మణిపురి యువతి తంగ్జామ్ మనోరమ హత్యకు ఎవరు బాధ్యులో విచారించిన జ్యుడీషియల్ కమిషన్ నివేదిక ఎట్టకేలకు వెలుగు చూసింది. నివేదికను కమిషన్ వెల్లడి చేసిన దశాబ్దం తర్వాత, అది కూడా సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్నాకనే, అందులోని అంశాలు పాక్షికంగానైనా లోకానికి వెల్లడి అయ్యాయి. అస్సాం రైఫిల్స్ కు చెందిన సైనిక బృందం ఒకటి మనోరమ ఇంట్లో చొరబడి, ఆమెను లాక్కెళ్లి, చిత్రహింసలకు గురిచేసి, అనంతరం విచక్షణారహితంగా అనేకమార్లు తుపాకితో కాల్చి చంపారని కమిషన్ నివేదిక తెలిపింది.
జ్యుడీషియల్ ఎంక్వైరీ కమిషన్ తన నివేదికను డిసెంబర్ 2004 లోనే మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం నివేదికను బహిర్గతం చేయలేదు. కనీసం నివేదిక ఏమి చెప్పిందో కూడా వెల్లడి చేయలేదు. ఈశాన్య రాష్ట్రాలలో పోలీసులు, సైనికుల కష్టడీలో ఉన్నవారి మరణాలపై విచారణ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. ఈ పిటిషన్ ను విచారిస్తున్న క్రమంలో సుప్రీం కోర్టు మనోరమ హత్యపై కమిషన్ నివేదికను తమకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దానితో మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం నివేదికను ఈ వారం సుప్రీం కోర్టుకు ఇవ్వక తప్పలేదు. సుప్రీం కోర్టు ద్వారా మాత్రమే నివేదికలోని అంశాలు దేశానికి తెలిసాయి. నివేదికలోని కొన్ని అంశాలను పత్రికలు వెల్లడి చేశాయి. “మణిపూర్ గ్రామ యువతి కష్టడీలో ఉండగా మరణించిన ఈ ఉదంతం అత్యంత దిగ్భ్రాంతికరమైనది” అని నివేదిక వ్యాఖ్యానించిందని ది హిందు తెలిపింది. కమిషన్ కు విశ్రాంత జిల్లా మరియు సెషన్స్ జడ్జి సి.ఉపేంద్ర సింగ్ ఛైర్మన్ గా వ్యవహరించారు.
“17వ అస్సాం రైఫిల్స్ కు చెందిన సాయుధ సైనికుల బృందం ఒకటి జులై 10-11, 2004 తేదీల మధ్య రాత్రిన ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని ఆమె ఇంటిలోకి చొరబడింది. మర్మావయవాల వద్ద, తొడలపైనా అనేక గుపాకి గుండ్ల గాయాలతో ఉన్న ఆమె శరీరం జ్ఞారియన్ యారిపోక్ రోడ్ పైన ఉండగా మరుసటి రోజు కనుగొన్నారు. ఈ చోటు పోలీసు స్టేషన్ కు 2 కి.మీ కంటే తక్కువ దూరంలోనే ఉంది” అని నివేదిక తెలిపింది.
సైనికులు మనోరమ ఇంటిలోకి చొరబడిన క్షణాల నుండి ఏమి జరిగిందో వివరిస్తూ నివేదిక కళ్ళకు కట్టింది. నివేదిక ప్రకారం:
ఆ రోజు రాత్రి మనోరమ తమ్ముడు తంగ్జామ్ బసు టి.విలో రాజు చాచా సినిమా చూస్తున్నాడు. అప్పటికి అర్ధరాత్రి దాటి అరగంట అయింది. ఆ సమయంలో తన ఇంటి బయట అలజడి శబ్దాలను బసు విన్నాడు. మరి కొద్ది నిమిషాల్లో అస్సాం రైఫిల్స్ కి చెందిన సైనికుల బృందం ఆ ఇంటి తలుపు తోసుకుంటూ లోపలికి చొరబడింది. తలుపు వైపు చూసిన బసుకు తన అక్క మనోరమ తమ తల్లి ఖుమాలీమాను కరిచి పట్టుకుని ఉండగా ఆమెను సైనికులు బైటికి ఈడ్చుకెళ్తుండడం కంటబడింది. మనోరమ “ఇమా ఇమా ఖాము (అమ్మా, అమ్మా వీళ్ళని ఆపు) అని అరుస్తోంది.
తన అక్క నోరును నొక్కి పెడుతూ ఉండగా ఆమె నిస్సహాయంగా “ఈ ఖంగాడే” (ఏమో నాకు తెలియదు) అని చెప్పడం బసు విన్నాడు. సైనికులు వేస్తున్న ప్రశ్నలకు మనోరమ సమాధానం ఇస్తోంది. అనంతరం సైనికులు ఆమెను లాక్కెళ్లి వాహనంలో పడేసుకుని వెళ్ళిపోయారు. ఆమెను తీసుకెళ్లే ముందు ఆమె కుటుంబం చూస్తుండగానే వరండాలో వివిధ రకాలుగా హింసించారు. ఆ మరుసటి రోజు పోలీసు స్టేషన్ కు 2 కి.మీ దూరంలో ఆమే శవం అర్ధ నగ్నమై తేలింది.
