ఆస్ట్రేలియా మీదుగా అమెరికా వెళ్ళు మోడి రైలు -1


Modi in Australia

భారత ప్రధాని నరేంద్ర మోడి నవంబరు 11 నుండి 20 వరకు మూడు దేశాల పర్యటనకు వెళ్ళి వచ్చారు. మియాన్మార్ పర్యటనలో ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సభకు హాజరయిన మోడి ఆస్ట్రేలియా పర్యటనలో జి-20 గ్రూపు సమావేశాలకు హాజరయ్యాడు. ఈ పర్యటనలో మోడియే ప్రధాన ఆకర్షణ అని చెప్పుకుని భారత పత్రికలు మురిసిపోయాయి. వామపక్ష భావాలు కలిగి ఉన్నట్లు భావించే ది హిందు పత్రిక సైతం ఈ పత్రికల్లో ఒకటిగా ఉండడం గమనార్హం.

అంటరాని నేతగా దాదాపు ప్రపంచం అంతా భావించిన నరేంద్ర మోడి ప్రస్తుతం ‘మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం’ అంటూ పశ్చిమ దేశాధినేతలు ప్రకటించేవరకూ ఎదగడం ‘మోడి నాయకత్వ ప్రతిభే’ అని చెప్పడం హిందూత్వకు అవసరం కావచ్చు. కానీ అదే మాటను మోడి విమర్శకులు సైతం వివిధ రూపాల్లో వ్యక్తం చేయడం వెనుక భారత దేశ పాలకవర్గాలను కలిపి ఉంచడానికి సామ్రాజ్యవాదులు చేస్తున్న కృషి పని చేయడం ఒక వాస్తవం. కాగా, ఎటువంటి తత్తరపాటు లేకుండా తమకు కావలసిన అత్యంత దుర్మార్గమైన ఆర్ధిక సంస్కరణలను అమలు చేయడంతో పాటు, సంస్కరణలకు ఎలాగూ వచ్చే వ్యతిరేకతను ఎలాంటి వెనుకంజ వేయకుండా అణచివేయగల సత్తాను మోడి నిరూపించుకున్నాడని పశ్చిమ ప్రభువులు నమ్మకం పెట్టుకోవడం కూడా మరో వాస్తవం.

రెండున్నర దశాబ్దాల క్రితం సోవియట్ రష్యా పతనం చెందిన నేపధ్యంలో పశ్చిమ దేశాలకు దగ్గర కావడానికి భారత పాలకులు ఒక మార్గం ఎంచుకుని దానికి ‘లుక్ ఈస్ట్ పాలసీ’ (తూర్పువైపు చూసే విధానం) అని పేరు పెట్టుకున్నారు. ఇది వాస్తవానికి ‘లుక్ ఈస్ట్ టు లుక్ వెస్ట్’ (తూర్పు మీదుగా పశ్చిమం వైపు చూసే విధానం) మాత్రమే అని భౌగోళిక రాజకీయ విశ్లేషకులు ససాక్షరంగా పుస్తకాలు రాసి మరీ తేల్చేశారు. 1990లనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, అనంతర కాలంలోని యు.పి.ఏ-1, 2 ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు, వాటి ఫలితాలు ఈ విశ్లేషణను ధృవపరిచాయి.

ఇప్పుడు మోడి పూర్తి చేసిన పది రోజుల త్రిదేశ పర్యటన కూడా పశ్చిమ దేశాలకు, ముఖ్యంగా అమెరికా ప్రపంచాధిపత్య వ్యూహానికి తమను తాము పునరంకితం చేసుకోవడానికి, మరింత దగ్గరగా అంటకాగడానికే భారత పాలకులు వినియోగించారు. ఓ పక్క పశ్చిమ వ్యూహాలకు విధేయత ప్రకటిస్తూనే మరోపక్క చైనా నేతల సమక్షంలో ఇండియాతో పాటు ఆస్ట్రేలియా కూడా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం పరిశీలకుల దృష్టిని దాటి పోలేదు. కాగా జి-20 గ్రూపు సమావేశాలు పశ్చిమ దేశాలకు ఇతమిద్ధంగా కాణి ఉపయోగం కూడా రాల్చకపోవడం ఒక ఆసక్తికర పరిణామం.

