(హిందూత్వ సంస్ధల రాజకీయ పలుకుబడి పెరిగిన ఫలితంగా వారి సంకుచిత సాంస్కృతిక భావజాలం సమాచార, ప్రసార శాఖలోకి చొరబడి సమాజ ఆలోచనా రీతిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందని సూచించే ఈ సంపాదకీయం ఈ రోజు, డిసెంబర్ 8, ది హిందు పత్రికలో ప్రచురించబడింది. -విశేఖర్)
*********
“అశ్లీల’ అంశాలను, ‘మహిళలను కించపరిచే” కార్యక్రమాలను ప్రసారం చేశారని ఆరోపిస్తూ ‘కామెడీ సెంట్రల్’ టెలివిజన్ ఛానెల్ ప్రసారాలను 10 రోజుల పాటు నిషేధిస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలను ఇటీవల ఢిల్లీ హై కోర్టు సమర్ధిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. నవంబర్ 28 తేదీన సుప్రీం కోర్టు, హై కోర్టు తీర్పును తదుపరి హియరింగ్ జరిగే వరకూ నిలిపివేస్తూ స్టే మంజూరు చేసింది. గత కొన్ని సంవత్సరాలలో మంత్రిత్వశాఖ అనేకమార్లు అలాంటి హెచ్చరికలు, సలహాలు, ఆదేశాలు జారీ చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్స్ (రెగ్యులేషన్) యాక్ట్, 1995 చట్టం కింద తనకు దఖలు పడిన అధికారాలను ఉపయోగిస్తూ వీటిని జారీ చేసింది. “కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ లు ఒక పద్ధతి లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నేపధ్యంలోనూ, ఈ నెట్ వర్క్ ల ప్రసారాలన్నీ ప్రధానంగా పశ్చిమ తరహాకు చెందినందున అవి ‘సాంస్కృతిక దాడి’ సాగిస్తున్నాయని అనేక మూలల నుండి ప్రజలు భావిస్తున్న నేపధ్యంలోనూ…” ఈ చట్టాన్ని తెచ్చామని చెప్పారు.
2011-12 లో వార్షిక నివేదిక విడుదల చేస్తూ (సమాచార, ప్రసార) మంత్రిత్వ శాఖ, తాను “ఉపగ్రహ టి.వి ఛానెళ్ల చొరబాటు తరహా వ్యాప్తి వలన తేలికగా ప్రభావితమయ్యే మహిళలు, పిల్లల ప్రయోజనాలను పర్యవేక్షిస్తున్నాను” అని చెప్పుకుంది. ప్రసార కార్యక్రమాలు ఉల్లంఘించరాదని చెబుతూ ఈ చట్టం, మంచి అభిరుచి, మర్యాద, అశ్లీలత, మహిళలు పిల్లలను కించపరిచేవి… మున్నగు అంశాలకు సంబంధించి వివిధ అస్పష్ట ప్రమాణాలను నిర్దేశించింది. చట్టాన్ని అమలు చేసేందుకు మంత్రిత్వ శాఖ ఒక ఇంటర్-మినిస్టీరియల్ కమిటీ (ఐ.ఎం.సి) అని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఇతర మంత్రిత్వ శాఖల నుండి ప్రతినిధులు ఉంటారు. ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత ఐ.ఎం.సి వాటిని పరిశీలించి తగు చర్యలతో కూడిన తన సిఫార్సులను మంత్రిత్వ శాఖకు ప్రతిపాదిస్తుంది. బ్రాడ్ కాస్టింగ్ కంటెంట్ కంప్లయింట్స్ కౌన్సిల్ పేరుతో మరో స్వయం నియంత్రణా సంస్ధ కూడా వివిధ కేసుల్లో ఫిర్యాదులను పరిశీలించి తదుపరి చర్యకు మంత్రిత్వ శాఖకు పంపిస్తుంది.
మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనేక వందల ఉదాహరణలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే: ‘ఎమోషనల్ అత్యాచార్’ పేరుతో ప్రసారమైన కార్యక్రమంలో అశ్లీల దృశ్యాలు ప్రసారం చేశారని ఆరోపిస్తూ అందుకు గాను క్షమాపణలు కోరుతూ వారం రోజుల పాటు స్క్రోలింగ్ నడపాలని బిందాస్ టి.వి చానెల్ ను ఆదేశించింది; ‘గెటవుట్’, ‘బ్రిడ్జెట్స్ సెక్సీయెస్ట్ బీచెస్’, మొదలైన కార్యక్రమాలలో అశ్లీల అంశాలు ఉన్నాయని టి.ఎల్.సి ఛానెల్ కు హెచ్చరికలు అందాయి; ‘డెక్స్టర్’, ‘టు అండ్ ఎ హాఫ్ మేన్’, ‘హౌ ఐ మెట్ యువర్ మదర్’, ‘మేడ్ మెన్’ మొదలైన కార్యక్రమాల్లో అశ్లీల దృశ్యాలు చూపించారని చెబుతూ స్టార్ వరల్డ్, FX ఛానెళ్లకు హెచ్చరికలు అందాయి; ‘ద వండర్ ఇయర్స్’ పేరు గల షోను మంచి అభిరుచి, మర్యాదతో రూపొందించలేదని, అవి పిల్లలను కించపరిచేలా ఉన్నాయని ఆరోపణలతో ఒక హిత బోధ అందుకుంది.
సృజనాత్మక స్వేచ్ఛ పట్లా, భావ ప్రకటనా స్వేచ్ఛ మరియు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లాంటి రాజ్యాంగ అంశాలకు సంబంధించిన ఆధునిక లక్షణాల పట్లా ఎటువంటి గౌరవం లేకుండా, న్యాయ వ్యవస్ధ నుండి కనీస జోక్యం కూడా లేకుండానే ఐ.ఎం.సి గానీ మంత్రిత్వ శాఖ గానీ ఈ బ్యూరోక్రటిక్ ఆదేశాలు జారీ చేయడాన్ని గమనించవచ్చు. కనుక ఈ ప్రక్రియలో పర్యవేక్షణ లేదా పారదర్శకతలు కొరవడ్డాయి. రెండవది, ప్రసారాంశాలపై విలువల తీర్పులు ఇచ్చేయడానికి అవసరమైన ప్రమాణాలు -ఉదా: మర్యాద, మంచి అభిరుచి మరియు అశ్లీలత మొ.వి- అస్పష్టంగా ఉండడం. సంకుచిత స్వభావం కలిగిన సాంస్కృతిక పోలీసింగ్ దృష్టితో ఉన్నవారు వాటిని తేలికగా దుర్వినియోగం చేయవచ్చు. చివరిగా, నియంత్రణకు సంబంధించి మంత్రిత్వ శాఖ యొక్క అవగాహన ప్రధానంగా సంరక్షణాత్మకంగానూ, పితృస్వామికంగానూ ఉన్నది. అటువంటి తరహా పాలన సృజనాత్మక సేచ్ఛ, ఎంపికలను పెంపొందించకపోగా, ఆటంకపరుస్తుంది.