(ఈ కవిత 2001లో రాసింది. అంతకుముందు సంవత్సరం నా పుట్టిన రోజు నాడు మా డివిజనల్ మేనేజర్ పంపిన గ్రీటింగ్ కార్డ్ కు ‘ప్రణమీయ హితైషి’ కవితతో బదులిచ్చానని చెప్పా కదా. అది చూసి మా కొలీగ్ ఒకరికి తనకు కూడా నా చేత కవిత రాయించుకోవాలని తోచింది. కానీ నాకు స్ఫూర్తి తెప్పించడం ఎలా? అందుకు తానొక పధకం వేసుకున్నారు. సంవత్సర కాలం పాటు ఓపిక పట్టారు. తర్వాత యేడు పుట్టిన రోజుకి నేను నిద్ర లేవకముందే -నేను లేటుగా లేస్తాన్లెండి!- ఇంటికి ఫోన్ చేసి (అప్పట్లో ఇంకా ల్యాండ్ లైన్ ఫోన్లే) ‘శుభా కాంక్షలు’ చెప్పారు. అది కవిత కోసమే అని నాకు అర్ధం అయింది. చచ్చినట్లు అప్పటికప్పుడు ఓ కవిత రాసేసి ఆఫీసుకి పట్టుకెళ్లి ఇచ్చాను. అందుకు మా కొలీగ్ ఎంతో సంతోషపడ్డారు. -విశేఖర్)
*********
స్పృహ లేని అలజడి
సడి లేకుండా నాడుల్ని అల్లుకుపోతున్న క్షణాలు
అలలుగా విరుచుకు పడుతున్న గురక సవ్వడి
కలల కల్లోలాన్ని చెప్పకనే చూపుతోంది
శ్వాస, ఖణేల్ మంటున్న నిశ్శబ్ద నిశీధిలో
భావ ఘర్షణల ముద్రలు
అల్లకల్లోలం రేపుతున్నాయి
రాత్రి……………
రోజు మారినా దరిచేరని నిద్రా దేవత
నా ఒంటిని తన ఒడిలో చుట్టేసి
వెలుతురు పిట్టల పాటల్ని
నా చెవిని సోకనీయడం లేదు
*** *** ***
ఎస్.ఏ-21 లో జింగిల్ బెల్స్ లా…
లీలగా… … … బాల్యం బడిలా…
గణగణ గణగణ గణగణ…
రెప్పల బరువు తప్పించలేక
చెవులు అయిష్టంగా రిక్కించాను
గణగణ కాదది, ట్రింగ్… … … ట్రింగ్… … …
ఉలికిపాటు నడకై
ఆనక పరుగై
ఫోను గొంతు నోక్కేస్తే
మనిషి గొంతు వినిపించింది
“మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే”
ఎందుకు చేప్మా?!
గతం పొరల్లో దారి దొరకలేదు
ఆ గొంతే మళ్ళీ మోగక తప్పలేదు
ఔరా! నేను పుట్టింది ఈ రోజేనట!
ఔను కదూ!!!
*** *** ***
కలల కల్లోలాల్ని తరిమేయించి
స్మృతుల ధారను
బాల్యం పూపొదలపై జార్చి
యాంత్రిక క్షణాలకు చురుకు పుట్టించిన
నేస్తమా…..!
నీకివే నా కృతజ్ఞతాంజలి!
(ఎస్.ఏ-21 అంటే కేసియో ప్లేయర్ లో బేసిక్ మోడల్)
read twice to understand, nice. simple and sweat