భారత ప్రభుత్వం పగ్గాలను ఎన్.డి.ఏ నేత నరేంద్ర మోడి చేపట్టిననాటి నుండి జాత్యహంకార ఇజ్రాయెల్ తో మన వాణిజ్యం కొత్త పుంతలు తొక్కుతోంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే ఇజ్రాయెల్ తో సన్నిహిత సంబంధాలు పెంచుకుని వాణిజ్య స్నేహాలను ఏర్పాటు చేసుకున్నా నరేంద్ర మోడి, ప్రధాన మంత్రి పీఠం అధిష్టించాక తన పలుకుబడిని మరింతగా విస్తరించారు. ఫలితంగా ఇజ్రాయెల్-ఇండియాల మధ్య త్వరలోనే స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదరవచ్చని వాణిజ్య విశ్లేషకులు, అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇజ్రాయెల్ నుండి దూరంగా ఏమీ లేదు. వాజ్ పేయి హయాంలోనే నెహ్రూ-ఇందిరాగాంధీల హయాం నాటి పాలస్తీనా అనుకూల విధానాన్ని విడనాడుతూ భారత దేశం ఇజ్రాయెల్ తో స్నేహ సంబంధాలను ప్రారంభించింది. ఫలితంగా భారత దేశానికి అరబ్బు, ముస్లిం దేశాలతో ఉన్న చారిత్రక స్నేహ సంబంధాలు, అంతర్జాతీయంగా భారత్ కు ఉన్న రాజకీయ ప్రతిష్ట పలుచబారింది. అయినప్పటికి ఎన్.డి.ఏ-1 ప్రభుత్వం అనంతరం అధికారం చేపట్టిన యు.పి.ఏ అవే విధానాలను కొనసాగించింది. తద్వారా ఇజ్రాయెల్ తో స్నేహ సంబంధాల పెంపుదల ఒక్క బి.జె.పి నిర్ణయం మాత్రమే కాదని కాంగ్రెస్ వెనుక ఉన్న పాలక వర్గ గ్రూపులు కూడా దానిని ఆమోదించాయని స్పష్టం అయింది.
అయితే కాంగ్రెస్/యు.పి.ఏ పాలకులు ఇజ్రాయెల్ తో స్నేహాన్ని బహిరంగంగా చాటుకోవడానికి ఇష్టపడలేదు. ఇజ్రాయెల్ తో స్నేహం మరియు వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తూనే పైకి మాత్రం తమకు ఇజ్రాయెల్ పొడ గిట్టదు అన్నట్లుగా వ్యహరించారు. న్యూ ఢిల్లీలో ని వ్యూహాత్మక రాజకీయ, వాణిజ్య సంబంధాల విశ్లేషణ సంస్ధ అబ్జర్వర్ రీసర్చ్ ఫౌండేషన్ అధిపతి సి.రాజమోహన్ మాటల్లో చెప్పాలంటే “ఢిల్లీ ఇజ్రాయెల్ ను తన ఉంచుకున్న భార్యగా చూసింది. ప్రైవేటుగా సంబంధాలు నెరుపుతూనే బహిరంగంగా సంబంధాలున్నట్లుగా అంగీకరించేందుకు ఇష్టపడని రీతిలో వ్యహరించింది.”
ఇజ్రాయెల్ తో సంబంధాలను కార్పెట్ కింద దాచి ఉంచడం ద్వారా ముస్లిం-అరబ్ దేశాలతో స్నేహ సంబంధాలను కాపాడుకోవాలని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం భావించిందని పరిశీలకుల నిశ్చితాభిప్రాయం. ఈ రకపు సంబంధాలు ఇజ్రాయెల్ లోని అతి మితవాద పార్టీలకు రుచించనప్పటికీ అసలు లేకపోవడం కంటే ఎంతో కొంత సంబంధం ఉండడం మెరుగేనన్న అభిప్రాయంతో మింగి ఊరుకున్నారు.
నరేంద్ర మోడి ప్రధాని పగ్గాలు చేపట్టినాక ఈ పరిస్ధితి మారిపోయింది. ఇజ్రాయెల్ తో బహిరంగంగానే వివిధ వాణిజ్య, రాజకీయ సంబంధాలు ఇండియా పెట్టుకుంటోంది. ఎంత బహిరంగంగా అంటే, సెప్టెంబర్ లో ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరిగిన సందర్భంగా ప్రత్యేకంగా సమయం కేటాయించుకుని మరీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, భారత ప్రధాని మోడిలు అక్కడే సమావేశం అయ్యేంతగా! అమెరికా అధ్యక్షుడితో సమావేశం కంటే భారత ప్రధానితో సమావేశానికే నేతన్యూహు ఆసక్తి చూపారని అప్పట్లో కొన్ని పశ్చిమ పత్రికలు గుసగుసలు పోయాయి కూడా.
