ఆస్ట్రేలియా నగరం బ్రిస్బేన్ లో జరుగుతున్న జి20 సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడి గారే ప్రధాన ఆకర్షణగా నిలిచారని పత్రికలు కోడై కూస్తున్నాయి. భారత పత్రికలే కాకుండా కొన్ని పశ్చిమ పత్రికలు కూడా ఈ అంశంలో ఏకాభిప్రాయాన్ని కలిగి ఉండడం విశేషం. ముఖ్యంగా పశ్చిమ రాజ్యాధినేతలు మోడితో కరచాలనం చేయడానికి, వీలయితే హగ్ చేసుకోవడానికీ, ఆయనతో కలిసి ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపుతున్నారట.
నవంబర్ 15, 16 తేదీలలో బ్రిస్బేన్ లో జి20 గ్రూపు దేశాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 5 దేశాల పర్యటనలో ఉన్న మోడి ప్రధాన గమ్యం జి20 సమావేశాలే. జి20 సమావేశాలకు ముందు, తర్వాతా మరిన్ని దేశాల పర్యటనలకు మోడి పధక రచన చేసుకున్నారు.
ప్రదాని నరేంద్ర మోడి పశ్చిమ దేశాధినేతలకు ఎంతగా ఆకర్షణ అయ్యారంటే తాను మోదిని కౌగిలించుకున్న ఫోటోను ఆస్ట్రేలియా ప్రధాని టోని అబ్బాట్ స్వయంగా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసేంతగా! జి20 దేశాల సమావేశాలకు ఆతిధ్యం ఇస్తున్నది టోని అబ్బాట్ కనుక ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసే టపాల కోసం ప్రపంచ మీడియా ఆసక్తిగా ఎదురు చూస్తుంటుంది. ఆ విధంగా నరేంద్ర మోడి ఆకర్షణపై మరింతగా మీడియా కేంద్రీకరించింది.
చివరికి అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా మోడితో కరచాలనానికి, ఆయనతో కబుర్లు చెప్పడానికి, నవ్వుతూ తుళ్లుతూ సంభాషణ జరపడానికి ఆసక్తిగా ఉన్నారని పత్రికలు తెలిపాయి. టోని అబ్బాట్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫొటోల్లో ఆయనా, మోడి, ఒబామాలు పరస్పరం కరచాలనం చేసుకుంటున్న దృశ్యం కూడా ఉండడం విశేషం.
జి20 అసలు సమావేశాలకు ముందు గ్రూపు దేశాల అధినేతలకు టోని అబ్బాట్ విందు ఇచ్చారు. ఈ విందును జి20 రిట్రీట్ గా పిలుస్తున్నారు. జి20 రిట్రీట్ సందర్భంగా కూడా వివిధ దేశాధినేతలు మోడి చుట్టూ మూగి ఆయనతో కబుర్లు చెప్పేందుకు, పలకరించేందుకు ఆసక్తి చూపించారట. అమెరికా అధ్యక్షుడు, ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆస్ట్రేలియా ప్రధాని టోని అబ్బాట్, కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్ మోడి చుట్టూ కూడి చిట్ చాట్ చేశారని పత్రికలు తెలిపాయి.
“పురుషులందు పుణ్య పురుషులు వేరయా” అన్నట్లు “ఫోటోలందు మోడి హగ్ ఫోటో వేరయా” అని ఆస్ట్రేలియా ప్రధాని టోని అబ్బాట్ హమ్మింగ్ చేస్తున్నారని అభిజ్ఞవర్గాల భోగట్టా. ది ఏజ్ పత్రిక ప్రకారం జి20 సమావేశాల ఫోటోలు అన్నింటిలోనూ అబ్బాట్, మోడి లు హగ్ చేసుకున్న ఫోటో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. (బహుశా, ఫోటో ఆఫ్ ద జి20 గా ఈ ఫోటోకు ఆ పత్రిక బిరుదు ప్రకటించవచ్చునేమో)
టోని అబ్బాట్ ఇంకే దేశాధినేతకు మోడీకి ఇచ్చిన హగ్ ఇవ్వలేదని ది ఏజ్ పత్రిక తెలిపింది. “ఫొటోల్లోకెల్లా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న ఫోటో ప్రధాన మోడి, అబ్బాట్ ల హగ్ ఫోటోయే. వారిరువురు హగ్ చేసుకున్నప్పుడు మీడియా సెంటర్ అంతా “వోవ్” అంటూ ముక్త కంఠంతో ఉత్సాహభరితం అయింది. అబ్బాట్ కు మంచి మిత్రులు డేవిడ్ కామెరాన్, స్టీఫెన్ హార్పర్ (కెనడా ప్రధాని) లకు కూడా అబ్బాట్ హగ్ ఇవ్వలేదు మరి” అని ది ఏజ్ తెలిపింది.
