రష్యా అధ్యక్షుడు పుటిన్ ఒక రోజు ఇండియా సందర్శన రష్యాకు ఫలప్రదంగా ముగిసింది. డజను అణు రియాక్టర్ల నిర్మాణం, చమురు సరఫరా ఒప్పందం, మిలట్రీ సరఫరా ఒప్పందాలతో పుటిన్ కడుపు నింపుకుని సంతృప్తిగా వెళ్లారు. అమెరికా తన షేల్ గ్యాస్, చమురు ఉత్పత్తిని తీవ్రం చేయడం ద్వారా అంతర్జాతీయ రేట్లను కిందికి నెట్టడంతో రష్యా ఆర్ధిక వ్యవస్ధ కష్టాల్లో పడిన సందర్భంలో ఇండియాతో చేసుకున్న ఒప్పందాలు రష్యాకు మేలు చేస్తాయి. ఇండియాకు మాత్రం అనుత్పాదక వ్యయాన్ని పెంచుకోవడం వల్ల ఉన్న కాస్త చమురు (డబ్బు) వదిలిపోతుంది.
అణు రియాక్టర్లు అత్యంత ఖరీదైనవి. చెప్పడానికి విద్యుత్ కి అని చెప్పినా అణు రియాక్టర్ల విస్తరణ వెనుక భారత పాలకుల అణు (ఆయుధ) లక్ష్యాలు ఉన్నాయి. అమెరికాకి ఉన్నట్లుగా ఇండియా అణు సామర్ధ్యం పట్ల రష్యాకు అభ్యంతరాలు లేవు. అమెరికా విధించినట్లుగా -కెమెరాలు మొహరిస్తాం, నిఘా పెడతాం, ఇంధనం అణ్వాయుధాలకు తరలకుండా అడ్డుకుంటాం, అణు పరిహార చట్టాన్ని సడలించాలి…- లాంటి వెర్రి మొర్రి షరతులను రస్యా విధించలేదు. (అణు పరిహార చట్టం నుండి రష్యాకు మినహాయింపు ఇస్తామని చెపుతున్నందున ఆ తగాదా లేకపోవచ్చు.)
ఫలితంగా ఏకంగా 12 అణు రియాక్టర్లను నిర్మించే ఒప్పందాన్ని రష్యాతో ఇండియా కుదుర్చుకుంది. వీటిలో 6 రియాక్టర్లు కూడంకుళం లోనే నిర్మిస్తారుట. ఇప్పటికే 2 రియాక్టర్లను రష్యా అక్కడ నిర్మించింది. ఒకటి విద్యుత్ ఉత్పత్తి సాగిస్తుండగా మరొకటి త్వరలో పూర్తి కానుంది. మిగిలిన 6 రియాక్టర్లను ఎక్కడ నిర్మించేది ఇండియా ఇంకా నిర్ణయించుకోవాల్సి ఉందని తెలుస్తోంది. రెండు అణు రియాక్టర్ల నిర్మాణం వల్ల స్ధానిక మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు. ఫ్యాక్టరీ వ్యర్ధాలు కలిసి సముద్ర జలాలు విష తుల్యం అవుతున్నాయి. కర్మాగారానికి వ్యతిరేకంగా ఉద్యమించిన జాలరులు దేశద్రోహం కేసులు ఎదుర్కొని నెలల తరబడి జైళ్ళలో మగ్గిపోయారు.
ఇపుడు మరిన్ని రియాక్టర్లు నిర్మించడం అంటే పాలకుల అణు దాహం తీర్చడానికి మరింతమంది ప్రజానీకం జీవితాల్ని ఛిద్రం చేసుకోవడానికి సిద్ధపడవలసి ఉంది. రష్యా ప్రభుత్వ సంస్ధ రొసాటోమ్ ఈ 12 రియాక్టర్లను నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అణు రంగ సహకారంలో ‘విజన్’ పేరుతో ఒక పత్రంపై ఇరు దేశాధినేతలు సంతకం చేయడం మరో విశేషం. మొత్తం మీద 20 అణు రియాక్టర్లను రష్యా ఇండియాకు సరఫరా చేస్తుందని ఈ పత్రంలో రాసుకున్నారు. రొసాటోమ్ కంపెనీ 12 రియాక్టర్లు సరఫరా చేస్తే మిగిలినవి ఇతర కంపెనీలు సరఫరా చేస్తాయట. వీటిని 20 యేళ్ళ లోపుల నిర్మించాలని ‘విజన్’ లో పేర్కొన్నారు.
