మాదే స్నాన! 500 యేళ్ళ నుండి కొనసాగుతున్న ఆచారం అని చెపుతూ అటు అగ్ర కులస్ధులు, ఇటు నిమ్న కులస్ధులు ఆచరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక ఆచారం. వినడానికి, చదవడానికి జుగుప్స కలిగించే ఈ ఆచారాన్ని రద్దు చేయాలని బి.సి. సంఘాలు అనేక యేళ్లుగా పోరాడుతున్నా, ప్రభుత్వాల-కోర్టుల పరోక్ష మద్దతుతో నిర్విఘ్నంగా కొనసాగుతోంది. తన చెంతకు వచ్చిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు, తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ‘ఆచారాన్ని కొనసాగించవచ్చన్న’ హై కోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.
మాదే స్నాన, ఒక కుల దురాచారం. సమాజంపై బ్రాహ్మణుల ఆధిపత్యానికి సజీవ, వికృత సాక్ష్యం. నిమ్న కులాలుగా చెప్పబడిన ప్రజల భావదాస్యానికి, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని అంగీకరించే లొంగుబాటు మనస్తత్వానికి వర్తమాన ఆచరణ రూపం. ఇది తీవ్రంగా ఉన్నదంటే 2011లో ఈ ఆచారాన్ని రద్దు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన బి.సి సంఘ నేతను అటు అగ్ర కులస్ధులు, ఇటు నిమ్న కులస్ధులు పట్టుకుని చావబాదేటంతగా! బి.సి. సంఘం నేత పోలీసులకు ఫిర్యాదు చేసి బైటికి వచ్చి విలేఖరులతో మాట్లాడుతుండగానే అగ్ర, దళిత కులస్ధులు ఇరువురూ వచ్చి ఆయన్ను చితకబాదారు. అప్పటికి ఆయన పోలీసుల రక్షణలో ఉన్నారు. అంతా అయ్యాక ఆసుపత్రిలో చేర్చడం మాత్రమే పోలీసులు ఇచ్చిన రక్షణ!
కర్ణాటకలోని కుక్కే సుబ్రమణ్య ఆలయాల్లో ఈ ఆచారం కొనసాగుతోంది. రాష్ట్రంలో మూడు ఆలయాలు ఉండగా ఆ మూడింటిలోనూ ఈ కుల దురాచారం జరుగుతోంది. నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటివారంలో జరిగే చంపా షష్టి పండుగ నాడు మూడు రోజుల పాటు ‘మాదే స్నాన’ ను ఆచరిస్తారు. ఆచారం ప్రకారం భ్రాహ్మణులు గుడిలోపల భోజనాలు చేస్తారు. వారు తిని వదిలేసిన ఆకులను అక్కడే ఉంచుతారు. దళిత, గిరిజన కులాలకు చెందిన వారు ఈ ఎంగిలి ఆకులపై దొర్లితే వారి చర్మ వ్యాధులు తగ్గిపోతాయని, పాపాలు నాసిస్తాయని నమ్ముతారు. ఆ నమ్మికతో ఎంగిలాకులపై ‘పొర్లు దండాలు’ తరహాలో దొర్లి పాప, వ్యాధి పరిహారం కావించుకుంటారు.
ఆచారాన్ని పాటించే వారిలో అత్యున్నత చదువులు చదివినవారు కూడా ఉండడం గమనార్హం. మధ్య తరగతి కుటుంబాలవారు, రిటైర్డ్ జడ్జిలు, డాక్టర్లు, ఇంజనీర్లు సైతం ఈ ఆచారాన్ని పాటిస్తూ తమ భావాల మకిలిని రుజువు చేసుకుంటున్నారు.
బి.సి. సంఘాలు అనేక యేళ్లుగా ఈ కుల దురాచారాన్ని నిర్మూలించాలని పోరాటం చేస్తున్నాయి. కోర్టుల్లో కూడా వారు పోరాటం సాగిస్తున్నారు. నిడుమామిటి మఠానికి చెందిన వీరభద్ర చన్నమళ్ళ స్వామి ఆచారాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశాడు. ఇంకా ఇతరులు కూడా ఈ వ్యాఖ్యాన్ని దాఖలు చేసినవారిలో ఉన్నారు. ఈ నేపధ్యంలో కర్ణాటక ప్రభుత్వం మధ్యేవాద పరిష్కారాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం ఆచారం కొనసాగుతుంది. అయితే ఎంగిలాకులపై కాకుండా ప్రసాదం ఉంచిన ఆకులపై మాత్రమే నిమ్న కుల భక్తులు దొర్లుతారు. ‘ఎంగిలాకులు’ అన్నదే లేదు గానీ మూఢాచారం మాత్రం యాధావిధిగా కొనసాగే ఏర్పాటు ఇందులో ఉంది.
