సాధారణ ఎన్నికల్లో బి.జె.పి గెలుపుకి వాల్ స్ట్రీట్ కంపెనీలూ స్వయంగా రంగంలోకి దిగడం తెలిసిన విషయమే. సామ్రాజ్యవాద కంపెనీలు గనుక తమ అనుకూల ప్రభుత్వాలు వచ్చేలా చూసుకోవడం అవి ఎప్పుడూ చేసేపనే.
కానీ సార్క్ సహోదరి శ్రీలంక ప్రభుత్వం సైతం తన పొరుగునే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో బి.జె.పి పునాదులు విస్తరించడానికి సకరిస్తుందని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు.
భారతీయ జనతా పార్టీలో వ్యూహ చతురుడుగా ప్రసిద్ధికెక్కిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, తమిళనాడులో కమలం వికసించడానికి శ్రీలంక కోర్టు తీర్పును సైతం సానుకూలంగా మాలుచుకుంటున్నారని కార్టూన్ సూచిస్తోంది.
విషయం ఏమిటో పాఠకులకు తెలిసే ఉండాలి. శ్రీలంకకు చట్ట విరుద్ధంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న పేరుతో 5గురు మత్స్యకారులకు అక్కడి సుప్రీం కోర్టు ఉరి శిక్ష విధించింది. ఇంకేం, తమిళనాడులో రాజకీయ పార్టీలు హాహాకారాలు మొదలు పెట్టాయి. మోడి ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలని డిమాండ్ చేశాయి. కొన్ని జాతీయ పత్రికలు సైతం సంపాదకీయాలు రాసి శ్రీలంక చర్యను నిరసించాయి.
జరగవలసినంత గొడవ జరిగాక, పుట్టాల్సినంత కాక పుట్టాక… శ్రీలంక అధ్యక్షుడు ఉరిశిక్ష పడిన భారతీయ జాలరులకు క్షమా భిక్ష పెడుతున్నట్లు ప్రకటించారు. దానితో తమిళనాట హర్షధ్వానాలు మిన్ను ముట్టాయి. వ్యూహ చతురత పేరుతో తెగించాలే గానీ ఈ హర్షాన్ని కూడా సొమ్ము చేసుకోవడం ఎంత సేపని!
అందునా ‘పురచ్చితలైవి’ ని అవినీతి కేసులో శిక్ష వేయించి పదేళ్ళ పాటు ఎన్నికలకు అనర్హురాలినిగా చేసిన దరిమిలా అక్కడ మిగిలిన ఖాళీని పూడ్చగల అద్భుతమైన అవకాశం చేరువలోకి వచ్చాక ఇక ఏ వ్యూహానికైనా అడ్డం ఉండబోదు.
ఉరిశిక్ష రద్దు అయినందున వారి విడుదల తేదీ నాడు ఇంటికి వస్తారని తమిళనాడులో బంధువులు, స్నేహితులు, రాజకీయ పార్టీలు స్వాగత సత్కారాలు ఏర్పాటు చూస్తున్న వేళ వారు ఎక్కిన విమానం చెన్నైకి బదులు నేరుగా న్యూ ఢిల్లీ వెళ్లిపోయింది.
న్యూ ఢిల్లీలో బి.జె.పి ప్రభుత్వ నేతలు తగిన స్వాగత సత్కారాలు అందజేసి, జాలరులకు వారికి చెప్పాల్సినవి చెప్పిన తర్వాత మాత్రమే వారు చెన్నైకి వచ్చారు. అదేమిటని అడిగితే పొరుగు దేశంలో శిక్ష పడ్డావారిని గూఢచార సంస్ధలు డీబ్రీఫ్ చేయడం ఆచారం అని చెప్పారు.
ఆచారాలను ఓట్లుగా మలుచుకునే విద్యలో బి.జె.పి ఎలాగూ పండిపోయింది కదా!