నాట్లే ఇంకా కాలేదు, అన్నం కుక్కర్ రెడీ -కార్టూన్


Babu's development

కొత్త రాజధాని పేరుతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు చేస్తున్న హడావుడి చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో తెలియని పరిస్ధితి. భూ సమీకరణకు సంబంధించి విధాన ప్రకటన ఇంతవరకు చేయలేదు. లక్ష ఎకరాల భూమి సేకరించేది ఏ ప్రయోజనాల కోసమో తెలీదు.భూములు ఇవ్వబోయే రైతులకు నష్టపరిహారం ఎంతో తెలీదు.

భూములు లేక భూములు గలవారిపై ఆధారపడి బ్రతుకుతున్న లక్షలాది నిరుపేద కుటుంబాలకు బ్రతుకు తెరువు ఏమిటో కనీసం ఆలోచన కూడా చేయడం లేదు. భూములు ఇచ్చేందుకు ఎందరు రైతులు సుముఖంగా ఉన్నది తెలియదు. తెలుగు ఛానెళ్లలో భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న కొద్ది మంది రైతుల మొఖాలు తప్ప ససేమిరా అంటున్న మెజారిటీ రైతుల మొఖాలు తర్వాత సంగతి, వారి అభిప్రాయాలకే స్ధానం లేదు.

ఏమీ తెలియకుండానే, ఏమీ చెప్పకుండానే రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తా, జపాన్ చేస్తా, ఇంకోటి చేస్తా… అంటూ ముఖ్యమంత్రి గారు ఒకటే విధంగా రొడ్డ కొట్టుడు కొట్టేస్తున్నారు. రైస్ కుక్కర్ అన్నీ కొనిపెట్టుకుని ‘ఊ, కానీండి… నాట్లు వేయండి’ అంటూ వెంటబడుతున్నారు. నాట్లు పూర్తయి పంట చేతికి వచ్చేనాటికి ఆ కుక్కర్ కాస్తా తుప్పు పట్టి పనికి రాకుండా పోవచ్చన్న తెలివిడి ఏ పెద్ద మనిషికీ లేనట్లు కనిపిస్తోంది.

సి.ఎం గారు అప్పుడే సింగపూర్ వెళ్ళి వచ్చారు. జపాన్ కూడా చుట్టి వచ్చారు. అక్కడి పెట్టుబడిదారులు, మేయర్లు, అధికారులు… అందరినీ కలిశారు. అక్కడి మంత్రులతోనూ మంతనాలు జరిపారు. అక్కడికి వెళ్ళి వచ్చాక అక్కడి నిర్మాణాలను పొగడంలో మునిగిపోయారు. అక్కడి పని సంస్కృతిని మెచ్చుకున్నారు. వారి జి.డి.పి లతో మన జి.డి.పి ని పోల్చి ‘సిగ్గుపడదాం’ అని కూడా అంటున్నారు. ఈ వార్తల్ని విమర్శనా రహితంగా ప్రచురిస్తూ పత్రికలు సైతం చంద్రబాబు పధకాలకు ఇతోధికంగా ప్రచారం చేసి పెడుతున్నాయి.

మన నేతలు చేస్తున్న పోలికలలో ఇసుమంతయినా సంబద్ధత ఉన్నదా అన్న విషయాన్ని పత్రికలు పట్టించుకుంటున్నట్లు లేదు. సింగపూర్ అన్నది ఒక నగర రాజ్యం. అభివృద్ధి చెందిన దేశాలలోని ధనిక వంశాల డబ్బు రాసుల్ని అటూ ఇటూ తరలిస్తూ సొమ్ము చేసుకునే రాజ్యం అది. ప్రపంచ ధనిక వర్గాల వాళ్ళు ఆటవిడుపుగా విడిది చేసి సేదతీరే నేల సింగపూర్. ప్రపంచ స్ధాయి అక్రమ సొమ్మును భద్రంగా నిర్వహించి పెడుతూ తద్వారా వచ్చే రుసుము పై ఆధారపడిన దేశం సింగపూర్.

జపాన్ అభివృద్ధి చెందిన దేశం. అక్కడ భూ స్వామ్య వ్యవస్ధ ఎన్నడో నశించి పెట్టుబడిదారీ వ్యవస్ధ పరిపక్వ దశకు చేరుకుంది. పరిమిత నేలతోనే అత్యంత అభివృద్ధి చెందిన యంత్ర పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ భారీ ఉత్పత్తులు తీయగల దేశం.

