-The Hindu Editorial dated November 18, 2014
(ప్రపంచ వాణిజ్యంలో) వివాదాస్పద అంశం ‘ఆహార భద్రత కోసం ఆహార ధాన్యాలను ప్రభుత్వం నిలువ చేసుకునే’ విషయంలో ఇండియా, అమెరికాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రపంచ వాణిజ్య చర్చలను తిరిగి పట్టాల మీదికి తేవాల్సి ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్ధ చరిత్రలో టి.ఎఫ్.ఏ గణనీయమైన అడుగు అనదగ్గ బహుళపక్ష “వాణిజ్య వసతీకరణ ఒప్పందం” (Trade Facilitation Agreement -TFA) ను కాపాడేందుకు ఈ ద్వైపాక్షిక సర్దుబాటు/రాజీ అత్యవసరమైన మార్గాన్ని సమకూర్చుతుంది. గత సంవత్సరం బాలిలో డబ్ల్యూ.టి.ఓ మంత్రుల సమావేశంలో ఆమోదించబడిన టి.ఎఫ్.ఏ, కస్టమ్స్ నిబంధనలను సులభతరం కావించేందుకు, పోర్టుల నుండి సరుకుల విడుదలను వేగవంతం చేసేందుకు, సరుకు మార్పిడి ఖర్చులను తగ్గించేందుకు ఉద్దేశించినది.
ఒప్పందంపై సంతకానికి ముందే, ఆహార సబ్సిడీ విషయమై శాశ్వత పరిష్కారం చూపాలని పట్టుబడుతూ మోడి నేతృత్వంలోని బి.జె.పి ప్రభుత్వం టి.ఎఫ్.ఏ పై సంతకం చేసేందుకు నిరాకరించింది. చారిత్రక వ్యవసాయ ఉత్పత్తిలో 10 శాతం మొత్తానికి వ్యవసాయ సబ్సిడీలను పరిమితం చేయాలన్న డబ్ల్యూ.టి.ఓ నిబంధనే వివాదానికి మూలం. ఈ నియమం -డబ్ల్యూ.టి.ఓ సమావేశాలలో నొక్కి చెప్పబడిన విధంగానే- పేదవారికి ఆహారం అందించే విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఉన్న బాధ్యతలను బలహీనపరుస్తుంది. అటువంటి సబ్సిడీ పరిమితిని నిర్ణయించేందుకు అనుసరించిన మెధడాలజీని ఇండియా, మరికొన్ని దేశాలు ప్రశ్నించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
సభ్య దేశాలు సబ్సిడీ పరిమితిని దాటిపోయే పక్షంలో ఎదుర్కోవలసిన చట్టబద్ధ సవాళ్లను నుండి రక్షణ పొందేందుకు ఇండియా తదితర దేశాలకు డబ్ల్యూ.టి.ఓ నిబంధనలలో పొందుపరిచిన ‘పీస్ క్లాజ్’ నిజానికి పరిమిత కాలం పాటు మాత్రమే అవకాశం కల్పిస్తుంది. ‘పీస్ క్లాజ్’ కాలపరిమితి ముగిసిపోయి, ఈ పరిమితిని అధిగమించడాన్ని సభ్య దేశాలు చట్టబద్ధంగా సవాలు చేస్తే పరిస్ధితి వచ్చాక కూడా వ్యవసాయ సబ్సిడీపై నెలకొన్న ఆందోళన అపరిష్కారంగా మిగిలిపోతే ఏమిటి పరిస్ధితి? వ్యవసాయ సబ్సిడీలపై పరిమితి విధిస్తూ రూపొందించిన నిబంధనలపై ఆధారపడి తలెత్తే ఫిర్యాదులు, ఆహార ధాన్యాలను నిలవ ఉంచి పేదలకు సరఫరా చేయడంలో ప్రభుత్వాలకు ఉండే సామర్ధ్యాన్ని తీవ్రంగా నిరోధిస్తాయి. టి.ఎఫ్.ఏ ని అడ్డుకోవడంలో మోడి ప్రభుత్వంపై ఈ భయాలే పని చేశాయి. ఈ ప్రతిష్టంభన కొనసాగినట్లయితే వాణిజ్య వసతీకరణ వల్ల లబ్ది చేకూరే నియమాల అమలు కూడా ఆలస్యం అవుతుంది.
