2జి కేసుకు దూరంగా ఉండండి -సుప్రీం కోర్టు


CBI director

భారత దేశంలో హై ప్రొఫైల్ కేసులను విచారించే హై ప్రొఫైల్ విచారణాధికారులు సైతం విచారణకు ఎలా తూట్లు పొడుస్తారో తెలిపే ఉదంతాలు ఇప్పటికే అనేకం వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా 2జి కేసులోనే ఇలాంటి ఉదాంతాలు నాలుగైదు వెలుగులోకి రాగా సి.బి.ఐ అధిపతి రంజిత్ సిన్హా ఉదంతం మరొకటిగా వచ్చి చేరింది.

2జి కేసు విచారణ నుండి దూరంగా ఉండాలని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ రోజు (నవంబర్ 20) సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను ఆదేశించింది. చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేయడం విశేషం.

తన ఆదేశాలకు కారణం చెప్పడానికి ధర్మాసనం నిరాకరించడం మరో విశేషం. అయితే తన నిరాకరణకు కారణం మాత్రం ధర్మాసనం చెప్పింది. “సి.బి.ఐ అనే అత్యున్నత సంస్ధపైనా, ఆ సంస్ధ డైరెక్టర్ పదవి పైనా ఉన్న నమ్మకాన్ని ఉద్దేశ్యపూర్వకంగా కాపాడేందుకు, మేము ఉద్దేశ్యపూర్వకంగానే కారణం వివరించడం లేదు” అని కోర్టు ఆదేశం పేర్కొంది.

మేము కారణం చెప్పలేము అన్న నిరాకరణ లోనే సుప్రీం కోర్టు కారణం ఏమిటో స్పష్టం చేసిందని భావించవచ్చు. 2జి కేసు నిందితులతో, ఆ కేసు విచారిస్తున్న అత్యున్నత విచారణ సంస్ధ అధిపతి గారే స్వయంగా రాసుకు పూసుకు తిరుగుతున్నట్లు సుప్రీం కోర్టు ఒక నిర్ణయానికి వచ్చిందని భావించవచ్చు. ఆ కారణం వల్లనే తాజా ఆదేశం వెలువడిందని చెప్పవచ్చు.

Ranjit Sinha

సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను 2జి కేసు నిందితులు క్రమం తప్పకుండా కలుస్తున్నారని, ఆయన ఇంటివద్దనే సమావేశాలు జరుగుతున్నాయని అందుకు రంజిత్ సిన్హా నివాసం సందర్శకుల రిజిస్టర్ నే సాక్ష్యంగా చూపుతూ సుప్రీం కోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్ పిటిషన్ వేసిన ఫలితమే తాజా ఆదేశం.

లాయర్ ప్రశాంత్ భూషణ్ కోర్టుకు అందజేసిన రిజిస్టర్ కాపీ అసలుదేనని ప్రాధమికంగా రుజువయిందని సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా చెప్పింది. ప్రశాంత్ భూషణ్ కోర్టుకు ఇచ్చిన రిజిస్టర్ నకిలీదని వాదించిన రంజిత్ సిన్హా వాదనను కోర్టు అంగీకరించలేదని దీని ద్వారా స్పష్టం అయింది.

తన నివాస సందర్శకుల జాబితాను ప్రశాంత్ భూషణ్ కు లీక్ చేసిన ‘విజిల్ బ్లోయర్’ ఎవరో బహిరంగం చేయాలని రంజిత్ సిన్హా కోర్టును కోరినప్పటికి కోర్టు అంగీకరించలేదు. నిజానికి గతంలో ఇచ్చిన ఆదేశాల్లో విజిల్ బ్లోయర్ ఎవరో చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను ప్రశాంత్ భూషణ్ పాటించలేదు. అలా చేస్తే విజిల్ బ్లోయర్ కు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని, కనుక ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని భూషణ్ కోరారు.

భూషణ్ కోర్కెను మన్నిస్తూ సుప్రీం కోర్టు తన పాత ఆదేశాలను వెనక్కి తీసుకుంది. విజిల్ బ్లోయర్ పేరు బహిరంగం చేయనవసరం లేదని పేర్కొంది. తద్వారా ఒక మంచి సాంప్రదాయానికి సుప్రీం కోర్టు నాంది పలికింది. విజిల్ బ్లోయర్ పేరును వెల్లడి చేసే విషయంలో సుప్రీం కోర్టు మొదటి ఆదేశానికి కట్టుబడి ఉన్నట్లయితే ప్రభుత్వంలో అత్యున్నత స్ధాయిలో జరిగే అక్రమాలను వెల్లడి చేసేందుకు ఇంకెవరూ ముందుకు రాని దౌర్భాగ్య పరిస్ధితి ఏర్పడి ఉండేది. అలాంటి పరిస్ధితికి సుప్రీం కోర్టు తానే స్వయంగా కారణంగా నిలిచి ఉండేది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s