కానీ ఇండియా/ఆంధ్ర ప్రదేశ్ అలా కాదు. ఇక్కడ ప్రజలు మెజారిటీ వ్యవసాయంపై ఆధారపడినవారు. వారిలో ఎక్కువమందికి వర్షాలు కురిస్తే తప్ప నీటిపారుదల లేదు. ఇక్కడి పరిశ్రమల రంగం గానీ, సేవల రంగం గానీ వ్యవసాయ ఉత్పత్తులపైనే ప్రధానంగా ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ అందించే సాఫ్ట్ వేర్ సేవలన్నీ అమెరికా, ఐరోపా తదితర అభివృద్ధి చెందిన దేశాల అవసరాలను తీర్చేవే తప్ప దేశ ప్రజలకు అవి ఉపయోగపడేది చాలా తక్కువ. భూములు ప్రభుత్వానికి ఇచ్చేస్తే రైతులకు మరో బ్రతుకు తెరువు ఉండదు. వారికి వ్యవసాయం తప్ప మరో పని తెలియదు. రైతులే కాకుండా రైతుల భూములపై ఆధారపడి ఇంకా అనేక రెట్ల మంది, చివరికి చిన్న చిన్న వ్యాపారులు కూడా బ్రతుకుతున్న పరిస్ధితి.

ఇలాంటి చోట్ల సింగపూర్, జపాన్ లను సృష్టించడం సాధ్యం అవుతుందా. జపాన్ కంపెనీలు, సింగపూర్ కంపెనీలు తమ తమ దేశాలలోని పరిస్ధితులకు అనుగుణంగా పని చేస్తాయి తప్ప భారత/ఆంధ్ర పరిస్ధితులకు అనుగుణంగా పని చేస్తాయా? సింగపూర్ అభివృద్ధిని ఇక్కడకు తెచ్చినా అది ఉపయోగపడవలసింది సింగపూర్ కంపెనీలకు కాదు, మన ప్రజలకు ఉపయోగపడాలి. భూములను జపాన్, సింగపూర్, అమెరికా, ఐరోపా దేశాలకు అప్పగించి, వారు భారీ మాళ్ళు, స్కై స్క్రాపర్లు, బులెట్ రైళ్లు ఇత్యాదివి నిర్మించి ఇస్తే వాటిపై మన రైతులు, మన కూలీలు, చేతి వృత్తుల వాళ్ళు, భూమిలేని నిరుపేదలు, కౌలు రైతులు ఎలా ఆధారపడి బతకాలి?

ఎక్కడ అభివృద్ధి జరిగినా స్ధానిక ప్రజల నుండి మొదలు పెట్టి, వారికి మెరుగైన జీవనాన్ని కల్పిస్తేనే అది నిజమైన అభివృద్ధి. అలా కాకుండా జపాన్, సింగపూర్ కంపెనీలకు మన భూములు ఇచ్చేసి, అక్కడ ఉన్నట్లే ఇక్కడా కట్టమని, స్ధాపించమని, నిర్మించమని చెబుతూ మన బడ్జెట్ వనరులన్నీ ఇచ్చేస్తే మన జనానికి ఏమి ఒరుగుతుంది? అందమైన రోడ్లు, భవనాలు, రైళ్లు వస్తే అవి మన జనానికి ఉపయోగపడతాయా?

రాజధాని నిర్మాణం పేరుతో ఆంధ్ర ప్రదేశ్ లో ఒక మహా కుంభకోణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవి అభివృద్ధి పేరుతో జరుగుతున్నాయి. ఆంధ్ర జనానికి ఏ విధంగానూ ఉపయోగపడని సింగపూర్, జపాన్ నిర్మాణాల పేరుతో జరుగుతున్నాయి. చివరికి రైతులు, కూలీలు, వారిపై ఆధారపడిన చిన్నా-పెద్దా వ్యాపారులు… వీరందరికీ ఏమీ మిగలదు. పోగుట్టుకున్న చోట వెతుక్కునే అవకాశం కూడా జనానికి రాబోదు. రాష్ట్ర పాలకులు చూపిస్తున్న అరచేతి స్వర్గం చూసి మోసపోతే భవిష్యత్తులో తీవ్ర సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.

3 thoughts on “నాట్లే ఇంకా కాలేదు, అన్నం కుక్కర్ రెడీ -కార్టూన్

  1. సర్, కార్టూన్ ని వివరిస్తూనే రాజధాని పేరుతో జరుగుతున్న మాయాబజార్ని వివరించినతీరు బాగుంది!-ఇప్పటీకే కొంత ఆలస్యంగా ఈ విషయంగూర్చి వివరించినప్పటీకీ సంధర్భం బాగుంది. కానీ,ఆ కర్టూన్ని చూసి అది రుణమాఫీకి చెందిన అంశంగా భావించాను!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s