వ్యవసాయ సబ్సిడీల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేవరకూ పీస్ క్లాజ్ ను నిరవధికంగా కొనసాగించేందుకు ప్రస్తుతం అమెరికాతో కుదిరిన ఒప్పందం అవకాశం కల్పిస్తుంది. పద్ధతులపై మెత్తగా ఉంటూనే జాతీయ ప్రయోజనాలపై పట్టుబట్టే మోడి ప్రభుత్వ వైఖరికి ఈ ఒప్పందం ఒక సూచిక. తమ ఆహార భద్రతపై తమకున్న ఆందోళనలు, టి.ఎఫ్.ఏ వల్ల కలిగే ప్రభావాలపై అమెరికాకు స్పష్టంగా వివరించినాక ఆ దేశం తగిన స్పందనతో ముందుకు వచ్చింది. ఒక దశలో ప్రపంచంలో ఒంటరిగా మిగిలే ప్రమాదాన్ని ఇండియా ఎదుర్కొన్నప్పటికి తక్షణ పరిష్కారం కోసం ఇండియా పట్టుబట్టకుండానే నిరవధిక పీస్ క్లాజ్ కు అంగీకరించింది. మొత్తంమీద చూస్తే తాజా ఒప్పందం బహుళపక్ష వాణిజ్య చర్చలు ముందుకు సాగేందుకు వీలు కల్పిస్తుంది. ఈ ఒప్పందం దరిమిలా టి.ఎఫ్.ఏ ఇక వాస్తవరూపం దాల్చనుంది. ద్వైపాక్షిక ఒప్పందాన్ని డబ్ల్యూ.టి.ఓ ఆమోదించాల్సి ఉంది. అమెరికాయే దారి చూపినందున ఇతర దేశాలు ఆమోదించే అవకాశం ఎలాగూ ఉంది. ప్రపంచ ఆర్ధిక పర్యావరణంలో భారత స్ధానాన్ని ఈ ఒప్పందం గుర్తించేదే అయినా, బహుళపక్ష ప్రపంచ వేదికపై అమెరికాకి గల ఆధిక్యాన్ని ఇది నొక్కి చెబుతోంది.
(టి.ఎఫ్.ఏ కు ది హిందు ఇస్తున్న మద్దతు ఆందోళనకరం. కాగా మోడి ప్రభుత్వానికి జాతీయ ప్రయోజనాలపై నిబద్ధత ఉన్నట్లు చెప్పడం హాస్యాస్పదం. మోడి ప్రభుత్వం మెల్లగా రాజకీయంగా సెంటర్ కు జరగడం సంగతేమో గానీ ది హిందూ మాత్రం మెల్లగా కుడివైపు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. సంపాదకీయం చెబుతున్నట్లు టి.ఎఫ్.ఏ భారత వాణిజ్యవర్గాలకు కాసిని పైసలు రాల్చవచ్చునేమో గానీ భారత రైతులకు, పేదలకు మాత్రం అది ఉరితాడుతో సమానం. అత్యంత అభివృద్ధి నిరోధకరమైన, ప్రజా వ్యతిరేకమైన వాణిజ్య వసతీకరణ ఒప్పందానికి ది హిందు పత్రిక మద్దతు ఇవ్వడం ఆ పత్రిక మారుతున్న ప్రాధామ్యాలను తెలియజేస్తోంది. లేదా వాలుకు కొట్టుకుపోవడంలో పత్రిక ప్రతిభను తెలియజేస్తోంది. లేదా పత్రిక యాజమాన్యంలో తీవ్ర వైరుధ్యాలు ఏర్పడిన పరిస్ధితినయినా తెలియజేస్తోంది. -విశేఖర్)
2 thoughts on “పట్టాలపై వాణిజ్య వసతీకరణ -ది హిందు ఎడిట్”