కార్మికుల సమ్మెకు మోడి పరిష్కారం: విభజించు-పాలించు


కార్మికుడిని “శ్రమ యోగి” గా ప్రధాని నరేంద్ర మోడి అభివర్ణించారు. కార్మికులను ఆకాశానికి ఎత్తుతూ ‘శ్రమయేవ జయతే” అని నినాదం ఇచ్చారు. ఆయన అభివర్ణన, నినాదం కేవలం అలంకార ప్రాయమే అని కార్మికులకు తెలియడానికి నెల రోజులు కూడా పట్టలేదు. గత అరవై యేళ్లుగా భారత దేశ ప్రజల ఇంధనం అవసరాలను కోల్ ఇండియా కంపెనీ తీరుస్తోంది. అలాంటి కంపెనీలో వాటాలను మోడి ప్రభుత్వం ప్రైవేటు బహుళజాతి కంపెనీలకు అమ్మేయడానికి నిరసనగా కార్మికులు సమ్మె బాట పట్టారు. ‘శ్రమ యోగు’ల సమస్యలను సావధానంగా ఆలకించడానికి బదులు, కార్మికుల మధ్య విభజన తెచ్చి తాను తలపెట్టిన కార్యం నెరవేర్చుకునేందుకు మోడి సిద్ధపడ్డారు.

కోల్ ఇండియాలో వాటాల అమ్మకం చేపడుతున్నట్లు కేంద్రం ప్రకటించినప్పుడు బి.జె.పి అనుబంధ కార్మిక సంఘం భారత్ మజ్దూర్ సంఘ్ (బి.ఎం.ఎస్) దానిని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. బి.జె.పి కార్మిక సంఘం కూడా కోల్ ఇండియా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్లుగా పత్రికలు వార్తలు కూడా ప్రచురించాయి. తీరా చూస్తే సోమవారం (నవంబర్ 24) సమ్మెకు తమ మద్దతు లేదని బి.ఎం.ఎస్ తాజాగా ప్రకటించింది. ప్రధాని మోడి తన పలుకుబడిని ఉపయోగించి కోల్ ఇండియా కార్మికులలో చీలకలు తేవడంలో సఫలం అయ్యారని రాయిటర్స్ లాంటి పశ్చిమ కార్పొరేట్ సంస్ధలు కూడా విశ్లేషించడం బట్టి పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు.

కోల్ ఇండియా కంపెనీ అతి పెద్ద భారతీయ ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఒకటి. దేశ ఇంధన అవసరాలు తీర్చడంలో ఈ కంపెనీకి ఘనతర చరిత్ర ఉంది. ప్రైవేటు కంపెనీలకు వాగ్దానం ఇచ్చినట్లుగానే మోడి ప్రభుత్వం ఈ కంపెనీని క్రమంగా స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు చర్యలు ప్రారంభించింది. మొదటి విడతగా కంపెనీలో 10 శాతం వాటాలను ప్రైవేటు కంపెనీలకు అమ్మడానికి కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఐదు జాతీయ కార్మిక సంఘాలు సోమవారం సమ్మె చేస్తున్నట్లు ప్రకటించాయి.

కోల్ ఇండియాలో మొత్తం దాదాపు 4 లక్షలమంది వరకు కార్మికులు పని చేస్తున్నారు. వారిలో సగం మంది తమ వెనుక ఉన్నారని బి.ఎం.ఎస్ చెప్పుకుంటోంది. సోమవారం సమ్మెలో వారందరు పాల్గొనబోరని బి.ఎం.ఎస్ నేత బాయిజ్ నాధ్ రాయ్ ప్రకటించాడు. “మన డిమాండ్లు నెరవేర్చుకోవడానికి సమ్మె చేయడం సరైన చర్య కాదు” అని ఆయన కార్మికులకు హిత బోధ చేశారు. సమ్మె సరైన చర్య కాదు సరే, మరి ఏది సరైన చర్య? ఏ సరైన చర్య తీసుకుంటే కోల్ ఇండియా కంపెనీని ప్రైవేటు కంపెనీలకు అమ్మేయకుండా మోడి ప్రభుత్వాన్ని అడ్డుకోవచ్చు? ఆ ముక్క కూడా ఆయనే చెప్పేస్తే మిగిలిన కార్మికులు కూడా సమ్మె చేయరు కదా! అసలు అమ్మకమే లేకపోతే సమ్మె అవసరమే ఉండదు కదా! అమ్మకం వద్దు అని ఈ కార్మిక నేత ప్రధాని మోడీకి ఎందుకు చెప్పరు?

