బాబా రాంపాల్ అరెస్టుకు సాయుధ ప్రతిఘటన


దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించని నేపధ్యంలో బాబా రాంపాల్ ని అరెస్టు చేయలేక హర్యానా పోలీసులు నిస్సహాయులుగా మిగిలారు. హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న బాబా రాంపాల్ అనేకసార్లు కోర్టుకు హాజరు కాకుండా చట్టం అంటే తనకు లెక్కలేదని చాటాడు. ఆయన్ని అరెస్టు చేసి తేవాలని పంజాబ్ & హర్యానా హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఆయనకు వంట్లో బాగాలేదని కాబట్టి అరెస్టు చేయడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పడం బట్టి భారత దేశంలో కోర్టులు ఏ స్ధితిలో ఉన్నాయో అర్ధం అవుతుంది.

బాబాను అరెస్టు చేయలేకపోతే హోమ్ కార్యదర్శి, డి.జి.పిలు స్వయంగా హాజరు కావాలని హై కోర్టు ఆదేశించింది. అధికారులు ఇద్దరికీ, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు తలంటు పోయడంతో బాబా అరెస్టుకు సిద్ధమైన పోలీసులపై బాబా అనుచరులు కాల్పులు జరపడంతో పోలీసులు గాయాల పాలయ్యారు. వేలాది మంది భక్తులను బలవంతంగా ఆశ్రమంలో ఉంచుకుని వారిని మానవ కవచంగా (human shield) బాబా ఉపయోగించుకోవడం విశేషం.

కోర్టు నియమించిన అపోలో ఆసుపత్రి డాక్టర్ బాబాను పరీక్షించి, ఆయన శుభ్రంగా, ఆరోగ్యంగా ఉన్నారని, కోర్టుకు హాజరు కాగల పరిస్ధితిలోనే ఉన్నారని స్పష్టం చేయడంతో బాబాను అరెస్టు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వమే సుముఖంగా లేదని తెలిసి వచ్చింది. ఈ మేరకు కోర్టు కూడా ప్రతికూల వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు చర్యకు దిగక తప్పని పరిస్ధితి వచ్చింది.

63 సం.ల సంత్ రాంపాల్ బాబా ఓ హత్య కేసులో నిందితుడు. 2006లో ఆయన ఆశ్రమాన్ని చుట్టుముట్టిన ప్రజలపై బాబా అనుచరులు కాల్పులు జరపడంతో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. దరిమిలా పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా ఆయనకు రక్షణ కల్పిస్తూ వచ్చాయి. ఫలితంగా 43 సార్లు కోర్టు సమన్లను బాబా రాంపాల్ లెక్కచేయలేదు.

ఈ సంవత్సరం జులై నెలలో కొందరు లాయర్లపై బాబా అనుచరులు దాడి చేసి కొట్టడంతో కేసుకు తాజాదనం వచ్చి చేరింది. బాబాకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సదరు లాయర్లు పిటిషన్ వేయడంతో మరో విచారణ మొదలైంది. ఈ విచారణను సైతం బాబా లెక్క చేయలేదు. దానితో కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేసింది. ఈ వారంటులను కూడా లెక్క చేయని బాబాను అరెస్టు చేయడం మాని రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు మద్దతుగా వస్తూ అనారోగ్యం సాకు చూపుతూ అరెస్టు నుండి తప్పించాలని ప్రయత్నించింది.

కోర్టు ఈ కేసులో అమికస్ క్యూరీని నియమించుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎత్తులు కోర్టు దృష్టికి వచ్చాయి. బాబాపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారంటు జారీ చేసిన హై కోర్టు నవంబర్ 5 తేదీన బాబును తన ముందు ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం ఈ ఆదేశాలను అమలు చేయడంలో విఫలం కావడంతో నవంబరు 10 తేదీకి రాంపాల్ ను హాజరు పరచాలని, విఫలం అయ్యే పనైతే హోమ్ కార్యదర్శి, డి.జి.పి లు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని కోర్టు కోరింది. రాంపాల్ కు అండగా రాజకీయ శక్తులు నిలవడంతో అధికారులే స్వయంగా కోర్టుకు హాజరు కావలసి వచ్చింది.