బ్రిటిష్ పత్రిక ది గార్డియన్ మోడిపై ప్రత్యేక వ్యాసం రాస్తూ “జి20 సమావేశాల్లో అత్యంత పాపులర్ లీడర్ నరేంద్ర మోడియే. ఇతర నాయకులు చూడాలని తపిస్తున్న నాయకుడాయన. ఆయనతో కలిసి కనిపించాలని ఇతర నాయకులు తహతహలాడుతున్న నాయకుడాయన” అని ది గార్డియన్ అభివర్ణించింది. “శుక్రవారం నాడు మోడి జి20 సమావేశాలకు శిఖరాగ్ర సభ యొక్క రాజకీయ రాక్ స్టార్ వలే ఏతెంచారు. ఇతర నాయకులు కలవాలని ఉవ్విళ్లూరుతున్న నేత నరేంద్ర మోడి. అంతర్జాతీయ బహిష్కృత నేత స్ధాయి నుండి జి20 రాజకీయ రాక్ స్టార్ గా ఎదిగిన నేత” అని గార్డియన్ మోడిపై పొగడ్తలు కురిపించింది.
ఇది అతిశయోక్తి కానక్కర్లేదు. ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడి ఇచ్చిన వాగ్దానాలు, ఎన్నికల అనంతరం కూడా ప్రభుత్వ నేతగా ధైర్యంగా (వారి దృష్టిలో) ఆయన అమలు చేస్తున్న విధానాలు అలాంటివి మరి! కాకుల్ని కొట్టి గద్దల్ని మేపే విధానాలు, దేశ వనరులను సాధ్యమైనంత తక్కువ ప్రజా ప్రతిఘటనతో విదేశీ కంపెనీలకు అప్పజెప్పే విధానాలు, దేశ శ్రామిక శక్తిని ఎటువంటి కార్మిక చట్టాల బాదరబందీ లేకుండా చౌకగా విదేశీ బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పే విధానాలు అమలు చేసే పాలకుడు అత్యధిక జనాభా కలిగిన దేశాన్ని ఏలుతున్నప్పుడు, ఆయనను మంచి చేసుకోవడానికి ఏ సామ్రాజ్యవాద దేశాధీశుడు ఇష్టపడడు?
సమావేశాల్లో ఇప్పటికే ఓసారి ప్రసంగం చేసిన నరేంద్ర మోడి సంస్కరణలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ప్రకటించుకున్నారు. ఆశ్చర్యకరంగా సంస్కరణలకు ప్రతిఘటన ఎదురుకావడం సహజం అని కూడా ఆయన జి20 సమావేశాల్లో ప్రకటించారు. ప్రభుత్వ విధానాలు ప్రజానుకూలం అయినప్పుడు ప్రజల నుండి ప్రతిఘటన ఎందుకు వస్తుంది? ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకం అయితేనే ప్రజలు ప్రతిఘటిస్తారు తప్ప వారు పని లేక, తమకు అనుకూలం అయినా ప్రతిఘటించి నెత్తిమీదకు నిర్బంధాన్ని, పోలీసు కేసులను, జైలు శిక్షలను తెచ్చుకోరు కదా!
అయినా, సంస్కరణలకు ప్రతిఘటన సహజం అని చెబుతున్నారంటే అవి ప్రజలకు వ్యతిరేకమైనవేనని మోడి అంగీకరిస్తున్నారని స్పష్టం అవుతోంది. ప్రజా వ్యతిరేకం అని తెలిసి కూడా మోడి ఆర్ధిక సంస్కరణలను అమలు చేస్తున్నారని ఆయన మాటలు తెలియజేస్తున్నాయి. అటువంటి ధైర్యవంతుడైన పాలకులను పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలు అమితంగా ఇష్టపడతాయి అనడంలో సందేహం లేదు.