భోపాల్: వేల ప్రాణాలకు గడ్డిపోచ విలువ కట్టి 30 యేళ్ళు -ఫోటోలు


విషపు రెక్కల డేగ భోపాల్ నగరం విను వీధుల్లో విష విహారం చేసి డిసెంబర్ 3 తేదీకి 30 యేళ్ళు గడిచిపోయాయి. సో కాల్డ్ నాగరిక ప్రజాతంత్ర భారత రిపబ్లిక్ రాజ్యం సాక్షిగా, ఘనతర ఆధునిక న్యాయ వ్యవస్ధల కనుసన్నల్లో, సామ్రాజ్యవాద అమెరికాతో స్నేహ సంబంధాలు దినదిన ప్రవర్ధమానం అవుతుండగానే భోపాల్ విష వాయు బాధితులు నేటికీ విషవాయువు పీడితులుగా ఇళ్ళు, ఒళ్ళు, తరతరాల ఆరోగ్యం అన్నీ గుల్ల చేసుకుని న్యాయం కోసం దేబిరిస్తూనే ఉన్నారు.

రారాజులు, యువరాజులు, మంత్రివర్యులు, బ్యూరోక్రాట్ అధికారులు ఇత్యాది రాజ్య పాలకులు పొరబాటున కేసులో ఇరుక్కుంటే వారికి బెయిల్ ఇవ్వడం కోసం అర్ధరాత్రి-అపరాత్రి అని లేకుండా, ఇల్లూ-కోర్టూ అని కాకుండా ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ కలం పట్టుకుని సిద్ధంగా ఉండే న్యాయాధీశులకు డబ్బు కొవ్వు పట్టిన ఒక విదేశీ కంపెనీ అధిపతికి భారత ప్రభుత్వాలే స్వయంగా విమానం ఏర్పాటు చేసి మరీ దేశం దాటించినా లెక్కకట్టి బాధ్యులను తెల్చేందుకు 30 యేళ్ళ కాలం కూడా సరిపోక పోయింది.

ఖర్చులు తగ్గించుకుని లాభాలు పెంచుకునే లాభార్జనా దృష్టితో యూనియన్ కార్బైడ్ యాజమాన్యం ఫ్యాక్టరీలోని వివిధ పరికరాల భద్రతా నిర్వహణను మూలకు నెట్టేయడం వల్లనే ఆనాటి విషవాయువు లీకేజి ప్రమాదం జరిగింది. పైపులు తీవ్రంగా తుప్పు పట్టడంతో విషవాయువు విడుదల కావడానికి దారి తీసిన రసాయన చర్యలు వేగంగా జరిగాయి. 200 ఉక్కు డ్రమ్ముల్లో మిధెన్ ఐసో సైనేట్ (మిక్ వాయువు) ను నిల్వ చేయాల్సి ఉండగా దానిని ఒకే ఒక్క పెద్ద ట్యాంకులో నిల్వ చేశారు. సదరు ట్యాంకులోకి నీరు ప్రవేశించడంతో కార్బన్ డై ఆక్సైడ్ వాయువు ఏర్పడి అది పెరుగుతూ పోయింది. ఫలితంగా ట్యాంకు లోపల ఒత్తిడి పెరిగిపోయి భద్రత కోసం ఏర్పరిచిన కవాటాలు బద్దలై మిక్ వాయువు భారీ మొత్తంలో భోపాల్ నగరాన్ని చుట్టుముట్టింది.

1984 డిసెంబర్ 2, 3 తేదీల మధ్య రాత్రిన (తెల్లవారితే 3వ తేదీ) ప్రమాదం సంభవించడంతో భోపాల్ లోని వేలాది మంది ప్రజలకు ఏమి జరుగుతున్నదీ తెలిసేలోపే చనిపోయారు. మృతుల సంఖ్య అధికారికంగా ఇప్పటికీ ఇతమిద్ధంగా తెలియదంటే సామాన్య ప్రజల పట్ల భారత పాలకుల శ్రద్ధాసక్తులు ఏ పాటివో అర్ధం చేసుకోవచ్చు. సరైన నిర్ధారణకు ప్రభుత్వాలు కృషి చేయకపోవడం వలన మరణాల సంఖ్య 3,000 నుండి 25,000 వరకూ ఎవరికి నచ్చిన అంకె వారు చెప్పడమే.

