జాతివివక్ష: ఆందోళనల సుడిలో అమెరికా -ఫోటోలు


ఫెర్గూసన్ పోలీసు కాల్పుల్లో నల్ల జాతి యువకుడిని కాల్చి చంపిన కేసులో నిందితుడైన తెల్లజాతి పోలీసుపై ఎలాంటి కేసు నమోదు చేయకూడదని గ్రాండ్ జ్యూరీ నిర్ణయించింది. తెల్లజాతి సభ్యులే 75 శాతం స్ధానాల్ని ఆక్రమించి ఉండే గ్రాండ్ జ్యూరీ తెల్లజాతి పోలీసుకు అనుకూలంగా వ్యవహరించిందని అమెరికా ప్రజలు భావిస్తున్నారు. ఫలితంగా గ్యాండ్ జ్యూరీ తీర్పుకు వ్యతిరేకంగా అమెరికా అంతటా మరోసారి ఆందోళనలు మిన్నంటాయి. నల్లజాతి అధ్యక్షుడు ఉన్నంత మాత్రాన ప్రభుత్వ యంత్రాంగం వివక్షా రహితంగా వ్యవహరించబోదని ఫెర్గూసన్ గ్రాండ్ జ్యూరీ వ్యవహారం రుజువు చేస్తోంది.

ఈ సంవత్సరం ఆగస్టు 9 తేదీన తెల్లజాతి పోలీసు అధికారి ఒకరు ఉట్టి పుణ్యానికి 18 యేళ్ళ నల్లజాతి యువకుడు మైఖేల్ బ్రౌన్ ను కాల్చి జరిపి చంపాడు. కాల్పులు జరపడానికి ఎలాంటి కారణము లేదు. కాల్పులు జరిపిన సమయంలో నిజానికి మైఖేల్ బ్రౌన్ మోకాళ్లపై నిలబడి చేతులు పైకెత్తి కాల్పులు జరపవద్దని సూచిస్తూ వంగుతూ ఉన్నప్పటికీ పోలీసు అధికారి విచక్షణారహితంగా అనేక మార్లు కాల్పులు జరిపి బ్రౌన్ ప్రాణం తీసేశాడు.

ఈ ఘటనకు నిరసనగా అప్పుడే అమెరికా వ్యాపితంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. పోలీసులతో ప్రజలు వీధి యుద్ధాలు చేశారు. వ్యాపార సంస్ధలపై దాడులు చేశారు. నల్లజాతి-తెల్లజాతి ఘర్షణగా పశ్చిమ పత్రికలు కాల్పుల ఘటనను, అనంతర నిరసనలను వ్యాఖ్యానించినప్పటికి నిరసనల్లో అనేకమంది తెల్లజాతి పౌరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య సంస్ధాపకునిగా, ప్రజాస్వామ్యం ఛాంపియన్ గా చెప్పుకుంటూనే నానాటికీ పోలీసు రాజ్యంగా అవతరిస్తున్న అమెరికా రాజ్యం పట్ల అక్కడి పౌరులలో తీవ్ర అసంతృపి నెలకొని ఉన్నదనడానికి మైఖేల్ బ్రౌన్ హత్యకు వ్యతిరేకంగా చెలరేగిన నిరసనలు తెలియజేశాయి.

మైఖేల్ బ్రౌన్ పై కాల్పులు జరిపిన తెల్లజాతి పోలీసు డారెన్ విల్సన్ పై కేసు నమోదు చేయాలా లేదా అన్న అంశాన్ని (కాల్పులు జరిపి హత్య చేయడం సరైందా కాదా అన్న అంశంపై కాదు) పరిశీలించడానికి గ్రాండ్ జ్యూరీని మిస్సోరీ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఫెర్గూసన్ లో ప్రజలు 75 శాతం మంది నల్లజాతి పౌరులే. అయినప్పటికీ అక్కడి పోలీసుల్లో 90 శాతం మంది తెల్లజాతివారే. గ్రాండ్ జ్యూరిలో సైతం 75 శాతం తెల్లజాతివారే ఉన్నట్లు పత్రికలు నివేదించాయి. ఈ నేపధ్యంలో మైఖేల్ బ్రౌన్ కుటుంబం ఆశించిన న్యాయం లభిస్తుందని నమ్మినవారు తక్కువ మందే.

