కొలువిస్తామని మత మార్పిడి, హిందూ సంస్ధల ‘ఏ’కృత్యం?


Conversion ceremony in Agra -NDTV

Conversion ceremony in Agra -NDTV

హిందువులు ముస్లిం మతంలోకి మారినా, బాప్తిజం పుచ్చుకుని క్రైస్తవ మతంలోకి వెళ్ళినా ఆర్.ఎస్.ఎస్, దాని అనుబంధ సంస్ధలు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ‘లవ్ జిహాద్’ అంటూ స్వకపోల కల్పిత కుట్రలను కూడా సృష్టించి కులాతీత, మతాతీత ప్రేమ వివాహాలకు మతం రంగు పులమడం వారికి ఇష్టమైన కార్యక్రమం. అలాంటి హిందూ అతివాద సంస్ధలు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉద్యోగాలు ఇప్పిస్తాం, ప్రభుత్వ పధకాలు ఇప్పిస్తాం, అని ఆశ చూపుతూ ముస్లింలను హిందూ మతంలోకి ఆకర్షించే బృహత్తర కర్తవ్యాన్ని భుజాలకు ఎత్తుకున్నాయని పత్రికల వార్తలను బట్టి తెలుస్తోంది.

హిందూ మతంలో కుల అణచివేతను సహించలేక ముస్లిం, క్రిస్టియన్ మతాలను అవలంబిస్తే అది అకృత్యం. అభివృద్ధి నినాదంతో ప్రజల ఓట్లను ఆకర్షించి, అధికారంలోకి వచ్చి, ఆ అధికారాన్ని ఉద్యోగాలు, ప్రభుత్వ పధకాలు ఇస్తామని ఆశపెట్టడానికి వినియోగిస్తూ ఇతర మతస్ధులను హిందూ మతంలోకి ఆకర్షించడం ఏ కృత్యం?

హిందు మితవాద సంస్ధలైన బజరంగ దళ్, ధర్మ జాగరణ్ మంచ్ లు ఆగ్రాలో 350 మంది ముస్లింలను హిందూ మతంలోకి మార్చాయి. ముస్లింలు తమకై తాము మతం మారితే అది వారి యిష్టం. ఇష్టమైన మతాన్ని అవలంబించే స్వేచ్ఛ ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించింది. కానీ ఆగ్రాలో జరిగింది అది కాదు. హిందు మతంలోకి మారిన వారికి ఉద్యోగాలు ఇస్తామని, వివిధ ప్రభుత్వ పధకాల ద్వారా లబ్ది కలిగేలా చేస్తామని ఆశ పెట్టి మతం మార్చారని పత్రికల ద్వారా తెలుస్తోంది.

మత మార్పిడికి హిందూ సంస్ధలు సైతం మురికివాడలనే ఎంచుకోవడం గమనార్హం. ఆర్ధిక స్ధితిగతులు మత మార్పిడికి సహకరిస్తాయని ఆ విధంగా హిందూ సంస్ధలు కూడా గుర్తించాయని ఇక్కడ తెలుసుకోవలసిన విషయం. హిందూ మతం అంటే ఒక జీవన విధానం అనీ, అత్యున్నత సంస్కృతి అనీ గొప్పలు చాటుకునే హిందూ సంస్ధలు మత మార్పిడికి పేదలనే లక్ష్యంగా చేసుకోవడం ఏమిటి? వారి బలహీన ఆర్ధిక పరిస్ధితిని ఆసరా చేసుకుంటే తప్ప అత్యంత గొప్ప సంస్కృతీ, జీవన విధానంలోకి రప్పించలేకపోయారా?

క్రైస్తవ మతం స్వీకరించినవారిలో అత్యధికులు అణగారిన కులాల వారే ఉండడం బట్టి క్రైస్తవ మతం సైతం ఎవరిని లక్ష్యంగా చేసుకుందో అర్ధం చేసుకోవచ్చు. ముస్లిం మత ప్రజలు అత్యధికులు పేదవారే. వారి పూర్వీకులు పేద అణగారిన కులాల నుండి ముస్లిం మతంలోకి వచ్చారు గనక, వారికి అప్పటికీ, ఇప్పటికీ ఆస్తులు లేవు గనకనే ముస్లింలలో అత్యధికులు పేదలుగా కొనసాగుతున్నారన్నది నిష్టుర సత్యం.