నిద్రలో ఉన్న 6 లక్షల మంది ప్రజలపై అర్ధరాత్రి విరుచుకుపడిన విషవాయువు మృతుల పట్లే కాస్త జాలిగా వ్యవహరించింది అంటే అతిశయోక్తి కాబోదు. బ్రతికి బయటపడిన పదుల వేల కుటుంబాల్లో ఇప్పటికీ మానసిక, శారీరక వైకల్యంతో పిల్లలు పుడుతున్నారు. తరాల తరబడి భోపాల్ ప్రజలను వెన్నాడుతూ వస్తున్న విష వాయువు ప్రమాదం నూటికి 99 పాళ్ళు మానవ నిర్మితమే.

యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో తయారవుతున్న కీటక నాశని అప్పటికి తన ప్రభ కోల్పోతోంది. కొనుగోళ్ళు తగ్గిపోయాయి. దాంతో లాభాలూ తగ్గాయి. ఇక నిర్వహణ ఖర్చు తగ్గించుకుందామని ఫ్యాక్టరీ యాజమాన్యం భావించింది. అందులో భాగంగా యంత్ర పరికరాల నిర్వహణ మూలన పడేసింది. భద్రతా నిర్వహణను పట్టించుకోలేదు. దానితో ఫ్యాక్టరీలోని వివిధ భాగాలు తుప్పు పట్టి శిధిలావస్ధకు చేరుకున్నాయి. వరుస ప్రమాదాలు జరిగినా యాజమాన్యం లెక్క చేయలేదు. కార్మికులు, నగర ప్రజల భద్రత కంటే తన లాభార్జననే ముఖ్యంగా ఎంచుకుంది. యాజమాన్య లాభ దాహం చివరికి భోపాల్ ప్రజలు పోయిన ప్రాణాలు పోను, తరాల తరబడిన మానసిక, అంగ వైకల్యాలకు గురవుతూ వస్తున్నారు.

ఈ నష్టాలకు పర్యావరణ నష్టం అదనం. ఇప్పుడు అక్కడ చుట్టూ పక్కల తాగు నీరు దొరకదు. మొక్కలు, జంతువులు సైతం విషవాయు ప్రభావం నీడన కొనసాగుతున్నాయి. విషం లేని జీవి అక్కడ లేదంటే అతిశయోక్తి కాదు. ఇదంతా వినుతికెక్కిన మన ప్రజాస్వామ్య పాలకుల కనుసన్నల్లో కొనసాగింది. కోర్టుల దయారాహిత తీర్పులు భోపాల్ బాధితులకు మరిన్ని కన్నీళ్లే మిగిల్చాయి తప్ప కనీసం ఆదుకున్నది లేదు. బాధితులను ఆదుకోవడం కంటే పీడకుడిని నేరం నుండి తప్పించేందుకే వ్యవస్ధలన్నీ పని చేశాయి.

2001లో యూనియన్ కార్బైడ్ కంపెనీని డౌ కెమికల్స్ కంపెనీ కొనివేశాక బాధితులకు మరిన్ని కడగండ్లు మొదలైనాయి. నష్టపరిహారం చెల్లించే బాధ్యత తనకు లేదని డౌ కంపెనీ మొఖం చాటేసింది. వేలాది టన్నుల విష వ్యర్ధాలు ఇప్పటికీ కార్బైడ్ ఫ్యాక్టరీ సమీపంలో భూగర్భంలో పాతి ఉంచారు. ఈ వ్యర్ధాలు అక్కడి పరిసరాలను విషమయం చేస్తోంది. ఈ ప్రాంతం మొత్తం విషతుల్యం అయిపోయిందని ప్రభుత్వమే అంగీకరించింది.

ఈ నేపధ్యంలో ఆనాటి ప్రమాద దృశ్యాలను ఈ నాటి కంటితో చూడడం అవసరం. యూనియన్ కార్బైడ్ యాజమాన్యాన్ని శిక్షిస్తామని, నష్టపరిహారం చెల్లించేలా ముకుతాడు వేస్తామని మన పాలకులు పలికిన ప్రగల్భాలు ఈ నాడు ఏ స్ధాయిలో నీటి మూటలుగా మిగిలాయో మనకు తెలుసు. ఈ జ్ఞానంతో ఆనాటి దుర్ఘటనను పునఃదర్శించడం వల్ల మనకు మరిన్ని వాస్తవాలు అర్ధం అయ్యే అవకాశం ఉంటుంది.

 

One thought on “భోపాల్: వేల ప్రాణాలకు గడ్డిపోచ విలువ కట్టి 30 యేళ్ళు -ఫోటోలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s