ఇప్పుడిక అనుమానం అనవసరం. ఇజ్రాయెల్ నిజ స్వరూపం ఏమిటో స్పష్టంగా తేటతెల్లం అయిపోయింది. న్యాయమైన పాలస్తీనా ప్రజల పోరాటాలను టెర్రరిజంగా చెప్పుకుంటూ ప్రపంచ దేశాల మద్దతు పొందేందుకు ప్రయత్నించే యూదు రాజ్యం తాను స్వయంగా సిరియా టెర్రరిస్టులకు ఆయుధ, వైద్య సహాయం అందజేస్తోందని ఐరాస నివేదికలు స్పష్టం చేశాయి.
1967 నాటి ఐరాస తీర్మానం అనుసారం సిరియా-ఇజ్రాయెల్ సరిహద్దులో ఇజ్రాయెల్ ఆక్రమిత సిరియా భూభాగం గోలన్ హైట్స్ లో నెలకొల్పిన ఐరాస కార్యాలయం UNDOF సంస్ధ ఐరాస భద్రతా సమితికి వరుస నివేదికలు సమర్పించింది. సిరియాలో బషర్ ఆల్-అస్సాద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ చర్యలకు పాల్పడుతున్న పలు ఉగ్రవాద సంస్ధలకు ఇజ్రాయెల్ క్రమం తప్పకుండా సాయం చేస్తోందని యునైటెడ్ నేషన్స్ డిజ్-ఎంగేజ్ మెంట్ అబ్జర్వర్ ఫోర్స్ సమర్పించిన నివేదికలు తెలిపాయి.
సిరియాలోని సాయుధ తిరుగుబాటుదారులతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐ.డి.ఎఫ్) సైనికులు, అధికారులు నిత్యం సంబంధాలు నెరుపుతున్నారని చెప్పేందుకు సాక్ష్యాధారాలతో కూడిన పత్రాలను UNDOF సమర్పించింది. మార్చి 2013 నుండి డిసెంబర్ 2014 వరకు (21 నెలల కాలం) జరిగిన కాలంలో ఐ.డి.ఎఫ్-తిరుగుబాటుదారులు పరస్పరం సహకరించుకున్న అనేక ఉదాహరణలను తాము రికార్డు చేశామని UNDOF అధికారులు తెలిపారు.
పశ్చిమ దేశాలు బహిరంగంగా మద్దతు ఇచ్చే ఫ్రీ సిరియన్ ఆర్మీ నుండి ఇరాక్-సిరియా భూభాగాలతో ఇస్లామిక్ కాలిఫెట్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన ఇసిస్ (ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా) వరకు అనేక సంస్ధలు అస్సాద్ ప్రభుత్వంపై సాయుధ ఉగ్రవాద దాడులు చేస్తున్నాయి. ఈ సంస్ధలు సిరియా చుట్టుపక్కల ఉన్న వివిధ అమెరికా మిత్ర – అరబ్ దేశాల మద్దతును స్వీకరిస్తున్నాయి. బషర్ అనంతర సిరియాలో తమ తమ ప్రభావాలను స్ధాపించే లక్ష్యంతో సౌదీ, కతార్, యు.ఏ.ఇ, జోర్డాన్, టర్కీ… తదితర దేశాలు వివిధ ఉగ్రవాద గ్రూపులను పోషిస్తున్నాయి.
ఈ గ్రూపుల మధ్య సారాంశంలో తేడా ఏమీ లేదు. ఈ గ్రూపులన్నీ సిరియాను ముక్కలు చెక్కలు చేసేందుకు కాచుకున్నవే. వివిధ శిబిరాల్లో ఈ గ్రూపుల సభ్యులందరూ అమెరికా, ఐరోపాల గూఢచారుల నుండి సాయుధ శిక్షణ పొందినవే. ఈ ఉగ్రవాద మూకలకు ఇజ్రాయెల్ సాయుధ శిక్షణ ఇవ్వడంతో పాటు గాయపడిన ఉగ్రవాదులకు వైద్య చికిత్స అందిస్తోందని, బహుశా ఆయుధాలు కూడా సరఫరా చేస్తోందని UNDOF నివేదికలు నిర్ధారించాయి.
“యునైటెడ్ నేషన్స్ పొజిషన్ 85 కు సమీపంలో కాల్పుల విరమణ రేఖ మీదుగా ఐ.డి.ఎఫ్ సైనికులు, సిరియాలోని సాయుధ తిరుగుబాటుదారులతో సంప్రదింపులు జరుపుతున్న సంఘటనలను UNDOF సిబ్బంది గమనించారు” అని అక్టోబర్ 27 తేదీన సమర్పించిన నివేదిక స్పష్టం చేసిందని రష్యా టుడే (ఆర్.టి) పత్రిక తెలిపింది.
ఐ.డి.ఎఫ్ సైనికులు కాల్పుల విరమణ రేఖ గేటును తెరిచి పట్టుకోగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సిరియా వైపు నుండి ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్ లోకి ప్రవేశించారని తాజా (అక్టోబర్ 27 నాటి) నివేదిక తెలిపింది. ఐ.డి.ఎఫ్ సైనికులు సిరియా భూభాగం లోకి చొచ్చుకు వచ్చి 60 నుండి 70 వరకు కుటుంబాలు ఉండగల గుడారాలను నెలకొల్పిందని అదే నివేదిక తెలిపింది. ఇజ్రాయెల్ వైపు నుండి 300 మీటర్ల దూరంలో నెలకొల్పిన ఈ గుడారాల శిబిరం నిజానికి సాయుధ టెర్రరిస్టుల కోసం నెలకొల్పిన శిబిరం అని సిరియా ప్రభుత్వం UNDOF కు ఫిర్యాదు చేయడం గమనార్హం.
