మహారాష్ట్ర ఎన్నికలు-ప్రభుత్వ ఏర్పాటు నాటకంలో చివరి అంకం పూర్తయింది. ఎన్నికలకు ముందు బి.జె.పి తో పొత్తును తెగతెంపులు చేసుకున్నది లగాయితు శివ సేన నేతలు, బి.జె.పి పై నిప్పులు చెరగని రోజంటూ లేదు. ఉత్తుత్తి పులి గాండ్రింపులు చేసి చేసి అలసిపోయిన శివసేన చివరికి పిల్లికంటే దిగజారి తమ ముందు ‘ఎలుక’గా అభివర్ణించిన బి.జె.పి చేతనే మెడలో గంట కట్టించుకుంది.
మహారాష్ట్రలో ఎవరిది ఆధిపత్య హస్తం అన్నది నిర్ధారించుకోవడంలో పరస్పరం విభేదించుకున్న బి.జె.పి, శివసేనలు తమ విభేదం పరిష్కారానికి మహా నాటకానికి తెర లేపారు. ఈ నాటకం నిజమేనేమో అని భ్రమింపజేస్తూ శివసేన చేసిన బెదిరింపులన్నీ ఉత్తుత్తివేనని రాష్ట్ర ప్రభుత్వంలో చేరడం ద్వారా శివసేన స్పష్టం చేసింది.
ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కాలన్న అంశమే బి.జె.పి, శివసేన మధ్య తలెత్తిన తగాదా. పైకి ఇది పదవీ రాజకీయం లాగానే కనిపించిన అసలు వ్యవహారం ఆధిపత్య పోరుకి సంబంధించినది. తమకు బలం పెరిగింది కనుక తమ మాటే వినాలని బి.జె.పి కొత్త ఒప్పందాన్ని ప్రతిపాదించగా అందుకు శివసేన నిరాకరించడంతో వారి తగాదా ప్రజల మధ్యకు చేరింది.
ఎన్నికల్లో బి.జె.పి కి అత్యధిక సీట్లు దక్కినప్పటికి మెజారిటీ కరువయింది. కానీ ఎన్.సి.పి బేషరతు మద్దతు వల్ల శివసేన బేరమాడే శక్తి బాగా బలహీనపడింది. ఎన్.సి.పి మద్దతు తీసుకోకుండానే ఆ పార్టీ ఇవ్వజూపిన మద్దతును చూపుతూ శివసేనను దారికి తెచ్చుకోవడంలో బి.జె.పి సఫలం అయింది.
ముఖ్యమంత్రి పదవి డిమాండ్ చేసిన శివసేన చివరికి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా దక్కించుకోలేకపోయింది. కనీసం హోమ్ మంత్రి పదవి ఇవ్వడానికి కూడా బి.జె.పి నిరాకరించింది. అయినప్పటికీ శివసేన తన పులి వేషాన్ని చాలించి, మారిన బలాబలాలను గుర్తించి తన పిల్లి స్ధానంలోకి ఒదిగిపోయింది.