సవరించిన ఆచారం ప్రకారం భ్రాహ్మణులు మాత్రమే ఆలయంలో భోజనం చేసే ఆచారానికి స్వస్తి పలకాలని నిర్ణయించారు. అయితే అన్నీ కులాల వాళ్ళకి ఆలయంలో భోజనం పెట్టాలని చెప్పే బదులు ఎవరికీ భోజనం పెట్టడానికి వీలు లేదని నిర్ణయించారు. పండగ జరిగే రోజుల్లో మాత్రమే ఈ విధంగా ఆలయంలోపల గానీ బైట గానీ ఎవరికీ భోజనాలు పెట్టడం నిషేదిస్తారు. ఆ విధంగా అప్పటి బి.జె.పి ప్రభుత్వం బ్రాహ్మణుల చెంత ఇతర కులాల ప్రజలు భోజనం చేసే ప్రమాదాన్ని నివారించింది.
బి.జె.పి హయాంలో కర్ణాటక ప్రభుత్వం ఆచారానికి మద్దతుగా కోర్టులో వాదనలు వినిపించగా కాంగ్రెస్ హయాంలో ఆచారాన్ని రద్దు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం వాదించడం విశేషం. వందల యేళ్లుగా వస్తున్న ఆచారం కనుక పూర్తిగా రద్దు చేయలేమని అప్పటి బి.జె.పి ప్రభుత్వం కోర్టులో వాదించాడు. హైకోర్టు మధ్యవర్తిత్వంలో చివరికి బి.సి. సంఘాలు కూడా సవరించిన ఆచారానికి అయిష్టంగా అంగీకరించాయి. కానీ డిసెంబర్ 7, 2012 తేదీన సవరించబడిన ఆచారంపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో పాత ఆచారమే నిర్విఘ్నంగా కొనసాగింది.
ఈ సంవత్సరం వివాదం మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కింది. కుక్కే సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఉద్యోగులు హై కోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. శతాబ్దాల ఆచారానికి సవరణలు చేయడం ఏమిటని వారు పిటిషన్ లో ప్రశ్నించారు. పిటిషన్ ను విచారించిన హై కోర్టు విచిత్రంగా, విచారణ పూర్తయ్యేవరకు ‘మాదే స్నాన’ ఆచారాన్ని దాని ఒరిజినల్ రూపంలో కొనసాగించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. సవరణలతో కూడిన ఆచారాన్ని అమలు చేయాలని 2012లో తాను ఇచ్చిన ఉత్తర్వులపై కూడా హై కోర్టు స్టే విధించుకుంది.
కాగా కర్ణాటకలోని ప్రభుత్వం మళ్ళీ కేసు విచారణలో జోక్యం చేసుకుంది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కావడంతో ఆచారానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు వెళ్లింది. పాత ఆచారం కొనసాగించాలని హై కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరింది. పిటిషన్ ను విచారించిన జస్టిస్ మదన్ బి. లోకుర్, ఆర్.బానుమతిలతో కూడిన ధర్మాసనం ఆచారం కొనసాగింపుపై (హై కోర్టు ఆదేశాలపై) స్టే విధించింది. 500 యేళ్లుగా కొనసాగుతున్న ఆచారాన్ని రద్దు చేయరాదని ప్రతివాదులు వాదించగా “అంతరానితనం కూడా 500 యేళ్లకు పైగానే కొనసాగుతూ వచ్చింది. అయినా రద్దు చేశారు. దాన్ని కూడా కొనసాగిద్దామా?” అని జస్టిస్ లోకుర్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
బహుశా అంతరానితనం రద్దును ఎత్తివేయడానికి సొ కాల్డ్ అగ్ర కులస్ధులకు అభ్యంతరం లేకపోవచ్చు. ఒక కులం (లేదా నాలుగైదు కులాల) ఆధిపత్యాన్ని కొనసాగాలని కోరెవారందరూ ఒక్క అంతరానితనం ఏం ఖర్మ, అనేక ఇతర దుర్మార్గ ఆచారాలకు మద్దతు ఇవ్వవచ్చు. కానీ దేశాన్ని పాలించేవారు అనేక యేళ్ళు ముందుకు వెళ్ళి ఆలోచన చేయగలగాలి. ముఖ్యంగా రాజ్యాంగం నిర్దేశించిన ఉదాత్తమైన ఆశయాలను, లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని విధానాలు రూపొందించాలి. తద్వారా సామాజిక చైతన్య స్ధాయిని ఒక్కో అడుగూ పెంచుకుంటూ పోవాలి. కానీ దురదృష్టకరం ఏమిటంటే పాలకులకు స్వప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టవు. ఓట్ల కోసం ప్రజల చైతన్యాన్ని మొద్దుబార్చి లబ్ది పొందడమే వారికి అవసరం.