ఆగ్రాలో మధునగర్ పేరు గల మురికివాడలో మత మార్పిడి కార్యక్రమాన్ని హిందు సంస్ధలు చేపట్టాయని పత్రికలు తెలిపాయి. “పుర్ఖోంకి ఘర్ వాపసి” (పూర్వీకులు సొంత గూటికి చేరుకోవడం) పేరుతో ఆర్.ఎస్.ఎస్ అనుబంధ సంస్ధలు కార్యక్రమం నిర్వహించాయని 60 ముస్లిం కుటుంబాలు దీని ద్వారా మతం మార్చుకున్నాయని ది హిందు తెలిపింది. వేద మంత్రోచ్చారణల మధ్య కార్యక్రమం జరిగిందని తెలుస్తోంది. మతం మారినవారికి హిందూ సంస్కృతి, సంప్రదాయాలు అలవాటు చేసేందుకు నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మధునగర్ మురికివాడలో బీహార్, పశ్చిమ బెంగాల్ నుండి వలస వచ్చిన పేదలు ఎక్కువగా నివసిస్తారు. వారు దారిద్ర రేఖ దిగువున ఉన్నట్లు ధృవీకరించే బి.పి.ఎల్ కార్డులు ఇప్పిస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చారట. ఆధార్ కార్డులు, ఇళ్ల పట్టాలు కూడా ఇప్పిస్తామని వారు నమ్మబలికారట. కార్యక్రమ నిర్వాహకులు మాత్రం ముస్లింలు స్వచ్ఛందంగానే మతం మారారని చెబుతున్నారు.

కానీ కార్యక్రమం అనంతరం మతం మారిన దంపతులను మీడియా ఇంటర్వ్యూ చేస్తే అసలు సంగతి తెలిసింది. కార్యక్రమ నిర్వాహకులు తమకు ఆర్ధికంగా మేలు చేస్తామని చెప్పారని మీడియాతో మాట్లాడుతూ కొందరు చెప్పారు. ప్రభుత్వం అమలు చేసే వివిధ పధకాల కింద లబ్ది చేకూరేలా చూస్తామని చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమం గురించి వివరాలు సేకరించి తగు చర్య తీసుకుంటామని సమాజ్ వాదీ పార్టీ ప్రతినిధులు ఇప్పుడు చెబుతున్నారు.

ఫస్ట్ పోస్ట్ పత్రిక ప్రకారం మతం మారినవారు 300 మంది కాగా వారిని మతం మార్చడానికి మూడు నెలలుగా ఆర్.ఎస్.ఎస్ కృషి చేస్తున్నదని బజరంగ్ దళ్ నాయకులే చెప్పారు. మతం మారిన పేదలకు బి.పి.ఎల్ కార్డులు మంజూరు అయ్యేలా చూస్తామని కూడా బజరంగ్ దళ్ నాయకులు చెప్పారని ఫస్ట్ పోస్ట్ చెప్పడం విశేషం. మతం మారిన వారిని సంస్కృతీకరించి (sanskritize) అనంతరం వారిని ఓటర్లుగా రిజిస్టర్ చేస్తామని, రేషన్ కార్డులు ఇప్పిస్తామని బజరంగ్ దళ్ నేత అజ్జు చౌహాన్ చెప్పారని పత్రిక తెలిపింది.

మతం మారినవారు అసలు భారతీయులు కాదని వారు బంగ్లాదేస్ నుండి వలస వచ్చారని ముస్లిం స్కాలర్ ఒకరు చెప్పారని ఫస్ట్ పోస్ట్ చెప్పడం మరో విశేషం. అక్రమ నివాసులకు హిందూ తీర్ధం ఇచ్చి సక్రమ నివాసులుగా మార్చారని ఆయన ఆరోపించారు.

“మంటల పండగ జరిగే చోటికి మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడ కూర్చోవాలని చెప్పారు. దాంతో మేము ఆందోళన చెందాము. హిందు దేవుళ్ళను పూజించాలని చెప్పారు. వాళ్ళు చెప్పిందల్లా చేశాం” అని మునిర్ అనే వ్యక్తి చెప్పాడని ఎ.బి.పి న్యూస్ ను ఉటంకిస్తూ ఫస్ట్ పోస్ట్ తెలిపింది. “కానీ ఇప్పుడు మేము మళ్ళీ ఖురాన్ చదువుతున్నాము. మా కుటుంబ సభ్యులు నమాజ్ చేశారు కూడా” అని మునీర్ చెప్పినట్లు తెలుస్తోంది.

