పడిపోనున్న 2014 Q2 వృద్ధి రేటు -అంచనా


2014-15 ఆర్ధిక సంవత్సరానికి గాను మొదటి త్రైమాసికంలో (2014 Q1) 5.7 శాతం జి.డి.పి వృద్ధి రేటు సాధించడం తమ ఘనతే అని నరేంద్ర మోడి/బి.జె.పి/ఎన్.డి.ఏ2 ప్రభుత్వం చెప్పుకుంది. తమ ప్రభుత్వం దాదాపు మే నెల చివరి వరకు కొనసాగినందున 5.7 వృద్ధి రేటు తమ ఘనతే అని గత యు.పి.ఏ ప్రభుత్వం మోడి ప్రభుత్వంతో పోటీకి వచ్చింది. ఇప్పుడు 2014 రెండవ త్రైమాసికంలో వృద్ధి రేటు పడిపోనున్నదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జి.డి.పి తగ్గడానికి కారణం తమ ప్రభుత్వమే అని మోడి ప్రభుత్వం అంగీకరిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

రెండవ త్రైమాసికం ఆర్ధిక ఫలితాలు వచ్చే శుక్రవారం (నవంబర్ 28) అధికారికంగా వెలువడనున్నాయి. అధికారిక అంచనాలు వెలువడడానికి ముందే సర్వే జరిపి వృద్ధి రేటు ఎంత ఉండవచ్చో అంచనా వేయడం వాణిజ్య పత్రికలకు ఉన్న అలవాటు. ఈ అలవాటు మేరకు కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ అధికారులను కూడా సంప్రదించిన రాయిటర్స్ వార్తా సంస్ధ 2014 Q2 లో వృద్ధి రేటు 5 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది.

అనగా మొదటి త్రైమాసికంలో నమోదైన 5.7 శాతం నుండి అమాంతం 5 శాతానికి వృద్ధి రేటు పడిపోతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో ఈ 0.7 శాతం తేడా కూడా చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ వేసుకున్నా 5.2 శాతం కంటే మించి నమోదు కాకపోవచ్చని కేంద్రంలో అధికారులు భావిస్తున్నారని రాయిటర్స్ తో పాటు ఇతర వాణిజ్య పత్రికలు కొన్ని నివేదించాయి. జి.డి.పి తగ్గుదలకు నరేంద్ర మోడి లేదా అరుణ్ జైట్లీ ఎవరిని బాధ్యులుగా చూపనున్నారన్నది ఆసక్తికరమైన అంశం.

తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం పని చేస్తోందని వెంకయ్య నాయుడు, జైట్లీ లాంటి పెద్దలు చెప్పుకున్నారు. దాని ఫలితంగానే ఆర్ధిక వృద్ధి రేటు మెరుగైందని వారు గట్టిగా చెబుతారు. మంచి ఫలితాలు వస్తే తమ ఘనతే అని బాకాలు ఊదుకోవడం, ప్రతికూల ఫలితాలు వస్తే గత ప్రభుత్వాల పాపాన్ని తాము ఇంకా మోస్తున్నామని తప్పుకోవడం బి.జె.పి నేతలకు ఉన్న అలవాటు. బహుశా అధికారిక ఫలితాలు వచ్చాక ఇదే వాదనను బి.జె.పి నాయకులు చేయవచ్చు.

“రెండో త్రైమాసికంలో ఆర్ధిక వృద్ధి రేటు 5 శాతం దగ్గరలో ఉండవచ్చు. వ్యవసాయ ఉత్పత్తి, పారిశ్రామిక ఉత్పత్తి పడిపోవడమే దానికి ప్రధాన కారణం. మహా అయితే 5.2 శాతం వృద్ధి రేటు నమోదు కావచ్చు. అంతే” అని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారని రాయిటర్స్ తెలిపింది.

