బి.జె.పి నేటి పూర్తి మెజారిటీ అధికారాన్ని హస్తగతం చేసుకునే క్రమంలో ఆ పార్టీ నాయకులు ధరించిన వివిధ పాత్రల పరిణామాన్ని పరిశీలిస్తే ఆసక్తికరంగా ఉంటుంది. ఆ మాటకు వస్తే దాదాపు ప్రతి (దోపిడి) పార్టీ లోనూ జనాన్ని రెచ్చగొట్టే అతివాద పాత్రలు కొన్ని, జనానికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా చేయవలసిన పనిని చేసుకుంటూ పోయే పాత్రలు మరి కొన్నీ కనిపిస్తాయి.
ఇలా రెండు రకాల పాత్రలను జనం ముందు ఉంచవలసిన అవసరం రాజకీయ పార్టీలకు ఎందుకు వస్తుంది? సమాధానం అంత కష్టం ఏమీ కాదు. ప్రజల ప్రయోజనాలు, పార్టీల (వెనుక ఉన్న పాలకవర్గాల) ప్రయోజనాలకు మధ్య తీవ్ర అంతరం ఉండడమే ఈ వైరుధ్య పరిస్ధితికి కారణం.
జనాన్ని రెచ్చగొట్టడం ద్వారానో, మాయ మాటలు చెప్పి నమ్మించడం ద్వారానో ఓట్లు నొల్లుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అదే జనం ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వ విధానాలను రూపొందించి అమలు చేసే బ్యాచ్ మరొకటి ఉంటుంది. తమ మధ్య వైరుధ్యం ఏదో ఒకటి ఉందని, అది ప్రజలకు సంబంధించినదేనని ఈ రెండు బ్యాచిలు ప్రజల ముందు ఫోజు పెడతాయి. లోతుకు వెళ్ళి పరిశీలిస్తే ఈ రెండు బ్యాచిలు తమకు అప్పజెప్పబడిన వివిధ పాత్రలను పోషిస్తున్నారని, వారిద్దరు ఒకే నాణేనికి బొమ్మా, బొరుసు లాంటి వారని అర్ధం అవుతుంది.
బి.జె.పి మొదటిసారి అధికారం చేపట్టిన కాలంలో వాజ్ పేయి సర్వసమ్మతి కలిగిన నాయకుడుగానూ, అద్వానీ తీవ్రవాద హిందూత్వ ప్రసంగాలతో జనాన్ని రెచ్చగొట్టే నాయకుడుగానూ ప్రజలకు కనిపించారు. అద్వానీ ద్వారా హిందూత్వ ఓట్లను ఆకర్షిస్తే, వాజ్ పేయి ద్వారా బి.జె.పిలో కూడా నెమ్మదిగా ఆలోచించే వారు ఉన్నారన్న భ్రమల్ని కలిగించారు. కానీ సరిగ్గా చూస్తే వాజ్ పేయి కూడా తీవ్రవాద ప్రసంగాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ రధయాత్ర ద్వారా మత కల్లోలాలు రెచ్చగొట్టి ఓటర్లను మత ప్రాతిపదికన చీల్చి లబ్ది పొందే పాత్రను అద్వానీ పోషించడమే మనకు ప్రధాన అంశంగా కనిపిస్తుంది. ఆ విధంగా వాజ్ పేయి సాఫ్ట్ హిందూత్వ లేదా మోడరేట్ హిందూత్వ పాత్ర పోషిస్తే అద్వానీ ఫైర్ బ్రాండ్ హిందూత్వ పాత్ర ధరించారు.
వాజ్ పేయి పదవీ కాలం పూర్తయింది. తదుపరి ప్రధాని అభ్యర్ధిగా అద్వానీ ప్రమోట్ అయ్యారు. కానీ ప్రధాని పదవి అభ్యర్ధికి తీవ్రవాద హిందూత్వ ముద్ర అనామోదనీయం. అది ప్రజలందరిని ఆకర్షించే ముద్ర కాదు. పైగా ప్రజల్ని విడదీసే ముద్ర. కనుక అద్వానీ సాఫ్ట్/మోడరేట్ హిందూత్వ పాత్రలోకి మారవలసి వచ్చింది. అందుకు ఆయన పాక్ వెళ్ళి జిన్నాను సెక్యులరిస్టుగా పొగిడారు. ఆ క్రమంలో ఆయన అదృశ్య లక్ష్మణ రేఖ దాటిపోయి మోడరేట్ కన్నా మించిన ఉదారవాదిగా బయటపడ్డారు. అది ఆయన లక్ష్యం కాదు, కానీ అదలా జరిగిపోయింది. అనగా అద్వానీ తన లక్ష్యిత ముద్ర పొందడంలో విఫలం అయ్యారు. ఫలితంగా సంఘ్ పరివార్ నుండే విమర్శలు తినవలసి వచ్చింది.
