లాస్ ఏంజిలిస్ నగరంలో నిర్మాణంలో ఉన్న నివాస భవనాలు రెండు అగ్ని కీలలకు ఆహుతి అవుతున్నాయి. భవనాలను నిలువునా దహించివేస్తూ ఆకాశాన్ని తాకుతున్న మంటల టవర్ కు సంబంధించిన ఫోటోలను పలువురు పౌరులు సోషల్ వెబ్ సైట్లలో పోస్ట్ చేస్తున్నారు. అగ్ని ప్రమాదం వల్ల రెండు ఫ్రీ వే లను మూసేసినట్లు పత్రికలు తెలిపాయి. 250 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తూ మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటో ఇంతవరకు అంతుబట్టలేదని తెలుస్తోంది. భారీ స్ధాయిలో మంటలు భవనం మొత్తాన్ని దహించివేస్తున్న దృశ్యం భయానకంగా ఉన్నదని ప్రత్యక్ష సాక్ష్యులను ఉదహరిస్తూ పలు పత్రికలు తెలిపాయి. నిర్మాణంలో ఉన్న 7 అంతస్ధుల భవనంలో మొదలైన మంటలు తీవ్ర స్ధాయికి చేరి పక్కనే ఉన్న మరో భవనానికి వ్యాపించాయని డెయిలీ మెయిల్ పత్రిక తెలిపింది.
110 ఫ్రీ వే, 101 ఫ్రీ వే లు రెండూ కలిసే చోట నిర్మాణంలో ఉన్న భవనం తగలబడుతుండడంతో ఆ రెండు ప్రధాన రహదారులను పోలీసులు మూసేశారు. విపరీత వేడిమితో, భారీ సైజులో చెలరేగిన మంటలు అదుపు చేయడం బాగా కష్టంగా ఉందని తెలుస్తోంది. మంటలు ఎంత భారీగా ఉన్నాయంటే చుట్టుపక్కల అనేక మైళ్ళ దూరం వరకు కనిపిస్తున్నాయని, అక్కడి పొగలవల్ల లాస్ ఏంజిలిస్ నగరంలోని ఇతర స్కై స్క్రాపర్ భవనాలు దూరం నుండి కనిపించడం లేదని పత్రికలు తెలిపాయి.
స్ధానిక కాలమానం (పసిఫిక్ టైం) ప్రకారం తెల్లవారు ఝాము గం. 1:20 ని.ల ప్రాంతంలో మంటలు ప్రారంభం అయ్యాయి. నిర్మాణంలో ఉన్న భవనంలో ఎవరూ లేకపోవడంతో క్షతగాత్రులు ఎవరూ లేరు. పక్కనే ఉన్న 16 అంతస్ధుల భవనానికి అంటుకోవడం వల్ల ప్రాణ నష్టం గాని, గాయాలు కావడం గానీ జరిగింది లేనిదీ తెలియలేదు. ప్రస్తుతం మంటలు అదుపు చేయడం పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
లాస్ ఏంజిలిస్ టైమ్స్ (ఎల్.ఏ.టైమ్స్) పత్రిక ప్రకారం మూడు బహుళ అంతస్ధూల భవనాలు అగ్ని కీలలకు ఆహుతి అయ్యాయి. భవనం బైట చెలరేగుతున్న మంటలను 90 నిమిషాల్లో అదుపు చేశామని కానీ లోపల భాగంలో మంటలు కొనసాగుతున్నాయని లాస్ ఏంజిలిస్ అగ్నిమాపక విభాగం అధికారి చెప్పినట్లు ఎల్.ఏ.టైమ్స్ పత్రిక తెలిపింది. కింది రెండు అంతస్ధులు కాంక్రీటుతో నిర్మించగా ఆ తర్వాతవి కలపతో నిర్మించారని దానితో మంటలు వేగంగా భవనాన్ని మింగేసాయని తెలుస్తోంది.
మంటలకు కారణం ఇంకా తెలియాల్సి ఉంది. కింది ఫోటోలను డెయిలీ మెయిల్, ఇన్స్టాగ్రామ్, ఎల్.ఏ.టైమ్స్ పత్రికల నుండి సేకరించినవి.