160 సభ్య దేశాల ప్రపంచ వాణిజ్య సంస్ధ (WTO) కు చెందిన జనరల్ కౌన్సిల్ గత వారం స్ధాపించబడ్డ 20 యేళ్ల కాలంలోనే మొట్టమొదటి అతి పెద్ద ప్రపంచ స్ధాయి ఒప్పందం ఆమోదించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఆహార నిల్వల సమస్య పరిష్కారం అయ్యేవరకూ వాణిజ్య వసతీకరణ ఒప్పందంపై సంతకం చేసేది లేదని నిరాకరిస్తూ న్యూ ఢిల్లీ కాలు అడ్డం పెట్టడంతో డబ్ల్యూ.టి.ఓ ప్రతిష్టంభన ఎదుర్కొంది. తత్ఫలితంగా ఉత్తన్నమైన జఠిల సమస్య వల్ల డబ్ల్యూ.టి.ఓ భవిష్యత్తే ప్రశ్నార్ధకం అయిన పరిస్ధితి ఏర్పడింది. డబ్ల్యూ.టి.ఓ వైఫల్యం వల్ల ఎదురయ్యే వినాశకర పరిణామాలను పసిగట్టిన అమెరికా వేగంగా స్పందిస్తూ ఇండియాతో ద్వైపాక్షిక చర్చల్లోకి వెళ్లింది. వివాదాస్పద సమస్యకు సంబంధించి ఇరు పక్షాలు ఒక పరిష్కారానికి రావడంతో డబ్ల్యూ.టి.ఓ తన మొట్టమొదటి ఒప్పందంపై సంతకం చేసేందుకు అడ్డంకులు తొలగిపోయాయి.
ప్రజా ఆహార నిల్వల సమస్య చుట్టూ రక్షణ వలయం నిర్మించడంతో బహుళపక్ష వాణిజ్య వ్యవస్ధ పట్ల సభ్య దేశాల నిబద్ధతను ఖాయం చేసినట్లయింది. బాలి ఒప్పందం తమ ఆహార భద్రతా విధానాలను ప్రమాదంలో పడవేస్తుందని ఇండియా తదితర దేశాలు భావించాయి. (ఆహార) భద్రతా కారణాల రీత్యా ప్రజా ఆహార నిల్వలను కొనసాగించే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే వరకు కొనసాగే చర్చలను ఇతర సమస్యలపై జరిగే చర్చల ఫలితాల నుండి స్వతంత్రంగా ఉంచేందుకు డబ్ల్యూ.టి.ఓ జనరల్ కౌన్సిల్ ఇప్పుడు అంగీకరించింది. శాశ్వత పరిష్కారం దొరికేవరకూ బాలీ ఒప్పందంలో అంగీకరించిన పీస్ క్లాజ్ ను అమలులో కొనసాగించేందుకు కూడా అంగీకారం కుదిరింది. భారత దేశ అభ్యంతరాలను (ఈ) ఒప్పందం స్పష్టంగా పరిగణించింది.
సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు అంతిమ గడువును డిసెంబర్ 2015 గా డబ్ల్యూ.టి.ఓ తనకు తానే ముందుకు జరుపుకుంది. ఈ కఠినమైన గడువు విధింపు సమస్యను నిరంతరాయంగా సాగదీయకుండా చేయాలన్న తీవ్రస్ధాయి నిబద్ధతను ప్రతిబింబిస్తోంది. ఒక విధంగా చూస్తే వాణిజ్యాన్ని వక్రగతి పట్టించే ఆహార సబ్సిడీలు కేంద్ర సమస్యగా కొనసాగుతుందన్న హామీని అభివృద్ధి చెందిన ప్రపంచానికి కూడా ఇది కల్పిస్తోంది. మూల నిర్ణయ సవరణ (Protocol of Amendment) కు జనరల్ కౌన్సిల్ ఆమోదం తెలపడంతో ‘వాణిజ్య వసతీకరణ ఒప్పందం అమలు చేసే ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభం అయింది. ముఖ్యంగా, వాణిజ్య మౌలిక నిర్మాణాలను ఆధునీకరించేందుకు, ప్రపంచ వాణిజ్యాన్ని సులభతరం చేసే నియంత్రణల సడలింపును వేగిరం చేసేందుకు దీనిని ఉద్దేశించారు.
