ఇటీవల జరిగిన సార్క్ సమావేశాలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసిపోయాయి. ప్రాంతీయ సమగ్రత, ఐక్యతల కోసం అని చెబుతూ ఏర్పాటు చేసిన సార్క్ కూటమి సభ్య దేశాలు నిరంతరం ఒకరినొకరు తిట్టిపోసుకోవడంతోనే కాలం గడిపాయి తప్ప లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నట్లు ఏనాడూ కనిపించలేదు.
తన ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల సారధులను ఆహ్వానించి ఆశలను చిగురింపజేసిన నరేంద్ర మోడి తీరా అసలు సార్క్ సమావేశాలకు వచ్చేసరికి తుస్సు మానిపించారు. సార్క్ లో ఇండియా, పాకిస్తాన్ లే అతి పెద్ద దేశాలు. పాక్ ప్రధాని నవాజ్ వేదికపైకి వస్తుండగా భారత ప్రధాని కనీసం ఆయనవైపు చూడకపోవడం ఆశావాహులను నిరుత్సాహపరిచింది.
ఉత్తుత్తి ప్రసంగాలతో సాగుతూ పోయిన సార్క్ సమావేశాలు చివరికి ఎటువంటి సంయుక్త ప్రకటన లేకుండానే ముగిసే ప్రమాదం ముంచుకొచ్చింది. దానితో ఆతిధ్య దేశం నేపాల్ ఎలాగో సర్ది చెప్పి ఇండియా, పాకిస్ధాన్ అధిపతులు పరస్పరం షేక్ హ్యాండ్ ఇచ్చుకునేందుకు ప్రోత్సహించాక గాని కాస్త ఫర్వాలేదనిపించే ఒప్పందాలు ఏవో రెండు మూడు ప్రకటించారు.
గడ్డ కట్టుకుపోయిన ఇండియా-పాక్ సంబంధాలను షేక్ హ్యాండ్ ద్వారా కరిగింపజేశారు అని ఈ కార్టూన్ సూచిస్తోంది. ఈ షేక్ హ్యాండ్ ఫలితం శాశ్వత స్వభావం కలిగినదేమీ కాదు. అది కేవలం face saving exercise మాత్రమే. సంఘ్ పరివార్ ఒత్తిడి వల్లనో, లేక పాత రోజులు గుర్తుకు రావడం వల్లనో సరిహద్దు చొరబాట్లు సాకు చూపుతూ పాక్ తో సంబంధాలకు/చర్చలకు ఇండియా ససేమిరా అంటోంది.
ఇక ఇది ఇంతే.