నీటి దౌత్యం: మాల్దీవులకు ఇండియా, శ్రీలంకకు చైనా


MSR

అమెరికా తలపెట్టిన ఆసియా-పివోట్ వ్యూహం పుణ్యమాని దక్షిణాసియాలో ఇండియా-చైనాల మధ్య పోటీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇండియా తన నౌకా, వాయు బలగాలను వినియోగించి మాల్దీవులకు భారీ మొత్తంలో మంచి నీటిని సరఫరా చేసిన మూడో రోజుకే శ్రీలంకలో భారీ నీటి ప్రాజెక్టును చైనా ఆవిష్కరించింది. 230 మిలియన్ డాలర్ల ఖర్చుతో శ్రీలంకలో అతి పెద్ద నీటి సరఫరా ప్రాజెక్టుకు చైనా కంపెనీ ఒకటి శ్రీకారం చుడుతోందని జిన్ హువా వార్తా సంస్ధ ద్వారా తెలుస్తోంది.

చైనా మెషినరీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ (సి.ఎం.ఇ.సి) అనే సంస్ధ కొలంబోకు సమీపంలో మంచి నీటి సరఫరా ప్రాజెక్టు నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే దానివల్ల 6 లక్షల మంది ప్రజలు లబ్ది పొందుతారు. కొలంబోకు సమీపంలోని 42 గ్రామాల ప్రజలు ప్రాజెక్టు వల్ల లబ్ది పొందుతారని పత్రికలు తెలిపాయి.

ఇదే చైనా కంపెనీ శ్రీలంకలో మరో పెద్ద నిర్మాణ ప్రాజెక్టులో ఇప్పటికే మునిగి ఉంది. 1.2 బిలియన్ డాలర్ల ఖర్చుతో లక్విజయ బొగ్గు ఆధారిత విద్యుత్ కర్మాగారాన్ని ఈ కంపెనీ నిర్మిస్తోంది.

సి.ఎం.ఇ.సి నిర్మించనున్న నీటి శుద్ధి ప్రాజెక్టు రోజుకు 54,000 ఘనపు మీటర్ల మంచి నీటిని సరఫరా చేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంటుతో పాటు అక్కడి నుండి నీటిని గ్రామాలకు కొనిపోయేందుకు అవసరమైన పైపు లైన్లను కూడా చైనా కంపెనీ నిర్మిస్తుంది.

ఇందులో భాగంగా 1000 కిలో మీటర్ల దూరం మేర పైపు లైన్లను కంపెనీ నిర్మిస్తుంది. బీజింగ్-కొలంబోల మధ్య దినదిన ప్రవర్ధమానమై వర్ధిల్లుతున్న స్నేహ సంబంధాలలో తాజా ప్రాజెక్టు ఒకటి మాత్రమేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

చైనా వ్యాపార విస్తరణను అడ్డుకునేందుకు అమెరికా దక్షిణాసియాలో అనేక ఆటంకాలను సృష్టిస్తోంది. ఈ ఆటంకాలను అధిగమించేందుకు చైనా ప్రతి వ్యూహాలను అమలు చేస్తోంది. దక్షిణ, తూర్పు చైనా సముద్రాలతో పాటు మలక్కా ద్వీపకల్పం, హిందూ మహా సముద్రాలలో సైనిక స్ధావరాలను యుద్ధ నౌకలను అమెరికా మోహరించగా చైనా దానికి ప్రతిగా తనదైన మేరిటైమ్ సిల్క్ రోడ్ రూపకల్పనకు నడుం బిగించింది.

21వ శతాబ్దపు మేరిటైమ్ సిల్క్ రోడ్ (MSR) గా విశ్లేషకులు అభివర్ణిస్తున్న వ్యాపార మార్గం చైనాలోని ఫ్యుజి రాష్ట్ర తీరం నుండి ఐరోపా తీరం వరకు ప్రయాణం చేసేందుకు ఉద్దేశించినది. హిందూ మహా సముద్రంలో ఇండియా, శ్రీలంక, మాల్దీవుల మీదుగా వెళ్ళే ఈ సముద్ర వాణిజ్య మార్గం కీన్యా రాజధాని నైరోబి మీదుగా, ఆ తర్వాత సూయజ్ కాలువ ద్వారా మధ్యధరా సముద్రంలో ప్రవేశించి అంతిమంగా ఇటలీ నగరం వెనిస్ కు చేరుతుంది.

