ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం యురేనియం సరఫరా అన్నది సమాన స్ధాయి వ్యాపార సంబంధాల్లో భాగంగా జరిగినది కాదు. భారత దేశం అమెరికా, దాని మిత్ర దేశాలతో వాణిజ్య, రాజకీయ, ఆర్ధిక సంబంధాలను మరింత దృఢతరం చేసుకుని, అమెరికా శిబిరానికి మరింత దగ్గర అయ్యే భౌగోళిక రాజకీయ అవసరం రీత్యానే యురేనియం సరఫరా అవుతుంది. అనగా యురేనియం ఇంధనాన్ని ఇచ్చి ఇండియా నుండి చైనా-రష్యా శిబిరంపై వ్యతిరేకతను అమెరికా సంపాదిస్తోంది. ఇది దళారీ పాలకుల లక్షణాల్లో ఒకటి. పైకి చూసేందుకు స్వతంత్రతగా కనిపిస్తుంది. లోపల మాత్రం పెత్తందారీ దేశాలకు సాగిలపడడం దాగి ఉంటుంది.
బ్రిక్స్ కూటమిలో భాగంగా చైనా చొరవతో ప్రపంచ బ్యాంకుకు పోటీగా న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు ఏర్పడింది. ఐ.ఎం.ఎఫ్ కు పోటీగా కంటింజెంట్ రిజర్వ్ ఫండ్ ఏర్పడింది. ఇవి కాకుండా ఎ.డి.బికి పోటీగా ఆసియా కోసం ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకును (ఎ.ఐ.ఐ.బి) చైనా ఏర్పాటు చేసింది. ఈ నేపధ్యంలో ఇండియాను తమ గుప్పిట్లో ఉంచుకుని చైనాను సాధించడం అమెరికా లక్ష్యంగా పెట్టుకోగా దానికి భారత పాలకులు యధాశక్తి సహకరిస్తున్నారు. తమ లక్ష్యంలో భాగంగా ఒక పద్ధతి ప్రకారం అమెరికా, దాని మిత్ర దేశాలు ఇండియా యురేనియం దాహాన్ని వినియోగించుకుంటూ వస్తున్నారు. ఇండియాకు యురేనియం సరఫరా చేయకుండా విధించిన నిషేధాన్ని గత ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎత్తివేయగా, ఇప్పటి ప్రభుత్వం పౌర అణు ఒప్పందంపై సంతకం చేసింది.
ఆస్ట్రేలియాలో మోడి సంతకం చేసిన ఒప్పందాల్లో ముఖ్యమైనది భద్రతా ఒప్పందం. ‘ఫ్రేమ్ వర్క్ ఫర్ సెక్యూరిటీ కో ఆపరేషన్’ పేరుతో పేర్కొనబడిన ఈ ఒప్పందం గురించి పత్రికలు పెద్దగా వార్తలు ఇవ్వలేదు. ఆస్ట్రేలియాలో మోడి ఏ విధంగా ఆకర్షక కేంద్రంగా ఉన్నారో చెబుతూ పేజీలు నింపాయే గానీ, ఆయనను కేంద్రాన్ని చేస్తూ ఇండియాను అమెరికా భౌగోళిక వ్యూహంలో పావుగా చేస్తున్న సంగతిని మాత్రం విస్మరించాయి.
సెక్యూరిటీ ఒప్పందం మేరకు ఇండియా-ఆస్ట్రేలియా-అమెరికాల మధ్య మిలట్రీ ఒప్పందాలు పెరుగుతాయి. ఉమ్మడి సైనిక విన్యాసాలు పెరుగుతాయి. ఇరు దేశాల ఆర్మీల మధ్యా, నావికా దళాల మధ్యా, వాయు బలగాల మధ్యా క్రమం తప్పకుండా చర్చలు నడుస్తాయి. పరస్పరం గూఢచార సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం పెరుగుతుంది.
