పశ్చిమ బెంగాల్ లో ఒక దశలో ఎదురు లేనట్లు కనిపించిన తృణ మూల్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వరుస ఇక్కట్లు ఎదుర్కొంటోంది.
శారద చిట్ ఫండ్ కుంభకోణం మమత బెనర్జీ మెడకు భారీ గుదిబండగా మారిపోయింది. బర్ద్వాన్ పేలుళ్లు చేయించింది టి.ఎం.సి పార్టీయే అన్నట్లుగా బి.జె.పి అధ్యక్షుడు ప్రచారం చేస్తున్నారు. శారదా చిట్ ఫండ్ డబ్బు బర్ద్వాన్ పేలుళ్లకు ఉపయోగించారని, శారదా చిట్ ఫండ్ కుంభకోణం దోషులను టి.ఎం.సి కాపాడుతోందని ఒక ర్యాలీలో మాట్లాడుతూ బి.జె.పి అమిత్ షా ఆరోపించారు.
అయితే అది మా అభిప్రాయం కాదని కేంద్ర ప్రభుత్వం రాజ్య సభలో ప్రకటించడంతో అమిత్ షా ఆరోపణల్లో పస ఏమిటో తేటతెల్లం అయింది. సహారా గ్రూపు కంపెనీ అధినేతకు అమిత్ షా కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ టి.ఎం.సి పార్టీ పార్లమెంటు వద్ద ఆందోళనకు దిగడం గమనార్హం.
శారదా చిట్ ఫండ్ కుంభకోణం డబ్బులు బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడి నుండి ఫైనాన్సింగ్ రూపంలో బర్ద్వాన్ పేలుళ్లకు ఉపయోగపడ్డాయన్నది అమిత్ షా ఆరోపణ. కానీ తమ పరిశోధనలో ఇప్పటివరకు ఆ రెండింటి మధ్య సంబంధం ఉన్నట్లు ఆధారాలు లభించలేదని కేంద్ర ప్రభుత్వం రాజ్య సభలో ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్ధలకే ఆధారాలు లభ్యం కాకుండా అమిత్ షా ఎలా ప్రకటిస్తారు?
ముందు కాస్త బురద జల్లేస్తే అవతలి వాడు కడుక్కునే పనిలో పడిపోతారు. ఈ లోపు మనకు కావలసిన పని చక్కా పూర్తి చేసుకోవచ్చు. ఇదే బి.జె.పి అధినేత వ్యూహంగా కనిపిస్తోంది.
బి.జె.పి పార్టీకి లభించిన ఆధునిక చాణక్యుడుగా ప్రశంసలు అందుకుంటున్న అమిత్ షా వ్యూహ ఫలితం వల్లనే ‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి మునుపు ఇప్పటికీ మూడు చోట్ల మతకల్లోలాలు చెలరేగాయ’ని పార్లమెంటులో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్, బీహార్ లలో బి.జె.,పి స్వీప్ కు దారి తీసిన ముజఫర్ నగర్ అల్లర్ల లాగానే ఢిల్లీలోను ఫలితాలు రాబట్టాలని బి.జె.పి ప్రయత్నిస్తోందని వారి ఆరోపణ.
బెంగాల్ లో మత కల్లోలాలకు బదులు టి.ఎం.సి తప్పులపై ఆధారపడాలని బి.జె.పి భావిస్తోందని అమిత్ షా మాటలను బట్టి అర్ధం అవుతోంది. బర్ద్వాన్ పేలుళ్లు, బంగ్లా దేశ్ కనెక్షన్, శారదా కుంభకోణం ఈ మూడింటిని సంయుక్తంగా ప్రయోగిస్తూ ఫలితం రాబట్టే వ్యూహాన్ని ఆయన రచించారని కార్టూన్ సూచిస్తోంది.