ఇంజనీర్ కమ్ సంత్ రాంపాల్ ఎట్టకేలకు కటకటాల వెనక్కి చేరారు. గారడీ విద్యలతో, బూటకపు శాస్త్ర పరిజ్ఞానంతో ఉత్తర, మధ్య భారతంలో అనేకమందిని తన భక్తులు/శిష్యులుగా చేసుకున్న సంత్ రాంపాల్ ను లొంగదీయడంలో పంజాబ్ & హర్యానా హై కోర్టు ఎట్టకేలకు సఫలం అయింది. 2010 నుండి కోర్టు జారీ చేసిన 43 సమన్లను లెక్క చేయకుండా ఎప్పటికప్పుడు మినహాయింపు కోరుతూ వచ్చిన రామ్ పాల్ లోయర్ల జోలికి వెళ్లడంతో కటకటాల వెనక్కి చేరక తప్పలేదు.
2006లో మరో గ్రూపు ప్రజలపై రాంపాల్ సాయుధ అనుచరులు కాల్పులు జరపడంతో ఒకరు చనిపోగా, మరి కొద్ది మంది గాయపడ్డారు. రాంపాల్ ఆదేశాల మేరకే కాల్పులు జరిగాయని గుర్తించిన పోలీసులు ఆయనపై హత్య కేసు నమోదు చేశారు. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో సంత్ రాంపాల్ కస్టడీ నుండి తప్పించుకున్నాడు. అనంతరం జరిగిన విచారణలో అనేకమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ రాంపాల్ కోర్టుకు హాజరు కాలేదు. ఎప్పటికప్పుడు అనారోగ్యం సాకు చూపుతూ హాజరు కాలేనని చెబుతూ వచ్చాడు.
ఈ సంవత్సరం జులైలో రామ్ పాల్ అనుచరులు ఒక కోర్టులో చొరబడి లాయర్లను బెదిరించడంతో రామ్ పాల్ అరెస్టుకు కౌంట్ డౌన్ మొదలయింది. రాంపాల్ నేరాలను ప్రస్తావిస్తూ ఆయనకు ఇచ్చిన బెయిలు రద్దు చేయాలని లాయర్లు పిటిషన్ వేయడంతో బెయిల్ రద్దయింది. అయినప్పటికీ రాంపాల్ కోర్టుకు హాజరు కాలేదు. దరిమిలా లాయర్లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఫలితంగా కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది.
ఎన్.బి.డబ్ల్యూను అమలు చేయడానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం రామ్ పాల్ కు వత్తాసుగా వచ్చింది. ఆయనకు ఆరోగ్యం బాగా లేదని, కనుక అరెస్టు చేయరాదని వాదించింది. కోర్టు అందుకు ఒప్పుకోలేదు. హత్య కేసు నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నట్లు లేదని చురక వేసింది. దానితో రాంపాల్ అరెస్టు అనివార్యం అయింది. ఈ నేపధ్యంలో గత రెండు వారాలుగా రామ్ పాల్ తనవద్దకు వచ్చిన భక్తులను ఆశ్రమంలోనే నిర్బంధించి వారిని మానవ కవచంగా ఉపయోగిస్తూ అరెస్టు నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.
మరోవైపు తనకు ఆరోగ్యం బాగాలేదని కోర్టుకు కబురు పంపాడు. కోర్టు ఒక వైద్యుడిని నియమించి రాంపాల్ అనారోగ్యంతో ఉన్నారా లేదా వాకబు చేయాలని కోరింది. ఆయనను పరీక్షించిన వైద్యుడు, రాంపాల్ ఆరోగ్యం భేషుగ్గా ఉందని, కోర్టుకు వచ్చే పరిస్ధితిలోనే ఉన్నాడని స్పష్టం చేయడంతో రాంపాల్ మరింత ప్రతిఘటన ఇవ్వడం మొదలు పెట్టాడు. ‘బాబా కమెండో’ ల పేరుతో తాను పోషించిన సాయుధ మూకలను తన 12 ఎకరాల ఆశ్రమం చుట్టూ మోహరించి పోలీసులు, కేంద్ర పారా మిలటరీ బలగాలను లోపలికి రాకుండా అడ్డుకున్నాడు.