2014-15 ఆర్ధిక సంవత్సరానికి గాను ప్రభుత్వ కంపెనీలలో వాటాల అమ్మకం ద్వారా 9.5 బిలియన్ డాలర్లు ఆర్జించాలని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ కంపెనీల అమ్మకం ద్వారా రు. 51,925 కోట్లు ఆర్జించాలని యు.పి.ఏ-2 ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ లో లక్ష్యంగా నిర్దేశించగా ఎన్.డి.ఏ-2 ప్రభుత్వం దానిని రు. 58,425 కోట్లకు పెంచింది. కోల్ ఇండియా కంపెనీలో 10 శాతం వాటాల అమ్మకం ద్వారా ఈ లక్ష్యంలో మూడో వంతు సాధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అనగా కోల్ ఇండియా వాటాల అమ్మకం ద్వారా కనీసం 16,000 కోట్ల వరకు సంపాదించాలని మోడి ప్రభుత్వం లక్ష్యం.

మోడి ప్రభుత్వం అమ్మాలనుకుంటున్న ప్రభుత్వ కంపెనీలన్నీ ముఖ్యమైనవే. అనేకయేళ్లుగా భారత ప్రజలకు, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చినవే. ఉదాహరణకి స్టీల్ ఆధారిటీ ఇండియా లిమిటెడ్ కంపెనీలో 5 శాతం వాటాలు అమ్మేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారత దేశ ఉత్పత్తి సామర్ధ్యానికి, పరిజ్ఞానానికి, సార్వభౌమ వ్యక్తీకరణకు సంకేతంగా చెప్పదగ్గ ఓ.ఎన్.జి.సి కంపెనీలో 5 శాతం వాటాలు అమ్మేసి 17,000 కోట్లు సమకూర్చాలని మోడి ప్రభుత్వం యొక్క మరో లక్ష్యం.  భారత జలవిద్యుత్ శక్తి సంస్ధ NHPC (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) లో 11 శాతం వాటా, అలాగే మరో ఇంధన సంస్ధ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC) లో 5 శాతం వాటా, గ్రామీణ విద్యుత్ సంస్ధ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ (REC) లో 5 శాతం వాటా అమ్మకానికి పెట్టాలని మోడి ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది.

ఒక పక్క దేశీయ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచాలని చెబుతూ మరోపక్క దేశానికి చెందిన ఘనతర కంపెనీలను ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పడం జనాన్ని మోసగించడం తప్ప మరొకటి కాదు. ప్రకటనలు, బోధనలు, సిద్ధాంతాలు ఆర్భాటంగా చేయడం, ఆచరణలోకి వచ్చేసరికి అందుకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తూ దేశ ఆర్ధిక వ్యవస్ధ నడుములు విరిగిపోయే చర్యలు అమలు చేయడం యు.పి.ఏ ప్రభుత్వం పాటించిన సూత్రం. ఎన్.డి.ఏ/బి.జె.పి/మోడి ప్రభుత్వం అవే చర్యలు, విధానాలు మరింత వేగంగా అమలు చేస్తోంది తప్ప భిన్నంగా ఏమీ చేయడం లేదు. వ్యక్తులు మారారు – మన్మోహన్ స్ధానంలో నరేంద్ర మోడి వచ్చారు, కాంగ్రెస్ మంత్రుల స్ధానంలో బి.జె.పి మంత్రులు వచ్చారు. విధానాలు మాత్రం అవే, కాకపోతే మరింత వేగంగా, మరింత కఠినంగా, మరింత గట్టిగా, మరింత స్ధిరంగా పాత విధానాలు కొనసాగుతున్నాయి. స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలకు మోడి ఎన్నిక ఎందుకు అంతగా సంతోష పరిచిందీ ఈ 4 నెలల్లో అమలయిన చర్యలు స్పష్టంగా చెబుతాయి.

ప్రజా వ్యతిరేక విధానాలను వేగవంతంగా అమలు చేయడంతో పాటు నరేంద్ర మోడికి ఉన్న అదనపు సామర్ధ్యం కార్మికుల్లోనే ఒకరితో ఒకరికి తగవు పెట్టడం; చిచ్చు పెట్టి చీల్చడం; చీలికలు తెచ్చి అనుకున్న పనిని నిర్విఘ్నంగా నెరవేర్చుకోవడం.