రాజ్యాంగాన్ని మతం తో నింపితే మిగతా కాలం చెల్లిన ఆచారాలను ఉన్నపలంగా పునరిద్దరించుకోవచ్చు అని గదా పాలకుల హ్యూహాం!
ఎంగిలాకులపై దొర్లితే చర్మ వ్యాధులు వస్తాయని బ్రాహ్మణులకి కూడా తెలుసు. వాటి మీద తాము దొర్లరు కానీ శూద్రులని దొర్మలంటారు.
సర్,”మాదే స్నాన” దురాచారానికి సంభంధించిన మీ గత టపాలను చూశాను ఈ ఆచారాలు,సాంప్రదాయాలమీద అసహ్యం వేస్తోంది.
ప్రజలలో శాస్త్రీయ దృక్పధం లేకపోవడం విచారించదగ్గ విషయం. ఈ దేశ ప్రజలలో అధికులకు కావలసినది లాజిక్ లు కాదు మ్యాజిక్ లు. అందుకు ప్రధాన కారణం బ్రహ్మణ ఆదిపత్యమేనంటారా? ప్రభుత్వాల చేతకానితనమంటారా? ప్రశ్నించలేని చేతకానితనమంటారా?
ఈ విషయంలో నా ఆలోచనలు ఇలా ఉన్నాయి.
ఇది మంచి ఆచారమా?
కాదు. అత్యంత నీచమైన ఆచారం. దాన్ని ప్రచారంలో పెట్టడం ఆయావ్యక్తుల నీచత్వాన్ని మనకళ్ళముందు నిలుపుతుంది. అలా చేస్తే తప్ప దేవుడుగారికి వాళ్ల చర్మవ్యాధులు నయం చెయ్యాలనిపించేంత జాలి కలుగకపోతే, ఆదేవుణ్ణి నేను ఉత్తముడు అనలేను. ఈ ఆచారం కొనసాగడాన్ని సమర్ధించేవారినీ, అదంతా ఒక మహిమ అని వాదించేవాళ్ళనీ, నమ్మేవాళ్లనీ కూడా నేను ఏమాత్రమూ గౌరవించలేను.
ఆచారం శాతాబ్దాలనాటిదైనంతమాత్రాన అది మంచిదేనా? దాన్ని మార్చకుండా అలా ఉంచవలసిందేనా?
లేదు. ఆధునుక యుగంలో ఇంకా ఆటవిక సాంప్రదాయాలు కొనసాగడమేమిటి?
మరిప్పుడేం చెయ్యాలి?
నిషేధించినందువల్ల ఆ ఆచారం మరింత పేట్రేగిపోతుంది. ఈ ఆచారపు దుర్మార్గానికి చెప్పుదెబ్బలాంటి విరుగుడు అక్కడివాళ్ళలో సరైన చైతన్యం కల్పించి, వాళ్ళంతటవాళ్ళు తెలుసుకొని మానేసేలా చెయ్యడమ్మాత్రమే. అసలు ఏచర్మవ్యాధైనా ఎందుకు కలుగుతుంది? అది మందుల ప్రభావంతో ఎలా నయమవుతుంది అన్నవిషయాలు విస్తృతంగా ప్రచారం చెయ్యాలి. అలా జంతువుల్లాగా ఎంగిలాకులపైన దొర్లడంలోని తెలివితక్కువతనాన్నీ, ఆచారం వెనుకున్న అభిజాత్యాన్నీ విస్తృతంగా ప్రచారంలోకి తేవాలి. నిషేధించవలసిన అవసరంలేను స్థితికి ప్రజల్ని చెయ్యాలేగానీ, నిషేధించడం తెలివైన పనవ్వదు. అదికూడా ప్రజలు తమ అజ్ఞానంకొద్దీ స్వఛ్ఛందంగా పడిదొర్లుతున్నప్పుడు.