చివరికి జె.సి.బి లతో ఆశ్రమం వెనుక గోడలను కూల్చి లోపలికి ప్రవేశించిన పోలీసులు రెండు రోజులు వెతికి రామ్ పాల్ ను అరెస్టు చేశారు. ఈ రెండు రోజులు ఆయన నిజంగానే దొరకలేదా లేక రాజకీయ నాయకుల పలుకుబడి ద్వారా అరెస్టు నుండి తప్పించుకునేందుకు తగిన అవకాశం వచ్చేవరకు ఎదురు చూసారా అన్నది తెలియరాలేదు. దేశవ్యాపితంగా పత్రికలు, ఛానెళ్లు ఈ వార్తను కవర్ చేయడంతో ప్రభుత్వాల ఉదాసీనతపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంక ఎంతమాత్రం రక్షణ ఇవ్వలేకపోయింది. భక్తుల పేరుతో కొందరు కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిసినప్పటికీ సహాయం చేయడానికి ఆయన నిరాకరించారు. చట్టం పాటించాలని హితవు పలికారు. ఆ విధంగా అన్ని దారులు మూసుకున్న తర్వాతనే రామ్ పాల్ అరెస్టు సాధ్యపడింది తప్ప ప్రభుత్వాల చురుకుదనం వల్ల మాత్రం కాదు.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టుకు హాజరయిన రాంపాల్ కు హై కోర్టు నవంబర్ 28 వరకు జ్యుడీషియల్ కష్టడి విధించింది. కొన్ని పత్రికలు ఆయనకు పోలీసు కష్టడి విధించారని చెప్పాయి. జిల్లా ఎస్.పి ఆధ్వర్యంలో ప్రత్యేక పరిశోధనా బృందం ఏర్పాటు చేశారని, సదరు బృందం నవంబర్ 28 తేదీకి నివేదిక ఇస్తుందని అడ్వకేట్ జనరల్ చెప్పడంతో ఆ రోజుకి తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.
రాంపాల్ అరెస్టు కోసం పోలీసులు, వందలమంది కేంద్ర బలగాల సహాయం తీసుకోవలసి వచ్చింది. పోలీసులపై బాబా కమెండోలు జరిపిన కాల్పుల్లో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అనేకమంది పౌరులు సైతం గాయపడ్డారు. ఆశ్రమాన్ని ఖాళీ చేయించే క్రమంలో 6 గురు భక్తులు చనిపోయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘర్షణ జరుగుతున్న క్రమంలో పోలీసు కాల్పుల్లో 6గురు భక్తులు చనిపోయారని ఆశ్రమ నిర్వాహకులు ప్రకటించారు. తీరా చూస్తే వారి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. చనిపోయినవారిలో 5 గురు మహిళలు కాగా ఒకరు పసి పాప అని తెలుస్తోంది. వారి మరణాలకు కారణం ఏమిటన్నది వైద్యులు పరిశీలిస్తున్నారు. ఆకలి, ఉద్రిక్తత, ఒత్తిడి, అనారోగ్యం… ఈ కారణాలన్ని పని చేసి 6గురు మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
పోలీసులతో ఘర్షణ పడినందుకు గానూ, సాయుధ మూకలతో దాడి చేసినందుకు గాను, చట్టానికి సహకరించకుండా 6 గురు మరణానికి దోహదం చేసినందుకు గాను రామ్ పాల్ పై మరో హత్య కేసును పోలీసులు నమోదు చేశారు. ఆయన అనుచరులను 459 మందిని కూడా అరెస్టు చేశారు. వారిలో 118 మంది రాజస్ధానీయులు, 116 మంది హర్యానా వాసులు 72 మంది మధ్య ప్రదేశ్ వాసులు, 10 మంది బీహారీయులు, 83 మంది ఉత్తర ప్రదేశ్ వాసులు, ముగ్గురు నేపాలీయులు ఉన్నారని పోలీసులు చెప్పారు. ఒక ల్యాప్ టాప్, 6 మొబైల్ ఫోన్లు, 10 హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు.
ప్రజల్లో సైంటిఫిక్ టెంపర్ పెంపొందించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించాలని రాజ్యాంగం చెబుతోందని, ఈ సూత్రాన్ని ప్రభుత్వాలే స్వయంగా ఉల్లంఘించడంతో ప్రజలు బాబాలు, గురువుల మోసాల వలలో తేలికగా పడిపోతున్నారని పలువురు హేతువాదులు విమర్శిస్తున్నారు. ఇటీవల ఒక ఆసుపత్రి, వైద్య పరిశోధనా సంస్ధ ప్రారంభోత్సవం సందర్భంగానే ప్రధాని మోడి గణేషుడి ఏనుగు తలను ప్లాస్టిక్ సర్జరీ ఆవిష్కరణగా చెప్పడం దీనికి ఒక ఉదాహరణ అని వారు ఎత్తి చూపుతున్నారు. సకల సామాజిక రుగ్మతలకు మూలమయిన ఆర్ధిక అసమానతలు, ఆర్ధిక వెనుకబాటు తనం కొనసాగినంతవరకు దేశంలో మరింతమంది రామ్ పాల్ లు అవతరించబోరని గ్యారంటీ లేదు.
