కూటమి యుగం ప్రారంభం అయ్యాక రాష్ట్రాల శాసన సభల్లోనూ, లోక్ సభలోనూ విశ్వాస పరీక్ష నెగ్గడం రాజకీయ పార్టీలకు కత్తి మీద సాముగా మారిపోయింది. కూటమిలో ప్రతి చిన్న పార్టీ గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక, అలాగని వారిని వదులుకోలేక కూటమి నేత పార్టీలు నానా చావు చచ్చేవి. కానీ మహారాష్ట్రలో మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం మెజారిటీ లేకపోయినా సరే అతి సులభంగా విశ్వాస పరీక్ష నెగ్గి ముందు తరాలకు ఒక ఆదర్శాన్ని చూపింది.
బహుశా ఫడ్నవీస్ ప్రభుత్వానికి/బి.జె.పి నేతలకు తెలంగాణ బిల్లు ఆమోదమే ఒక మార్గ సూచికగా కనపడి ఉండాలి. ఒక రాష్ట్రాన్ని విభజించే ముఖ్యమైన బిల్లును కూడా తీవ్ర వ్యతిరేకత మధ్య మూజువాణి ఓటుతో కాంగ్రెస్ ప్రభుత్వం నెగ్గించుకున్న తీరు వారికి ఆదర్శంగా కనపడి ఉండాలి. తెగించాలే గానీ ఏం చేయడానికైనా వెరపు ఎందుకు? కాకపోతే కొద్ది రోజుల పాటు కాసిని విమర్శలు వస్తాయంతే! జనాన్ని మాయ చేయడంలో ఎవరు మాత్రం వెనకబడి ఉన్నారు కనక!
ఫలితంగా ఎన్నడూ లేని విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొట్ట మొదటి విశ్వాస పరీక్ష అత్యంత అప్రజాస్వామిక రీతిలోనైనా సరే, నల్లేరు మీద నడకలా సాగిపోయింది.
అడ్డంగా ఉన్న కర్రను ఎగిరి దూకాల్సిన పోటీ అది. ఎంతో సాధన చేస్తే తప్ప రికార్డు స్ధాయి ఎత్తులకు ఎగరడం సాధ్యం కాదు. అందునా ఫడ్నవీస్ లాంటి భారీ కాయులకు మైనారిటీ సీట్లతో విశ్వాస పరీక్ష ఎత్తుకు ఎగరడం మరింత కష్ట సాధ్యం. మొదట స్పీకర్ ని గెలిపించుకుని రిఫరీ స్ధానంలో తమ వాడ్ని కూర్చోబెట్టాక ఇక ఎగరడానికి బదులు నడిచి వచ్చినా ఎగిరినట్లే నమోదైపోతుంది. పాత రికార్డులు అతి సులభంగా తుడిచిపెట్టుకుపోతాయి.
కృష్ణశాస్త్రి గారన్నారు. నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు!
భూస్వామ్య సమాజ సామెత: మొగున్ని కొట్టి మొగసాలకెక్కిందట!