రాంపాల్ ను అరెస్టు చేసేందుకు మరింత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కోరారు. ఆశ్రమంలో వేలాది మంది భక్తులు బాబాకు రక్షణగా ఉన్నారని, బాబా అనుచరులు చట్ట విరుద్ధంగా మారణాయుధాలు కలిగి ఉన్నారని తెలిపాడు. ఈ పరిస్ధితిలో బలవంతపు అరెస్టుకు సిద్ధపడితే తీవ్ర ఘర్షణలు జరగవచ్చని, కొందరు ప్రాణాలు కోల్పోవచ్చని తెలిపాడు. దానితో కోర్టు నవంబర్ 21 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఇచ్చింది.

అమికస్ క్యూరీ (కోర్టు సహాయకులుగా వ్యవహరించే అడ్వకేట్) రాష్ట్ర ప్రభుత్వం బాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ధోరణిని వెలుగులోకి తెచ్చారు. నాన్ బెయిలబుల్ వారంట్ ను అమలు చేయకుండా కోర్టు ధిక్కారానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిందని ఎత్తి చూపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రవర్తన చట్టం వైఫల్యానికి, అలజడులకు, అరాచకానికి దారి తీస్తుందని తెల్పాడు.

రాంపాల్ అనుచరులకు, హర్యానా పోలీసులకు మధ్య (సాయుధ) ప్రతిష్టంభన నెలకొని ఉందని, పోలీసులకు సహాయంగా కేంద్ర బలగాలు కూడా మోహరించాయని, ఇలాంటి పరిస్ధుతుల్లో ఆదివారం (నవంబర్ 16) రోజు సాయంత్రం గం. 7:30 ని.లకు పోలీసు బలగాలలో భారీ మొత్తాన్ని హఠాత్తుగా ఉపసంహరించారని, ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన అఫిడవిట్ లో కోర్టుకు తెలియజేయలేదని తెలిపారు.

“ఇది రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాన్ని పూర్తిగా వదిలిపెట్టడమే” అని ఎత్తి చూపిన అమికస్ క్యూరీ పోలీసులు ఆశ్రమంలోకి చొరబడి బాబాను ఎందుకు అరెస్ట్ చేయకూడదో చెప్పాలని డిమాండ్ చేశారు. హోమ్ శాఖ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తార్ ఆధీనంలోనే ఉన్నదని కనుక పౌర, పోలీసు విభాగాలు రెండూ ఆయనకు జవాబుదారీగా ఉంటాయని, ఈ నేపధ్యంలో శుక్రవారం (నవంబర్ 21) నాడు బాబాను హాజరుపరచకపోతే గనక రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కార ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

ఈ నేపధ్యంలో బాబాను హాజరుపరచడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుగా ఉన్నదని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. దానితో నవంబర్ 18 తేదీన (ఈ రోజు) రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు చర్యకు ఉపక్రమించాయి. హిసార్ లో బాబా దాగి ఉన్న సత్లోక్ ఆశ్రమం పైకి దాడి చేశాయి. పోలీసులు, కేంద్ర బలగాలు ఆశ్రమంలోకి వెళ్తున్న క్రమంలో లోపల ఉన్న బాబా అనుచరులు (బాబా కమేండోలుగా తమను తాము పిలుచుకుంటారు) వారిపై కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం మీద 40 మంది పోలీసులు గాయపడగా 100 మందిని ఆసుపత్రుల్లో చేర్చారు. కాల్పులతో పాటు పెట్రోల్ బాంబులు కూడా వారు విసరడంతో క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉన్నదని తెలుస్తోంది.

ప్రధాన ద్వారం వద్ద భక్తులను పెద్ద సంఖ్యలో ఉంచడంతో పోలీసులు వెనుకవైపు నుండి జె.సి.బిలతో గోడలు బద్దలు కొట్టి ప్రవేశించారు. బాబా అనుచరుల ప్రతిఘటన ఎదుర్కోవడానికి లాఠీచార్జీ చేశారు. నీటి క్షిపణులు ప్రయోగించారు. టియర్ గ్యాస్ వదిలారు. ఈ క్రమంలో పలువురు విలేఖరులు సైతం పోలీసు దెబ్బలు తిన్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభం అయిన బాబా అరెస్టు కార్యక్రమం సఫలం అయినదీ లేనిది ఇంకా తెలియరాలేదు. దాదాపు 12 ఎకరాల స్ధలంలో విశాల ప్రాంతంలో ఆశ్రమం నిర్మించినట్లు తెలుస్తోంది.