దోహా రౌండ్ చర్చలు ప్రారంభం అయినప్పటి నుండి, విభిన్న ప్రయోజనాల కూటములు కొలువై ఉన్న నేపధ్యంలో డబ్ల్యూ.టి.ఓ తన ప్రాసంగికత కోసం కొట్టుమిట్టాడుతోంది. కోతకు గురై తక్కువ లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పటికీ ప్రక్రియల పరంగా ప్రాధాన్యత కలిగిన వాణిజ్య వసతీకరణ ఒప్పందం ద్వారా తన ప్రతిష్టకు పునర్వైభవం సాధించుకోవచ్చని అది ఆశిస్తోంది. ప్రజా ఆహార నిల్వల సమస్య డబ్ల్యూ.టి.ఓ సంబరాన్ని దాదాపు చెరుపునకు గురయింది. కానీ ఇప్పుడు బాలిని మళ్ళీ మొదలుపెట్టనవసరం లేదు. గుర్తించదగిన విషయం ఏమిటంటే, బాలి మంత్రివర్గ నిర్ణయాలను అమలు చేసేందుకు కావలసిన వర్క్ ప్రోగ్రాంపై జులై 2015 లోపు అంగీకారానికి రావాలని డబ్ల్యూ.టి.ఓ జనరల్ కౌన్సిల్ తనకు తాను గడువు విధించుకుంది.
ఈ చారిత్రక ఒప్పందం వివేచనాపూరిత రాజీని ఆవిష్కృతం చేసినట్లయితే గనక, బహుళపక్ష వాణిజ్య వ్యవస్ధను శక్తివంతం కావించే వైపుగా పని చేసేందుకు సభ్య దేశాలలో ఉన్న ఆతృతను కూడా తెలియజేస్తోంది. బాలి నిర్ణయాలకు అనుగుణంగా ఫలితాలను వెలువరించేందుకు అవసరమైన దారులు, సాధనాలు కనుగొనేందుకు ఈ ఒప్పందం సభ్య దేశాలను తప్పనిసరిగా పురిగొల్పి తీరాలి. అయితే, మొండి ప్రశ్న ఏమంటే: దౌహా రౌండ్ ఉద్దేశించినట్లుగా వాణిజ్యంలోని మరింత సున్నిత అంశాలలో సైతం సరళీకరణ చేపట్టేందుకు తగిన ధైర్యాన్ని ఈ ఒప్పందం డబ్ల్యూ.టి.ఓ కు కల్పిస్తుందా?
(వాణిజ్య వసతీకరణ ఒప్పందాన్ని దొడ్డిదారిని రంగం మీదికి తెచ్చేందుకు అమెరికా ఇండియాను ఒప్పించింది. ఈ సంపాదకీయంలో మనం తెలుసుకోవాల్సిన అంశం ఇదొక్కటే. మిగిలిన భాగం అంతా ఒప్పందానికి మద్దతు సమకూర్చిపెట్టేందుకు సంపాదకులు పడ్డ ప్రయాసే తప్ప మరొకటి కాదు. వాణిజ్య వసతీకరణ ఒప్పందం వల్ల స్వర్గంలో సగభాగం దిగివస్తుందని, దోహా రౌండ్ చర్చలను పూర్తిగా ఆమోదిస్తే ఆ మిగిలిన సగం స్వర్గం కూడా దిగినట్లే అనీ ఈ సంపాదకీయం గొప్ప భ్రమలు కలిగిస్తోంది. ఈ అవగాహనతో నాకు ఏకీభావం లేకపోగా ఏహ్యభావం మాత్రం ఉంది.
ఎందుకంటే TFA (Trade Facilitation Agreement) వల్ల స్వర్గం దిగి రావడం ఖాయమే గాని అది ప్రజలకు ఉపయోగపడే స్వర్గం కాదు. కేవలం ధనికవర్గాలు స్వేచ్ఛగా, నిర్లజ్జగా అశేష శ్రామిక ప్రజలను మరిన్ని కడగళ్లకు గురిచేస్తూ అనుభవించగల స్వర్గం మాత్రమే. ఇలాంటి పచ్చి ప్రజావ్యతిరేక ఒప్పందాన్ని దొడ్డిదారిని ఆమోదించేందుకు మనవాళ్లు సహకరించిన చర్యను నెత్తిన పెట్టుకుని మోయడమే కాకుండా దోహా రౌండ్ ప్రకారం అత్యంత సున్నితమైన అంశాల్లో కూడా సరళీకరణ చేసేయాలని ప్రబోధిస్తున్న ఇంతటి నాసిరకపు సంపాదకీయం ది హిందు నుండి వెలువడడమే అత్యంత బాధాకరం.
పాపము ఉపశమించుగాక! తధాస్తు దేవతలు భూగ్రహంపై ముఖ్యంగా బాలిపై విహరించకుండుగాక! ప్చ్, ఏం లాభం? శాపనార్ధాలు, ఆశీర్వాదాలు పని చేసే కాలం కాదుగదా!!!
-విశేఖర్)