దేశ ఆర్ధిక మూలాలని దెబ్బ తీసి యు.పి.ఏ-ఎన్.డి.ఏ ప్రభుత్వాలు సాధించదలిచింది ఏంటయ్యా అంటే ఫిస్కల్ డెఫిసిట్ ని 4.5 శాతం నుండి 4.1 శాతానికి తగ్గించడం. బంగారు గుడ్లు పెట్టే బాతును చంపి, పొట్ట కోస్తే బంగారు గుడ్లు వస్తాయా లేక గుడ్లు పెట్టే బాతు అసలుకే లేకుండా పోతుందా? లోటు తగ్గించుకునేందుకు ఎంత తెలివి హీనుడైనా చేసే పని ఆదాయం పెంచుకునేందుకు మార్గాలు వెతకడం. బడ్జెట్ మొత్తాన్ని మరిన్ని ఉత్పాదక చర్యలకు తరలించి, మరిన్ని ప్రభుత్వ కంపెనీలు స్ధాపిస్తే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. అలా పెరిగిన ఆదాయంతో లోటు పూచుకోవడం భేషైన పని అని తెలియడానికి ఆర్ధిక శాస్త్రవేత్తలు కానక్కరలేదు.

ఐనా సరే, వాటాల అమ్మకానికే ప్రభుత్వాలు ఎందుకు తెగిస్తున్నాయి? ఎందుకంటే విదేశీ మాస్టర్లు వారికి అప్పజెప్పిన పని అదే. దేశంలోని ప్రభుత్వ కంపెనీలన్నీ విదేశీ ప్రైవేటు బహుళజాతి కంపెనీలకు ఇచ్చేయాలి. తద్వారా విదేశీ కంపెనీల మార్కెట్ దాహం, లాభ దాహం తీర్చాలి. తీవ్రమైన, మౌలికమైన సంక్షోభంలో కూరుకుపోయి బైటికి రాలేక సతమతం అవుతున్న పశ్చిమ సామ్రాజ్యవాద సంస్ధలు/దేశాలకు ఆహారంగా మన ఆర్ధిక వ్యవస్ధ మారిపోవాలి.

యు.పి.ఏ 2 ప్రభుత్వ హయాంలోనే కోల్ ఇండియా వాటాల అమ్మకానికి ప్రయత్నం జరిగింది. అప్పుడు బి.జె.పి ప్రతిపక్షంలో ఉంది కనుక బి.జె.పి అనుబంధ బి.ఎం.ఎస్ కూడా ఆ ప్రయత్నాన్ని తీవ్రంగా ప్రతిఘటించింది. ఇప్పుడు బి.జె.పి అధికార పక్షం. కాబట్టి మోడి తన పలుకుబడిని ఉపయోగించి కార్మిక సంఘాల మధ్య చీలికలు తేగలరని బ్యూరోక్రాట్లు, ప్రైవేటు కంపెనీలు నమ్మకం పెట్టుకున్నారు. వారి నమ్మకం వమ్ము కాలేదని బి.ఎం.ఎస్ చేస్తున్న సమ్మె వ్యతిరేక హితబోధలు స్పష్టం చేస్తున్నాయి. సమ్మెకు బి.ఎం.ఎస్ దూరంగా ఉంటోంది కనుక సమ్మె వల్ల పెద్దగా ప్రభావం ఉండబోదని కేంద్రం భావిస్తోంది.

“వాటాల అమ్మకం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. కార్మిక యూనియన్లు కూడా దారికి వస్తాయి. కోల్ ఇండియా అధికారులు వారితో చర్చలు జరుపుతున్నారు కూడా” అని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. ఇదే నిజమైతే బి.ఎం.ఎస్ తో పాటు ఇతర కార్మిక సంఘాలు సోమవారం సమ్మెను నామమాత్రంగా నిర్వహించి సరిపెడతాయి. తద్వారా కార్మికుల నుండి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతూ ప్రభుత్వానికి సహకరించిన ఘనత కూడా సాధిస్తాయి. పోరాట పటిమ ఎన్నడో మొద్దుబారిన సో కాల్డ్ వామపక్ష సంఘాలే ప్రాబల్యంలో ఉండడం వల్ల ఇంతకంటే మించి ఆశించగలిగేది కూడా ఏమీ లేకపోవచ్చు. కార్మికులే తాము ఎవరిని నమ్ముతున్నామో తెలుసుకుని, వారిని వదిలించుకుని సొంతగా స్వతంత్ర పోరాటం చేయాల్సి ఉంటుంది. ప్రజలకు ఉపాధి కొనసాగాలన్నా, దేశ ఆర్ధిక వ్యవస్ధ సార్వభౌమత్వం దక్కాలన్నా, ఉన్న ఉపాధి రద్దు కాకుండా ఉండాలన్నా కార్మికవర్గం నిర్ణాయక పాత్ర వహించడం వినా మార్గం లేదు.

2 thoughts on “కార్మికుల సమ్మెకు మోడి పరిష్కారం: విభజించు-పాలించు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s