స్నోడెన్ పత్రాల్లో పేర్కొనబడిన ‘ఐదు కళ్ళు’ (Five Eyes) –అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్- లో భాగమైన దేశాలతో గూడచార సమాచార మార్పిడి అంటే అర్ధం ఈ దేశాలతో ఇండియా సమానంగా ఉంటుందని కాదు. ఐదు కళ్లకు భారత గూఢచారులు సేవలు అందించడం ప్రారంభిస్తారని అర్ధం. అనగా భారత ప్రజలపై భారత పాలకులు సాగించే గూఢచార సమాచారం నేరుగా ఐదు కళ్ల నీడలోకి వెళ్లిపోతుంది. ఇది అంతిమంగా భారత ప్రజల పోరాటాలపై అంతర్జాతీయ పర్యవేక్షణగా మారిపోతుంది.
ఆస్ట్రేలియాలో మోడి చెప్పిన మాటలు చూస్తే విషయం ఇంకాస్త స్పష్టం అవుతుంది. “మనం సముద్రాలపై కలిసి పని చేయాలి. అంతర్జాతీయ వేదికలపై సహకరించుకోవాలి… అన్ని దేశాలూ, అవి పెద్దవైనా చిన్నవైనా అంతర్జాతీయ చట్టాలకు, నిబంధనలకు కట్టుబడి ఉండాలి, తమ మధ్య ఎంత తీవ్రమైన వివాదాలు ఉన్నా సరే” అని మోడీ ప్రకటించారు. ఈ మాటలు నేరుగా చైనాను ఉద్దేశించి అన్నవి. దక్షిణ చైనా సముద్రంలోనూ, తూర్పు చైనా సముద్రంలోనూ చైనాకూ ఇతర తూర్పు, ఆగ్నేయాసియా దేశాలకు మధ్య ఉన్న వివాదాలను ఉద్దేశిస్తూ మోడి ఈ వ్యాఖ్యలు చేశాడు. నిజానికి ఈ రెండు సముద్రాలలో వివాదాలు రెచ్చగొట్టింది అమెరికాయే. వివాదాలు రెచ్చగొట్టి ఆనక వాటి పరిష్కారంలో తన మిత్రదేశాలు జపాన్, ఫిలిప్పీన్స్, ధాయిలాండ్ తదితర దేశాలకు మద్దతుగా నిలిచే పేరుతో ఇక్కడ అమెరికా తన యుద్ధ నౌకలను మోహరించింది. తద్వారా చైనాను సైనికంగా చుట్టుముట్టే వ్యూహాన్ని అమెరికా అమలు చేస్తోంది.
ఈ వ్యూహంలో భాగం అవుతూ ఇండియా కూడా తగుదునమ్మా అంటూ తన వాణిజ్య, మిలట్రీ నౌకలను అడపా దడపా తూర్పు, దక్షిణ చైనా సముద్రాలకు పంపుతోంది. ఆస్ట్రేలియా, జపాన్ ల యుద్ధ నౌకలు కూడా ఉద్దేశ్యపూర్వకంగా చైనా భూభాగానికి సమీపంగా విహరిస్తూ ఉద్రిక్తతలను మరింత రెచ్చగొడుతున్నాయి. వాస్తవం ఇది కాగా మోడి చైనాకు హెచ్చరికలు చేయడం కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే. ఓ పక్క బ్రిక్స్ బ్యాంకు, సి.ఆర్.ఏ, ఏ.ఐ.ఐ.బి లలో భాగస్వామ్యం వహిస్తూ అదే సంస్ధల్లో ప్రధాన భాగస్వామి చైనాకు హెచ్చరికలు చెయ్యడం వల్ల అమెరికా ప్రయోజనాలు నెరవేరుతాయి గాని ఇండియా ప్రయోజనాలు కాదు. పైగా భారత ప్రజల ప్రయోజనాలు మరింత దారుణంగా దెబ్బ తింటాయి. అమెరికా సామ్రాజ్యవాదానికి ఇండియా మరింతగా కట్టివేయబడుతుంది.
చైనాకు వ్యతిరేకంగా అమెరికా అమలు చేస్తున్న మిలట్రీ ఆధిపత్య వ్యూహంలో ఇండో-పసిఫిక్ ప్రాంతం కీలకమైనదిగా అమెరికా పరిగణిస్తోంది. హిందూ మహా సముద్రంలో జల రవాణా మార్గాలను సైనికంగా చుట్టుముట్టి తద్వారా చైనాకు మధ్య ప్రాచ్యం నుండి జరిగే ఇంధన (పెట్రోలియం) సరఫరాను, ఆఫ్రికానుండి వచ్చే ఖనిజ సరఫరాను నియంత్రించాలన్నది అమెరికా పధకం. ఈ పధకానికి మోడి సంతకం చేసిన సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ ఒప్పందం ఇతోధికంగా దోహదం చేస్తుంది. ఈ లొంగుబాటును సమర్ధించుకోవడానికి మోడి ‘పెద్దా, చిన్నా దేశాలన్నీ అంతర్జాతీయ చట్టాలు పాటించాలని’ బోధలు చేశాడు. వాస్తవానికి ఈ బోధనలు అమెరికాకే సరిగ్గా వర్తిస్తాయి.
`చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ ఆస్ట్రేలియాలో ఉన్నంతవరకూ ఈ ఒప్పందం సంగతి ఆస్ట్రేలియా ప్రధాని టోని అబ్బాట్ ప్రకటించలేదు. గ్జి జిన్ పింగ్ తో కుదుర్చుకున్న చైనా-ఆస్ట్రేలియాల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా ఆస్ట్రేలియా పెద్ద మొత్తంలో లాభ పడనుంది. దానితో గ్జి దేశంలో ఉన్నంతవరకు ఇండియాతో సెక్యూరిటీ ఒప్పందాన్ని టోనీ అబ్బాట్ ప్రకటించలేదు. ఆయన దేశం దాటి వెళ్ళాకనే ఇండియాతో ఒప్పందాన్ని పత్రికలకు విడుదల చేశారు. విడుదల చేసింది భారత విదేశాంగ శాఖే గాని ఆస్ట్రేలియా కాదు. చైనాతో వాణిజ్య సంబంధాలకు ఆస్ట్రేలియా ఇచ్చే విలువ మోడి/ఇండియా ఇవ్వక పోవడం తెలివితక్కువ అనాలా, లొంగుబాటు అనాలా?
ప్రజాస్వామ్య దేశాల మధ్య సహకారం అంటూ మోడి మరో విధంగానూ చైనా వ్యతిరేక ప్రకటన చేసి అమెరికాను సంతృప్తిపరిచారు. ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగిస్తూ ఆయన “అన్నింటికంటే మిన్నగా మనం ప్రజాస్వామిక ఆదర్శాల కారణంగా ఏకతాటిపై ఉన్నాం” అని మోడి చెప్పారు. అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాలు ప్రజాస్వామ్య దేశాలని అందుకే అవి ఒక తాటిపై ఉంటూ నియంతృత్వ రాజ్యమైన చైనాను దూరం పెట్టాయని మోడి చెప్పదలిచారు.
నిజం ఏమిటి? ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో ఈ సో కాల్డ్ ప్రజాస్వామ్య దేశాలు అత్యంత కర్కశమైన చట్టాలను చేసుకున్నాయి. అమెరికాలో అచ్చంగా పోలీసు రాజ్యం అమలవుతోంది. నిరాయుధుడైన నల్లజాతి వ్యక్తిని తుపాకితో కాల్చి చంపిన పోలీసులపై ఎలాంటి నేరారోపణ చేయడానికి అమెరికా కోర్టులు నిరాకరించిన ఉదాహరణ నవంబర్ 25 నాటిదే. ఈ తీర్పును నిరసిస్తూ అమెరికా అంతటా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, అలజడి చెలరేగాయి. జపాన్ లో అమెరికా సైనిక స్ధావరానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలను అక్కడి ప్రజాస్వామ్యం నిర్దయగా అణచివేస్తుంది.
ఆస్ట్రేలియా పౌరుడు జులియన్ ఆసాంజే, అమెరికా పీడితుడిగా రెండేళ్లకు పైగా ఈక్వడార్ అనే చిన్న దేశం దయతో ఒక చిన్న గదిలో గడుపుతుంటే అదేమని ప్రశ్నించక పోగా ఆసాంజే వీసా రద్దు చేస్తానని బెదిరించిన గొప్ప ప్రజాస్వామ్య దేశం ఆస్ట్రేలియా. జి20 సమావేశాల కోసం అని చెబుతూ భారీ మొత్తంలో పోలీసు, సైనిక బలగాలను మోహరించి బ్రిస్బేన్ నగరంలో సామాన్యుడికి ప్రవేశం లేకుండా చేశారు. చివరికి మిలట్రీ విమానాలచేత కూడా పహారా కాయించారు. ఇక గుజరాత్ లో మోడి అమలు చేసిన హిందూ ప్రజాస్వామ్యం గురించి చెప్పనే అవసరం లేదు. ఇలాంటి ప్రజాస్వామ్య దేశాలు చైనాను వేలెత్తి చూపగలవా? ఈ నాలుగు దేశాల్లోనూ, చైనాలోనూ అమలులో ఉన్నది బూర్జువా నియంతృత్వాలే తప్ప ప్రజాస్వామ్యం కాదు. కాకపోతే ఈ దేశాల్లో ఎన్నికల తంతు ఉంటే చైనాలో అది లేదు. పీడితులను ఎంచుకునే స్వేచ్ఛ ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది గనక?
