(మరి కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయనున్న సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను 2జి కేసు విచారణ నుండి పక్కకు తప్పుకోవాలని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించిన పరిణామంపై ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం ఈ వ్యాసం. -విశేఖర్)
**************
సి.బి.ఐ డైరెక్టర్ గా రంజిత్ సిన్హా హయాం గురించి సానుకూలాంశం ఏదన్నా ఉందంటే అది, మరి కొద్ది రోజులలో ఆయన హయాం ముగింపుకు రావడమే. సున్నితమైన కేసుల్లో అత్యంత సామర్ధ్యంతో పరిశోధన చేసిన చేస్తుందన్న సంస్ధగా అనేకమంది నమ్మకం పెట్టుకున్న ఈ దేశ ప్రధాన ఏజన్సీ నుండి ఆయన బైటికి వెళ్ళేనాటికి సంస్ధ విశ్వసనీయత తుడిచిపెట్టుకుపోయిన భాగంలో ఆయన భారీ వాటాను స్వంతం చేసుకుని ఉంటారు. కేవలం సుప్రీం కోర్టుకు మాత్రమే ఉద్దేశించబడిన స్టేటస్ రిపోర్ట్ ను న్యాయ మంత్రి చూడడానికి అనుమతించడం దగ్గర్నుండి విచారణలో ఉన్న అనుమానితులతో అనధికారిక సంబంధాలు నెరపడం వరకు రంజిత్ సిన్హా పదే పదే తన సొంత ఏజన్సీ, కార్యాలయ గౌరవం మరియు న్యాయ కారణాలు తలదించుకోవడానికి కారణం అయ్యారు. 2జి స్పెక్ట్రమ్ కేసుల నుండి దూరంగా ఉండాలని ఆయనకు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశం గతంలో ఎన్నడూ ఎరగనిది.
న్యాయ పాలనలో జోక్యం చేసుకోవడం, పరిశోధనను పట్టాలు తప్పించడానికి లోపలినుండి ప్రయత్నాలు చేయడం, అసౌకర్యంగా ఉన్నారని భావించిన అధికారులను పరిశోధన బృందం నుండి అకారణంగా తొలగించడం… ఇవే ఆయనపై వచ్చిన ఆరోపణలు. అవినీతి ఆరోపణలున్న వారికి సహాయం చేయాలని భావించడం, ఎయిర్ సెల్-మాక్సిస్ కేసులో ఛార్జి షీటు దాఖలు చేయడంలో ఆలస్యం చేయడం… ఇవి సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ అనే ఎన్.జి.ఓ ఆయనపై చేసిన ఆరోపణలు. ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆరోపణలు ప్రాధమికంగా విశ్వనీయమైనవిగా భావించింది. అయినప్పటికీ ఏజన్సీ ప్రతిష్టను పరిరక్షించడం కోసం వివరణాత్మక ఆదేశాలు ఇవ్వకుండా ధర్మాసనం సంయమనం పాటించింది. అయితే, సిన్హా దుష్కృత్యాలు ఏపాటివో నిర్ధారించి తగిన క్రమశిక్షణ చర్య తీసుకునే బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై పడింది.
సి.బి.ఐ సంస్ధ ‘పంజరంలోని చిలుక’, అనగా, రాజకీయ ఒత్తిడుల నుండి తన స్వతంత్రతను కాపాడుకోవడానికి పోరాడుతున్న సంస్ధ అంటూ సంప్రదాయకంగా వస్తున్న నిర్వచనాన్ని సిన్హా స్వయంగా సంస్ధ నెత్తి మీదికి తెచ్చారు. ఆయన హయాంలో, ఏజన్సీ తనకు తానుగా ఎంపిక ద్వారానే నమ్రతగా వ్యవహరిస్తున్నట్లుగానూ, న్యాయం తప్ప మరే ఇతర కారణాల కోసమైనా ఇష్టంగానే పని చేస్తున్నట్లుగానూ కనిపించిన దశలు ఉన్నాయి. అనేక అంశాల్లో పరిగణించదగిన పురోగతి ఏమన్నా ఉన్నదంటే అది కేవలం న్యాయ వ్యవస్ధ పర్యవేక్షణ మరియు ముల్లు పొడుపు వల్లా, మనస్సాక్షి కలిగిన పరిశోధకుల అప్రమత్తత వల్లా, (స్వచ్ఛంద) కార్యకర్తల మెలకువ వల్లా మాత్రమే సాధ్యపడింది. సిన్హా నివాస సందర్శకుల వివరాలను వెలుగులోకి తెచ్చిన విజిల్ బ్లోయర్ పేరును వెల్లడి చేయాలన్న తన పాత ఆదేశాన్ని సుప్రీం కోర్టు వెనక్కి తీసుకోవడం కూడా ఈ వ్యవహారంలో సరిగ్గా ఇమిడిపోయింది.
ఒక వ్యక్తి అందజేసిన సమాచారం విశ్వసనీయమైనదేనని ఒకసారి రుజువయ్యాక, ఆ ఇన్ఫార్మర్ గుర్తింపును వెల్లడి చేయాల్సిన అవసరం లేదన్న 2జి కేసు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనంద్ గ్రోవర్ చేసిన వాదనతో కోర్టు సరిగ్గానే ఏకీభవించింది. సిన్హా నిష్క్రమణం -ఆయన స్వయంగా రాజీనామా చేయడం ద్వారా మరికొన్ని రోజులు ముందుకు జరిగినట్లయితే ఇంకా సబబుగా ఉండేది- సి.బి.ఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించి లోక్ పాల్ చట్టంలో ప్రతిపాదించబడిన సంస్కరణలను ఆచరణలోకి అనువదించడానికి తగిన అవకాశం కల్పిస్తుంది. న్యాయ స్ధాపనకు సంబంధించినంతవరకు చట్టం కేవలం ఆస్తికలను మాత్రమే సమకూర్చుతుందని, దాన్ని అమలుచేసేవారే దానికి అవసరమైన ఆత్మను, సత్తాను ఇస్తారని మాత్రం మరువరాదు.