వృద్ధి రేటు పడిపోవడం వల్ల వడ్డీ రేటు విషయంలో ఆర్.బి.ఐ గవర్నర్ పైన ఒత్తిడి పెరగవచ్చు. ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీల మధ్య ఈ విషయంలో ఇప్పటికే ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోందని కొద్ది రోజుల క్రితం ఏ.బి.ఎన్ ఛానెల్ ప్రత్యేక వార్తా కధనం ప్రసారం చేసింది. వడ్డీ రేటు తగ్గించడానికి ఆర్.బి.ఐ నిర్ణయిస్తే ఆ మేరకు పెట్టుబడులు పెరిగి జి.డి.పి పెరగవచ్చని ప్రభుత్వం ఆశిస్తోంది. కానీ వడ్డీ రేటు తగ్గించినంత మాత్రాన ఎకాఎకిన జి.డి.పి వృద్ధి చెందుతుందన్న గ్యారంటీ ఏమీ లేదు.

ఆర్.బి.ఐ వడ్డీ రేటును తగ్గిస్తే వాణిజ్య బ్యాంకులు మరింత మొత్తాన్ని ఆర్.బి.ఐ నుండి రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతాయి. ఫలితంగా బ్యాంకులు మరిన్ని రుణాలను పరిశ్రమల యాజమాన్యాలకు పంపిణీ చేస్తారని, ఈ సొమ్ముతో పారిశ్రామిక వేత్తలు కొత్త పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి అధికం చేస్తారని, తద్వారా ఉపాధి కూడా పెరుగుతుందని ఆర్ధిక వేత్తలు అంచనా వేస్తుంటారు. ఈ ఆశతోనే వడ్డీ రేటు తగ్గించాలని అరుణ్ జైట్లీ ఆర్.బి.ఐ ని కోరుతున్నారు.

అయితే జి.డి.పి వృద్ధి రేటు కేవలం వడ్డీ రేటు తగ్గించడం వల్లనే సాధ్యం కాదు. అదీకాక వడ్డీ రేటు తగ్గింపు ద్వారా సమకూరిన అదనపు డబ్బును పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు స్పెక్యులేటివ్ కార్యకలాపాలలో వెచ్చిస్తూ వేగంగా లాభాలు పొందే మార్గాలు వెతకడం అలవాటు చేసుకున్నారు. ఉత్పాదక కార్యకలాపాల్లోకి తక్కువగా వెళ్తున్నారు. ఫలితంగా వడ్డీ రేటు తగ్గింపు వల్ల జి.డి.పి వృద్ధిపై సానుకూల ప్రభావం ఉంటుందని గ్యారంటీ లేదు. కాకపోతే పారిశ్రామిక వేత్తలు, బడా వ్యాపారులు, ఇతర ధనిక వర్గాలకు మరింత డబ్బు అందుబాటులోకి వచ్చే మాట నిజం. అనగా వడ్డీ రేటు తగ్గింపు ధనికవర్గాలకు తప్ప కింది వర్గాలకు ప్రయోజనం చేకూర్చవు.

అదీకాక అంతర్జాతీయంగా కూడా పరిస్ధితులు ఇంకా ఏమీ మెరుగుపడకపోగా మరింత దిగజారింది. చివరికి ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ప్రధాన ఇంజన్ గా ఉన్న చైనా కూడా ఆర్ధిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. ఆర్ధిక వ్యవస్ధకు ఊపు తేవడానికి కొద్ది రోజుల క్రితమే చైనా ఆర్ధిక ఉద్దీపన ప్రకటించింది. జపాన్ కూడా మరో ఆర్ధిక ఉద్దీపన ప్రకటించింది. అమెరికా, యూరోప్ లపై ఇండియా ఐ.టి సేవల ఎగుమతులు ఆధారపడి ఉన్నందున ఆ వైపు కూడా పరిస్ధితి సానుకూలంగా లేదు. ఇన్ని ప్రతికూల పరిస్ధితుల మధ్య ఆర్.బి.ఐ వడ్డీ రేటు తగ్గించినా అది జి.డి.పి వృద్ధి రేటు పెంపుదలగా మారడం అనుమానమే.

