాయపడిన విద్యార్ధి చెప్పడం గమనార్హం. ఏంజరుగుతోందో తెలిసే లోపల పిల్లలు కింద పడిపోయారని తాము ఎందుకు కింద పడిపోయింది కూడా తమకు తెలియలేదని, తమకు బులెట్ తగిలినట్లు ఆ తర్వాతే తెలిసిందని ఆ విద్యార్ధి చెప్పాడు.

బందీలుగా ఉన్న పిల్లలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని సైనికుల ప్రతినిధులు చెప్పారు. హెలికాప్టర్లను సైతం సైన్యం రంగంలోకి దించింది. ఆందోళనలో ఉన్న పిల్లల తల్లి దండ్రులను బడిలోకి వెళ్లకుండా నిరోధించడం పోలీసులకు మరో పెద్ద సమస్య అయింది. అనేకమంది తల్లి దండ్రులు తమ పిల్లల కోసం ఆతృతగా ఏడుస్తూ ఎదురు చూస్తుండగా చనిపోయినవారి తల్లి దండ్రుల దుఃఖం అలవి కాకుండా ఉంది. యూనిఫాం లో స్కూల్ కి వెళ్ళిన పిల్లలు రక్తపు ముద్దలై, విగత జీవులై వెనక్కి వచ్చారని పలువురు తీవ్రంగా దుఃఖిస్తున్నారు.

మిలిటెంట్లు తమ కాల్పుల్లో విరామం పాటించిన సమయం చూసుకుని సైనికులు తమను రక్షించడానికి వచ్చారని కొందరు విద్యార్ధులు తెలిపారు. తాము వస్తుండగా అనేకమంది తమ మిత్రులు కారిడార్లలో పడి ఉండగా చూశామని, వారికి తీవ్రంగా రక్త స్రావం అవుతోందని బతికి ఉన్నదీ లేనిది తెలియలేదని విద్యార్ధులు పత్రికలకు తెలిపారు. కొందరు విద్యార్ధులను మూడు సార్లు, నాలుగు సార్లు కాల్చారని వారు తెలిపారు.

దాడి జరిగినప్పుడు పాఠశాలలో ఒక ఫంక్షన్ జరుగుతున్నట్లు కొన్ని పత్రికలు తెలిపాయి. పెషావర్ సైనిక బలగాల కమాండర్ ఒకరు ఫంక్షన్ లో లేచి నిలబడి మాట్లాడడం ప్రారంభించిన వెంటనే మిలిటెంట్లు అక్కడ ఉన్న విద్యార్ధులపై కాల్పులు ప్రారంభించారని షూజా ఖాన్ అనే విధార్ధిని ఉటంకిస్తూ డెయిలీ మెయిల్ పత్రిక తెలిపింది.

ఉత్తర వజీరిస్తాన్ రాష్ట్రంలో మిలిటెంట్లను ఎరివేసే నెపంతో ప్రస్తుతం పాక్ ప్రభుత్వం సైనిక చర్య సాగిస్తోంది. ఈ సైనిక చర్యకు ప్రతీకారం గానే తాలిబాన్ తాజా దాడికి పూనుకుంది. “ఉత్తర వజీరిస్తాన్ లో మిలట్రీ ఆపరేషన్ ద్వారా మమ్మల్ని అణచివేశారని భావించనవారికి ఇది మా బహుమతి. వాళ్ళు (పాక్ మిలట్రీ) మా సామర్ధ్యం గురించి ఎప్పుడూ తప్పుగానే ఊహించారు. భారీ దాడులు చేయగల స్ధితిలో మేము ఇప్పటికీ ఉన్నాము. ఈ రోజు జరిగింది కేవలం ట్రయల్ మాత్రమే” అని తాలిబాన్ ప్రతినిధి ఖోరసాని తన ప్రకటనలో పేర్కొన్నాడు.

పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పాఠశాల దాడిని ‘జాతీయ దుఃఖం’గా ప్రకటించారు. దాడిని బ్రిటిష్ ప్రధాని కామెరాన్ ఖండించారు.

పాకిస్తాన్ తాలిబాన్ గతంలో అనేకసార్లు పౌర లక్ష్యాలపై దాడులు చేసినప్పటికీ పాఠశాలపై దాడి చేయడం ఇదే ప్రధమం. సైనిక బలగాలు, చెక్ పాయింట్లు, మిలట్రీ స్ధావరాలు, ఎయిర్ పోర్ట్ లు తదితర లక్ష్యాలపై తాలిబాన్ అనేకమార్లు దాడులు జరిపింది.

పాకిస్తాన్ లో దాడి జరుగుతుండగానే బ్రిటిష్ కామెడీ నటుడు రస్సెల్ బ్రాండ్ టెర్రరిస్టు దాడులకు ప్రధాన కారకురాలు అమెరికాయే అని చెబుతూ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. గ్వాంటనామో బే లో అనేక యేళ్ళు నిర్బంధితుడుగా ఉండి విడుదల అయిన ఒక మాజీ ఖైదీని ఇంటర్వ్యూ చేసిన వీడియోను రస్సెల్ బ్రాండ్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. “టెర్రర్ ని అత్యంత సమర్ధవంతంగా నిర్వహించేవారే ‘టెర్రర్’ అంటే ఏమిటో నిర్ణయిస్తున్నారు” అని రస్సెల్ బ్రాండ్ ట్వీట్ చేశారు.

పాకిస్తాన్ పాఠశాలపై జరిగిన టెర్రరిస్టు దాడికి తక్షణ కారణం తెహ్రీక్-ఏ-తాలిబాన్ అన్నది స్పష్టమే. కానీ ఈ దాడి వెనుక ఏయే భౌగోళిక రాజకీయ లక్ష్యాలు పని చేసాయో, ఏయే సామ్రాజ్యవాద శక్తులు పధక రచన చేసాయో త్వరలో వెల్లడి కాకుండా పోదు.

2 thoughts on “పాక్ పాఠశాలపై ఉగ్ర దాడి, 84 మంది పిల్లలు బలి -ఫోటోలు

  1. పిల్లలను చంపి అదేదో ఘనకార్యమన్నట్లు ప్రకటించుకోవడం నీతిమాలిన చర్య! పిల్లలు కూడా వివక్షకు గురౌతున్నారన్న విషయం స్పస్టం(ముఖ్యంగా ఉగ్రవాద బాదిత దేశాలలో).కొసమెరుపు ఏమిటంటే దీనికి కారణం అమెరికా అని కొందరు ప్రకటించడం!!
    పిల్లలను లక్ష్యంగా చేసుకొన్నవారు ప్రత్యక్షంగా కనిపిస్తుంటే పరొక్షకారణాలను వెతుక్కొవడం అనవసరం!

  2. మూర్ఖులు,దుర్మార్గులు,సొంత పిల్లల్నే చంపుకుతినే విష పురుగులు… ఇంతకుమించి ఈ దుర్మార్గుల్ని ఏమి అనగలం….. నాగశ్రీనివాస

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s