దాడికి ముందు గత రెండు రోజులుగా ఆశ్రమానికి నీరు, విద్యుత్, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాను పోలీసులు నిలిపి వేశారు. తద్వారా బాబా అనుచరులు, భక్తులు ఆశ్రమం వదిలి బైటికి వస్తారని వారు ఆశించారు. వారు ఆశించినట్లే భక్తులు మెల్లగా బైటికి రావడం మొదలైంది. తమను బలవంతంగా ఆశ్రమంలో ఉంచారని, ఘర్షణ వ్యవహారం తెలియక లోపలికి వెళ్తే తమను లోపలే ఉంచారని పలువురు భక్తులు ఈ సందర్భంగా చెప్పడం విశేషం.

నక్సలైట్లకు అన్నం పెడుతున్నారనే పేరుతో వందల మంది అమాయక గిరిజనులను జైళ్ళలో కుక్కి విచారణ లేకుండా చేసే పోలీసులకు, కేంద్ర బలగాలకు ఒక హత్య కేసు నిందితుడిని అరెస్టు చేయడానికి పదేళ్ళు పట్టడం ఒక వింత. సాయుధ చర్యలకు పాల్పడినందుకు నక్సలైట్లను ఉగ్రవాదులుగా ముద్రవేసి కర్కశ చట్టాలు ప్రయోగించే ప్రభుత్వాలు ఒక బూటకపు బాబా సాయుధ మూకలను పోషిస్తున్నా ఇన్నాళ్లూ ఎలా చూస్తూ ఊరుకున్నాయి? సాయుధ మూకల పహారాలో ఉన్న బాబా కోర్టుకు హాజరు కాలేని అనారోగ్యంతో ఉన్నారని బొంక వలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది?

కేవలం ఒకే ఒక్క అరెస్టు వారంటు అమలు చేయడానికి హర్యానా రాష్ట్ర ప్రభుత్వానికి అనేక జిల్లాల పోలీసులు, కేంద్ర పారా మిలట్రీ బలగాలు కావలసి వచ్చింది. అవీ చాలక విద్యుత్, నీటి సరఫరా బంద్ చేశారు. అన్నీ అయ్యాక 40 మంది పోలీసులు ఆసుపత్రి పాలు కాగా, 100 మంది పౌరులు గాయాల పాలయ్యారు. ఇంత జరిగినా రాంపాల్ అరెస్టు అయ్యాడో లేదో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం తన బలగాలను ఉపసంహరించుకున్నప్పుడే రామ్ పాల్ సట్లోక్ ఆశ్రమం నుండి తప్పించుకునిపోయి ఉన్నా ఆశ్చర్యం లేదు.

దేవుడా
రక్షించు నాదేశాన్ని
పవిత్రులనుండి పతివ్రతలనుండి
పెద్దమనుషులనుండి పెద్దపులులనుండి
నీతుల రెండునాల్కలు సాచి బుసలు కొట్టే
నిర్హేతుక కృపాసర్పాలనుండి
లక్షలాది దేవుళ్ళనుండి వారిపూజారులనుండి
వారి వారి ప్రతినిధులనుండి
సిద్ధాంత కేసరులనుండి సిద్ధులనుండి
శ్రీ మన్మద్గురుపరంపరనుండి

అంటూ తిలక్, పనిలేక వేడుకోలేదు.

2 thoughts on “బాబా రాంపాల్ అరెస్టుకు సాయుధ ప్రతిఘటన

  1. బలవంతుల కొక చట్టం…బలహీనుల కొకచట్టం…

    బాబాల కాళ్ల మీద బొక్కాబోర్లా పడే మంత్రులు, నాయకులు, అధికారులు ఉన్నంత కాలం…ఇలాంటి బాబాలు తమ ఇష్టారాజ్యం చెలాయిస్తుంటారు.
    ఈ కేసులో చెప్పుకోవాల్సింది ఏమిటంటే…న్యాయవ్యవస్థ కచ్చితంగా, కఠినంగా వ్యవహరించడం. అదే న్యాయవ్యవస్థ కూడా బాబా గారికి లొంగి ఉంటే…ఈ కేసు గురించి బయటి ప్రపంచానికి తెలిసి ఉండేదే కాదు.
    — మన దేశంలో ఇంకా ఇలాంటి దొంగ బాబాల జాతకాలు చాలా బయటకు రావాల్సి ఉంది.

  2. సాధారణ వ్యక్తి రెండు సార్లు కోర్త్ నోతీస్ తీసుకోకపోతేనే అతన్ని కోర్త్ ధిక్కారం కేస్ కింద అరెస్త్ చేస్తారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s