మైఖేల్ బ్రౌన్ హత్య అమెరికాలో ఒంటరిగా జరిగిన ఘటన కాదు. బ్రౌన్ హత్యకు ముందూ తర్వాతా కూడా నల్లజాతి బాధితుడు – తెల్లజాతి పోలీసు ఇమిడి ఉన్న ఘటనలు జరిగాయి. దాదాపు అన్నీ కేసుల్లోనూ పోలీసులు విచారణ లేకుండానో, శిక్ష పడకుండానో తప్పించుకోగలిగారు. బ్రౌన్ హత్య విచారణా కాలంలోనూ ఇతర అనేక చోట్ల పోలీసు దాష్టీకాన్ని వెల్లడించే హత్యలు, ఘర్షణలు జరిగాయి. వారానికి కనీసం ఇద్దరు ముగ్గురయినా అమెరికా పోలీసుల చేతుల్లో మరణిస్తున్నారని కొన్ని సంస్ధలు తెలియజేశాయి.

పోలీసు అధికారి విల్సన్ కు వ్యతిరేకంగా ఎలాంటి అభియోగాలు మోపరాదని సోమవారం (నవంబర్ 24) గ్రాండ్ జ్యూరీ చేసిన నిర్ణయం అన్యాయం అని అమెరికా ప్రజలు భావిస్తున్నారని అమెరికా అంతటా చెలరేగిన ఆందోళనలు తెలియజెప్పాయి. అమెరికా వ్యాపితంగా డజన్ల కొద్దీ నగరాల్లో ఇప్పటికీ ఆందోళనలు జరుగుతున్నాయి. తీర్పు వెలువడిన రోజు వివిధ చోట్ల, ముఖ్యంగా మిస్సోరీలో హింసాత్మక నిరసనలు ప్రజ్వరిల్లాయి. ఆందోళనకారులు కొన్ని చోట్ల పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసు కార్లకు నిప్పు పెట్టారు. షాపులు సైతం ధ్వంసం చేశారు.

మరుసటి రోజు కూడా నిరసనలు కొనసాగాయి. ఈసారి మరిన్ని నగరాలకు ఆందోళనలు వ్యాపించాయి. బోస్టన్, బాల్టిమోర్, వాషింగ్టన్, న్యూయార్క్ లాంటి ప్రధాన నగరాల్లో నిరసనకారులు వీధులను దిగ్బంధనం కావించారు. వాహనాలు తిరగకుండా అడ్డుకున్నారు. భారీ ర్యాలీలు నిర్వహించారు. లాస్ ఏంజలీస్ నగరంలో హైవే రోడ్లపై ట్రాఫిక్ ను అడ్డుకున్నారు. అనేక చోట్ల పోలీసులు నిరసనల అణచివేతకు పాల్పడ్డారు. పోర్ట్ లాండ్ తదితర నగరాల్లో పెప్పర్ స్ప్రే జల్లి నిరసన అడ్డుకునే ప్రయత్నం చేశారు. పదుల సంఖ్యలో అరెస్టులు చేశారు. చికాగోలో మేయర్ ఆఫీసు బైట ధర్నా నిర్వహించిన 100 మందికి పైగా నిరసనకారులను అరెస్టు చేశారు. అమెరికాలో ప్రతి 28 గంటలకు ఒకసారి ఒక బ్లాక్ వ్యక్తిని పోలీసులు చంపుతున్నారని ఒక అధ్యయనంలో తేలిందని, ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ 28 గంటల ధర్నాకు పూనుకున్నామని ఆందోళనకారులు తెలిపారు.