మియాన్మార్, ఫిజీల పర్యటన కంటే ఆస్ట్రేలియా పర్యటనే ప్రముఖంగా పత్రికల చర్చల్లో చోటు చేసుకుంది. నరేంద్ర మోడి ప్రభుత్వం ఆస్ట్రేలియా మీదుగా అమెరికాకు దగ్గరయిన పరిణామాలు ఆస్ట్రేలియా పర్యటనలో ఎక్కువగా నమోదు కావడం ఇందుకు కారణం. మూడు దేశాల పర్యటనలో 40 దేశాల అధినేతలను ఏదో ఒక రూపంలో ముఖాముఖీ కలవడం ద్వారా రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్ధాయి పరిణామాల్లోనూ మోడిని, నెహ్రూ తరహాలో, ప్రముఖ నాయకుడిగా పరిచయం చేయాలన్న ప్రయత్నం ఉంది. ఈ ప్రయత్నం వెనుక ప్రధాన పాత్ర దేశంలో హిందూత్వ శక్తులకు మద్దతుగా అంతకంతకు ఎక్కువగా సమీకృతం అవుతున్న దళారీ పెట్టుబడిదారులు, భూస్వామ్య శక్తులు ఉండగా వారికి సామ్రాజ్యవాదులు సైతం మద్దతు ఇస్తుండడం విశేషం.

ఆస్ట్రేలియా నగరం బ్రిస్బేన్ లో జరిగిన జి20 శిఖరాగ్ర సమావేశాలు ఎటువంటి ప్రభావశీలమైన నిర్ణయాలు లేకుండానే ముగిసిపోయాయి. తప్పదు గనుక ఉమ్మడి ప్రకటన (కమ్యూనిక్) జారీ చేశారు తప్ప అందులో ఎప్పటిలాగా పశ్చిమ దేశాలు ఎలాంటి డిమాండ్లను చొప్పించలేకపోయాయి. రష్యా, చైనాలు తమ ఆర్ధిక, రాజకీయ ప్రాబల్యాన్ని విస్తరించుకుంటున్న నేపధ్యంలోనే అమెరికా, ఐరోపా దేశాలు గతంలో వలే మూడో ప్రపంచ దేశాలపైనా, ఇండియా, చైనా, బ్రెజిల్ లాంటి వర్ధమాన దేశాలపైనా ముసుగు ఆదేశాలు జారీ చేయలేకపోయాయి.

ఉక్రెయిన్ విమానం కూల్చినందుకు బాధ్యత తీసుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పైన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ లు ఉమ్మడిగా విషం కక్కినప్పటికీ పశ్చిమ పత్రికలు తప్ప జి20 సభ్య దేశాలను అవి తమతోపాటు నిలపలేకపోయాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనాను చుట్టుముట్టి లొంగదీసుకునే వ్యూహంలో తమకు ఉన్న అవసరం రీత్యా జపాన్, అమెరికా మాటను కాదనలేని పరిస్ధితి వల్ల ఆస్ట్రేలియా దేశాలు రష్యాపై విషం కక్కడంలో అమెరికాకు తోడు నిలిచాయి.