ఇన్ని చెప్పుకుని ‘ఆసియన్ నాటో’ గురించి ప్రస్తావించుకోకపోవడం తప్పిదం అవుతుంది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియాలు 2006-07 సంవత్సరంలో “నాలుగు ప్రజాస్వామ్యాలు” పేరుతో ‘చతుర్భుజ భద్రతా ఏర్పాటు’ను ప్రారంభించాయి. దీనిని ‘ఆసియన్ నాటో’ గా చైనా అప్పట్లో విమర్శించింది. ఈ ఏర్పాటును ‘క్వాడ్’ అని కూడా కొన్ని పత్రికలు సంబోధిస్తాయి. అయితే 2008లో లేబర్ పార్టీ నేత కెవిన్ రడ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్వాడ్ నుండి ఆస్ట్రేలియా బైటికి వచ్చింది. ఫలితంగా క్వాడ్ ఉనికిని కోల్పోయింది. ఈ చర్యకు పర్యవసానంగానే కెవిన్ రడ్ ప్రభుత్వం కూలిపోయింది. లేబర్ పార్టీలోనే తిరుగుబాటు నేతలు తయారై కెవిన్ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. అమెరికా ప్రకటించిన పివోట్-ఆసియా వ్యూహానికి దూరం జరుగుతున్నందునే కెవిన్ రడ్ ప్రభుత్వం కూలిపోయిందన్నది కొద్ది మందికి తెలిసిన విషయం. అమెరికా ఎంబసీకి సన్నిహితంగా మెలిగే జూలియా గిల్లార్డ్ కెవిన్ స్ధానంలో ప్రధాని పీఠాన్ని చేపట్టింది.
ఇప్పుడు మళ్ళీ ‘క్వాడ్’ ను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మోడి పర్యటనలోనూ, జి20 సమావేశాలలోనూ జరిగిన పరిణామాల ద్వారా అర్ధం అవుతోంది. నాలుగు దేశాలు మూడు మూడు చొప్పున సమావేశం కావడం పెరిగింది. ఒకసారి అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు సమావేశం అయితే, మరోసారి అమెరికా, జపాన్, ఇండియాలు సమావేశం అవుతాయి. వెరసి నాలుగు దేశాలు మళ్ళీ క్వాడ్ కూటమిని తెరమీదికి తెస్తున్నాయి. త్వరలోనే క్వాడ్ పునరుద్ధరణ తధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.
మూడు దేశాల పర్యటన అని చెప్పినప్పటికీ భారత ప్రధాని మోడి ప్రధాన గమ్యం ఆస్ట్రేలియాయే. జి20 సమావేశాల్లో ఆ కూటమికి సంబంధించిన ఏ ఒక్క ప్రయోజనమూ నెరవేరలేదు. ‘వచ్చాం, వెళ్ళాం’ అన్నట్లుగా జరిగిన జి20 సమావేశాల సందర్భంగా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ లు తమ చైనా వ్యతిరేక లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాయి. ఆ లక్ష్యానికి భారత ప్రధాని నరేంద్ర మోడి మనసా, వాచా సహకరించి తనకు అప్పగించిన పనిని పూర్తి చేసుకుని వచ్చారు.
unless the people who have depth knowledge about the international affairs words of Modi looks like casual statements.
what might be the impact on India in near future.
why Modi not having good relations with china. more over china is also good friend from earlier times with us. then why we should be friendly with china.
అన్ని దేశాలదీ ఒకటే తరహా కాకులను కొట్టి గద్దలను మేపడం!