సంక్షోభ పరిస్ధితులు తీవ్రం అవుతున్న నేపధ్యంలో ప్రజాందోళనలను అంచనా వేస్తూ కొద్ది సంవత్సరాలుగా అమెరికా ప్రభుత్వాలు పోలీసులకు మిలట్రీ తరహా శిక్షణ ఇస్తున్నారు. మిలట్రీకి ఇచ్చే ఆయుధాలను పోలిసులకు ఇస్తున్నారు. కాల్పులు జరిపి హత్య చేసే పోలీసులకు మద్దతుగా అనేక చట్టాలను ఆమోదించారు. ఈ నేపధ్యంలో పోలీసులను నిరాయుధులను చేయాలని పలుచోట్ల నిరసనకారులు డిమాండ్ చేశారు. జాతి వివక్షాయుత ఉగ్రవాదాన్ని పోలీసులు విడనాడాలని డిమాండ్ చేశారు. పిట్స్ బర్గ్ లో ఈ డిమాండ్లతో ప్రజలు ప్రదర్శనలు నిర్వహించారు. అట్లాంటా నగరంలో కాలేజీ విద్యార్ధులు తమ క్యాంపస్ నుండి వాకౌట్ చేసి సి.ఎన్.ఎన్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. మినియాపులిస్ లో కారు ఒకటి ప్రదర్శనకారులపై దూసుకెళ్లడంతో పలువురు గాయపడ్డారు.

కార్పొరేట్ పత్రికలు నిరసనకారులు పాల్పడిన విధ్వంసక చర్యలపై కేంద్రీకరించాయి తప్ప పోలీసుల దాష్టీకం గురించి ఒక్క విమర్శా చేయలేదు. రాజ్యం సైనికులు, పోలీసుల సహాయంతో చిత్తానుసారం హత్యలకు, విధ్వంసాలకు, ప్రజలను టెర్రరైజ్ చేసి అనుకున్నది చేసుకుపోవడానికి పూనుకుంటున్నప్పుడు వాటికి లేని అభ్యంతరం ప్రజల న్యాయమైన ఆగ్రహావేశాలకే ఎప్పుడూ వస్తుంది. చివరికి బాధితుల కుటుంబాలు కూడా శాంతియుతంగా నిరసనలు చేయాలని పిలుపు ఇవ్వడం, హింసను ఆమోదించేది లేదని గొప్పలు పోవడం తరచుగా జరుగుతోంది.

ఈ గొప్పలు, శాంతి బోధనలు అంతిమ పరిశీలనలో రాజ్యహింసకు మద్దతుగా తేలుతున్నాయే తప్ప రాజ్యహింసను ఎదుర్కొనేదిగా తేలడం లేదని వారు గ్రహించాలి. చట్టాలను అతిక్రమిస్తూ, అవతలి వ్యక్తిని చంపకుండానే నిరోధించగల పరిస్ధితుల్లోనూ హత్యలు చేసే పోలీసుల హింసకు లేని అభ్యంతరం హింసకు ప్రతిస్పందించే ప్రజల హింసకు మాత్రమే ఎందుకు వస్తుంది? పోలీసులకు, సైనిక బలగాలకు వర్తించని శాంతి బోధలు రాజ్య హింసను నిరసించే జనానికే ఎందుకు వర్తిస్తుంది?

వ్యాపార సంస్ధలపై దాడి చేసి దోచుకుంటే అది నిరసన ఎలా అవుతుంది? అని కొందరు ప్రశ్నించబోతారు? పైకి చూసేందుకు ఇది సవ్యమైన అనుమానంగానే తోస్తుంది. కానీ దోపిడీ సమాజాల్లో, ముఖ్యంగా పెట్టుబడిదారీ సమాజాల్లో వ్యక్తిగత ఆస్తులకు ఉండే విలువ మనుషుల ప్రాణాలకు ఉండదు. ఏమి చేసయినా ప్రైవేటు ఆస్తులు పోగేసుకోవచ్చు, ఎన్ని మోసాలు చేసయినా, చివరికి చట్టాలను ఉల్లంఘించి అయినాసరే ప్రైవేటు ఆస్తులను సంపాదించవచ్చు. ఆస్తులు ఏ విధంగా సమకూర్చుకున్నా ఆ ఆస్తులకు ఎనలేని పవిత్రత, భద్రత, సంరక్షణ ఉంటాయి. కానీ అత్యంత విలువైన మనిషి ప్రాణానికి మాత్రం విలువ ఉండదు. ఎంతమందిని చంపయినా సరే ఆస్తుల రక్షణకు పెట్టుబడిదారీ సమాజం కట్టుబడి ఉంటుంది.

