ఇసిస్ లో చేరిన ఇండియన్ తిరిగి రాక


Four boys

ఇరాక్, సిరియాలలో భూభాగాలను ఆక్రమించుకుని ఇస్లామిక్ కాలిఫెట్ ను ఏర్పరిచిందని అమెరికా ప్రకటించిన ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా’ సంస్ధ లో చేరిన భారతీయుడు వెనక్కి వచ్చేశాడని ది హిందు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం రాయబార ఛానెళ్ల ద్వారా ప్రయత్నాలు చేయడంతో ఆరిఫ్ మజీద్ క్షేమంగా దేశానికి చేరుకున్నాడని పత్రిక తెలిపింది.

మోసుల్ లో జరిగిన ఒక బాంబు దాడిలో ఆరిఫ్ చనిపోయినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆరిఫ్ తో పాటు వెళ్ళిన మరో భారతీయుడు సహీమ్ టంకి ఆరిఫ్ తల్లిదండ్రులకు ఆగస్టులో ఫోన్ చేసి బాంబు దాడిలో ఆరిఫ్ చనిపోయాడని సమాచారం ఇచ్చాడు. అయితే కొద్ది రోజుల అనంతరం ఆరిఫ్ స్వయంగా ఇంటికి ఫోన్ చేసి తాను బ్రతికే ఉన్న సంగతి తెలిపాడు. ఆ సందర్భంగా ఆరిఫ్ తనకు ఇంటికి రావాలని ఉందని తల్లిదండ్రులకు తెలిపాడు.

తమకు తమ కుమారుడు ఫోన్ చేసిన సంగతి ఆరిఫ్ తల్లిదండ్రులు నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ అధికారులకు చెప్పారని, తమ కుమారుడి ఫోన్ వివరాలు వారు ఇచ్చారని, తద్వారా ఆరిఫ్ టర్కీలో ఉన్నట్లు కనుగొన్నామని ఎన్.ఐ.ఏ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. ఫోన్ లో తనకు ఇంటికి రావాలని ఉందని ఆరిఫ్ చెప్పడంతో అతని విషయాన్ని సానుభూతితో పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం రాయబార సంబంధాల ద్వారా వెనక్కి రప్పించే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

ఆరిఫ్ మజీద్, ఫహద్ షేక్, అమాన్ టాండెల్, సహీమ్ టంకిలు మరో 40 మందితో కలిసి మతపరమైన విహారయాత్రకు బయలుదేరి వెళ్లారు. బాగ్దాద్ వెళ్ళే ఎటిహాడ్ ఎయిర్ వేస్ విమానం ఎక్కివెళ్ళిన వీరు బాగ్దాద్ లో దిగిన కొన్ని రోజులకు మిగిలినవారి నుండి విడిపోయినట్లు తెలుస్తోంది. మే 31 తేదీన ఒక ప్రైవేటు టాక్సీ ఎక్కి ఆ నలుగురు మోసుల్ వెళ్లారు. అప్పటి నుండి వారు కనపడకుండా పోయారు. అనంతరం ఆగస్టు 26 తేదీన సహీమ్ ఫోన్ చేసి ఆరిఫ్ చనిపోయాడని చెప్పాకనే ఈ నలుగురి ఉదంతం తెలిసింది.

పోలీసులు ఇచ్చిన సమాచారం బట్టి చూస్తే ఎన్.ఐ.ఏ అధికారులు ఈ నలుగురి కుటుంబాల కార్యకలాపాలపై నిఘా పెట్టారని, సదరు నిఘా ద్వారానే సహీమ్ ఫోన్ విషయాన్ని పసిగట్టారని అర్ధం అవుతుంది. ఒక సీనియర్ పోలీసు అధికారి ది హిందు పత్రికకు ఇలా చెప్పారు:

“నలుగురు తప్పిపోయినట్లు తెలిసిన దగ్గరి నుండి వారి కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లపై నిఘా పెట్టారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వచ్చారు. ఇటీవల ఈ నెల మొదట్లో ఆరిఫ్ తన తండ్రికి ఫోన్ చేశాడు. తనకు వెనక్కి రావాలని ఉందని చెప్పాడు. తమ సంభాషణ వివరాలను అతని తండ్రి ఎన్.ఐ.ఏ అధికారులతో పంచుకున్నాడు. ఆరిఫ్ నెంబర్ ను ట్రాక్ చేయగా టర్కీ నుండి మాట్లాడినట్లు తెలిసింది. అతన్ని వెనక్కి రప్పించడానికి దౌత్య మార్గాలలో ప్రయత్నించడం ప్రారంభించారు.”

