‘ఎద్దు పుండు కాకికి ముద్దు’ అని సామెత. కొమ్ములకు అంటించిన మంటలు చెలరేగి పోతుంటే భయంతో పరుగులు తీసే ఎద్దుతో ఆడుకుంటూ స్పానియార్డ్ లు పడే సరదా చూస్తే ‘ఇదేం ఆనందం’ అనిపించక మానదు. కొమ్ములు తిరిగిన భారీ ఎద్దులతో పోరాటాలకు దిగడం స్పానిష్ సంస్కృతిలో భాగం అని అందరికి తెలిసిన విషయమే. కానీ ఫైర్ బుల్ ఫెస్టివల్ (టోరో డి జుబిలో) పేరుతో స్పెయిన్ లో ఏటా జరిగే ప్రాణాంతక పండగ విషయం తెలిసింది తక్కువ మందికే కావచ్చు.
ఫైర్ బుల్ ఫెస్టివల్ స్పెయిన్ లో మెడినాసెలీ పట్టణంలో మాత్రమే జరుగుతుందిట. ఈ పండగ సరిగ్గా అర్ధరాత్రి సమయంలో జరుగుతుంది. మైదానం మధ్యలో ఒక స్తంభాన్ని ఉంచి ఎద్దును దానికి కట్టేస్తారు. ఎద్దు కొమ్ములకు తేలికగా మండే స్వభావం కలిగిన తారు ముద్దలను బంతులుగా చేసి తగిలిస్తారు. ఆ తర్వాత తారు ముద్దలకి నిప్పు పెడతారు. మంటలు బాగా అంటుకున్నాక స్తంభానికి కట్టేసిన ఎద్దును వదిలేస్తారు.
కటిక చీకట్లో ఇక ఎద్దు కొమ్ములకు అంటించిన తారు కాగడాల తరహాలో వెలిగిపోతు ఉంటుంది. ఆ మంటల ధాటికి ఎద్దు భయంతో అటూ ఇటూ పరుగెత్తుతూ అడ్డం వచ్చినవారిని కుమ్మేయడానికి ప్రయత్నిస్తుంటే ఆ ఎద్దుతో ఆడుకోవడం అక్కడి జనానికి సరదా. ఆడేవాడిది ఒక సరదా అయితే వారి ఆటను చూసి కేరింతలు వేసే జనానిది మరో సరదా. తారు ముద్దలు పూర్తిగా మంటలకు ఆహుతి అయ్యేవరకు ఈ ఆట కొనసాగుతుంది.
మంటల వేడి ఎద్దుకు తగలకుండా ఉండేందుకు అని చెబుతూ ఎద్దు ముఖం నిండా బురదను పూస్తారు. ఎంత బురద పూసినా ఆ వేడి ఎక్కడికి పోతుంది? అది కూడా ఎద్దు శరీరంలో భాగం అయిన కొమ్ములకి నిప్పు పెట్టినాక?! ఎద్దులను రెచ్చగొట్టడానికి ఎర్ర రంగు బట్టలను వాటి ముఖం ముందు ఊపుతూ, స్టేడియంలో జనం కేకలతో హోరెత్తిస్తుంటే, ఆ ఎద్దులతో పోరాడే స్పానియార్డ్ లు దానితో తనివి తీరక ఈ ఫైర్ బుల్ ఫెస్టివల్ ని కనిపెట్టారేమో తెలియదు.
ఇటీవల కాలంలో జంతు ప్రేమికులు ఫైర్ బుల్ ఫెస్టివల్ కు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు తెలియజేస్తున్నప్పటికి ఫెస్టివల్ మాత్రం ఆగలేదు. జంతు హక్కుల కార్యకర్తలు ఈ సంవత్సరం గట్టిగా ప్రతిఘటించడంతో పండగ కొద్ది సేపు వాయిదా పడిందే తప్ప జరగకుండా మాత్రం ఆగలేదు. కార్యకర్తలు తమను తాము మైదానం మధ్యలో ఎద్దుని కట్టివేసే స్తంభానికి తమను తాము కట్టివేసుకుని నిరసన తెలిపారు.
పండగ కొనసాగాలని కోరేవారు జంతు హక్కుల కార్యకర్తలతో ముష్టి యుద్ధాలకు తలపడడంతో పోలీసులు రంగంలోకి దిగి హక్కుల కార్యకర్తలను అక్కడి నుండి తొలగించారే గానీ ఫెస్టివల్ ని నిరోధించే పనికి పూనుకోలేదు. ఇదే ఘర్షణ వ్యవహారం బహుశా వచ్చే సంవత్సరమూ కొనసాగవచ్చు. చివరికి సంస్కృతి పరిరక్షకులే విజయం సాధించడం, కార్యకర్తలను పోలీసులు తొలగించడం మామూలుగా జరిగిపోతుంది.
ఫెస్టివల్ ఇష్టులు, జంతు హక్కుల కార్యకర్తలు ఘర్షణ పడుతున్న దృశ్యాలను కూడా కింది ఫొటోల్లో చూడవచ్చు. ఈ ఫోటోలను ది అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది.
శాడిస్ట్ మెంటాలిటీ!, ఆటవిక వేట దశ నుండి ఇంకా పూర్తిగా బయట పడలేదు.