మోడి హయాంలో ఇండియా, ఇజ్రాయెల్ లు వరుసగా అనేక రక్షణ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. సెప్టెంబర్ లో మోడి-నెతన్యాహు ల సమావేశం ఫలితం ఇచ్చిందా అన్నట్లుగా అదే నెలలో ఇజ్రాయెల్ క్షిపణుల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఎప్పటి నుండో అనుకుంటున్నదే. కానీ మన్మోహన్ ప్రభుత్వం తాత్సారం చేయగా, మోడి ప్రభుత్వం ఆగమేఘాలపై ఒప్పందాన్ని పూర్తి చేసింది. ఈ క్షిపణులు భారత నావికా బలగాలకు ఉద్దేశించినవి.
అక్టోబర్ నెలలో ఏకంగా 520 మిలియన్ డాలర్ల ఖరీదు చేసే మరో రక్షణ ఒప్పందాన్ని ఇరు దేశాలు కుదుర్చుకున్నాయి. ఇజ్రాయెలీ తయారీ ట్యాంకు విధ్వంసక క్షిపణులను ఈ ఒప్పందం ద్వారా ఇండియా కొనుగోలు చేస్తోంది. నవంబర్ రెండో వారంలో ఇరు దేశాలు ఉమ్మడిగా అభివృద్ధి చేసిన వాయు రక్షణ వ్యవస్ధ (aerial defence system) ను మొదటి సారిగా విజయవంతంగా పరీక్షించారు. ఈ పరీక్ష విజయవంతం కావడాన్ని ఇండియా “ముఖ్యమైన మైలురాయి” గా అభివర్ణించి మురిసింది.
“నూతన ప్రభుత్వ హయాంలో ఇండియా, ఇజ్రాయెల్ దేశాల మధ్య సహాకారంలో గొప్ప కదలిక వచ్చింది. ఈ సహకారం రక్షణ రంగంతో పాటు ఆర్ధిక రంగానికి సైతం విస్తరించింది” అని ఇజ్రాయెల్ ఆర్ధిక మంత్రి నఫ్తాలి బెన్నెత్ రాయిటర్స్ వార్తా సంస్ధతో వ్యాఖ్యానించడాన్ని బట్టి ఇరు దేశాల సంబంధాల ప్రస్తుత స్ధాయిపై ఒక అవగాహనకు రావచ్చు.
ఇజ్రాయెల్ తయారు చేసిన మిలట్రీ పరికరాల కొనుగోలుదారుల్లో ప్రస్తుతం ఇండియాయే అతి పెద్దదని తెలుస్తోంది. అలాగే రష్యా తర్వాత ఇండియాకు రెండో పెద్ద కష్టమర్ గా అవతరించిందని వాణిజ్య పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2014 సం.లో మొదటి 9 నెలల్లో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 3.4 బిలియన్ డాలర్లకు చేరిందని రాయిటర్స్ తెలిపింది. ప్రపంచ వాణిజ్యం స్ధాయిలో ఈ అంకె పెద్దదేమీ కాదు. కానీ ఇరు దేశాల మధ్య గతంలో జరిగిన వాణిజ్యంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఇండియాతో వాణిజ్యం మెరుగుదల ఫలితంగా ఇజ్రాయెల్ ఎగుమతి మార్కెట్లలో ఈ.యు తర్వాత అతి పెద్ద మార్కెట్ గా ఆసియా అవతరించింది. గతంలో ఈ స్ధానంలో అమెరికా ఉండేది.