పశ్చిమ రాజ్యాలు సిరియాలో ప్రవేశపెట్టిన టెర్రరిస్టులకు టర్కీ భూభాగంపైనే ఆయుధ శిక్షణ ఇచ్చారు. శిక్షణకు అవసరమైన ఫైనాన్స్ సౌదీ అరేబియా, కతార్ లు సమకూర్చగా, పశ్చిమ రాజ్యాలు ఆయుధాలు అందజేశాయి. టర్కీ, జోర్డాన్ లలో పశ్చిమ రాజ్యాల మిలట్రీ గూఢచార సిబ్బంది వివిధ దేశాల నుండి సమీకరించిన ముస్లిం యువతకు శిక్షణ ఇచ్చారు. అక్కడి నుండి సిరియా, ఇరాక్ లకు వివిధ ఉగ్రవాద గ్రూపులకు కార్యకర్తలుగా తరలించారు. ఈ అంశాలను పశ్చిమ పత్రికలే వివిధ రూపాలలో, వివిధ సందర్భాలలో వెల్లడి చేశాయి.

ఈ నేపధ్యంలో పరిశీలిస్తే ఆరిఫ్ కు టర్కీలో ఆయుధ శిక్షణ ఇచ్చేందుకు తరలించినట్లు అర్ధం చేసుకోవచ్చు. టర్కీ వెళ్ళిన తర్వాత బహుశా ఆరిఫ్ కి వాస్తవాలు తెలిసి ఉంటాయి. తమకు చెప్పినట్లు తాము జీహాద్ కోసం పని చేయడం లేదనీ, జీహాద్ కూ తమకు ఇస్తున్న శిక్షణకు అసలు సంబంధమే లేదని గ్రహించి ఉండవచ్చు. తాము పోరాడుతున్నామని చెప్పిన అమెరికన్లే తమకు శిక్షణ ఇవ్వడాన్ని గ్రహించి ఉండవచ్చు. దానితో ఆరిఫ్ భ్రమలు పటాపంచలై ఉండవచ్చు. ఇంటిపై బెంగ పట్టుకోవడం వల్లనే ఆరిఫ్ వెనక్కి వచ్చి ఉండవచ్చు కూడా. ఇవన్నీ ఊహలు మాత్రమే. ఆరిఫ్ నుండి ఏదో విధంగా నిజాలు బైటికి వస్తే తప్ప అసలు విషయం ఏమిటో తెలియదు.

భారత భద్రతా బలగాలు, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆరిఫ్ ను ఇబ్బంది పెట్టకుండా సానుభూతితో పరిశీలించడానికే నిశ్చయించుకున్నారని పత్రిక తెలిపింది. “భారత శిక్షా స్మృతి ప్రకారం అతని చర్య నేరమే అయినా ఇది సున్నితమైన అంశం అయినందున యువకులను అరెస్టు చేయడం మరో సమస్య అవుతుంది. తీవ్రవాద భావజాలం అనే గాలానికి ఎరగా చిక్కిన ఈ బాలురిని అరెస్టు చేస్తే పెద్ద చర్చ జరగవచ్చు. దానివల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అందువల్ల బాలుర కేసును సానుభూతితో చూడాలని హోమ్ మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఎటువంటి కేసూ పెట్టవద్దని నిర్ణయించింది” అని పోలీసు అధికారి చెప్పారు.

పోలీసు అధికారి చెప్పింది నిజమే అయితే అది మంచి నిర్ణయమే. ఇంటర్నెట్ లో తీవ్రవాద భావజాలం చదవడంతోనే అటువైపు ఆకర్షితులు కావడం జరగడం చాలా చాలా అరుదుగా జరుగుతుంది. అటువైపు ఆకర్షితులు కాగల పరిస్ధితులు తమ చుట్టూ ఉంటే తప్ప ఎవరూ ఒక భావజాలానికి ఆకర్షితులు కాలేరు. అది ఒక భౌతిక నియమం. ప్రకృతి సహజం. సామాజిక లక్షణం కూడా.

నలుగురు యువకులు ముంబై సమీపంలోని ధానే జిల్లాకు చెందినవారు. నిత్యం శివసేన లాంటి హిందూత్వ శక్తుల విద్వేష ప్రచారంలో బ్రతుకుతూ మతకలహాల మధ్య పుట్టి పెరిగిన ధానే యువకులు తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షితులు కావడంలో ఆశ్చర్యం లేదు. అసలు దోషులు ఈ యువకులు కాదు. తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేసే సాహిత్యాన్ని, బోధనలను, వీడియోలను తయారు చేసేది అమెరికాలో అని తెలిస్తే అసలు దోషి ఎవరో ఇట్టే అర్ధం అవుతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s