ఈ నేపధ్యంలో జి20 సమావేశాల సందర్భంగా నరేంద్ర మోడి కార్యకలాపాలను పరిశీలించవలసి ఉంటుంది. జి20 సమావేశాలు ముగిసిన తర్వాత కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వ అతిధిగా మోడి మరిన్ని రోజులు ఆ దేశంలో గడిపారు. ఆస్ట్రేలియా అనంతరం జరిగిన ఫిజి పర్యటన, ఎక్కువ రోజులు ఆస్ట్రేలియాలో గడపడాన్ని కప్పి పుచ్చడానికి ఉద్దేశించినది మాత్రమేనన్న కొందరి విశ్లేషణలో వాస్తవం లేకపోలేదు. 28 యేళ్ళ తర్వాత ఆస్ట్రేలియా సందర్శించిన మొదటి భారత ప్రధానిగా మోడి పాల్గొన్న కార్యక్రమాలు, చేసుకున్న ఒప్పందాలు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో అమెరికా + యూరోప్ మరియు చైనా + రష్యాల మధ్య నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్ధితులకు ప్రతిబింబంగా నిలిచాయి.

అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా తన పివోట్-ఆసియా (ఆసియా కేంద్రక) వ్యూహాన్ని మొదటిసారి ఆస్ట్రేలియా పార్లమెంటులోనే ప్రకటించడం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు. పివోట్-ఆసియా వ్యూహంలో ఆస్ట్రేలియా, ఇండియాలను ప్రధాన భాగస్వాములుగా అమెరికా ఎంచుకుంది. చైనాకు వ్యతిరేకంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో తీవ్రంగా పెరిగిపోయిన ఆయుధ బలగాల కేంద్రీకరణలోనూ ఇండియా, ఆస్ట్రేలియాలు ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యం కొనసాగింపుకే తాము కట్టుబడి ఉన్నట్లు జి20 సమావేశాలలో బారాక్ ఒబామా మరోసారి పరోక్షంగా స్పష్టం చేశాడు.

నవంబర్ 17 తేదీన ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగించిన నరేంద్ర మోడి ఇరు దేశాల మధ్య సంబంధాలు దృఢతరం కావించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చాటారు. ఇండియాకు ఆస్ట్రేలియాతో ఉన్నట్లుగా అత్యధిక సినర్జీ (ఇరు శక్తులు వేరు వేరుగా ఉన్న మొత్తం కంటే కలిసినప్పుడు ఇంకా ఎక్కువ శక్తి ఉత్పన్నం కావడం) ఉన్న దేశాలు ప్రపంచంలో చాలా తక్కువ అని మోడి ప్రకటించారు. ఇండియాలో అభివృద్ధి కోరుకుంటున్న బిలియన్ మంది ప్రజలు ఉంటే ఆస్ట్రేలియాలో అభివృద్ధి సాధించిన కొద్ది మిలియన్ల మంది ఉన్నారని విస్తారమైన సహజవనరులు ఆస్ట్రేలియా ప్రజల సొంతమని మోడి వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు మోడి యధావిధిగానో, ఏదో మర్యాదకో చేసినవి కావు. వాటి వెనుక నిర్దిష్ట లక్ష్యం, అవగాహన ఉన్నాయి. ఆస్ట్రేలియా నుండి పెట్టుబడులు ఇండియాకు వరద కట్టాలని మోడి కాంక్షిస్తున్నారన్నది తెలిసిన విషయమే. ప్రపంచంలోనే అత్యధిక యురేనియం నిల్వలున్న దేశం ఆస్ట్రేలియా. సెప్టెంబర్ నెలలో ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ ఇండియా పర్యటించినప్పుడు ఇరు దేశాల మధ్య ‘పౌర అణు ఒప్పందం’ కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం యురేనియం ఇంధనాన్ని ఆస్ట్రేలియా సరఫరా చేయాలి. వైద్య ప్రయోజనాల కోసం రేడియో ఐసోటోపులు కూడా సరఫరా చేయాల్సి ఉంది. యురేనియంతో పాటు ఆస్ట్రేలియా నుండి బొగ్గునూ దిగుమతి చేసుకోవాలని భారత పాలకులు ఆశిస్తున్నారు. ఆస్ట్రేలియా బొగ్గు గనులను అభివృద్ధి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నది భారతీయ పెట్టుబ్బడిదారుడు, మోడికి సన్నిహితుడుగా పేరు పొందిన గుజరాత్ పారిశ్రామికవేత్త అదాని కావడం గమనార్హం. ఈ కాంట్రాక్టు మేరకు అదాని కంపెనీ, ఆస్ట్రేలియాలోని అతి పెద్ద బొగ్గుగని కార్మైఖేల్ లో 16 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టబోతున్నాడు.