బి.జె.పి ఎం.పి వినయ్ కతియార్ అయితే ఇంకో అడుగు ముందుకు వేశారు. ముస్లింలు హిందూ మతంలోకి చేరడంలో తప్పేమీ లేదని, వారసలు మొదట హిందువులేనని మతం మారడం వల్ల హిందువులు అయ్యారని ఒక వాస్తవం చెప్పేశారు. తమ పూర్వమతంలోకి తిరిగి వచ్చినందున కార్యక్రమంలో అభ్యంతరం పెట్టడానికి ఏమీ లేదని ఆయన సెలవిచ్చారు. అనగా ఇప్పటి ముస్లింలు ఒకప్పటి హిందువులేనని ఏవో కారణాల వల్ల మతం మారారని బి.జె.పి ఎం.పి అంగీకరిస్తున్నారు. ముస్లిం కాలనీలపై బడి హత్యాకాండలు జరపడం, లవ్ జిహాద్ పేరుతో దుష్ప్రచారం చేయడం, రామ భక్తులే సక్రమ సంతానం-అన్య మతస్ధులు అక్రమ సంతానం అంటూ దూషణలకు దిగడం… ఇవన్నీ ఒకప్పటి హిందువుల పైనే హిందూ సంస్ధలు సాగించాయని బి.జె.పి అంగీకరిస్తున్నట్లేనా?!

8 thoughts on “కొలువిస్తామని మత మార్పిడి, హిందూ సంస్ధల ‘ఏ’కృత్యం?

 1. You criticized in very well manner, But why you ignored Tirupati issue, Jama masjid imam (Imam invited pakistan president for his son ceremony) issue, west bengal bomb issue. If we think we are secular, then we should act in same manner in all religion issues. I dont know why so-called secular fellows in India always concentrate on wrong activities of Hindu group’s, why not on other religion activities?

 2. మతమార్పిడి ఎక్కువసార్లు ఎవరో ఒకరు మభ్యపెడితే జరుగుతుంది. ఉదాహరణకు క్రైస్తవ సంస్థల్నే తీసుకోండి వాళ్ళు వాళ్లదేవుడు మిగతావారికన్నా effective అనిచెబుతారు (మీకు డిటర్జెంటు advertisements గుర్తుకొస్తే అది నా తప్పుకాదు), డబ్బుల్ని ఎరగా చూపిస్తారు. శాశ్వితమైన స్వర్గమూ, అగ్నిగుండంలాటి నరకమూ ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఇప్పుడు హిందూ సంస్థలూ అదేపని చేశాయి. నావరకు నాకు ఇద్దరు చేస్తున్నదీ తప్పుకాదు., వాళ్ళు వాళ్ళ products (మతం) అమ్ముకోవడానికి, సర్క్యులేహ్షన్ పంచుకోవడానికి వినియోగదారులకు వేర్వేరు ఆఫర్లిస్తున్నారు (మభ్యపెడుతున్నారు). కాకుంటే మతమార్పుడులను నిషేధించమంటూ హిందూసంస్థలు గొంతెత్తి అరవడం తప్పు. అదేపని ఇప్పుడు వారు చెయ్యడం ఒక విచిత్రం. నా ఉద్దేశ్యంలో మతాలుమారేవారు ఈ మత సంస్థలను బాగా వాడుకుంటున్నారు. మతం మారేవాడెప్పుడూ తెలివైనవాడే!

  అన్నట్లు భజరంగదళ్ని మితవాద సంస్థగా ఎప్పటినుంచి పరిగణిస్తున్నారు? కొన్ని అతివాద సంస్థలుగా భావిస్తున్నవాటిని ఉదహరించగలరా?

