ఏది జరగకూడదని అనుకున్నామో అదే జరిగింది. క్రికెట్ అభిమాన ప్రపంచం అంతా ఏది జరగాలని కోరుకుందో అందుకు విరుద్ధమైనదే జరిగింది. బౌన్సర్ బంతి దెబ్బకు కుప్ప కూలిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ (Philip Hughes) డాక్టర్లు కలుగ జేసిన కోమా నుండి మరి కోలుకోలేదు. మెదడుకు తీవ్ర గాయం తగలడంతో గాయం తగ్గడానికి డాక్టర్లు సంక్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ ఫలితం ఏమిటో 48 గంటలు గడిస్తే గాని తెలియదని వారు ప్రకటించారు. కానీ వారి శ్రమను ఓడిస్తూ మృత్యువు ఫిలిప్ హ్యూస్ ని కబళించింది.
గురువారం ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచాడని డాక్టర్లు ప్రకటించారు. దేశీయ లీగ్ మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తుండగా రెండు రోజుల క్రితం ఫిల్ హ్యూస్ తల వెనుక బంతి వేగంగా వచ్చి తాకడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. స్టేడియంలోనే ముప్పావు గంట సేపు ప్రధమ చికిత్స చేసిన అనంతరం హెలికాప్టర్ అంబులెన్స్ లో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ హ్యూస్ గాయం మెరుగుపడ లేదు. గురువారం ఉదయానికల్లా ఆయన మరణించారని తెలుస్తోంది. మరణ సమయంలో ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఆయన చెంతనే ఉన్నారని పత్రికలు తెలిపాయి.
25 యేళ్ళ ఫిల్ ఆస్ట్రేలియా జాతీయ జట్టు సభ్యుడిగా కూడా ఆడాడు. అయితే జాతీయ జట్టులో ఆయన స్ధిరంగా కొనసాగలేదు. అప్పుడప్పుడూ ఇతర సభ్యులు ఆడలేని పరిస్ధితి వచ్చినప్పుడు మాత్రమే జాతీయ జట్టులో ఆడే అవకాశం ఆయనకు లభించింది. ఇండియాతో కొద్ది రోజుల్లో జరగనున్న టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మైఖేల్ క్లార్క్ గాయం వలన మొదటి టెస్ట్ నుండి తప్పు కోవలసి వచ్చింది. ఆయన స్ధానాన్ని ఎంపిక చేసేందుకు సెలెక్ట్ కమిటీ సభ్యులు ఫిల్ ఆడుతున్న లీగ్ మ్యాచ్ లను పరిశీలిస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే గాయం తగిలే సమయానికి 63 పరుగులతో క్రీజ్ లో ఉన్న ఫిలిప్ ఎంపిక అయి ఉండేవాడని తెలుస్తోంది. కానీ షార్ట్ పిచ్ (బౌన్సర్) గాయం ఆయన కెరీర్ కు అర్ధాంతరంగా ముగింపు పలికింది.
హెల్మెట్ కూ మెడకూ మధ్య భాగంలో ఖాళీ ఉంటుందని, సరిగ్గా ఆ ఖాళీలోనే బంతి తగిలిందని, హెల్మెట్ తయారీదారు కంపెనీ మసూరి ప్రతినిధి ప్రకటించింది. అదీ కాక ఫిల్ ధరించిన హెల్మెట్ పాత మోడల్ కు చెందినదని తాము కొద్ది నెలల క్రితమే విడుదల చేసిన తాజా మోడల్ ను ధరించినట్లయితే పరిస్ధితి ఈ విధంగా ఉండకపోను అన్నట్లుగా కంపెనీ ప్రతినిధి ప్రకటించాడు. ఇలా చెబుతూనే మెడకూ, హెల్మెట్ కూ మధ్య ఉన్న ఖాళీని కవర్ చేస్తూ హెల్మెట్ రూపొందిస్తే బ్యాట్స్ మెన్ తల కదిలించడం కష్టం అవుతుందని సదరు ప్రతినిధి చెప్పడం గమనార్హం.
ఓ పక్క తమ కంపెనీ హెల్మెట్ ఆటగాడిని కాపాడలేకపోయిందన్న వాస్తవాన్ని మింగక తప్పని పరిస్ధితి, మరో పక్క అది తమ చేతుల్లో ఏమీ లేదని సమర్ధించుకునే ఆతృత… ఈ రెండూ కంపెనీ ప్రతినిధి పరస్పర విరుద్ధ పరిశీలనలు జారీ చేసేలా పురి కొల్పినట్లు కనిపిస్తోంది. తమపై ఉన్న ఒత్తిడి వల్ల కాకుండా అసలు వాస్తవంగా ఎటువంటి పరిస్ధితి వల్ల ఆటగాడికి అంత తీవ్రమైన గాయం తగిలిందో విశ్లేషించగల నిస్పాక్షికత కంపెనీలకు ఉంటుందనుకోవడం అత్యాశే కావచ్చు. కంపెనీ ప్రతినిధి ఈ వ్యాఖ్యలు చేసే సమయానికి ఫిలిప్ ఇంకా మరణించలేదు.
