బి.సి.సి.ఐ భారత ప్రభుత్వ సంస్ధ అని చాలామంది భావిస్తారు. అది కేవలం ప్రైవేటు క్రికెట్ సంఘాలను కేంద్రీకృత స్ధాయిలో నియంత్రించే ప్రైవేటు సంస్ధ మాత్రమేనని వారికి తెలియదు. అనేక యేళ్లుగా భారత ప్రజల్లో క్రికెట్ జ్వరాన్ని పెంచి పోషించి ఆ జ్వరాన్ని సొమ్ము చేసుకుంటూ ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన క్రికెట్ బోర్డుగా బి.సి.సి.ఐ అవతరించింది.
బి.సి.సి.ఐని కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు కొన్ని సార్లు ప్రయత్నాలు జరిగాయి. కానీ క్రికెట్ జబ్బు డబ్బు తినడం మరిగిన సంపన్నులు అదే ప్రభుత్వంలోని ఇతర నేతల మద్దతుతో ఆ ప్రయత్నాలను విజయవంతంగా తిప్పి కొట్టారు.
బి.సి.సి.ఐ ద్వారా సమకూరుతున్న డబ్బు చాలక ఐ.పి.ఎల్ అంటూ మరో క్రికెట్ డబ్బు కేంద్రాన్ని క్రికెట్ సంపన్నులు తయారు చేసుకున్నారు. బి.సి.సి.ఐ ద్వారా సమకూరిన డబ్బును రొటేషన్ చేసుకోవడానికి, దానిని మరిన్ని రెట్లు పెంచుకోవడానికి ఐ.పి.ఎల్ తిరనాళ్ల బాగా ఉపయోగపడుతోంది.
బి.సి.సి.ఐ-ఐ.పి.ఎల్ డబ్బాటకు ప్రబల ప్రతినిధిగా వర్తమానంలో కనిపించే వ్యక్తి ఐ.సి.సి అధ్యక్షుడు శ్రీనివాసన్. క్రీడా రాజకీయాలకు, రాజకీయ క్రీడలకు, ఈ రెండింటి మధ్య అభివృద్ధి చెందిన అక్రమ సంబంధానికి శరద్ పవార్ ప్రతినిధి కాగా క్రికెట్ ను డబ్బు పరిశ్రమగా అభివృద్ధి చేసిన ప్రక్రియకు శ్రీనివాసన్ ప్రతినిధి.
బి.సి.సి.ఐ ఏలికగా కొనసాగుతూనే చెన్నై సూపర్ కింగ్స్ యజమానిగా అవతరించడంలో శ్రీనివాసన్ కు ఇప్పటికీ ఎలాంటి తప్పూ కనిపించడం లేదంటే ఆయనగారి ధన దాహానికి ఏడేడు సముద్రాలు సరిపోవని అర్ధం చేసుకోవచ్చు. బి.సి.సి.ఐ నేతగా సి.ఎస్.కె ను సొంతం చేసుకుని, ఒక పక్క తన అల్లుడు బెట్టింగ్ కార్యకలాపాలపై సుప్రీం కోర్టు విచారణ కొనసాగుతుండగానే ఐ.సి.సి అధ్యక్షుడు కాగలిగిన నేర్పరితనం శ్రీనివాసన్ ప్రదర్శించడం అబ్బురం కలిగించే విషయం.
ఐ.పి.ఎల్ బెట్టింగ్ లో, ఫిక్సింగ్ లో శ్రీనివాసన్ పాత్ర లేదని ముడుగల్ కమిటీ ప్రత్యేకంగా చెప్పడం బట్టి సదరు కమిటీ పని చేసింది దోషిత్వ నిర్ధారణకా లేక నిర్దోషిత్వ నిర్ధారణగా అన్నది అర్ధం కాలేదు. ముదుగుల్ కమిటీ ఏమి చెప్పినా అటు బి.సి.సి.ఐ అధ్యక్షుడుగా ఉంటూనే సి.ఎస్.కె యజమానిగా అవతరించడం బొత్తిగా కుదరని వ్యవహారం అనీ ప్రయోజనాల వైరుధ్యాన్ని (conflict of interests) ఆయన ఎలా విస్మరిస్తారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించాల్సిన పరిస్ధితి వచ్చింది. అయినా సరే, ఆయన మాత్రం తన తప్పు లేదని ముడుగల్ కమిటీ నిర్ధారించింది కనుక తనను మళ్ళీ బి.సి.సి.ఐ అధ్యక్షుడిని చేయాలని శ్రీనివాసన్ కోరుతున్నారు.
సి.ఎస్.కె యజమానిగా ఉండాలి. బి.సి.సి.ఐ అధ్యక్షుడుగా కొనసాగాలి. మళ్ళీ ఐ.సి.సి అధిపతి పదవి కూడా కావాలి. ఇక్కడ కార్టూన్ లో బ్యాట్స్ మేన్, రన్నర్ లుగా మాత్రమే చూపారు గానీ నిజానికి బౌలర్ గా కూడా ఆయనను చూపించవచ్చు. బహుశా రిఫరీగా కూడా!
కాదు లేండి! అంపైర్ ఏమో ముద్గల్ కమిటి,రిఫరీ ఏమో సుప్రీంకోర్ట్!!