“ఇండియా (వ్యాపార) అవకాశాలు పెరిగినప్పటికి రష్యా ఇప్పటికీ మాకు ముఖ్యమైన రక్షణ భాగస్వామిగా కొనసాగుతుంది” అని పుటిన్ తో కలిసి పాల్గొన్న విలేఖరుల సమావేశంలో ప్రధాని మోడి ప్రకటించారు. రక్షణ బడ్జెట్ ను గత కాంగ్రెస్ చేసిన కేటాయింపుల కంటే పెంచిన మోడి ప్రభుత్వం ఆయుధ బలగాలను పెంచుకునే పనిలో పడిపోయింది. రక్షణ రంగ కాంట్రాక్టులకు అత్యధిక మొత్తంలో ముడుపులు అందుతాయన్నది బహిరంగ రహస్యం. ఈ లెక్కన అవినీతి వ్యతిరేక మోడి ప్రభుత్వం రక్షణ రంగంలో కొనుగోళ్లకు ఆగమేఘాలతో అడుగులు వేయడం వెనుక మతలబు ఏమై ఉంటుందన్నది ఎవరికి వారే ఊహించుకోవలసిందే.
మిలట్రీ ఒప్పందంలో భాగంగా ఇండియా భూభాగంపై సంవత్సరానికి 400 హెలికాప్టర్లు అసెంబుల్ చేయడానికి రష్యా అంగీకరించింది. రెండు ఇంజన్ల Ka-226T హెలికాప్టర్లను ఈ విధంగా ఇండియాలో తయారు చేస్తారు. అనగా రష్యా తయారీ హెలికాప్టర్ విడి భాగాలను ఇక్కడికి తరలించి వాటిని అసెంబుల్ చేసి ఇండియా తయారీగా చెప్పుకుంటారు కాబోలు! ప్రధాని మోడి గారి ‘మెక్-ఇన్-ఇండియా’ నినాదం కూడా ఈ విధంగా ఆచరణలోకి వచ్చేస్తుంది. మన మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమల్లో ముఖ్యంగా ఆటో మొభైల్ పరిశ్రమల్లో అత్యధిక భాగం అసెంబుల్ పరిశ్రమలే. జపాన్, జర్మనీ, అమెరికా, స్వీడన్, ఫ్రాన్స్, చెక్, కొరియా.. తదితర దేశాల నుండి కార్ల కంపెనీలు విడి భాగాలను దిగుమతి చేసుకుని ఇక్కడ బిగించి ఇండియా తయారీగా చెబుతున్నాయి. మారుతి-సుజుకి, హ్యుండై, స్కోడా, వోక్స్ వ్యాగన్, ఫోర్డ్… తదితర కార్లన్నీ ఇదే బాపతు.
పుటిన్ సాధించిన మరో ముఖ్యమైన ఒప్పందం చమురు సరఫరా. వచ్చే 10 సం.ల పాటు చమురు సరఫరా చేసేందుకు రష్యన్ కంపెనీ రోస్ నేఫ్ట్, భారత కంపెనీ ఎస్సార్ ఆయిల్ లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఉత్పత్తి పరిణామంలో ప్రపంచంలో అత్యంత భారీ కంపెనీ అయిన రోస్ నేఫ్ట్ ఇండియాకు చమురు సరఫరా చేయడంలో అభ్యంతరం అనవసరం. కానీ దాని ఫలితం ప్రైవేటు కంపెనీ కాకుండా ప్రభుత్వ రంగ కంపెనీ చేతికి వస్తే ప్రజలకు మరింత ఉపయోగం.
ఎస్సార్ కంపెనీకి గుజరాత్ లో ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఉండడం గమనార్హం. రోజుకి 405,000 బ్యారేళ్ళ చమురును శుద్ధి చేయగల కర్మాగారం ఇది. ఈ కంపెనీకి ఇంగ్లండ్ లో కూడా ఒక రిఫైనరీ కలిగి ఉంది. పుటిన్ సందర్శనలో కూడా గుజరాత్ రాష్ట్రం వ్యాపార లబ్ది పొందడం ఏమి సూచిస్తోంది? 10 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ఎస్సార్ కు లభించడం చిన్న విషయం ఏమీ కాదు. పైగా ఈ వాణిజ్యానికి రష్యా ఆర్ధిక సంస్ధలే ఫైనాన్స్ చేయనున్నాయి.