సర్,నాకు అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించిన అంశం ఏమిటంటే త్రిమూర్తులను(ఆది దేవుళ్ళను!!!) పూజించవద్దు అని ప్రత్యక్షంగా చెప్పిన ఈయన గారివద్దకు అంతమంది(భక్తులు!!!) తరలివెల్లడం ఏమిటి? ఆయనకు రక్షణగా నిలవడం ఏమిటి? మనదేశంలోనే ఈ మూఢభక్తి ఈ ఆధునికకాలంలోకూడా కొనసాగడం ఏమిటి? నాకైతే దీనివెనుక ఉన్న లాజిక్ అర్ధంకావడంలేదు!?
ఎవరికైనా తెలిస్తే దయచేసి వివరించగలరు????
ఆది దేవతలు ప్రకృతి శక్తులు మాత్రమే! (వేదాల్లో అగ్ని, వాయువు, వరుణుడు వంటివారిని దేఆవతలుగా పూజలందుకోగా, విష్ణు కేవలం సైన్యాధిపతిగా చెప్పబడ్డాడు). ఆది దేవత (అమ్మతల్లి) ప్రస్తావన లేని నాగరికత ఏదీ లేదు (హరప్పా, మెసపొటేమియన్, గ్రీక్, ఈజిప్షియన్ నాగరికతలను ఒకసారి గుర్తు చేసుకోగలరు. There had always been a goddess of fertility/sex -ఆఖరికి ఇస్లాంలోకూడా అల్లాకు ముందుగా ‘అల్లత్’ ఉన్నది). సమాజం మాత్రృస్వామిక వ్యవస్థనుంచి, పితృస్వామిక వ్యవస్థ వైపు మళ్ళేకొద్దీ male deities ప్రాధాన్యతను సంతరించుకోసాగారు. ఆపైన కులాల (లేదా classes) ఆధిపత్యం ప్రకారం ఆయా వృతిదేవతలు ప్రాధాన్యతను సంతరించుకోసాగారు. విష్ణువు బ్రహ్మను మించి ప్రాధాన్యతను సంపాదించుకోవడాన్ని చరిత్రకారులు బ్రాహ్మణ్యంపైని క్ష్రత్త్రియత్వపు ఆధిపత్యంగా భావిస్తారు (please recall the conflict between the state and the church of the western world). త్రిమూర్తుల్లో బ్రహ్మ ఒకకులానికీ, విష్ణువు, శివుడూ వారివారి కులాలకూ ప్రాధాన్యం వహిస్తారన్నది తెలిసిన విషయమే. (శివుడు ‘నీచ’ కులాలకు ప్రాధాన్యం వహించినా శివుణ్ణి శైవం పేరుతో బ్రాహ్మణ్యం హక్కుభుక్తం చేసుకోవడం ఒక irony). కాబట్టి చెప్పొచ్చేదేమిటంటే త్రిమూర్తులు ఆది దేవతలు ఏమీకాదు.
ఇప్పుడు రాంపాల్ గారు దాన్ని సవాలు చేశారు. అది కొందరికి నచ్చింది. మరికొందరికి నచ్చకపోయినా, అయన పంధాని తప్పుబట్టేటన్ని గుండెలు హిందూ సమాజానికి లేవు. రేప్పొద్దున నేనే వాయుదేవుడి వేలువుడిచినబామ్మర్ది కొడుకు పేరుమీద ఒక ఆశ్రమాని స్థాపిస్తే అప్పుడుకూడా హిందువులు (కేవలం జన్మత: హిందువులైనంతమాత్రాన) నా భక్త పరమాణువులుగా మారుతారు. అప్పుడునేను త్రిమూర్తులమీద నా ఇష్టమొచ్చినట్ట్లు విమర్శలు చేయవచ్చు (అదే విమర్శలు ఏ ఇతరమతస్థుదో చేస్తే మాత్రమే హిందువులకు మండుకొచ్చును).
ఇతను ఒక సన్నాసి కానీ ఇతను ఖలిస్తాన్ ఉగ్రవాది భింద్రన్‌వాలేలాగ తన ఆశ్రమం చుట్టూ సాయుధుల కాపలా పెట్టించుకున్నాడు. చూసిన జనానికి అనుమానం రాలేదు, ఒక సన్నాసికి ఇంత setup అవసరమా అని!
Church vs ‘S’tate వాదనలో స్థూలంగా పాశ్చాత్య ప్రపంచం ఏనాడో Stateవై మొగ్గుచూపగా, భారత సమాజం ఇంకా పోరాట దశలో ఉన్నవైనాన్ని రాంపాల్ వైనం కళ్ళకి కడుతోంది. పోలీసుల ప్రాణాలను బలిగొన్నవారిని అరెస్టుచెయ్యడమనేది మనం మావోఇస్టుల విషయంలోనైతే కనంగాక కనం. ఇంత ‘హల్లాబోల్’ తర్వాతకూడా రాంపాల్ గారు మూడురోజుల కస్టడీతరువాత విడుదలైతే, అంతకుమించి మన ‘దేశం'(state) సిగ్గుపడాల్సింది ఏమీ ఉండదు.