మనోరమను ఆమెకు తెలియని సమాచారాన్ని చెప్పాలని కోరుతూ చిత్రహింసలు పెట్టి అనంతరం చంపేసిన అస్సాం రైఫిల్స్ తిరిగి ఆమెనే నిందితురాలిగా చేస్తూ రెండు ఎఫ్.ఐ.ఆర్ లు దాఖలు చేశారు. కెన్ వుడ్ (హ్యామ్ రేడియో?), చైనా తయారీ గ్రెనేడ్లు ఎక్కడ ఉన్నాయో ఆమె చూపిందని, ఆమె సహాయంతో వాటిని రికవర్ చేసుకున్నామని అస్సాం రైఫిల్స్ ఎఫ్.ఐ.ఆర్ లలో ఆరోపించారు. ఒక ఏ.కె-47 రైఫిల్ ను కూడా ఆమె సాయంతో స్వాధీనం చేసుకున్నామని ఆరోపించారు. తమ కష్టడీలో నుండి పారిపోవడానికి ఆమె ప్రయత్నించిందని దానితో ఆమె కాళ్లపై కాల్చామని, అనంతరం ఆ గాయాల నుండి రక్తం కారి, కారి చనిపోయిందని ఎఫ్.ఐ.ఆర్ లో నమోదు చేశారు.
అస్సాం రైఫిల్స్ కధనంతో కమిషన్ విభేదించింది. రాష్ట్ర పోలీసులను కూడా తప్పు పట్టింది. మనోరమ హత్య పరిశోధనను పూర్తిగా అస్సాం రైఫిల్స్ దయా దాక్షిణ్యాలకు పోలీసులు వదిలివేశారని అభిశంచింది. కమిషన్ విచారణ సందర్భంలో కూడా అస్సాం రైఫిల్స్ AFSPA ను అడ్డు పెట్టుకుని విచారణ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించారని కమిషన్ మండిపడింది. నిజానికి తమ కమిషన్ పని నిజాలు వెలికి తీయడం (ఫాక్ట్ ఫైండింగ్) మాత్రమేనని సైనికులు తప్పు చేశారని నిర్ధారణ అయ్యాక శిక్ష విషయంలో మాత్రమే AFSPA సెక్షన్ 6 ముందుకు వస్తుందని, విచారణను అడ్డుకోవడానికి కాదని కమిషన్ ఎత్తి చూపింది.
రైఫిల్స్ చెప్పుకున్నట్లుగా మనోరమ ఒంటిపై ఉన్న బులెట్ గాయంలో ఒక్కటంటే ఒక్కటి కూడా కాళ్లపై తగల్లేదని తగిలిన బులెట్లన్నీ శరీరం పైనే తగిలాయని వెల్లడి చేసింది. మనోరమ తప్పించుకోవడానికి ప్రయత్నించిందన్న ఆరోపణ “పచ్చి అబద్ధం” అని కమిషన్ స్పష్టం చేసింది. ఆమె నిస్సహాయంగా ఉన్నప్పుడే తుపాకితో కాల్చారని ఆమె గాయాలను చూస్తే అర్ధం అవుతుందని, ఆమెపై లైంగిక దాడి జరిగిందని నిరూపించే గాయాలు ఆమె ఒంటిపై ఉన్నాయని తెలిపింది. కమిషన్ 37 మంది సాక్షులను విచారించి తన నివేదికను రూపొందించింది.
మనోరమ హత్యకు నిరసనగా కొంతమంది మహిళలు పూర్తిగా వివస్త్రలై నగ్నంగా ప్రదర్శన నిర్వహించి సంచలనం స్తుష్టించారు. “సైనికులారా మమ్మల్ని కూడా రేప్ చేయండి” అని రాసి ఉన్న బ్యానర్ ప్రదర్శిస్తూ అస్సాం రైఫిల్స్ కార్యాలయం ముందు వారు నగ్న ప్రదర్శన చేశారు. అయినప్పటికీ తోలుమందం ప్రభుత్వాలు ఒక్క అంగుళం కూడా కదిలిన పాపాన పోలేదు. AFSPA చట్టం సాకు చూపి సైనికులపై విచారణ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరాకరించాయి. ఢిల్లీ బస్సులో జరిగిన అత్యాచారం పై పార్లమెంటులో కడవలు కడవలు కన్నీళ్లు కార్చిన ఎం.పి లు ఇంతవరకు మనోరమ హత్యను కనీసం ఖండించిన పాపాన పోలేదు.
ఇది కూడా దేశ భక్తి, దేశ రక్షణలో భాగమా? అయ్యే ఉంటుంది!