 3. మితవాదులు అన్నది రాజకీయ అర్ధంలో చెప్పిన పదం. ఆంగ్లంలో రైటిస్టులు అంటాం కదా, అది. అతివాదులు అన్నది అన్నీ రాజకీయ స్రవంతుల్లోనూ వాడవచ్చు. ఉదాహరణకి లెఫ్ట్ లోను, రైట్ లోనూ అతివాదులు ఉంటారు. ఖచ్చితంగా చెప్పాలంటే ఆర్.ఎస్.ఎస్ దాని అనుబంధ సంస్ధలను మిత అతివాదం (Right extremism) అనాలి. మావోయిస్టులను ది హిందు పత్రిక Left wing extremists అంటుంది.

  రాజకీయాలు అనే విశాల అర్ధంలో విప్లవ పార్టీలు లెఫ్ట్ అవుతాయి. సి.పి.ఐ, సి.పి.ఎం, లిబరేషన్ తదితర పార్టీలు లెఫ్ట్ లో రైట్ అవుతారు. లేదా సింపుల్ గా రివిజనిస్టులు అనవచ్చు. కాంగ్రెస్, ఎస్.పి, బి.ఎస్.పి తదితర సో-కాల్డ్ పార్టీలు సెంట్రిస్టు పార్టీలు. వీటిలో కాంగ్రెస్ తన ఆర్ధిక విధానాల ద్వారా సెంటర్ లో లెఫ్ట్ వైపు జరుగుతూ ఉంటుంది. అందువలన ఆ పార్టీ లైన్ ను ‘లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్’ అంటారు. బి.జె.పి, శివసేన తదితర పార్టీలు, సంస్ధలు రైటిస్ట్ పార్టీలు అవుతాయి. రైటిజం కు తెలుగు అనువాదం మితవాదం. రైట్ లో కూడా తీవ్ర భావాలను కలిగి ఉంటాయి కనుక బి.జె.పి, అనుబంధ సంస్ధలను మిత అతివాదులు అనాలి. మొత్తం మీద చూస్తే సెంటర్ నుండి right extremism వరకు నూతన ఆర్ధిక విచానాలకు మద్దతు నిలుస్తాయి. రివిజనిస్టు పార్టీలు లెఫ్ట్ కబుర్లు చెబుతూ నూతన ఆర్ధిక విధానాలకు నోటి వ్యతిరేకత చెబుతూ ఆచరణలో అవే విధానాలను అమలు చేస్తాయి. కనుక వారితో ఇంకా ప్రమాదం.

 4. హిందూత్వ సంస్థలు శూద్రులని మతం మారొద్దని చెపుతాయి కానీ శూద్రులని సవర్ణులతో సమానంగా చూస్తామని చెప్పవు.

  పదేళ్ళ క్రితం ఒక కమ్మవాడు (అతను కూడా శూద్రుడే కానీ శూద్రుల్లో అగ్ర కుల హోదా కలవాడు) నాతో అన్నాడు “దళితులు మతం మారడానికైనా మేము ఒప్పుకుంటాము కానీ హిందూ మతంలో ఉండి రిజర్వేషన్ కావాలంటే మాత్రం మేము ఒప్పుకోము” అని. మతం మారినవాళ్ళకి రిజర్వేషన్‌లు వర్తించవు కదా. దళితులూ, గిరిజనులూ, బి.సి.లలో అందరూ మతం మారితే రిజర్వేషన్‌లు రద్దవుతాయని అతని ఆశ. అతన్ని మతం కదిలించలేదు కానీ ఆర్థికాంశం కదిలించింది.

  భాజపాకి నాలుగు వోత్‌లు పడేలా చెయ్యడానికి ఈ హిందూత్వ మూకలు చేసే పనులు ఉపయోగపడతాయి కానీ నిజ జీవితంలో కులమతాలని మించిన virtue డబ్బే.

 5. ఇప్పుడే ఫేస్‌బుక్‌లో చదివాను. వాళ్ళు మతం మార్చుకోలేదట, కాళీ పూజలో కూర్చోమంటే కూర్చున్నారట, దాన్ని హిందూత్వవాదులు మత మార్పిడిగా చూపిస్తున్నారని వాళ్ళకి తెలియదట! చెత్త ఏరుకుని రీసైక్లింగ్‌కి అమ్ముకునే తమకి ఇస్లామైనా, హిందూ మతమైనా ఒకటేననీ; తాము ఎన్నడూ హిందువుల్ని వేరుగా చూడలేదనీ ఆ ముస్లింలు అన్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s