ఇలాంటి స్నానంతో చర్మవ్యాధులు తొలగిపోయేటట్లైతే….మరి బ్రాహ్మణులు ఆ ఎంగిలి ఆకులపై దొర్లొచ్చు కదా. నిజంగా చర్మ వ్యాధులు తొలగిపోయేటట్లైతే….సాధారణ జనానికి తెలియనిస్తారా…?
సుప్రీం కోర్టు తీర్పు అభినంద నీయం ! తీర్పు తో రాదు మార్పు ! నమ్మకాలు, వ్యక్తి గతాలు ! వాటితో ,ఇతరులను , ఇబ్బంది పెట్టనంత కాలం !
ఏ నమ్మకం , ఎట్లాంటిదో , ఆ నమ్మకం ఉన్న వారికే తెలుసు ! ఆ రకమైన నమ్మకాలున్న వారిలో రావాలి మార్పు !
క్షుద్ర విద్యలూ ,చేతబడులూ , బాణా మతులూ , తాయత్తులూ ,దైవ భక్తీ , ఇట్లా అనేక రకాలైన నమ్మకాలు , అనేక మందికి ఉన్నాయి !
పొర్లు దండాలు , మరి ఇతర చోట్ల నిషేధించట్లేదెందుకు ?మొక్కు కున్నారు కనుక నా ?!
ఇప్పుడు ‘మాదే స్నాన’ లో కూడా జనాలు మొక్కుకున్నారేమో ?!
ఈ ‘ మా దే స్నాన’ చేస్తున్న వాళ్ళు , వేరే ఎవరి బలవంతం మీదైనా చేస్తున్నారా ? లేదా ? అన్నదే ప్రశ్న !
అనేక వందల దురాచారాలు , అనేక లక్షల మంది , దేశం అంతటా ఆచరిస్తున్నారు ! ఏ రకమైన శాస్త్రీయ రుజువులూ లేని వాటిని కూడా !
కేవలం ఆదాయం లేని వాటినే , సుప్రీం కోర్టు నిషేధించడం జరుగుతుంది !విపరీతం గా మద్య పానం , పొగ తాగడం ! జూదమాడడం , మాదక ద్రవ్యాలు తీసుకోవడం,ఇవన్నీ కూడా వ్యక్తి కీ, కుటుంబానికీ , సంఘానికీ , విపరీతం గా హాని చేస్తున్నాయి ! ప్రతి ఏడాదీ , అనేక లక్షల ప్రాణాలు తీస్తున్నాయి కూడా !
మరి సుప్రీం కోర్టు ఎంచేస్తున్నట్టు ! ? ఎక్కడ కనబడుతుంది నిషేధం ? !
ఆ అలవాట్లు , కేవలం వ్యక్తి గతం కాబట్టి, ఏమీ చేయట్లేదా ? !
మరి ‘ మా దే స్నాన’ కూడా వ్యక్తి గతమే కదా ?!
( పై అభిప్రాయం తో , ‘ మా దే స్నాన’ ఆచారాన్ని , సమర్ధించినట్టు కాదు ! ఆ ఆచారం గర్హనీయం ! )
అసలు ఆ ఆచారాన్ని నిమ్న కులస్తులు పాటించడం మానేస్తే పోతుంది కదా.కోర్టులూ;గొడవలూఎందుకు?వాళ్ళలో ఆ చైతన్యం వారి నాయకులు తీసుకురావాలి.
కుక్కలు ఎంగిలాకులు తింటాయి, శుభ్రమైన ఆహారం దొరక్క. వాళ్ళు కులం పేరుతో మనుషుల్ని కుక్కల స్థాయికి దిగజారుస్తున్నారు.
రమణారావు గారు, చైతన్యం లేకపోవడ వాళ్ళ తప్పా లేదా వాళ్ళకి అది కలగకుండా చేసిన సమాజం యొక్క తప్పా? ఒక అమ్మాయి పిచ్చిది కదా అని ఆమె చేత భోగం మేళంలో నాట్యం చెయ్యించడం ఎలాంటిదో, దళితులకి చైతన్యం లేదు కదా అని వాళ్ళ చేత మరుగు దొడ్లు కడిగించడం కూడా అలాంటిది.
