కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఉప మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఢిల్లీలో ఒక బహిరంగ సభలో మత మైనారిటీలను ఉద్దేశిస్తూ వారు అక్రమ సంతానం అంటూ చేసిన వ్యాఖ్యలు మత విద్వేషంతో కూడినవి, రెచ్చగొట్టేవి మరియు ఒక ఉన్నత ప్రభుత్వ కార్యాలయానికి అధిపతిగా ఉన్న వ్యక్తికి తగనివి. ఆమె చెప్పిన క్షమాపణలు బలహీనంగా వ్యక్తం అయ్యాయి. బహిరంగ ప్రకటనలు చేసేప్పుడు నడవడిక కోల్పోవద్దని, జాగ్రత్తగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి భారతీయ జనతా పార్టీ ఎం.పిలకు సలహా ఇచ్చిన నేపధ్యంలో ఒత్తిడికి గురై చెప్పిన క్షమాపణలు మాత్రమేనని స్పష్టం అయింది. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవడంతో పాటు విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పినప్పటికీ, మంత్రి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేయడంలో ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండడంతో, అవేవీ బి.జె.పిని అవమానకర ఇబ్బందినుండి బైటపడవేయలేకపోయాయి.
అరుణ్ జైట్లీతో సహా పలువురు సీనియర్ మంత్రులు వేగంగా స్పందించి సాధ్వి వ్యాఖ్యలను ఖండించినప్పటికీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. క్షమాపణ అర్ధవంతంగా ఉన్నట్లయితే అది, గాయపరుస్తూ చేసిన వ్యాఖ్యలు పధ భ్రష్టమై చేసినవన్న తెలివిడిని స్పష్టంగా వ్యక్తం చేయాలి. కానీ ఆమె ప్రసంగం యొక్క సందర్భాన్ని పరిశీలిస్తే ఆ వ్యాఖ్యలు ఏదో యధాలాపంగా చేసినవో లేదా ఎన్నికల వేడిలో చేసినవో కావని స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర మంత్రివర్గంలోకి గత నెలలోనే చేరిన సాధ్వి ఆ ఉబ్బితబ్బిబ్బులో ఉన్నత పదవితో పాటు వచ్చి చేరే బాధ్యతలు, అంచనాలను విస్మరించినట్లు కనిపిస్తోంది. మతవిద్వేష పూరిత ప్రసంగం చేస్తున్నప్పుడు ఆమె తాను ఏమి మాట్లాడుతున్నారో, ఎవరిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడారన్నది స్పష్టమే. క్షమాపణ చేప్పాలని ఆమెను కోరవలసిన అవసరం రావడమే ఆమెకు తన వ్యాఖ్యల పట్ల ఎలాంటి విచారమూ లేదని సూచిస్తోంది.
సాధ్వి ఎంపిక చేసుకున్న మాటలు ప్రధాన మంత్రికి నిజంగా దిగ్భ్రాంతిని కలిగించినట్లయితే ఆ సంగతిని సాధారణ మందలింపు వెనుక దాచి ఉంచేబదులు స్పష్టంగా బహిరంగంగా వ్యక్తం చేసి ఉండాల్సింది. పనికిమాలిన చేష్టలు పనికిరావన్న సందేశాన్ని తన మంత్రులు, ఎం.పిల చెంతకి చేర్చాలని భావిస్తే ఆయన తీసుకోవలసిన సరైన చర్య నిరంజన్ జ్యోతిని మంత్రివర్గం నుండి తొలగించడం. చర్య చేసినవారిని వదిలేసి చర్యలను మాత్రమే విమర్శించడం వల్ల ప్రయోజనం ఉండదు. నిజానికి ఆమె రాజీనామాను డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాల డిమాండ్ ల నుండి దృష్టి మరల్చేందుకే క్షమాపణ చెప్పినట్లు కనిపిస్తోంది.
నిరంజన్ జ్యోతి తన మంత్రిత్వ శాఖకు ప్రత్యేకంగా తెచ్చిపెడుతున్న నైపుణ్యం ఏమీ లేదు. ఆమెను మంత్రివర్గం నుండి తప్పించడానికి మొండిగా నిరాకరించడం ద్వారా తన విద్వేషపూరిత వ్యాఖ్యలను ఏ కరుడుగట్టిన హిందూత్వ అభిమానులను ఉద్దేశించి ఆమె చేశారో వారికి మరింత ప్రోత్సాహాన్ని మోడి ఇస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ… కాంగ్రెస్, వామపక్షాలు, సమాజ్ వాదీ పార్టీ, ఆర్.జె.డి, త్రిణమూల్.. ఇలా అన్నీ పార్టీలు ఐక్యమై ఉమ్మడి లక్ష్యాన్ని వ్యక్తం చేయడం నుండి బి.జె.పి సాధ్విని మంత్రిగా తప్పించడం కంటే కొనసాగించడం వల్లనే ఎక్కువగా కోల్పోవలసి ఉంటుందని బి.జె.పి గ్రహించాలి. ప్రధాన మంత్రి గానీ ఆయన పార్టీ గానీ సాధ్వి వ్యాఖ్యలనుండి దూరంగా ఉన్నామని చెప్పేందుకు అత్యంత మెరుగైన మార్గం ఇక ఏ మాత్రం ఆలస్యం కాకుండా ఆమెను పదవి నుండి తప్పించడం. పార్టీ విధేయత కంటే మర్యాదే పై చేయి సాధిస్తుందని స్పష్టం చేయవలసిన సమయమిది.
(ఇటీవల కాలంలో ది హిందు నుండి వెలువడిన మెరుగైన సంపాదకీయం ఇది. ఒక అంశాన్ని గమనించాలి. అప్రధానమైన రాజకీయ, సామాజిక అంశాల్లో మునుపటి వాడిని కనబరుస్తున్న ది హిందు అత్యంత ప్రధానమైన ఆర్ధిక విధానాల విషయంలో మాత్రం ప్రవాహంలో పడి కొట్టుకుపోతోంది. చూడబోతే పత్రిక యాజమాన్యంలో లేదా సంపాదక వర్గంలో రెండు ధోరణులు ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకటి వ్యాపార ప్రయోజనాలను ప్రధానంగా ఎంచుతుంటే మరొక గ్రూపు గత కాలపు ప్రగతిశీల వైభవాన్ని నిలుపుకోవాలని తాపత్రయపడుతున్నట్లుగా అనిపిస్తోంది. అభివృద్ధి నిరోధకర ఆర్ధిక విధానాలకు మద్దతు వస్తూ, ఆ విధానాలకు ఆలంబనగా అభివృద్ధి చెందుతున్న మతదురహంకార అణచివేత ధోరణులను మాత్రం సాహసోపేతంగా ఖండిస్తున్నట్లుగా కనిపించడం వల్ల ఇలా అనవలసివస్తోంది. -విశేఖర్)
బహిరంగ రహస్యమే గా! హిడన్ ఎజెండా ఒక్కొక్కటే బయటికి వస్తుంది ఈ అయిదేళ్లలో పూర్తిగా బయట పడవచ్చు!