ఇజ్రాయెల్ రక్షణ పరికరాల కొనుగోలులో చైనా కూడా ముఖ్యమైన కష్టమర్. కానీ చైనాతో వాణిజ్యానికి అమెరికా ఇష్టపడదు. ఇజ్రాయెల్ అభివృద్ధి చేసే అత్యాధునిక మిలట్రీ, సైబర్ పరికరాలు చైనా చేతుల్లోకి వెళ్ళడం అమెరికాకు ఇష్టం లేదు. ఈ నేపధ్యంలో చైనా స్ధానాన్ని ఇండియా భర్తీ చేయడం ఇజ్రాయెల్ కు సంతోషాన్నిచ్చే అంశం.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే నరేంద్ర మోడి ఇజ్రాయెల్ సందర్శించి మరీ ఆ దేశంతో స్నేహ సంబంధాలు ఏర్పరుచుకున్నారు. 2006లో ఇజ్రాయెల్ సందర్శించిన మోడి అక్కడి వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానానికి ఆకర్షితులయ్యారని మన పత్రికలు చెబుతుంటాయి. మోడి సందర్శన అనంతరం ఇండియా ఇజ్రాయెల్ తయారీ డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీని కొనుగోలు చేయడం ప్రారంభించింది. నీరు తక్కువగా లభించే ఎడారి నేలల్లో, ఇసుక నేలల్లో డ్రిప్ ఇరిగేషన్ మంచి ఫలితాలను ఇస్తుంది. అప్పటికే ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు జరిగినప్పటికీ ఇజ్రాయెల్ స్నేహంతో ఇది మరింతగా వృద్ధి చెందింది. ఇండియాకు చెందిన జైన్ ఇరిగేషన్ కంపెనీ ఇజ్రాయెల్ లోని రెండు ఇరిగేషన్ కంపెనీలను కొనుగోలు చేసి సొంత సంస్ధను నెలకొల్పడం వెనుక మోడి నెరిపిన సంబంధాలు పని చేశాయని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఇజ్రాయెల్ పోర్ట్స్ కో. అనే కంపెనీ ఇండియాకు చెందిన కార్గో మోటార్స్ కంపెనీతో భాగస్వామ్యం వహిస్తూ గుజరాత్ లో ఒక డీప్ వాటర్ పోర్టును అభివృద్ధి చేస్తోంది. ఇజ్రాయెల్ కు చెందిన టవర్ జాజ్ కంపెనీ, ఇండియాకు చెందిన జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలు ఐ.బి.ఎం తో కలిసి ఢిల్లీలో ఛిప్ తయారీ కంపెనీని నెలకొల్పేందుకు పధకం రూపొందించుకున్నాయి. ఈ కంపెనీ స్ధాపనకు మూడు కంపెనీలు కలిసి 5.6 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. గత వారం ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లో జరిగిన భద్రతా సమావేశం సందర్భంగా భారత కంపెనీలు, అధికారులు ఇక్కడి పైప్ లైన్లు, రిఫైనరీలు తదితర మౌలిక నిర్మాణ వ్యవస్ధల కోసం భద్రతా వ్యవస్ధలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో ఇండియా-ఇజ్రాయెల్ దేశాలు కనీసం వచ్చే సంవత్సరానికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇరు దేశాలు ఈ విషయంలో ఏ స్ధాయిలో ప్రయత్నాలు చేస్తున్నది ఇంకా వెలుగులోకి రాలేదు. స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదిరినట్లయితే ఇరు దేశాల వాణిజ్యం రెండు రెట్లు, మూడు రెట్లు కూడా పెరగవచ్చని ఇండియా-ఇజ్రాయెల్ వాణిజ్య స్నేహ సంస్ధ అంచనా వేస్తున్నది.
ఇజ్రాయెల్ తో స్నేహ సంబంధాలు పెరగడం వెనుక అమెరికా మధ్యవర్తిత్వం, సిఫారసులు, కొండొకచో ఒత్తిడిలు కూడా పని చేస్తాయన్నది విస్మరించరాదు. వాణిజ్య సంబంధాల పెంపు కోసం భౌగోళిక రాజకీయాలు నడిచినట్లే భౌగోళిక రాజకీయాలలో భాగంగా కూడా సరికొత్త వాణిజ్య సంబంధాలు అభివృద్ధి చెందవచ్చు. ఈ రెండవది పరిణామంలో కొద్దిగానే ఉన్నప్పటికీ భవిష్యత్తులో జరగబోయే ప్రపంచ వాణిజ్య మలుపులకు ఇవి ముఖ్యమైన పునాదిని వేయవచ్చు.
“ఇండియాతో మా సంబంధాలు ఇంకా ఇంకా గొప్ప స్ధాయికి చేరే అవకాశం కనిపిస్తోంది. అందువలన మేము అత్యంత ఉత్సాహంతో ఉన్నాము. మా సంబంధాల వృద్ధికి ఆకాశమే హద్దు” అని న్యూ యార్క్ లో మోడిని కలవడానికి బెంజీమెన్ నెతన్యాహు వ్యాఖ్యానించడం ఎన్.డి.ఏ-2 హయాం పై ఇజ్రాయెల్ కు ఉన్న ఆశలను అంచనా వేయవచ్చు.