తుళువ భాషలో మాదె అంటే ఎంగిలి అని అర్థం. మాదె స్నాన అంటే ఎంగిలి స్నానం. కుక్కలు, పందులు చేసే పనుల్ని మనుషుల చేత చెయ్యిస్తున్నారు.
రమణా రావు గారు, మీరు పెద్దవారు, అన కూడదు కానీ, కులాన్ని నిమ్న కులాల వాల్లు పాటించక పోయినంత మాత్రానా కులం మాయ మవుతుందా? దాన్ని పాటించే వాల్లు అగ్ర కులాల వాల్లే కదా? ఆ భావ జాలాన్ని నరనరాన్ ఎక్కించింది ఆ బ్రాంహణౌలే గదా? ఇప్పుడు వారే పొమ్మన్నా పొయ్యే టట్లు లేదు. ఇప్పుడూర్ధిక పరిస్థితులు పీఠ పడె కొద్ది కుల మహామ్మారిని ప్రభత్వాలే ఎగదోలుతున్నాయి!
రమణారావు గారు, సమాజంపై తప్పుడు అభిప్రాయాలు చాలా మందికి ఉంటాయి. అలాగని జనం ఆ అభిప్రాయాల ఆధారంగానే బతకాలని కోరుకోలేము. ఇందియా కరెన్సీ విలువ తక్కువ కనుక ఇందియాలో cheap labour దొరుకుతోంది అని నమ్మేవాళ్ళు ఉన్నారు. కరెన్సీ విలువకీ, cost of labourకీ మధ్య సంబంధం లేదు. 1947లో రూపాయి విలువ దాలర్ విలువతో సమానంగా ఉండేది. అప్పట్లో గ్రాఫైత్ గని కార్మికుని రోజు కూలీ కేవలం 75 పైసలు. మా తాతయ్య తన గ్రాఫైత్ గనిలో పని చేసే కూలీలకి రోజుకి 75 పైసలే ఇచ్చేవాడు. అప్పట్లో inflation లేదు కాబట్టి రోజుకి 75 పైసలు కూలీతోనే ఆ గ్రాఫైత్ గని కార్మికులు బియ్యం, పప్పూలూ కొనుక్కోగలిగేవాళ్ళు. ఇప్పుడు కిలో బియ్యం మా విశాఖపట్నంలో 50 రూపాయల కంటే తక్కువ ధరకి దొరకదు. మధ్య ప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలోని చిక్లా మాంగనీస్ గనులకి వెళ్ళాను. అక్కడ కార్మికులు రోజుకి సంపాదించేది 100 రూపాయలే, అక్కడి మేనేజర్‌లకి మాత్రం నెలకి యాభై వేలు జీతం వస్తుంది. కరెన్సీని మరింత inflate చేస్తే కెజి బియ్యం ధర 100కి పెరుగుతుంది, మాంగనీస్ గని కార్మికుని కూలీ ధర రోజుకి 200 అవుతుంది, మాంగనీస్ గని మేనేజర్ జీతం నెలకి లక్ష అవుతుంది. ఈ విషయాలు ఇందియాలో చాలా మందికి తెలియవు కదా అని inflation లాంటి తప్పుడు ఆర్ధిక విధానాలని సమర్థించలేము. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలలో దొమ్మరి, భోగం కులస్తులు తమకి ఇద్దరు ఆడపిల్లలు పుడితే పెద్ద అమ్మాయిని కులాచారం ప్రకారం వేశ్యావృత్తికి పంపిస్తారు, రెండో అమ్మాయికి పెళ్ళి చేసి పంపిస్తారు. రెండో అమ్మాయిని ఆమె భర్తే వేశ్యావృత్తిలోకి దింపుతాడు. ఇదంతా వాళ్ళు తమ ఇష్ట ప్రకారం చేస్తున్నారు కదా అని దాన్ని మనం సమర్థించలేము.
కుల వ్యవస్థకి వ్యతిరేకంగా స్కూల్ పుస్తకాలలో పాఠాలు వ్రాస్తూ, పత్రికల్లో మాత్రం “సామాజికవర్గం” లాంటి అందమైన పేర్లు ఉపయోగించి కులాన్ని ప్రోత్సహించే వ్యవస్థని మీరు విమర్శించండి. అంతే కానీ దళితులు అజ్ఞానం వల్లే అలా ఉన్నారని అనొద్దు.