ఉక్రెయిన్ సంక్షోభం వల్ల రష్యా చమురు వ్యాపారం దెబ్బ తిన్నదని పశ్చిమ పత్రికలు రాస్తున్నాయి. ఉక్రెయిన్ సంక్షోభం నేపధ్యంలో రష్యా ఒంటరి అయిందని ఈ పరిస్ధితితుల్లో ఇండియాతో ఒప్పందాలు రష్యాకు వరం అవుతాయని రాయిటర్స్ రాసింది. ఇండియాతో వ్యాపార ఒప్పందాలు రష్యా ఆర్ధిక వ్యవస్ధకు మేలు చేస్తాయనడంలో సందేహం లేదు గానీ రష్యా చమురు వ్యాపారం దెబ్బ తిన్నది ఉక్రెయిన్ వల్ల కాదు, అమెరికా తన షేల్ చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచడం వల్ల.
అమెరికన్ షేల్ చమురు ప్రపంచ మార్కెట్లను ముంచెత్తుతోంది. దానితో చమురు ధరలు అత్యంత కనిష్ట స్ధాయికి బ్యారేల్ -ఒక్కింటికి 120 డాలర్ల నుండి 65 డాలర్లకు- పడిపోయింది. రష్యా, అర్జెంటీనా, వెనిజులా దేశాల చమురు మార్కెట్ ను దెబ్బతీసే ఏకైక లక్ష్యంతో అమెరికా ఈ ఘాతుకానికి తెగబడింది. ఈ నేపధ్యంలో చైనా, ఇండియాలతో మరిన్ని ఒప్పందాలను చేసుకోవాలని రష్యా తలపెట్టింది. ఆ మేరకు చైనాతో భారీ చమురు సరఫరా ఒప్పందాన్ని చేసుకుని పైప్ లైన్ల నిర్మాణానికి రష్యా పూనుకుంటోంది.
మొత్తం మీద 13 వాణిజ్య కాంట్రాక్టులను పుటిన్ ఆధ్వర్యంలో కుదుర్చుకున్నారని ది హిందు తెలిపింది.
(Photos: Reuters)
సర్,అనుత్పాదక వ్యయాన్ని పాలకులు పెంచుకొంటూ పోవడంలో ఉన్న మతలబు ఏమిటి?
విశేఖర్ గారు… నెను నా వర్డ్-ప్రెస్ థీం మారుద్దాం అనుకుంటున్నాను. కానీ ఎలా మార్చాలో తెలియడంలేదు. మీకు కుదిరితే సహాయం చెయ్యండి. ఇంకా నేను వర్డ్-ప్రెస్ వాళ్ళు ఇచ్చిన థీంస్ కాకుండా వేరే బయటి థీంసు అప్-లోడు చేద్దాం అనుకుంటున్నా.. నకు ఎలాచెయ్యాళో తెలియడంలేదు.,……………………నాగశ్రీనివాస
డ్యాష్ బోర్డ్ లో లెఫ్ట్ సైడ్ కింది నుండి ఐదో ఐకాన్ మీదికి మౌస్ తీసుకెళ్ళండి. అక్కడ అలంకారాలు లేదా ధీమ్స్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే అందుబాటులో ఉన్న ధీమ్స్ లోడ్ అవుతాయి. వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకుని యాక్టివేట్ చెయ్యడమే.
బైటి నుండి ధీమ్ అప్ లోడింగ్ కి వర్డ్ ప్రెస్ వాళ్ళు అంగీకరించరు. అలా చేయడానికి wordpress.org లో అవకాశం ఉండొచ్చు. కానీ అదెలాగో నాకు తెలియదు. ప్రీమియం ధీమ్స్ పేరుతో కొన్నింటిని వర్డ్ ప్రెస్ వాళ్ళు అమ్ముతారు. వాటిల్లో కొన్ని బెటర్ ధీమ్స్ దొరకవచ్చు.
//ఆగమేఘాలతో అడుగులు వేయడం వెనుక మతలబు ఏమై ఉంటుందన్నది ఎవరికి వారే ఊహించుకోవలసిందే. //
అనుత్పాదక వ్యయాన్ని పాలకులు పెంచుకొంటూ పోవడంలో ఉన్న మతలబు కూడా ఇదే!