9 thoughts on “పడిపోనున్న 2014 Q2 వృద్ధి రేటు -అంచనా

  1. స్పెక్యులేషన్ అంటే లాభం వస్తుందనే అంచనాతో, రిస్క్ తీసుకుని పెట్టే పెట్టుబడి. ఆ పెట్టుబడిదారులు ఏ పనీ చెయ్యరు, లాభాలు వచ్చేంత వరకు స్తాక్ మార్కెత్‌ల వైపు వేచి చూడడం తప్ప. స్పెక్యులేషన్ అంటేనే చూస్తూ ఉండడం అని అర్థం. ఆ పెట్టుబడిదారులకి లాభాలు రాకపోతే బ్యాంక్ ఋణాలు ఎగ్గొడతారు. గతంలో Global Trust Bank దివాలా తీసినట్టు ఇప్పుడు ICICI, HDFC, HSBC లాంటి బ్యాంక్‌లు దివాలా తీస్తాయి.

  2. sir in your opinion what the government has to do to come out from this situation. please suggest instead simply leaving the situation by giving an explanation. so that we can get an idea on some more economic concepts

    sir could you explain why the government collecting money for LPG and depositing back in account. what might the logic behind.

  3. గ్యాస్‌ని అధిక ధరకి అమ్మి, ఆ తరువాత వినియోగదారులకే సబ్సిదీ పేరుతో డబ్బులు తిరిగివ్వడం అనేది నీ దగ్గర డబ్బులు లాక్కొని నీకే డబ్బులు తిరిగివ్వడం లాంటిది. దాని వల్ల గ్యాస్ వినియోగదారుల ఖాతాలు ఉన్న బ్యాంక్‌లకి త్రాన్సాక్షన్స్ ఒత్తిడి పెరుగుతుంది తప్ప వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు.

  4. ఆయన్ని నియమించింది మనవాళ్లు కాదు. విదేశీ గంధర్వులు ఆయన్ని ఎంచుకున్నారు. కనుక ఆయన స్కేప్ గోట్ అయ్యే అవకాశం లేదు, ఏదో అద్భుతం జరిగితే తప్ప.