క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్స్ లో సచిన్ తో పోటీ వచ్చే ఆటగాడిగా అందరూ పరిగణించే బ్రియాన్ లారా ఒకింత నిర్మొహమాటంగా మాట్లాడాడు. ‘క్రికెట్ ప్రమాదకరమైన ఆట’ అని ఆయన తేల్చి చెప్పాడు. బాక్సింగ్, రగ్బీ, కార్ రేసింగ్ తదితర ఆటలకు మల్లేనే క్రికెట్ బ్యాటింగ్ లో కూడా ప్రమాదం ఇమిడి ఉన్నదని ఈ ప్రమాదాన్ని ఆటగాళ్లు సదా గమనంలో ఉంచుకోవాలని లారా వ్యాఖ్యానించాడు.
“ఇది చాలా దురదృష్టకరం. వివిధ అంశాల కారణంగా బ్యాట్స్ మెన్ ఎల్ల వేళలా వివిధ రకాల ప్రమాదాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటిది జరుగుందని మనం ఊహించలేము… ఇలాంటిది జరగకూడదని, ఆటగాడు కోలుకోవాలని ప్రార్ధించడం తప్ప మనం ఏమీ చేయలేని పరిస్ధితి… ఇది ప్రమాదకరమైన ఆట. నిజంగా అత్యంత కష్టమైన రగ్బీ, రగ్బీ లీగ్, మోటార్ రేసింగ్ ఆటల తరహాలోనే క్రికెట్ లో ఎప్పుడూ కొంత ప్రమాదాంశం ఇమిడి ఉంటుంది” అని లారా అన్నారని డెయిలీ టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది.
‘వర్టెబ్రల్ ఆర్టరీ డిసెక్షన్’ అన్న పరిస్ధితి వల్ల హ్యూస్ మరణించాడని క్రికెట్ ఆస్ట్రేలియా టీం డాక్టర్ బ్రక్నర్ చెప్పారని బి.బి.సి తెలిపింది. గుండె నుండి శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని మోసుకెళ్ళే రక్త నాళాలను ఆర్టరీలు (ధమని) అంటారు. ధమని లో ప్రవహించే రక్తం శరీర భాగాలకు ఆక్సిజన్ మోసు కెళ్తుంది. హ్యూస్ మెడకు బంతి బలంగా తగలడం వలన శరీర ఉపరితలానికి బాగా లోపలికి ఉండే ధమనిపై ఒత్తిడి కలుగజేసింది. ఈ ఒత్తిడి వల్ల ధమని గోడలు వాచిపోవడంతోపాటు రక్తం గడ్డ కట్టుకుపోయి రక్త ప్రవాహానికి ఆటంకం కలిగించింది. ధమని చిట్లి బ్లీడింగ్ జరిగింది. దానితో మెదడుకు తగిన మొత్తంలో రక్తం సరఫరా కాక హ్యూస్ మరణానికి కారణం అయింది. శరీరంలో బాగా లోపల ఉండే ధమనులు గాయపడడం బాగా అరుదుగా మాత్రమే జరుగుతుంది. అత్యంత భయానకమైన వాహన ప్రమాదాల్లో మాత్రమే ఇలా జరుగుతుందని డాక్టర్లు చెప్పడం గమనార్హం. ఇటువంటి గాయాన్ని తాము ఎన్నడూ చూడలేదని హ్యూస్ కు వైద్యం అందించిన వైద్యులు చెప్పారని డెయిలీ మెయిల్ తెలిపింది.
ఫిలిప్ మరణం పట్ల క్రికెట్ లోకం అంతా విషాధంతో స్పందిస్తోంది. పలువురు ప్రముఖులు సోషల్ వెబ్ సైట్లలో ఫిలిప్ కు నివాళులు ఆర్పిస్తున్నారు. క్రికెట్ అభిమానులు అనేక మంది ట్విట్టర్, ఫేస్ బుక్ లలో తమ విషాదాన్ని మాటల్లో వ్యక్తం చేస్తున్నారు. ఫిల్ గాయపడిన స్టేడియంలో జాతీయ జెండాను అవనతం చేశారు. ఇండియా-ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ను రద్దు చేయాలని కొందరు కోరుతున్నారు. పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ ను రద్దు చేసుకున్నారు.
ఈ వార్త నిజంగా నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది! బౌన్సెర్ వలన తగిలిన గాయానికి ఓ బ్యాట్స్ మెన్ మరణించడం నాకు తెలిసి ఇదే ప్రధమం! అబాట్ కు అందరూ అండగా నిలవాల్సిన సంధర్భం ఇది!
ఇండియా-బోర్డ్ ప్రెసిడెంట్ 11 మధ్య జరగాల్సిన 2 రోజుల ప్రాక్టిస్ ఆట రద్ధుచేశారు.
పక్-కివి ల మధ్య జరగాల్సిన ఈ రోజు ఆటను రద్ధుచేసి,మరో రోజుకు ఆటను పొడిగించారు!
too sad