కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మోడి ఇమేజి దెయ్యమై వేధిస్తోంది. కళ్ళు తెరిచినా, మూసినా మోడి భూతమే ప్రత్యక్షం అవుతుండడంతో తనను బంధించుకునే పరిస్ధితిలో పడిపోయింది. తాను ఎప్పుడూ గొప్పగా చెప్పుకునే స్వాతంత్ర పోరాట వారసత్వాన్ని మోడి ఎక్కడ తన్నుకుపోతారో అన్న భయంతో ప్రధమ ప్రధాని నెహ్రూ ఇమేజికి తాళం వేసేసుకుంది.
నవంబర్ 14, నెహ్రూ జన్మదినం. ఎప్పుడూ వచ్చే జన్మదినం కాదు 125వ జన్మదినం. అది పురస్కరించుకుని నెహ్రూ సంస్మరణ సభలు, సెమీనార్లు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ, సభకు భారత ప్రధాని నరేంద్ర మోడిని పిలవలేదు. పార్టీ పరంగా సభ జరిపినట్లయితే మోడిని పిలవకపోయినా పెద్ద సమస్య కాదు. కానీ సెమినార్లకు ప్రపంచ దేశాల నుండి నాయకులను, పేరు పొందిన వ్యక్తులను ఆహ్వానించడంతో ప్రధానికి ఆహ్వానం పంపలేదన్న సంగతి ప్రముఖంగా చర్చలోకి వచ్చింది.
జాతీయ నాయకుల వారసత్వాన్ని సొమ్ము చేసుకునేందుకు బి.జె.పి-మోడి ప్రయత్నాలు ముమ్మరం చేశారని, నెహ్రూ ప్రతిష్టను మోడి ఎక్కడ తన్నుకుపోతారో అన్న భయంతోనే కాంగ్రెస్ ప్రధానికి ఆహ్వానం పంపలేదని విమర్శలు వినిపించాయి.
మొదటి కాంగ్రెస్ ప్రభుత్వంలో హోమ్ మంత్రిగా పని చేసిన వల్లబ్ భాయ్ పటేల్ వారసులము తామే అని చెప్పుకోవడంలో బి.జె.పి పార్టీ దాదాపు సఫలం అయిందన్న అభిప్రాయం పత్రికలు వ్యక్తం చేశాయి. పటేల్ గుజరాతీ కావడం, ప్రధాని మోడి కూడా గుజరాతీయే కావడంతో సంక్లిష్టమైన ఈ ఫీట్ ను బి.జె.పి సాధించగలిగి ఉండవచ్చు.
ఇదే తరహాలో నెహ్రూ ప్రతిష్టను సైతం బి.జె.పి తన్నుకుపోతే కాంగ్రెస్ కు ఇక పుట్టగతులు ఉండకపోవచ్చు. నిజానికి ఆనాటి నెహ్రూను తలచుకుని ఈనాటి కాంగ్రెస్ కు ఓటు గుద్దే ఓటర్లు ఎవరూ ఉండరు. కానీ ఇక్కడ చూడవలసింది ఓటర్లను కాదు, ఓటర్లను నియంత్రించే భావజాలాన్ని.
రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ లిబరల్ జాతీయవాద భావజాలాన్ని ఎంచుకుంది. అందులో సెక్యులరిజం ఒక ప్రధాన భాగం. సోషలిస్టిక్ పాట్రన్ ఆఫ్ సొసైటీ పేరుతో నెహ్రూ కనబరిచిన అభ్యుదయ వాద ఫీల్ ప్రపంచంలో ఆయనకు కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టింది. బహుళ సంస్కృతులకు నిలయమైన భారత్ లో దేశాన్ని వివిధ సెక్టేరియన్ భావజాలాలకు అతీతంగా భావాత్మకంగా కలిపి ఉంచడంలో నెహ్రూవియన్ అభ్యుదయం ఎంతో కొంత మేరకు పని చేసింది.
మరోవైపు బి.జె.పి రాజకీయంగా మితవాద కన్సర్వేటివ్ మతతత్వ భావజాలాన్ని ఎంచుకుంది. ఈ భావజాలం 2 సీట్లను 80 సీట్లకు, ఆ తర్వాత ఒక కూటమికి నేతృత్వం వహించగల సీట్లను తెచ్చి పెట్టిందే గాని సాధారణ మెజారిటీని అందించలేకపోయింది. ఈ నేపధ్యంలో తీవ్ర హిందూత్వవాదిగా ముద్ర పడిన మోడి, వాజ్ పేయి తరహాలో సాఫ్ట్ హిందూత్వ వాదిగా మార్పు చెందిన ముద్ర పొందడానికి ఎన్నికలకు చాలా ముందునుండే ప్రయత్నాలు ప్రారంభించారు. సరిగ్గా ఇవే ప్రయత్నాలు చేసిన అద్వానీ సఫలం కాలేకపోగా, ఆయన విఫలం అయిన చోటనే మోడి సఫలం అయ్యారు.
గుజరాత్ మారణకాండ ముద్ర నుండి బైటపడేందుకు మోడి తీవ్రంగానే శ్రమించారు. పటేల్ ఉన్నతీకరణ అందులో ఒక భాగం. అనంతరం ఏకంగా నెహ్రూపైనే ఆయన కన్ను వేయడంతో కాంగ్రెస్ కు గంగవెర్రులు ఎత్తినట్లయింది. బి.జె.పి ప్రభుత్వం నెహ్రూ 125వ జయంతి ఉత్సవాలను నవంబర్ 14 నుండి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించగా, కాంగ్రెస్ తమ ఉత్సవాలను నవంబర్ 13 నుండే ప్రారంభించేసింది. బాల స్వచ్ఛ భారత్ పేరుతో పాఠశాలల విద్యార్ధుల చేత స్వచ్ఛ భారత్ నిర్వహించడం ద్వారా చాచా నెహ్రూ వారసత్వంలో బి.జె.పి కి కూడా భాగం ఉందన్న అనుభూతిని కేంద్ర ప్రభుత్వం కలిగించింది.
బి.జె.పి కి హిందూత్వ ముద్రతోనే మెజారిటీ కొనసాగించడం సాధ్యం కాదు. ఓటు బ్యాంకును విస్తరించుకోవాలంటే మతాతీత, సెక్యులర్ సెక్షన్ ఓట్లను కూడా బి.జె.పి ఆకర్షించాలి. ఇందులో బి.జె.పి సఫలం అయితే కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు నిర్మించుకోవడం మరింత కష్టం కాక తప్పదు.
ఫలితంగా నెహ్రూ వారసత్వ వాటా కోసం బి.జె.పి-కాంగ్రెస్ ల మధ్య ఘర్షణ చెలరేగింది. అది సెమినార్ ఆహ్వానాల నిరాకరణ రూపంలోనూ, చిల్డ్రన్ స్పెషల్ స్వచ్ఛ భారత్ నిర్వహణ రూపంలోనూ వ్యక్తం అయింది.
మోడి భయంతో నెహ్రూ సంస్కరణకు కూడా కాంగ్రెస్ తాళాలు వేసుకుందని పై కార్టూన్ సూచిస్తోంది.
చరిత్రే లేని వారు చరిత్రా నిండా తమవారేననడం కడు విచిత్రం! చరిత్ర ఎందుకు లేదులే మనువు , కౌటిల్యుని వారసులు కదా!