  5. మొన్న ప్రధానమంత్రి గారు దేశంలోకి పెట్టుబడులను ఆహ్వానించటానికి జపాను పర్యటన చేసారు, ఇప్పుడు సీమాంద్ర ముఖ్యమంత్రి గారు కూడా పారిశ్రామికవేత్తలతో కలిసి కాదు కాదు మంత్రులతో కలిసి జపాను పర్యటనకు వెళ్ళారు పెట్టుబడులు ఆహ్వానించటానికి, మంచిదే.. అయితే ఈ పర్యటనలో మన పాలకులు, మనం తెలుసుకోవాల్సిన విషయాలు…1.) జపాను ప్రధానమంత్రి 4 రోజుల క్రితం దిగువ పార్లమెంట్ ను రద్దు చేసి వచ్చే నెలలో ఎన్నికలకు వెళ్ళబోతున్నారు, పాలకపక్షంగా మరో రెండేళ్ళు అధికారంలో కొనసాగే అవకాశం ఉన్నప్పటికి సంక్షోభంలో ఉన్న ఆర్ధిక వ్యవస్థను సరిదిద్దలేక ప్రజామోదం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆరేళ్ళలో ఈయన 7వ ప్రధానమంత్రి. ఇంత తీవ్ర స్థాయిలో సంక్షోబం పెరగటానికి గల కారణాలు చూస్తే…ధీర్ఘకాలంగా ఉన్న జపాను సంక్షోభం నుండి దేశాన్ని గట్టెంకించటానికి జపాను కేంద్ర బ్యాంకు విచ్చలవిడిగా కరెంసీ నోట్లను ముద్రించి ప్రజలకు రుణాల రూపమ్లో ఇచ్చింది. డబ్బు సరఫరా పెరగడంతో కరెంసీ యెక్క విలువ తగ్గిపోయి జపాను షేర్ మార్కెట్ విదేశీ పెట్టుబడులతో కళకళలాడింది make in japan సక్సెస్ అయింది. కాని మధ్యతరగతి, పేద ప్రజల తలరాతలు మాత్రం కొంచెం కూడా మారలేదు, వచ్చే ఆదాయం రుణాలు తిరిగి చెల్లించటానికే సరిపోయింది. మరోవైపు పెనుభారంగా ఉన్న రుణభారం తగ్గించుకునెందుకు ప్రభుత్వం ప్రజలపై విక్రయ పన్ను 5% నుండి 8% కి పెంచింది. దీనితో ప్రజల కొనుగోళ్ళు ఆపటంతో ఒక్కసారిగా తీవ్ర సంక్షోబంలోకి వెళ్ళింది.2.) ఒక ప్రక్క జపాను దేశం తీవ్ర సంక్షోభం లో ఉన్నాకూడా అక్కడి వ్యాపారవేత్తలకు వచ్చిన నష్టం ఏమి లేదు, అందుకే వారికున్న అపారమైన సంపదతో మన దేశం లో పెట్టుబడులు పెట్టడానికి సిద్దంగా ఉన్నారు.దీని నుండి మన పాలకులు నేర్చుకోవాల్సింది :- creation of wealth కన్నా మన దేశంలో కూడా distribution of wealth అనేది ఇప్పుడు చాలా అవసరం.మనం తెలుసుకోవాల్సింది :- సంక్షోభాలు, భారాలు, దేశభక్తి అనేవి ఎన్నికలలో ఓట్లు వేసిన వారికి అంటకట్టి…సంపదపోగుబెట్టుకోవటం, పక్క దేశం లో వ్యాపారాలు చేసి లాభాలు మూటగట్టే అవకాశం మటుకు ఎన్నికల నిధులు సమకూర్చినవారికేఇస్తాయి మన ప్రభుత్వాలు.

  6. i came to know japan issue with your article thanks, iam improving knowledge in these aspects in these days. sir, you said about inflation of japan market, but didnt discuss about loan aspects that country. similarly, another aspect of investment of japan business people, when people purchasing power is decreased how the impact will not be on entrepreneurs. how they raise money to invest in other countries.

  7. 2014 అక్తోబర్‌లో దేశం నుంచి ఎగుమతైన సరుకుల విలువ 2609 కోట్ల దాలర్లైతే దిగుమతి అయిన సరుకుల విలువ 3945 కోట్ల దాలర్లు. ఎగుమతుల విలువ కంటే దిగుమతుల విలువ ఎక్కువగా ఉంటే ఫారెక్స్ మార్కెత్‌లో మన కరెన్సీ విలువ తగ్గుతుంది. రూపాయి విలువ మరీ తక్కువైతే తమకి ఆదాయం రాదనుకుని విదేశీ పెట్టుబడిదారులు మన దేశానికి రావడానికి భయపడతారు. కరెన్సీ విలువ తగ్గుదల వల్ల ద్రవ్యోల్బణం కూడా వస్తుంది. రూపాయి విలువ 50 పైసలు స్థాయికి తగ్గితే కరెన్సీ ముద్రణని రెండింతలు పెంచాల్సి వస్తుంది. వనరులు పెరగకుండా కరెన్సీ ప్రవాహం పెరిగితే ధరలు పెరుగుతాయి కనుక ద్రవ్యోల్బణానికి విదేశీ పెట్టుబడిదారులు భయపడతారు. ఇన్ని సమస్యలు ఉండగా విదేశీ పెట్టుబడుల వల్ల దేశం అభివృద్ధి చెందుతుందని మన పాలకులు ప్రచారం చేస్తున్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s