ఆస్ట్రేలియా నుండి ఎఫ్.డి.ఐ లు వరదలా పారాలని ఆ దేశంలో ప్రచారం చేసి వచ్చిన మోడి దానికి విరుద్ధంగా అదాని పెట్టుబడులే ఆస్ట్రేలియాకి వెళ్తుంటే ఎందుకు ఆపలేదు? అదాని పెట్టుబడులు ఇండియాలోనే అవసరమైన చోట ఎందుకు పెట్టకూడదు? విషయం ఏమిటంటే ప్రపంచంలో వివిధ బొగ్గు గనుల అభివృద్ధికి ఎవరూ ముందుకు రావడం లేదు. బొగ్గు ఉత్పత్తి వల్ల వచ్చే లాభం చాలా తక్కువకు పడిపోయింది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల నుండి విద్యుత్ ఉత్పత్తి చేయడం పెరగడంతో ఆరేళ్ళ కనిష్ట స్ధాయికి బొగ్గు రేట్లు పడిపోయాయి. ఆ పెట్టుబడిని మరో చోట పెడితే మరిన్ని లాభాలు వస్తాయన్న దృష్టితో ఆస్ట్రేలియా బొగ్గు గనుల అభివృద్ధికి పెట్టుబడులు ముందుకు రాని పరిస్ధితి. అతి పెద్ద ఆస్ట్రేలియా బొగ్గు కంపెనీలు బి.హెచ్.పి బిల్లిటన్, గ్లెన్ కోర్ లు తమ బొగ్గు ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేశాయి.

ఈ నేపధ్యంలో పౌర అణు ఒప్పందాన్ని ఎరగా వేసి అదాని పెట్టుబడులను ఆస్ట్రేలియా సంపాదించింది. ఇవి అదాని సొంత పెట్టుబడులు కావు. భారత ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్.బి.ఐ 1 బిలియన్ డాలర్ల రుణాన్ని అదానికి ఇస్తోంది. ఒక విదేశీ ప్రాజెక్టుకు ఒక భారత బ్యాంకు ఇంత భారీ రుణం ఎప్పుడూ ఇవ్వలేదు. ఇది భారత ప్రజల సొమ్ము. డబ్బు లేదని బొంకుతున్న పాలకులు ఆస్ట్రేలియాలో పెట్టుబడిగా ఎలా తరలిస్తున్నారు?

ఎస్.బి.ఐ రుణం కాకుండా సౌత్ కొరియా, అమెరికాలకు చెందిన బ్యాంకులు అదానికి 3 బిలియన్ల వరకు రుణం ఇస్తున్నాయి. అనగా బొగ్గుగని ప్రాజెక్టును అభివృద్ధి చేసిన ఫలితం ఆస్ట్రేలియాకు దక్కితే ద్రవ్య లాభం ప్రధానంగా అమెరికా, కొరియా బ్యాంకులకు వెళ్లనుంది. ఎందుకంటే ఎస్.బి.ఐ ఇచ్చిన రుణం ఏదో ఒకనాడు నిరర్ధక ఆస్తుల కింద రద్దు చేసే సౌలభ్యం ఉంది. ఈ విధంగా ఆస్ట్రేలియాలో అపార ఖనిజవనరులు ఉన్నాయనే పేరుతో భారత ప్రజల సొమ్మును ఆస్ట్రేలియాకు తరలిస్తున్నారు. మోడి అక్కడ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగానే ఇక్కడ ఎస్.బి.ఐ రుణం ఇస్తున్నట్లు ప్రకటించడం బట్టి భారత ప్రజల పొదుపు సొమ్ముపై కూడా విదేశాల పెత్తనం ఏ మేరకు ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s