ఐ.డి.ఎఫ్ సైనికులు రెండు బాక్సుల నిండా గుర్తు తెలియని పరికరాలు నింపి సిరియా తిరుగుబాటుదారులకు అందజేస్తున్న ఘటనను తాము చూశామని జూన్ 10, 2014 తేదీన సమర్పించిన నివేదికలో UNDOF అధికారులు తెలిపారు. ఈ ఘటన సిరియా భూభాగం పైనే చోటు చేసుకుందని నివేదిక తెలిపింది. దాదాపు ఇదే సమయంలో ఆల్-ఖైదా గ్రూపు (ఆల్-నూస్రా) టెర్రరిస్టులు 43 మంది ఐరాస శాంతి పరిరక్షక సైనికులను కిడ్నాప్ చేశారు.
1967 లో 6 రోజుల పాటు జరిగిన ఇజ్రాయెల్-అరబ్ యుద్ధంలో గోలన్ హైట్స్ భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది. ఆనాడు పలు అరబ్ దేశాలు ఉమ్మడిగా ఇజ్రాయెల్ తో యుద్ధం చేసినప్పటికీ అమెరికా అండతో ఇజ్రాయెల్ విజేతగా నిలిచింది. యుద్ధానంతరం మరింత పాలస్తీనా భూభాగంతో పాటు సిరియాకు చెందిన గోలన్ హైట్స్ ను, ఈజిప్టుకు చెందిన సినాయ్ ద్వీపాన్ని జోర్డాన్, లెబనాన్ లకు చెందిన భూ బాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించింది. అనంతరం అమెరికా మధ్యవర్తిత్వంలో ఈజిప్టు, ఇజ్రాయెల్ తో ఒప్పందం చేసుకుని సినాయ్ ను తిరిగి స్వాధీనం చేసుకుంది. అందుకు ప్రతిగా ఈజిప్టుకు అతి తక్కువ ధరలకు చమురు సరఫరా చేస్తోంది. ఆనాటి నుండి ఈజిప్టు పాలకులు అమెరికా-ఇజ్రాయెల్ ప్రయోజానలకు అంకితమై పని చేస్తూ తరించిపోతున్నారు.
1973లో జరిగిన యోమ్ కిప్పూర్ యుద్ధంలో ఇజ్రాయెల్ నుండి గోలన్ హైట్స్ ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సిరియా ప్రయత్నించి విఫలం అయింది. ఐరాస మధ్యవర్తిత్వంలో సిరియా-ఇజ్రాయెల్ ల మధ్య 1974 లో కుదిరిన యుద్ధ విరమణ ఒప్పందం మేరకు ఐరాస పరిశీలక బలగాలను గోలన్ హైట్స్ లో కొనసాగిస్తున్నారు. సదరు బలగాలే ఇప్పుడు ఇజ్రాయెల్ పాలకులు సిరియా టెర్రరిస్టులకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని, ఆయుధ సరఫరాను, వైద్య సహాయాన్ని ధృవీకరించాయి.
- UNDOF Position 86
ఈ వాస్తవం వెల్లడి కావడంతో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వం సైతం టెర్రరిస్టులకు తాము ఇస్తున్న మద్దతును దాచి పెట్టడం లేదు. అలాగని ధృవీకరించడమూ లేదు. తన పాత్ర ఉన్నప్పుడు ఏ విషయమూ చెప్పకపోవడం ఇజ్రాయెల్ అనుసరించే వైఖరి. ఇజ్రాయెల్ ప్రభుత్వం లోని వివిధ అధికారులు మాత్రం తాము ఇప్పటివరకు 1000 మందికి పైగా సిరియా తిరుగుబాటుదారులకు వైద్య చికిత్స అందించామని కొన్ని పత్రికలకు, ఛానెళ్లకు తెలిపారు. సిరియా ఉగ్రవాదులకు ఇజ్రాయెల్ లో చికిత్స ఇవ్వడాన్ని నిరసిస్తూ మైనారిటీ డ్రూజ్ మతస్ధులు ఆందోళనలు నిర్వహించిన సంగతి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు.
సిరియాలో టెర్రరిస్టులకు ఇజ్రాయెల్ అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్న సంగతి ధృవీకరించబడినాక ఇక అమెరికా మద్దతు గురించి కూడా అనుమానాలు అనవసరం. కనుక ఇసిస్ టెర్రరిస్టులకు అమెరికాకు మధ్య తగాదా ఉందన్న ప్రచారం పచ్చి అబద్ధం అని స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు. ఇసిస్ అనేది మధ్య ప్రాచ్యంలో అమెరికా భౌగోళిక రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చేందుకు సృష్టించబడిన సంస్ధ మాత్రమే. ఇందుకు విరుద్ధంగా ఉన్న అమెరికా ప్రచారాన్ని నెత్తిన పెట్టుకుని మోయడం భారత పత్రికలు, ఛానెళ్లు ఇకనైనా మానతాయా అన్నది అనుమానమే.