ఈ అవగాహనలో భాగంగానే పోలీసు అధికారి ఒకరు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటే పని చేయని చట్టాలు, ఆ హత్యకు వ్యతిరేకంగా, నిరసనగా జరిగే ఆస్తుల విధ్వంసాలకు వచ్చేసరికి చురుకుగా, వేగంగా పని చేస్తాయి. అనేక మూలల నుండి ఆందోళనకారుల విధ్వంసక చర్యలపై ఖండన మండనలు, నీతి బోధనలు, ఆహింసాత్మక ఆందోళనల ఆవశ్యకతలు, శాంతియుత వ్యక్తీకరణల అగత్యాలు రంగంలోకి దిగుతాయి. పత్రికల నిండా, ఛానెళ్ల నిండా రొదపెడుతూ శబ్ద కాలుష్యాన్ని అక్షర కాలుష్యాన్ని జనం మీదికి వదులుతాయి.

అంతిమంగా రాజ్యహింస చేసిన చట్టవ్యతిరేక హత్య చట్టబద్ధం అయిపోతుంది. అలా చట్టబద్ధం అయిపోవడానికి తగిన సాక్ష్యాలు మాత్రమే జ్యూరీల ముందు ప్రవేశపెట్టబడతాయి. ఆ రాజ్యహింసను నిరసించిన ప్రజలు మాత్రం జైళ్ళలో కుక్కబడతారు. ఫెర్గూసన్ హత్యపై గ్రాండ్ జ్యూరీ తీర్పును నిరసించినవారు 500 మందికి పైగా ఇప్పుడు అమెరికా జైళ్ళలో తేలారు. మరోసారి మరొక నల్లజాతి యువకుడు హత్యకు గురికాబోడని, అతని హత్య తర్వాత అతను ఏవేవో నేరాలు చేసి హత్యకు తగినవాడిగా చిత్రీకరించబోడని గ్యారంటీ మాత్రం ఉండదు. ఇంతకు మించిన పెనువిషాదం ఏముంటుంది?

3 thoughts on “జాతివివక్ష: ఆందోళనల సుడిలో అమెరికా -ఫోటోలు

  1. చివరికి బాధితుల కుటుంబాలు కూడా శాంతియుతంగా నిరసనలు చేయాలని పిలుపు ఇవ్వడం, హింసను ఆమోదించేది లేదని గొప్పలు పోవడం తరచుగా జరుగుతోంది. & ఈ గొప్పలు, శాంతి బోధనలు అంతిమ పరిశీలనలో రాజ్యహింసకు మద్దతుగా తేలుతున్నాయే తప్ప రాజ్యహింసను ఎదుర్కొనేదిగా తేలడం లేదని వారు గ్రహించాలి -ఇది నిజంగా గొప్పలకు పోవడమా? అంతకుమించి వారేమీ చేయలేని నిస్సహాయికు ఇది దర్పణం మాత్రమే!(నా వ్యక్తిగత అభిప్రాయం)

  2. రాజ్యహింసకు చట్ట బద్దతా, చట్ట వ్యతిరేకత ,అనేది ఉండదు. అంతిమంగా దాని లక్ష్యం రాజ్యాన్ని రక్షించుకోవటమే. -అంటే రాజ్య పాలనలో భాగ స్వామ్య కలిగిన వారిని రక్షించుకోవడమే.కాదా?
    ఏమైనా అమెరికా ప్రజలు వీధుల్లోకి రావడం హర్షించదగ్గదే
    ( వాళ్ళు నల్ల వాలేనా, లేక తెల్ల వాళ్లు కూడనా అని తెలియదు) మన దేశంలో చుండూరు లాంటి చోట అయితే గొంతెత్తిన వారు నల్ల తోలు గల వాల్లే, గోదుమ రంగు వాల్లు వచ్చి వుండరనుకుంటాను, ఇకరిద్దరు లాయర్లు తప్ప?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s