అమెరికా అభివృద్ధి చేసుకున్న మిసైల్ రక్షణ వ్యవస్ధకు విరుగుడును చైనా తాజాగా పరీక్షించింది. శబ్ద వేగానికి 10 రెట్ల వేగంతో ప్రయాణించగల హైపర్ సోనిక్ మిసైల్ అమెరికా మిసైల్ రక్షణ వ్యవస్ధకు విరుగుడు కావడం దాని వేగం వల్లనే.
దూసుకు వచ్చే మిసైళ్లను మధ్యలోనే కనిపెట్టి దానిని గాలిలోనే మరో మిసైల్ తో ఎదుర్కొని మట్టి కరిపించే వ్యవస్ధను అమెరికా అభివృద్ధి చేసుకుంది. ఇందులో దాడికి వచ్చే మిసైల్ వేగాన్ని కనిపెట్టి, నిర్దిష్ట సమయంలో ఏ పాయింట్ కు వస్తుందో అంచనా వేసి ఆ పాయింట్ లో అడ్డుకునేలా ప్రత్యర్ధి మిసైల్ ను మిసైల్ రక్షణ వ్యవస్ధ ప్రయోగిస్తుంది. ఇందులో వేగం ప్రధాన పాత్ర పోషిస్తుంది.
చైనా సరిగ్గా ఈ వేగం మీదనే ఆధారపడుతూ తన హైపర్ సోనిక్ స్ట్రైక్ వెహికల్ ను అభివృద్ధి చేసి పరీక్షించింది. పరీక్ష విజయవంతంగా ముగిసిందని చైనా, రష్యా నిపుణులు ప్రకటించారు. శబ్ద వేగానికి 10 రెట్లు వేగంతో ప్రయాణించడం వలన చైనా మిసైల్ ఏ క్షణంలో ఎక్కడికి చేరుతుందో పసిగట్టి ఛేదించడం సాధ్యం కాదు. లేదా కనీసం ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్న రక్షణ వ్యవస్ధకు అలాంటి సామర్ధ్యం లేదు. ఇది ఖచ్చితంగా అమెరికా గుండెల్లో గుబులు పుట్టించే పరిణామమే.
తన హైపర్ సోనిక్ వాహకానికి చైనా Wu-14 అని పేరు పెట్టింది. చైనా తన Wu-14 ను విజయవంతంగా పరీక్షించ్చిందని అమెరికా రక్షణ అధికారులు కొద్ది రోజుల క్రితమే పత్రికలకు తెలిపారు. వారి సమాచారాన్ని చైనా ఇప్పుడు ధృవీకరించింది. “పశ్చిమ చైనాలో జరిగిన ఈ పరీక్ష ఏ ఒక్క దేశాన్ని గానీ లక్ష్యాన్ని గానీ ఉద్దేశించి చేసింది కాదు” అని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
అమెరికా మిసైల్ రక్షణ వ్యవస్ధను ఛేదించడంలో చైనా శక్తి మరింతగా పెరిగిందన్న విషయాన్ని తాజా పరీక్ష రుజువు చేసిందని రష్యా నిపుణుడు సెంటర్ ఫర్ అనాలసిస్ ఆఫ్ వరల్డ్ ఆర్మ్స్ ట్రేడ్ ఆఫ్ రష్యా సంస్ధ డైరెక్టర్ ఇగోర్ కోరోట్చెంకో చెప్పాడని ది హిందు తెలిపింది. ఇగోర్ ప్రకటన చైనా రక్షణ శాఖ వెబ్ సైట్ లో ప్రచురితం కావడం విశేషం.
WU-14 కి గల మరో ప్రత్యేకత ఏమిటంటే భూ వాతావరణం లోని పై పొర వరకు వెళ్లగలగడం. ఈ సామర్ధ్యం ప్రస్తుతం అమెరికాకు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ ద్వారా ప్రయోగించబడిన WU-14 వాతావరణం పై పొరలో మిసైల్ నుండి విడిపోయిందని రష్యా వార్తా సంస్ధ RIA-నొవొస్తి తెలిపింది. అనంతరం కొద్ది సేపు గ్లైడింగ్ చేసి భూ వాతావరణం లోకి వేగంగా శబ్దవేగానికి 10 రెట్లు వేగంతో దూసుకు వచ్చిందని, అనగా గంటకు 12,800 కి.మీ వేగాన్ని అందుకుందని పత్రిక తెలిపింది. అమెరికా మిసైల్ రక్షణ వ్యవస్ధను ఛేదించడానికి ఇది బాగా సరిపోతుందని పత్రిక అంచనా వేసింది.
‘ఆసియా-పివోట్’ వ్యూహంలో భాగంగా పశ్చిమ పసిఫిక్ ప్రాంతాన్ని అమెరికా సైనిక మయం కావిస్తున్న నేపధ్యంలో చైనా సరికొత్త ఆయుధం ప్రాధాన్యతను సంతరించుకుంది. దక్షిణ చైనా సముద్రంలోని చమురు, మత్స్య సంపదల కోసం స్ధానికంగా ఉన్న వివాదాలను రెచ్చగొట్టడం ద్వారా యుద్ధ నౌకలను అమెరికా ఈ ప్రాంతంలో మోహరించింది. దానితో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు కేంద్రంగా పసిఫిక్ ప్రాంతం అవతరించింది. నాలుగు ప్రధాన శక్తులైన చైనా, అమెరికా, రష్యా, జపాన్ లు సంగమించే ప్రాంతంగా పశ్చిమ పసిఫిక్ ఉన్నదని, దానితో సంక్లిష్టమైన వూహాత్మక ప్రాంతంగా పశ్చిమ పసిఫిక్ ఉన్నదని చైనా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
“చైనా జాతీయ భద్రత కాపాడుకునేందుకు, పశ్చిమ పసిఫిక్ లోని వ్యూహాత్మక పరిస్ధితులను లోతుగా అధ్యయనం చేయడం మాకు అవసరం. ఇక్కడి భద్రతా ధోరణులను స్పష్టంగా గ్రహించాల్సి ఉంది. అంతిమంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్ధిరతలు పరిరక్షించే చొరవ మా చేతుల్లో ఉంచుకోవడం అవసరం” అని చైనా నిపుణుడు చెప్పారని ది హిందు తెలిపింది. పశ్చిమ పసిఫిక్ లో అమెరికాకు అవకాశం ఇవ్వకుండా చొరవ తమ చేతుల్లోకి తీసుకోవాలని చైనా భావిస్తున్నట్లుగా చైనా నిపుణుడి మాటల ద్వారా అర్ధం అవుతోంది.
ఉక్రెయిన్, క్రిమియాలను సాకుగా చూపుతూ రష్యాను పశ్చిమ దేశాలు ఒంటరిని చేయడంతో చైనా-రష్యాలు మరింత దగ్గరవుతున్నాయి. ఫలితంగా పశ్చిమ దేశాలు తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నాయి. తమ పతనాన్ని తామే లిఖించుకుంటున్నాయి. సామ్రాజ్యవాద గొలుసుకట్టు తమ వద్దనే బలహీనపడే అవకాశాలను మెరుగుపరుస్తున్నాయి. హైపర్ సోనిక్ టెక్నాలజీ అభివృద్ధిలో రష్యా కూడా చైనాకు సహకరించడం బట్టి భవిష్యత్ భౌగోళిక రాజకీయ చిత్రం ఒక రూపు దిద్దుకుంటున్నట్లు కనిపిస్తోంది.