నేను ఏకాకిని
జనారణ్యంలో మనుషుల్ని వెతుక్కుంతున్న జీవాన్ని
మనుషుల్లో ‘మనసు’ కై
దేవులాడుతున్న మానవతా పిపాసిని
నటిస్తున్న నిద్రపై స్వారీ చేస్తున్న మెలకువని
చచ్చిన రాకుమారుడ్ని మళ్ళీ చంపి
వధ్య శిల ఎక్కనున్న చంద్రమతిని
కృత్రిమత్వానికి సహజత్వానికి మధ్య
దూరాన్ని కొలుస్తున్న కొలబద్దను
సమూహంలో లేని సామూహికతను
సమాజంలో లేని సామాజికతను
కృష్ణుడిని తప్ప చూడలేని
దృత రాష్ట్రుడి చూపుని
కళ్ళకు గంతలు కట్టని గాంధారిని
కుప్పతొట్టి బాలల కడుపు నింపుతున్న
నిండు విస్తరాకుని
పాలింకిన చన్నులను ఆత్రంగా చీకుతున్న
సోమాలియా పసి బాలుడ్ని
కురుక్షేత్రంలో కర్ణుడికి అందివచ్చిన అస్త్ర విద్యని
తెగిపడ్డ ఏకలవ్యుడి బొటనవేలుని
నడి వేసవి ఎర్రని ఎండలో
కురిసే పండు వెన్నెలని
ఆర్ద్రత ఇంకిన మనసు నేలలో
మానవతను విత్తుతున్న బక్క రైతుని
సిద్ధాంతాలు, ఆదర్శాలు పెట్టే కూటిని
ఆగస్టు 15 నాడు తప్ప రుచించని
స్వతంత్ర భారత చాక్లెట్ ని
ఏకాంతంలోని సమూహాన్ని
సమూహంలోని ఏకాంతాన్ని
నేను…
కాకి కాని కాకిని
ఏకాకిని….
రచన: ఎన్వీయస్
రచనా కాలం: 18/10/2001, 1:20 PM
ప్రతి ఒక్కరికీ ఇలా భావించే సందర్భాలుంటాయనుకుంటాను. ఈ కవితలో కొన్ని ప్రతీకలూ, వ్యక్తీకరణలూ బాగున్నాయి.
వేణు గారు. అవును కావచ్చు. అలా భావించవలసి వచ్చే సమాజంలోనే ఉన్నాం కదా! బహుశా అలాంటి సందర్భాలు ఎక్కువైనప్పుడే ఏటితో పాటు పోవడం అలవాటు చేసుకుంటారులాగుంది.
ఓ….వి శేఖర్ గారు…మీరు కవితలు కూడా రాస్తారా….చాలా బాగుందండీ…వేణు గారన్నట్లు ప్రతీకలు అద్భుతంగా ఉన్నాయి. నిజమే మీరన్నట్లు….ఆగస్టు నాడు ఇచ్చే చాక్లెట్లు నిజంగా చాలా బాగుంటాయండి. అన్నట్లు మీ కలం పేరు ఎన్వీఎస్ అన్నమాట. ఇదేనా ఇంకా ఏమైనా రాశారా సార్…. వాటిని కూడా అప్పుడప్పుడు మాతో పంచుకోరూ…
చందుతులసి గారు, అవును, నేనూ రాస్తాను. అప్పుడప్పుడూ. చాలా అరుదుగా.
ఎన్వీయస్ నా పేరే గదా! ఎక్కువ మంది నన్ను పిలిచేది అలాగే. అసలు పేరుతో పిలవడం బద్ధకమై!
మాన భంగాలు, మరణాలు, హత్యలు, దొపిడీలు, మరెన్నొ దారుణాలు, మనచుట్టె జరుగుతున్నా , మనకెమిపట్టనట్టు, అసలెమిజరగనట్టు, పొద్దున్నె పట్నపొళ్ళ పరుగులు, కారణం, చావాలంటె, బతగాలిగా
శేఖర్ గారు,
ఎన్.వి.ఎస్. అంటె మీరేనా? ఎవరో అనుకున్నాను.ఇంతకు మునుపు మీరు కవిత రాసినపుడు మీ పేరు రాసినట్టున్నారు. మీరు రాసే విషయాలు అప్పుడప్పుడు కవితల రూపంలో కూడ చెప్ప ప్రయత్నించండి.:):)
అవును తిరుపాలు గారు. నా పేరు పలకడం కాస్త కష్టం కదా. మా స్కూల్ లోనే ఫ్రెండ్సు ఆ పేరు ఖాయం చేశారు. స్కూల్ మిత్రుల్లో కొందరు ఇంటర్ లో, BEలో కూడా కొనసాగారు. దాంతో ఆ పొడి అక్షరాల పేరు స్ధిరపడిపోయింది. చివరికి పరిస్ధితి ఎలా అయిందంటే, నా పేరు ఎవరన్నా పూర్తిగా పలికితే నాకే కొత్తగా వినిపిస్తుంది.