ఎలాగైతేనేం, అద్వానీ (అప్పటికి) ప్రధాని కావలసిందే కదా! ఆయన మోడరేట్ పాత్రలో దూరితే మరి తీవ్రవాద ముద్ర ఎవరిది? గుజరాత్ హింసాకాండ నేపధ్యంలో ఆ పాత్ర అనివార్యంగా మోడికి దక్కింది. హిందూత్వ కేడర్ ను ర్యాలీ చేయడంలో మోడి బహు బాగా విజయవంతం అయ్యారు. కానీ వారి లెక్క ఎక్కడో తప్పిపోయింది. మొదటిసారి అధికారం నిర్వహించడం వల్లనేమో ‘ఇండియా షైనింగ్’, ‘అంతా బాగుంది’ అంటూ ప్రజల అనుభవాలకు విరుద్ధమైన నినాదాలు ఇచ్చి అధికారం పోగొట్టుకుంది. దానితో అద్వానీ కల కలగానే మిగిలిపోయింది. ఈ లోపు అద్వానీని మించిన శిష్యుడుగా మోడి వృద్ధిలోకి వచ్చారు.
నరేంద్ర మోడి తన తీవ్ర ముద్రను వదిలించుకునేందుకు మూడేళ్ల ముందు నుండే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మత సామరస్యతా మిషన్ అన్నారు. ఏవేవో దీక్షలు చేశారు. ఓ వైపు పాత తీవ్ర ముద్రను మంద్ర స్ధాయిలో, లోపాయకారీగా కొనసాగిస్తూనే అభివృద్ధి పేరుతో, ఉద్యోగాల పేరుతో ఆమోదం సాధించినట్లు కనిపించడం మోడి ప్రత్యేకత! కాంగ్రెస్ పార్టీ సర్వ భ్రష్టం కావడం, మోడికి మట్టి అంటకుండా అవసరమైన చోట్ల, తీవ్ర ప్రసంగాలు పెద్దగా లేకుండానే మత విద్వేషాలు రెచ్చగొట్టగల సన్నిహిత నేత ‘అమిత్ షా’ రూపంలో లభించడం మోడికి కలిసి వచ్చింది. ఆ విధంగా మోడి మోడరేట్ పాత్రలోకి చొరబడిపోయారు.
కానీ గత నాయకుల వలె నరేంద్ర మోడి తదుపరి స్ధాయి నాయకత్వాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి కాదని, సర్వం తానే అయి షో నడిపించడం ఆయన లక్షణం అని విమర్శకులు చెప్పేమాట! అందువల్ల ప్రత్యామ్నాయ తీవ్ర ముద్ర పోషించగల సమాన నేత ప్రస్తుతం బి.జె.పిలో లేనట్లు కనిపిస్తోంది. చాప కింద నీరులా పని చేయడం అమిత్ షా పద్ధతి. కనుక ఆయన ప్రత్యామ్నాయ నేతగా గుర్తింపు పొందలేరు. అలాగని తీవ్ర ముద్రలు లేకపోతే పునాది కదిలిపోవచ్చు. ఈ పరిస్ధితుల్లో ఛోటా మోటా నాయకులకు మహదావకాశం లభిస్తోంది. వారు ఎంత మాటయినా అనగలరు. అని కూడా మోడి/పెద్దల మందలింపును సహించగలరు. తమ తీవ్రవాద ప్రవచనాల వల్ల ఎదురయ్యే వ్యతిరేకత నుండి రక్షణ కల్పించే బాధ్యతను ఎలాగూ పెద్దలు చేపడతారు. వారు మాత్రం ఎప్పటికీ ప్రత్యామ్నాయ నేతలు కాలేరు. వారు కేవలం హిందూత్వ దీపాన్ని నిత్య నూతనంగా వెలిగించే చమురు మాత్రమే తప్ప వెలుతురు మాత్రం కాబోరు.
ప్రస్తుతం దేశంలో పాలకవర్గాలకు అవసరం పడిన ఆర్ధిక విధానాల అవసరం కూడా అందుకు అనుగుణంగానే ఏర్పడి ఉంది. వారికి ఇప్పుడు ఒక నియంత లాంటి నేత కావాలి. ఆయన నేతృత్వంలో వేగంగా ఆర్ధిక సంస్కరణలు అమలు కావాలి. సంస్కరణలకు వచ్చే వ్యతిరేకతను ఉక్కు పాదంతో అణచివేయాలి. ఎక్కడా కూడా చివరికి సొంత శిబిరంలో కూడా ప్రత్యామ్నాయ స్వరం వినిపించకూడదు!
బి.జె.పి పార్టీ యొక్క బాహ్య,అంతర్గత లక్షణాలుగూర్చి వివరణ వాస్తవాలను వెల్లడిచేస్తున్నాయి!
బ్యూరొక్రసీ గూర్చి ఇటువంటి విమర్షణాత్మకమైన వివరణ ఆశిస్తున్నాను!-వీలైతే ఇవ్వగలరు?