(రష్యా అధ్యక్షుడు పుటిన్ ఇండియా వచ్చి వెళ్లారు. 20 ఒప్పందాలను ఆయన కుదుర్చుకుని మరీ వెళ్లారు. ఈ ఒప్పందాలను అమెరికా విమర్శించింది. ఈ అంశం గురించి ఈ రోజు ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ ‘Testing times for India-Russia ties’ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్)
*********
బిలియన్ల డాలర్ల విలువ కలిగిన 20 ఒప్పందాలపై ఒక్క రోజులో సంతం చేయడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత సందర్శన ఒక ఉత్పాదక సందర్శన అయింది. ఈ ఒప్పందాలు చమురు నుండి శక్తి వరకు, మౌలిక నిర్మాణాల నుండి మిలట్రీ శిక్షణ వరకు ఇండియా-రష్యాలు సహకరించుకునే ప్రతి రంగాన్ని స్పృజించాయి. 2025 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని ఇరు దేశాలు లక్ష్యం విధించుకున్నాయి. అన్నింటికంటే మిన్న యేమంటే, ప్రధాని నరేంద్ర మోడి భారత ముడి-వజ్రాల సేకరణ విధానాన్ని బహిరంగం కావించడంతో వజ్రాల పరిశ్రమకు ప్రపంచ కేంద్రంగా అవతరించవచ్చని ముంబై కల గనవచ్చు. చివరిగా, అధ్యక్షుడు పుటిన్ 12 అణు రియాక్టర్లు సరఫరా చేస్తామని ఆఫర్ ఇవ్వడం ద్వారా భారత అణు పరిహార చట్టాల పట్ల ఇతర దేశాలకు ఉన్నట్లుగా తమకేమీ అభ్యంతరాలు లేవని ఆయన చాలా స్పష్టంగా, అత్యంత ఆహ్వానకరమైన సూచనలు ఇచ్చారు.
అయితే, ఇండియా-రష్యాల స్నేహం యొక్క పాత వెలుగు ఇప్పుడు ఒక విధంగా మసకబారిందనడంలో ఎలాంటి సందేహము లేదు. తమ స్నేహబంధానికి సంబంధించి “ద్రుజ్బా-దోస్తీ” పేరుతో విడుదల చేసిన ప్రకటనలోని అనేక నిశ్చయాలు సమస్యలతో కూడినవిగా కనిపిస్తున్నాయి. ఆయన ఢిల్లీలో అడుగు పెట్టక మునుపే పార్లమెంటు ఉభయ సభల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాలన్న ఆఫర్ ను తిరస్కరించడం ద్వారా (ఇరు దేశాల) సంబంధంలో అంతా బాగా ఏమీ లేదని సూచించినట్లయింది. సమస్యలు ఏమిటో స్పష్టంగానే ఉన్నట్లున్నాయి: ఇండియా తన రక్షణ దిగుమతులను వివిధ్యీకరించడాన్ని రష్యా అసంతుష్టిగానే పరికించింది, ముఖ్యంగా హెలికాప్టర్, (యుద్ధ) విమానాల కొనుగోలు విషయంలో.
(సంబంధాల) దిగజారుడు ఈ మధ్య జరిగినదేమీ కాదు. ఫైటర్ విమానాలను, మిసైళ్లను ఫ్రాన్స్, అమెరికా, ఇజ్రాయెల్ ల నుండి కొనుగోలు చేయాలన్న నిర్ణయం “తర్క రహితం, అన్యాయం”గా అభివర్ణిస్తూ ఒక సీనియర్ రష్యా అధికారి తమ దేశ అసంతృప్తిని స్పష్టంగానే వెల్లడిస్తూ రష్యాను ‘పాత భాగస్వామి’గా పరిగణించాలని గత సంవత్సరం డిమాండ్ చేశారు కూడా. ఇండియా విషయానికి వస్తే పాకిస్తాన్ కు రక్షణ అమ్మకాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడం పట్ల, గత నెలలోనే పూర్తయిన మొట్ట మొదటి రష్యా-పాకిస్ధాన్ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ పట్లా ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియా ఇప్పటికీ తన రక్షణ అవసరాలలో 70 శాతం రష్యా ద్వారానే తీర్చుకుంటున్నందునా, రష్యాకు అతి పెద్ద (రక్షణ) కొనుగోలుదారుల్లో ఇండియా ఇప్పటికీ ఒకటి అయినందునా, ఇరు పక్షాల మధ్య ఉన్న పరస్పర ఆధారిత సంబంధాలను వారి అసంతృప్తులు మార్చజాలవు, కానీ వాటిని పరిష్కరించుకోవలసిన అవసరం మాత్రం ఉన్నది.
ఈ నేపధ్యంలో ‘రష్యాతో సంబంధం ఇండియాకు అత్యంత సన్నిహిత సంబంధంగా ఉంటుందని, అత్యంత ముఖ్యమైన రక్షణ భాగస్వామిగా కొనసాగుతుందని’ మోడి చెప్పిన మాటలు గమనార్హమైనవి. రక్షణ, శక్తి, వాణిజ్యం లాంటి వ్యాపార రంగాలకు అతీతమైన చోట్ల కూడా న్యూ ఢిల్లీ, మాస్కోలు పరస్పరం పునరంకితం కావలసిన ఆవశ్యకత ఇప్పుడు మరింతగా పెరిగింది. పశ్చిమ దేశాలకు రష్యా దూరం అవుతున్నందునా, అమెరికాకు ఇండియా ఇంకా ఇంకా దగ్గర అవుతున్నందునా -జనవరి 2015లో అధ్యక్షుడు బారక్ ఒబామా ఇండియా సందర్శించనున్నారు- వారి (ఇండియా, రష్యా) సంబంధాలు అనేక విధాలుగా సవాళ్ళు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇండియా-రష్యా ఒప్పందాలను విమర్శిస్తూ అమెరికా విదేశాంగ శాఖ విమర్శలు చేసిన దృష్ట్యా, ఆ సవాళ్ళు ఏమిటో అప్పుడే ఈషణ్మాత్రంగానైనా ఒక సూచన వెలువడినట్లే. మోడి తన ట్వీట్ ద్వారా ఇచ్చిన హామీ రానున్న నెలల్లో మరింత పరీక్షకు గురి కానుంది: “కాలాలు మారాయి, మా స్నేహం మాత్రం మారలేదు…”
ఈ 20 ఒప్పందాలాలో ప్రధానం గా కనిపిస్తున్నవన్నీ వ్యాపార-రక్షణ ఒప్పందాలే! సామాన్యులకు పనికివచ్చే విషయాలేవీ ఇందులో కనిపించట్లేదు!పోనూ,వారికి నష్టాన్ని కలిగించే అణురియాక్టర్ల అంశం ఉండనే ఉన్నాది!ఈ పర్యటనలో పనికి వచ్చే అంశాలు పెద్దగాలేనప్పటికీ,మనను దూరం చేసుకోకుడదన్న తాపత్రయం కనిపిస్తుంది(త్వరలో ఒబామా పర్యటన నేపధ్యంలో)