చైనా వ్యాపార విస్తరణను అడ్డుకోవడం, తద్వారా వెలిసిపోతున్న తన ప్రాభవాన్ని కాపాడుకోవడం అమెరికా లక్ష్యం అయితే, చైనాని బూచిగా చూపుతూ భారత పాలకులు ఆ లక్ష్యానికి సహకరించడం ఒక వైపరీత్యం. చైనా వ్యతిరేక అమెరికా ఎత్తుగడల్లో ఇండియా భాగస్వామ్యం వహించడం వల్ల భవిష్యత్తులో భారత ప్రజలకు మరిన్ని సమస్యలు తేవడం ఖాయం.

గత గురువారమే ఇండియా భారీ మొత్తంలో వాయు, నౌకా బలగాలను వినియోగించి మాల్దీవులకు మంచినీటిని సరఫరా చేసింది. మూడు సి-17 గ్లోబ్ మాస్టర్ రవాణా విమానాలు, రెండు ఐ.ఎల్-76 విమానాలతో ఈ నీటిని సరఫరా చేశారు. మాల్దీవుల రాజధాని మాలె లో నీటిని శుద్ధి చేసే కర్మాగారంలో అగ్ని ప్రమాదం సంభవించి జనరేటర్ పని చేయకపోవడంతో అక్కడ నీటి సంక్షోభం తలెత్తింది. దానితో ఇండియా ‘మీకు నేనున్నా’ అంటూ అత్యవసర చర్యలు చేపట్టింది.

విమానాలతో పాటు (సముద్ర నీటి నుండి) రోజుకు 20 టన్నుల మంచి నీటిని ఉత్పత్తి చేయగల యుద్ధ నౌక ఐ.ఎన్.ఎస్ సుకన్య ను కూడా మాల్దీవులకు ఇండియా తరలించింది. జనరేటర్ బాగయ్యేవరకు ఈ నౌక అక్కడే ఉంటుంది. మాల్దీవులను ఆదుకోవడం నిస్సందేహంగా మంచి సంగతే. కానీ ఒక మంచి పని కోసం అని కాకుండా చైనాను నిలువరించే అమెరికా వ్యూహంలో భాగంగా ఇలాంటి పనులను నెత్తికి ఎత్తుకోవడమే అభ్యంతరకరం.

దక్షిణ శ్రీలంకలో చైనా కంపెనీ ఒక పెద్ద నౌకా రేవును అభివృద్ధి చేస్తోంది. హంబన్ తోట పోర్ట్ గా పిలిచే ఈ రేవు పట్టణం కోసం 600 మిలియన్ డాలర్ల డాలర్ రుణాన్ని, 1 బిలియన్ యువాన్ల యువాన్ రుణాన్ని చైనా మంజూరు చేసింది. మొదటి దశ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం రెండో దశ నిర్మాణంలో ఉంది. హంబన్ తోట రేవు నిర్మాణాన్ని భారత పాలకులు తమ ప్రయోజనాలకు విరుద్ధంగా పరిగణిస్తారు.

నిజానికి ఇది భారత్ ప్రయోజనాలకు విరుద్ధం కాదు. కేవలం అమెరికా ఆధిపత్య ప్రయోజనాలకు మాత్రమే విరుద్ధం. ఓ పక్క బ్రిక్స్ కూటమిలో చైనా, రష్యాలతో సాపత్యం కలిగి ఉన్న ఇండియా, మరో పక్క అమెరికా ఆధిపత్య ప్రయోజనాలకు సహకరించడం దేశానికి మేలు చేయదు. అమెరికాతో స్నేహం ‘దృతరాష్ట్ర కౌగిలి’ తో సమానం. అలాంటి స్నేహ కౌగిలిలోకి కోరి కోరి చేరడం దేశ ప్రయోజనాలకు ఎంతమాత్రం క్షేమకరం కాబోదు.

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s